జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలన్న మార్క్స్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
మార్క్సిస్ట్ విప్లవ రాజకీయాలు చాలా ప్రత్యేకమైనవని 20వ శతాబ్దానికి చెందిన చాలామంది భావిస్తారు.
సామాజిక న్యాయం, సమాజంలో తీసుకురావాల్సిన మార్పులకు మార్క్స్ ఆలోచనలు చాలా అనువైనవి. ఎంతో ప్రత్యేకమైనవి.
అయితే ఆయన ఓ మానవతావాది, ఉన్నత లక్ష్యాలున్న నాయకుడు అన్నది నిర్వివాదం. ప్రపంచాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడంలో ఆయన ఆలోచనలు, విధానాలు ఎంతో సహాయం చేశాయి.
కార్ల్ మార్క్స్ కొన్ని అంశాలను చక్కగా అంచనా వేశారు. కొద్దిమంది సంపన్నులు తెరపైకి వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తారని, పెట్టుబడిదారీ విధానం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందని, ఆర్థిక సంక్షోభాలు ప్రజలను దాదాపు చంపేసినంత పని చేస్తాయని ఆయన హెచ్చరించారు.
మీకు ఫ్రీ టైం ఉండాలి. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీరే నిర్ణయించుకోవాలి.
ఇప్పుడు మీరు రోజుకు 24 గంటలు పనిచేయడం లేదు.వారంలో 7 రోజులూ ఫ్యాక్టరీకి / ఆఫీస్‌కి వెళ్లడం లేదు.డ్యూటీ మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు.రిటైర్మెంట్ తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ అందుకునే వెసులుబాటు కూడా కొందరికి ఉంటుంది.ఈ సౌకర్యాలు మీకు సంతృప్తిని కలిగిస్తున్నాయా? మీ సమాధానం అవును అయితే, మీరు తప్పకుండా కార్ల్ మార్క్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
"రోజంతా పనిచేసేలా మీపై ఒత్తిడి తీసుకొస్తే ఇక మీకు వ్యక్తిగత సమయం అంటూ ఏదీ ఉండదు. నీ సొంత జీవితం కూడా నీ అదుపులో ఉండదు" అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ మైక్ సావేజ్ అన్నారు.
తమ వద్ద ఉన్న ఏకైక సంపదైన శ్రమను కార్మికులు డబ్బు కోసం అమ్ముకునేలా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా ఒత్తిడి తీసుకొస్తుందో ఆనాడే మార్క్స్ రాశారు. పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడకు అది అవసరం.కానీ ఇందులోనూ అసమానతలు ఉండేవి. మార్క్స్ ప్రకారం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఉండేది కాదు. శ్రమ దోపిడీ జరిగేది. కార్మికులను మనుషులుగానే చూసేవారు కాదు. ఇది వారిని ఎంతో బాధించేది.వారికి మరిన్ని సౌకర్యాలు కావాలని మార్క్స్ ఆకాంక్షించారు. మనం స్వతంత్రంగా, సృజనాత్మకంగా ఉండాలని భావించారు. అన్నింటికంటే ముఖ్యంగా మన సమయాన్ని మనకిష్టమైనట్లు ఉపయోగించుకునే వీలు ఉండాలని ఆయన అనేవారు.
"పనే మన జీవితం కాకూడదు. మనకంటూ వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకూ ఇష్టాయిష్టాలు ఉండాలి. జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి" అని మార్క్స్ చెప్పేవారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇదే భావన ఉందని ప్రొఫెసర్ మైక్ అన్నారు. ఈ భావనకు పురుడు పోసింది మాత్రం మార్క్సే.
చేసే పనిలో మీకు సంతృప్తి ఉండాలి!
కార్ల్ మార్క్స్ ఇదే కోరుకున్నారు. మీరు చేసే పనిలో మీకు సంతృప్తి ఉండాలని చెప్పారు. కార్మికులు చేసిన పనిలో తమను తాము చూసుకుంటారు.
పని చేసే వాతావరణం మనం మరింత సృజనాత్మకంగా ఉండేందుకు వీలు కల్పించాలి. మన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి, పదును పెట్టుకునేందుకు అవకాశం ఉండాలి. అది మానవత్వం కావొచ్చు, తెలివితేటలు కావొచ్చు.
"ఒకవేళ మీరు చేసే పని మీకు నచ్చకపోతే అది ఎంతో బాధగా ఉంటుంది. పనిపై దృష్టి పెట్టలేకపోతారు. శక్తిసామర్థ్యాలు ఉన్నా వాటిని సరిగా వినియోగించుకోలేకపోతారు. ఒక రకంగా కుంగిపోతారు. క్రమంగా సమాజానికి దూరమైపోయే ప్రమాదం ఉంది"
ఈ మాటలు ఏ సిలికాన్ వ్యాలీకో చెందిన మోటివేషనల్ గురూ ఇటీవల చెప్పినవేమీ కాదు. 19వ శతాబ్దంలోనే మార్క్స్ చెప్పిన సూక్తులివి.
మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి అవసరం అని ఆలోచించిన నాటి తత్వవేత్తల్లో కార్ల్ మార్క్స్ మొదటి వరుసలో ఉంటారు.
1844లో రాసిన "ఎకనామిక్ అండ్ ఫిలసాఫిక్ మాన్యుస్క్రిప్ట్స్" పుస్తకంలో మార్క్స్ ఈ విషయాలను ప్రస్తావించారు.
ఫ్యాక్టరీలు, కార్యాలయాల్లో మనం చాలా సమయం పనిచేస్తూనే గడుపుతాం. ఆ పని నుంచి ఎంతో కొంత సంతోషం మనకు కలగాలి.
మీరు సృష్టించిన లేదా చేసిన పనిని చూసినప్పుడు మీకు గర్వంగా అనిపించాలి. అది మీకు ఉద్యోగంలో సంతృప్తి కలిగిస్తుంది. సంతృప్తి ఉంటే జీవితంలో సంతోషంగా ఉంటారు అని మార్క్స్ నమ్మేవారు.
క్షణాల్లో పని జరిగిపోవాలనుకునే పెట్టుబడిదారీ వ్యవస్థ.. ఉత్పత్తిని, లాభాలను ఎలా పెంచేసుకుందో కార్ల్ మార్క్స్ గమనించారు. ఈ ఉరుకులు పరుగుల కారణంగానే పని విభజన జరిగింది.
ఒక స్క్రూ మీద మూడు గీతలు గీయడమే మీరు చేయాల్సిన పని అనుకోండి.
అప్పుడు అదే పని గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తే ఎలా ఉంటుంది?
మీరు చేసే ఆ పనిలో ఆనందం పొందగలరా? అసాధ్యం కదా.
ఎంత సులువైన పని అయినా.. దాన్నే రోజుల తరబడి పదే పదే చేయడం కష్టంగా అనిపిస్తుంది.
నిజానికి మార్క్సిజం ఆధునిక పెట్టుబడిదారీ విధానం కంటే ముందే వచ్చింది. కానీ ప్రస్తుతమిది నిర్ధరించుకోవాల్సిన విషయం. పెట్టుబడిదారీ విధానం గురించి బాగా తెలియడానికి ముందే ప్రపంచం మార్క్సిజం గురించి చదువుకొని ఉంది.
ఆర్థికశాస్త్ర పితామహుడిగా పేరున్న ఆడమ్ స్మిత్ క్యాపిటలిజం పదాన్ని 'ఇన్విజిబుల్ హ్యాండ్' పుస్తకంలో మొదటిసారి వాడలేదని రచయిత లిండా యూహ్ చెప్పారు.
ఆడమ్ స్మిత్ కంటే ముందే 1854లో 'వానిటీ ఫెయిర్' అనే పుస్తకంలో రచయిత విలియం మేక్పీస్ థాకరే క్యాపిటలిజం పదాన్ని ఉపయోగించారని యూహ్ అన్నారు.
ఆ పుస్తకంలో క్యాపిటలిస్ట్ పదాన్ని 'సంపదకు యజమాని' అనే అర్థం వచ్చేలా ఉపయోగించారని యూహ్ వివరించారు.
కానీ ఆర్థిక పరిభాషలో ఈ పదాన్ని తొలిసారి ఉపయోగించింది మాత్రం కార్ల్ మార్క్సే. ఆయన 1867లో రాసిన క్యాపిటల్ (దాస్ క్యాపిటల్) పుస్తకంలో దీని ప్రస్తావన ఉంది.
ఆ తర్వాత మార్క్సిజానికి ఈ పదం పర్యాయపదంగా మారిపోయింది. అంటే ఒక రకంగా పెట్టుబడిదారీ విధానం కంటే ముందే మార్క్సిజం వచ్చింది.
(బిబిసి తెలుగు నుండి)
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి