మేడే"
"మేడే" ** అమరవీరుల వైభవోజ్వల సాహసగాథ __ విలియం అడెల్మన్ విషయసూచిక *ముందుమాట *ప్రవేశిక * హేమార్కెట్ పునర్దర్శనం *కాలక్రమణిక ***** *ముందుమాట __ ఎం.కె. పాంథే చరిత్రాత్మకమైన మేడేను కార్మికవర్గ సంఘీభావాన్ని తెలియచెప్పే అంతర్జాతీయ దినంగా యావత్ప్రపంచమూ జరుపుకుంటున్నది. అయితే, దీనిలోని విప్లవాంశను విస్మరించి కేవలం మొక్కుబడిగా జరుపుకునే ఒకానొక ధోరణి కార్మికవర్గ వుద్యమంలో తలెత్తుతున్నది. హేమార్కెట్ అమరవీరుల త్యాగాలను మాటల్లో కీర్తిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారుల దాడులకు వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని బలోపేతం చేసే నిర్మాణాత్మక చర్యలను చేపట్టక పోవటంవల్ల ఆచరణలో మేడే దినోత్సవాల వుద్దేశ్యమే వెనక్కు పోతున్నది. పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రపంచ కార్మికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చింది మేడే అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. "ప్రపంచ కార్మికులారా ఐక్యంకండు" అన్న సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయటంలో అది మహత్తరమైన శక్తిని ప్రదర్శించింది. సకల దేశాలలోని కార్మికవర్గంపై నయా బానిసత్వాన్నీ రుద్దేటందుకై ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సాగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాన...