మేడే"

 "మేడే"

** అమరవీరుల వైభవోజ్వల సాహసగాథ

__ విలియం అడెల్మన్


విషయసూచిక


*ముందుమాట


*ప్రవేశిక


* హేమార్కెట్ పునర్దర్శనం


*కాలక్రమణిక

*****


*ముందుమాట

__  ఎం.కె. పాంథే


చరిత్రాత్మకమైన మేడేను కార్మికవర్గ సంఘీభావాన్ని తెలియచెప్పే అంతర్జాతీయ దినంగా యావత్ప్రపంచమూ జరుపుకుంటున్నది. అయితే, దీనిలోని విప్లవాంశను విస్మరించి కేవలం మొక్కుబడిగా జరుపుకునే ఒకానొక ధోరణి కార్మికవర్గ వుద్యమంలో తలెత్తుతున్నది. హేమార్కెట్ అమరవీరుల త్యాగాలను మాటల్లో కీర్తిస్తున్నప్పటికీ, పెట్టుబడిదారుల దాడులకు వ్యతిరేకంగా వర్గపోరాటాన్ని బలోపేతం చేసే నిర్మాణాత్మక చర్యలను చేపట్టక పోవటంవల్ల ఆచరణలో మేడే దినోత్సవాల వుద్దేశ్యమే వెనక్కు పోతున్నది.


పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రపంచ కార్మికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చింది మేడే అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. "ప్రపంచ కార్మికులారా ఐక్యంకండు" అన్న సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయటంలో అది మహత్తరమైన శక్తిని ప్రదర్శించింది. సకల దేశాలలోని కార్మికవర్గంపై నయా బానిసత్వాన్నీ రుద్దేటందుకై ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ సాగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిఘటనా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్న ప్రతిజ్ఞ తీసుకునేలా ప్రపంచ వ్యాప్తంగాగల కోట్లాది కార్మికులకు యీనాటికీ మేడే స్ఫూర్తినిస్తూనే వున్నది.


(ఏదియేమైనప్పటికీ, మేడే స్ఫూర్తిని వుపయోగించుకుంటున్న ప్రపంచంలోని కొన్ని కార్మిక సంఘాలు హేమార్కెట్ అమరులను కీర్తిస్తూనే, అదే సమయంలో వర్గ సంకర విధానాలను ముందుకు తీసుకువస్తున్నాయి. రానున్న కాలంలో తమత్యాగాలను యీవిధంగా వుపయోగించుకుంటారని, కార్మికవర్గ హక్కుల రక్షణ కోసం మహిమాన్విత త్యాగాలు చేసిన హేమార్కెట్ అమరవీరులు కలనైనా వూహించి వుండరు.)


ఇలాంటి ధోరణులు కొన్ని వున్నప్పటికీ, అంతర్జాతీయ కార్మికవర్గ వుద్యమంలోని అత్యుత్తమ సంప్రదాయాలను ముందుకు కొనిపోయే క్రమాన్ని మేడే కొనసాగిస్తూనే వున్నది. కనుక హేమార్కెట్ ఘటనయొక్క చారిత్రక విశిష్టతను కార్మిక శ్రేణుల్లో తప్పనిసరిగా ప్రచారం చేయవలసిన తిరుగులేని ప్రాధాన్యం ఎంతైనా వున్నది. ఈ స్ఫూర్తి, (యజమానులతో చేతులు కలిపే కులీన కార్మిక ప్రభువులను ఎదుర్కొనేందుకు వుపయోగపడాలి. (హేమార్కెట్ వుదంతంలో ప్రభుత్వ న్యాయవాదుల పక్షాన సాక్షులుగా నిలచిన అప్రూవర్ల సంప్రదాయాన్ని యీ ప్రభువర్గ కార్మికులు ముందుకు తీసుకు వస్తున్నారు.)


అమర వీరుల మహత్తర సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళే హక్కును భారతదేశంతోసహా పలు దేశాలలో పుట్టుకువచ్చిన ఐదు నక్షత్రాల కార్మికోద్యమం వుద్ఘాటించజాలదు. ఇలాంటి నాయకుల విలువ ఏమిటో మేడే ప్రదర్శనల సందర్భంగా వారిచ్చే 'మహోగ్ర' ఉపన్యాసాలను విన్న కార్మికులు అర్థం చేసుకోగలరు.


హేమార్కెట్ వుదంతం అనేది అమెరికన్ కార్మికోద్యమ చరిత్రలో సంభవించిన యాదృచ్ఛిక ఘటన కానేకాదు. మొత్తంమీద చూస్తే వరుసవారీగా సాగిన అమెరికన్ కార్మికోద్యమ సమరశీల చర్యలకూ, ప్రత్యేకించి చికాగోలో సాగిన కార్మిక పోరాటాలకూ పతాకస్థాయి అనదగ్గ ఘటనయిది. ఎనిమిది గంటల పనిదినం కోసం సాగిన వుద్యమం చికాగో కార్మికులు చేసిన పోరాటాలన్నిటిలో ప్రధానమైనది. కొన్ని సంవత్సరాలపాటు భీషణ పోరాటాలను నడిపిన చికాగో కార్మిక వుద్యమ నాయకత్వం నుంచే హేమార్కెట్ నాయకులు పుట్టుకు వచ్చారు.


2008లో నా భార్య ప్రమీలతో కలసి చికాగోలో పర్యటించే అవకాశం లభించినపుడు నేను వుద్వేగభరితమైన గంభీర భావనకు లోనయ్యాను. అమరవీరుల స్మారక చిహ్నాన్నీ, హేమార్కెట్ ప్రదేశాన్నీ సందర్శించే అవకాశాన్ని కల్పించిన చికాగోలోని కమ్యూనిస్టు పార్టీ శాఖకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను. మాకు ఆతిథ్యమిచ్చిన అమెరికన్ కమ్యూనిస్టు పార్టీ వార పత్రిక 'వర్కర్స్ వరల్డ్' సంపాదకుడు టెర్రీ అల్బనో, అలానే, చరిత్రాత్మకమైన యీ పట్టణంలో బస చేసినపుడు చికాగోలోని ప్రధాన కార్మికసంఘ నాయకుడు స్కాట్ మార్షల్ మాకెంతో సహాయం చేశారు.


ఇల్లినాయిస్ లేబర్ హిస్టరీ సొసైటీ ఉపాధ్యక్షునిగానూ, ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో లేబర్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్గానూ బాధ్యతలను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ విలియం జె. అడెల్మన్ చేసిన విశేషమైన సూచనలను తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి. కార్మికవర్గం సాగించిన న్యాయబద్ధమైన పోరాటాల పూర్వరంగం గురించి దాదాపు రెండు గంటలకు పైగా విస్పష్టమైన రీతిలో ఆయన మాకు వివరించాడు. అలా చెప్పేటపుడు ఆయనలో వున్న అంకిత భావన కొట్టొచ్చినట్లు కన్పడింది.


ఇదే అంశంపై 'హేమార్కెట్ రీవిజిటెడ్' అన్న శీర్షికన తాను రచించిన గ్రంథాన్ని నాకు దయతో యిచ్చాడు. మేడే అమర జీవుల సాహసోపేతమైన గాథను యిది సవివరంగా తెలియ చెప్తుంది. ఈ పుస్తకం చదివి నేనెంతో వుద్విగ్నుణ్ణయ్యాను. చికాగో శ్రామికులు సాగించిన మహిమాన్విత పోరాటం గురించి భారతీయ పాఠకులు తెలుసు కోవాలన్న ఆలోచన నాకు వచ్చింది.


విషయ వివరణలో ఆయన పాటించిన పద్ధతి పాఠకుని హేమార్కెట్ ముందు నిలిపే విధంగా వున్నది. ప్రతి ఒక్క ఘటనకు సంబంధించిన చారిత్రక పూర్వరంగాన్ని రచయిత యిస్తాడు. తత్ఫలితంగా యీ మొత్తం వుదంతం గురించి పాఠకునికి స్పష్టత వుంటుంది.


మేడే అమరుల గురించి మరిన్ని వివరాలను తెలుసుకున్న తరువాత భారతదేశంలో మేడే నిర్వహణ సరికొత్త అర్థాన్ని సంతరించు కోగలదు. మేడే సాహసుల సందేశాన్ని భారతీయ శ్రామికుల వద్దకు విస్పష్టమైన రీతిలో తీసుకుపోయే అవకాశం లభించగలదు.


(అమెరికాలోని కార్మికవర్గం నడిపిన పోరాటాల చారిత్రక పూర్వరంగాన్ని అవగాహన చేసుకోవటం మన కార్మికవర్గానికి మహత్తరమైన గుణపాఠంగా కూడా వుండగలదు. ఈ గ్రంథం ఔత్సాహిక పరిశోధకులకు అత్యంత ప్రాధాన్యం కలిగిన ఆకరాలను సమకూర్చగలదు. భారతదేశంలో సాగిన జాతీయ ప్రాధాన్యం కలిగిన వివిధ వర్గపోరాటాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, భారత శ్రామిక వర్గానికి తెలియచేసే శక్తిని వారికి సమకూరుస్తుంది.


శ్రామిక వుద్యమంలో కనిపించే అరాజ్య వాదం లేదా అరాజక వాదం (Anarchism) గురించి భారతీయ పాఠకులకు వివరించ వలసిన అవసరం ఎంతైనా వున్నది. (అరాజకమంటే అల్లర్లు చేయటం, చట్టాలను వుల్లంఘించటంగానే ప్రజలు సర్వసాధారణంగా అర్థం చేసుకుంటుంటారు)


 రాజ్యం అనేది అణచివేత సాధనమని అరాజక వాదం ప్రకటిస్తుంది. కనుకనే, రాజ్యం వునికిలేని నూతన సమాజాన్ని రూపొందించు కోవాలని అరాజ్యవాదులు లేదా అరాజకవాదులు (Anarchist) చెప్తారు, అరాజకవాదంలో రకరకాల ధోరణులు వున్నాయి. సాధారణంగా దీనిని రాడికల్ వామపక్ష భావజాలంగా పరిగణిస్తారు.


మొదటి ఇంటర్నేషనల్గా చిరపరిచితమైన అంతర్జాతీయ కార్మిక సమాఖ్యను కారల్ మార్క్స్ స్థాపించాడు. రాజ్యం వునికి గురించి అరాజకవాదుల్లో అభిప్రాయ భేదాలు వున్నాయి. సోషలిస్టు వ్యవస్థను స్థాపించిన తరువాత రాజ్యం తన వునికిని కోల్పోతుందని కొందరు అరాజకవాదులు భావించారు. అయితే కమ్యూనిస్టు సమాజం నెలకొన్న తరువాత మాత్రమే రాజ్యం తన వునికిని కోల్పోగలదని మార్క్స్ చెపుతాడు. కాని, దీనిని అరాజకవాదులు ఆమోదించరు.


ఒక విచారణ సందర్భంగా అల్బర్ట్ పార్సన్స్ న్యాయస్థానంలో తన వాదనను యిలా సాగించాడు. "నేను అరాజకవాదిని..... సోషలిజం లేదా అరాజక వాదం అంటే ఏమిటి? క్లుప్తంగా చెప్పవలసి వస్తే, విముక్తి చెందటానికీ, ఉత్పత్తి సాధనాల సమాన పంపిణీకి పీడితులు హక్కును కలిగివుండటం, ఉత్పత్తిదారులు తమ వుత్పత్తులపై హక్కును కలిగివుండటం. అదీ సోషలిజం అంటే".


ప్రొఫెసర్ విలియం అడెల్మన్ పేర్కొన్నట్లుగా, కీలక పరిశ్రమలపై కార్మికులు నియంత్రణను కలిగివుండాలని చికాగో అరాజకవాదులు విశ్వసిస్తారు. 


చికాగో అమరులకు సోషలిస్టు సమాజ నిర్మాణం గురించి అస్పష్టమైన భావాలు మాత్రమే వున్నాయి. అయితే రాజ్యాధికారాన్ని నిలబెట్టి వుంచుకోవడానికి వారు అనుకూలంగా లేరు, రాజ్యాన్ని అణచివేత సాధనంగా భావించటమే యిందుకు కారణం.


ఈ తరహా భావజాలాన్ని మనం గమనంలో వుంచుకోవటం మంచిది. ఎందుకంటే, 1884 నాటి హేమార్కెట్ సంఘటనకు ముందూ, అ తరువాతా చికాగోలో సంభవించిన పరిణామాలను అర్థం చేసుకోవాలంటే యీ అంశాన్ని దృష్టిలో వుంచుకోవలసిన అవసరం వున్నది.


ఈ పుస్తకాన్ని అచ్చుకు సిద్ధం చేయటంలో సిఐటియులోని నా సహచరులు అనేక కష్టాలకు ఓర్చారు. దీని ముద్రణపట్ల వారు చూపిన అత్యధిక శ్రద్ధ కారణంగానే యిది బయటకు రాగలిగింది.


ఈ ప్రచురణ అంతర్జాతీయ ప్రమాణాలుకలిగి వుండేలా చూడటానికి ఎంతగానో శ్రమించిన ప్రోగ్రెసివ్ ప్రింటర్స్కు చెందిన అజయ్ కుమార్కు కూడా కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను.


*****


*ప్రవేశిక


1886 మేనెల 4వ తేదీ మంగళవారం రాత్రి సుమారుగా ఎనిమిదిన్నర గంటల సమయంలో చికాగోలోని హేమార్కెట్ సమీపంలోని డెస్లెయిన్స్ వీధిలో నిలబెట్టివుంచిన పాత సరకుల బండివద్ద దాదాపు 2,500 మంది గుమిగూడారు. ఒకానొక శ్రామిక పత్రిక సంపాదకుడు ఆగస్ట్ స్పైస్ ఆ బండిమీద నిలచి, అంతకు రెండు రోజులముందు సమ్మెకు దిగిన మెకార్మిక్ మరమ్మతు కర్మాగారానికి చెందిన కార్మికులను పోలీసులు కాల్చి చంపటాన్ని నిరసిస్తూ ప్రసంగించాడు. తరువాత కార్మిక నాయకుడైన అల్బర్ట్ పార్సన్స్ మాట్లాడాడు, అనంతరం ప్రొటెస్టెంట్ క్రైస్తవులలోని మెథొడిస్టు శాఖకు చెందిన శామ్యూల్ ఫీల్డెన్ వుపన్యసించాడు. వీరిలో ప్రతిఒక్కరూ అమెరికన్ సమాజంలోని లోటుపాట్లను వివరించారు. ఫీల్డెన్ తన ప్రసంగాన్ని ముగించే సరికి రాత్రి పదిన్నర గంటలైంది. ఆ సమయంలో ఆయుధాలు ధరించిన 176 మందితో కూడిన పోలీసుదళం ఒకటి అక్కడి వారిపై దాడికి దిగింది. దానితో అక్కడ గుమిగూడిన వారి సంఖ్య 200లకు తగ్గిపోయింది. అకస్మాత్తుగా గుర్తుతెలియని ఒకరు డైనమెట్ బాంబును విసరివేశారు. ఇలాంటి దానిని వినియోగించటం అమెరికాలో యిదే ప్రథమం. ఈ బాంబు సరిగ్గా పోలీసుల మధ్యలో పడటంతో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. పోలీసులు కాల్పులు జరపటంతో కనీసం నలుగురు మృతి చెందగా అనేకులు గాయపడ్డారు. భీతావహులైన పోలీసులు తమ వారిని కూడా హతమార్చారు. దీనితో ఆరుగురు పోలీసులు చనిపోయారు.


ఈ ఘటన జరిగిన తరువాత కొన్ని వారాలపాటు చికాగోతోపాటు దేశంలోని మరికొన్ని నగరాలలో వాక్స్వాతంత్య్రమూ, సభా స్వాతంత్ర్యమూ లేకుండా పోయాయి.


వందలాది శ్రామికులను, జాతి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ హింసాకాండకు శ్రామికవీరులు నిందలు పడ్డారు. వార్తా పత్రికలు, వ్యాపారులు,చివరకు ప్రజలు సైతం కార్మిక సంఘాలకు వ్యతిరేకులుగా మారిపోయి, ప్రతి ఒక్కరూ 'శాంతి భద్రతలు' అంటూ గగ్గోలుపెట్టారు. అనంతరం 8 మందిపై విచారణ జరిపి వారిలో నలుగురిని 1887 నవంబరు 11వ తేదీన ఉరితీశారు. ఇది జరగటానికి ఒక రోజుముందు వీరిలో ఒకరైన లూయీస్ లింగ్ ముఖం డైనమెట్ పేలుడు కారణంగా దెబ్బతిన్నది. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు కొంతమంది చెప్పగా, పోలీసులే హత్య చేశారని మరికొందరు పేర్కొన్నారు.


ఖైదీలలో సజీవులుగా మిగిలివున్న ముగ్గురికి 1893 జూన్లో ఇల్లినాయిస్ గవర్నర్ జాన్ పీటర్ అల్ట్జెల్ద్ క్షమాభిక్ష పెట్టారు. ఆ కారణంగా ఆయన రాజకీయ భవితవ్యం చిక్కుల్లో పడింది.


హేమార్కెట్ సభ, బాంబు విసరటం, లేదా కపట రీతిలో చెప్పేవిధంగా “హేమార్కెట్ ఘర్షణ”, విచారణ, తదనంతరం సంభవించిన పరిణామాలన్నీ “హేమార్కెట్ సంఘటన"గా ప్రసిద్ధి పొందాయి.


చాలాకాలం క్రితం, అంటే, 1886లో సంభవించిన హేమార్కెట్ ఘటన అనేది కొంతమంది దృష్టిలో చరిత్ర పుస్తకాలలో నిక్షిప్తమైనదిగా వుండవచ్చు. కాని ఆ ఘటనకు దారితీసిన అంశాలు సమస్యల రూపంలో యిప్పటికీ మనతోనే వున్నాయి.. నిరుద్యోగం, మైనారిటీల హక్కులు, న్యాయబద్ధమైన సంపద పంపిణీ, వాక్, సభా స్వాతంత్ర్యాలూ, రాజకీయ అవినీతి, పోలీసు నిఘా, కిరాతకత్వమూ, అమెరికన్ కార్మికులు తాము కోరుకున్న సంఘాలలో సంఘటితం అయ్యేటందుకు స్వేచ్ఛ వంటివన్నీ యిలాంటివే 1886 తరువాత చికాగో నగరం ఎంతగానో మారినప్పటికీ, పాత భవనాల స్థానంలో కొత్తవి వచ్చినప్పటికీ యీనాటికీ హేమార్కెట్తో ముడిపడివున్న ప్రదేశాల సందర్శన వుత్సుకతతో నిండివుంటుంది.


హేమార్కెట్ చౌకు యిప్పటికీ దాదాపుగా పూర్వంవలెనే వున్నది. వెనుకటి కూక్ కౌంటీ న్యాయస్థానమూ, ఒకప్పటి కౌంటీ కారాగారంవున్న ప్రాంతమూ 1880లను గుర్తు చేస్తున్నాయి. వికర్ పార్క్-మిల్వేకి అవెన్యూ ప్రాంతమంతా చూడచక్కని నిర్మాణాలతోనూ, వుత్సుకతను కలిగించే జాతుల యిరుగు పొరుగుతోనూ నిండివున్నది. పురాతన జర్మన్ వాల్దీమ్ శ్మశానం సందర్శన అంతగా వుపయోగపడక పోయినా, హేమార్కెట్ విషాదం మాత్రం మనలను కదిలిస్తుంది. 8 మంది హేమార్కెట్ వీరులేకాక, హేమార్కెట్ సభ, విచారణ, ఉరితీతలతో ఎవరి తలరాతలైతే మారాయో ఆ యిరవై నలుగురు కూడా మిమ్మలను ప్రభావితం చేస్తారు.


హేమార్కెట్ ఘటనకన్నా ప్రాధాన్యం కలిగిన ఘటనలు కొన్నివున్నప్పటికీ,బహు కొద్దిమంది అమెరికన్లు మాత్రమే వాటి ప్రాధాన్యాన్ని గుర్తించారు. అమెరికన్ కార్మిక చరిత్రలోని యీ మూలమలుపులను మరోమారు స్మరించు కోవలసిన అవసరం ఎవరికైతే వున్నదో, ప్రత్యేకించి ఆ అమెరికన్ స్త్రీ పురుష శ్రామికుల కోసం యీ గ్రంథ రచన సాగింది.


*చికాగోలోనే ఎందుకు జరిగింది?


1950లలో చికాగోకు చెందిన రచయిత నెల్సన్ అల్గోన్ చికాగోనూ, “దానికి చెందిన ప్రతి ఒక్కరినీ వారికి చెందిన వారిగానే తయారు చేసే నగరంగా......' పేర్కొన్నాడు. తొలినుంచీ చికాగో నగరం యీ విధంగానే వున్నట్లు కన్పడుతున్నది. చికాగో సహకార సమాజం కాదు, అత్యధిక పోటీని కలిగి వున్నది. చికాగో వాసులు "సర్వసాధారణంగా తమ వ్యాపారాలలో, తమ అదృష్టాలను పోగు చేసుకొనడంలో తలమునకలుగా వుంటారని, ఆలోచన చేయటానికి వారికి ఎక్కువ సమయం వుండదని", 1880ల నాటి విదేశీ పర్యాటకులు పేర్కొన్నారు. "చికాగోలో డాలరే మహరాజని”, సర్వసాధారణంగా విదేశీయులు వ్యాఖ్యానించే వారు.


1880ల నాటికే ప్రపంచంలోనే త్వరితగతిని వృద్ధిచెందుతున్న నగరంగా చికాగో నిలచింది. 'మాకు మేమే, మాకు యింకొకరితో పనిలేదు' అనుకునే తరహా ప్రజలను అది ఆకర్షించింది. "న్యూయార్క్కన్నా అమెరికన్ ప్రజలలోని వూహాజనితవాదులు, హద్దులు చెరిపేసినవారు, చమత్కారులు, నిర్లక్ష్యంతో మెలగేవారు”, చికాగోలో ఎక్కువగా వున్నారని 1887లో లండన్ టైమ్స్ పత్రిక పేర్కొన్నది.


భూమి ధర చౌకగా వుండటంతోపాటు, ప్రతి ఒక్కటీ నిర్మాణమై వుండటంతో మున్ముందుగా చికాగోలోకి అడుగుపెట్టిన వారు విజయాలు సాధించటానికి వీలుగా సహజంగానే బ్రహ్మాండమైన అవకాశాలు లభించాయి. న్యూ ఇంగ్లండు, తూర్పు దిశనుంచి వచ్చిన జార్జి పుల్మాన్, మార్షల్ ఫీల్డ్, పాటర్ పామెర్, సైరస్ మెకార్మిక్ వంటి తొలుదొల్తటి ఆంగ్లో శాక్సన్ ప్రొటెస్టెంట్లు 19వ శతాబ్దపు ద్వితీయార్ధమంతటా పట్టణ జీవితంలో ఆధిపత్యాన్ని కలిగివున్నారు. వారి వారసులు కూడా 1930ల వరకు నగరంపై రాజకీయంగా ఆధిపత్యాన్ని కలిగివున్నారు.


1830లలోనూ, 1840లలోనూ వచ్చిన ఐరిష్ వలసదారులనూ, 1848 తరువాత రావటం ప్రారంభించిన జర్మన్లనూ తొలుదొల్తటి వలసదారులు తక్కువగా చూడసాగారు. దోచుకోవటానికి వీలైన చౌక కూలీలుగా వారిని భావించారు. ఐరిష్లు, జర్మన్లు సంఘటితమై అమెరికన్ పౌరులకు వున్నట్లుగానే తమకు కూడా హక్కులు వుండాలని పోరాటం ప్రారంభించగానే వీరికి వ్యతిరేకంగా చెక్, బొహీమియా, పోలిష్ తదితర జాతి జనులను తీసుకువచ్చి నిలబెట్టారు. తత్ఫలితంగా జాతి, ఉపజాతి ఘర్షణలు చికాగోయొక్క తొలినాటి లక్షణాలుగా మారాయి.


తమ పనివాళ్ళ కోసం తాము సృష్టించిన సమస్యలు నగరంలోని సంపన్న వ్యాపారులకు ఎదురు కాలేదు. తమవలెనే తమ పనివాళ్ళు కూడా ధనవంతులు కాగలరని వారు భావించారు. వేలమంది నిరుద్యోగులుగా మారినపుడు పేదలు సోమరులని ధనికులు భావించారు. హేమార్కెట్ వుదంతం చోటుచేసుకోవటానికి ఏడాది ముందు "గడ్డు రోజులు-వాటిని సరిదిద్దడం ఎలా" అన్న శీర్షికన చికాగోకు చెందిన ఒక వ్యాపారి పేరుపెట్టకుండా ఒక వ్యాసాన్ని రాశాడు. నిరుపేద జాతి శ్రామికులకు యీ దిగువ విధంగా దేశభక్తి ప్రపూరిత సలహాను యిచ్చాడు:


“సక్రమంగా వినియోగించుకున్నట్లయితే, తక్కువ వేతనాలు కూడా నిన్ను, నీవారిని స్వతంత్రంగా వుంచుతాయి.... స్వతంత్ర సముపార్జనకుగాను ప్రత్యేకమైన శౌర్యము, అధికతర విజ్ఞానము, అసాధారణ సామర్ధ్యమూ అవసరం లేదు, పరిశ్రమ, సంయమనము, చక్కని నిర్వహణ అనేవి కీలకమైనవి......."


అయితే, దేనినైనా పక్కన పెట్టి ఒక వ్యక్తి రోజుకు ఒక డాలర్ ను ఎలా సంపాదించగలడు? ఈ సలహాను పాటించడం ద్వారా ఒక మహిళ లేదా ఒక బాలుడు, బాలిక రోజుకు 5 సెంట్లు ఎలా సంపాదించగలరు? 1880ల నాటికి నూతన యంత్రాల ప్రవేశంతో చివరకు నిపుణ కార్మికుల వుద్యోగాలు సైతం పోయాయి.


2. చికాగోలో అదనపు శ్రామికుల సంఖ్య పెరుగుతుండటంతో వేతనాలలో కోతనూ లేదా ఎక్కువ పనిగంటలనూ ఎవరైనా ఒప్పుకోని పక్షంలో అతని స్థానాన్ని పూరించటానికి అన్ని వేళలా కొంతమంది సిద్ధంగా వుండేవారు.


B


* చికాగోలో మైనారిటీలపై రాజకీయ అణచివేత


1855 నాటికి చికాగోలో స్థానికులకన్నా విదేశాలలో పుట్టినటువంటి ఓటర్లు ఎక్కువగా వున్నారు. తత్కారణంగా నగర రాజకీయాలపై తమ అదుపు తప్పిపోగలదని నగరంలోని ధనిక వ్యాపారులు భయపడ్డారు. దీనితో 'నో - నథింగ్స్' (know-nothings) పేరిట జాత్యహంకార, విదేశీవ్యతిరేక, కార్మికవ్యతిరేక రాజకీయపార్టీ వునికిలోకి వచ్చింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..