వసంతం వస్తుంది.. ఉరికొయ్యలు సైతం పుష్పిస్తాయి..!
" అవును, మేం మౌనంగానే ఉన్నాం. అయితే మృతప్రాయులుగా మాత్రం లేం. పచ్చపచ్చగా పండి వరుగుతున్న సోషలిస్ట్ పైరులం మేం. వసంతాగమనం ఎంతో దూరంలో లేదు. ప్రపంచమంతటా పంటల తరుణం రానే వస్తోంది. స్వేచ్ఛామానవుని వసంతం, అట్టడుగు జనం వసంతం, సర్వ మానవ సౌహార్ద వసంతం, ఉరికొయ్యలని సైతం పుష్పించేలా చేసే వసంతం. ఆ వసంతానికి అభిముఖంగా మేం ముందుకు సాగుతున్నాం. "
----- జ్యూలియస్ ఫ్యుజిక్
( రక్తాక్షరాలు )
రణధీరుడు జ్యూలియస్ ఫ్యూజిక్
(8 సెప్టెంబర్ 1945.. బెర్లిన్ లో జూలియస్ ఫ్యూజిక్ ను ఉరి తీసిన రోజు)
మేధస్సుకు_పదునుపెట్టి, కలాన్ని కరవాలం చేసి, ఫాసిజంపై యుద్ధం చేసిన రణధీరుడితడు. మనుషులందరినీ ప్రేమించిన మనిషి ఇతడు. కమ్యూనిస్టు ఇతడు. వెలుగును, స్వేచ్ఛను ప్రేమించాడు. మొత్తంగా జీవితాన్ని ప్రేమించాడు. ఈయనే జ్యూలియస్ ఫ్యూజిక్. రెండు ప్రపంచ యుద్ధాలు ఈయన జీవిత కాలం. జాతుల విముక్తి పోరాటం ఇతని జీవిత పాఠం. సమసమాజం కోసం విప్లవించడం ఇతని జీవితాదర్శం. ఈ వీరుడు చనిపోలేదు. కమ్యూనిజమే నిజమన్నందుకు అతన్ని చంపేశారు. ప్రేగ్ లో పాంక్రాను జైలులో పదహారున్నర మాసాలపాటు నాజీ నరహంతకుల చిత్రహింసలను భరిస్తూ, మృత్యువుతో పోరాడాడు. గాయాల గేయాలాలపిస్తూ, కలాన్ని గుండె నెత్తుటిలో ముంచి, భావాలను చీటీలపై అక్షరీకరించి కొలిన్ స్కీ అనే ఒక జెక్ గార్డు ద్వారా బయట ప్రపంచానికి చేర్చిన రచయిత, పాత్రికేయుడు జ్యూలియస్ ఫ్యూజిక్. ఆ అక్షరాలే 'రక్తాక్షరాలు'. కాలం ఎవరిని నిజాయతీగా నిలబెడుతుందో, ఎటువంటి వారిని విద్రోహులుగా దిగజార్చుతుందో చిత్రహంసల 'సినిమా' హాలు సాక్షిగా చెబుతూనే ఉరికంబాన్నెక్కిన వీరుడితడు.
తాను తప్పించుకునేందుకు అవకాశమున్నా ఐదుగురి ప్రాణాలను కాపాడేందుకు తాను పోలీసులకు పట్టుబడి ఉరికంబాన్నెక్కిన ఈ వీరుడి కథ తెలుసుకోవాలంటే అతని 'రక్తాక్షరాలు' చదవాలి. ఉషా ఎస్ డానీ రచించిన 'జూలియస్ ఫ్యూజిక్' చదవాలి. రెండు ప్రపంచ యుద్ధాల నేపథ్యాలను ఈ పుస్తకాలు మన ముందుంచుతాయి. ఫాసిజం పుట్టుక, పతనం.. నియంతల నీచ చరిత్ర.. దానికి ఎదురొడ్డి నిలిచిన త్యాగధనుల ఘన చరిత్ర తెలుసుకోగలుగుతాం.
ఇతరులను హింసించే స్వేచ్ఛ, ఆకలితో చచ్చే స్వేచ్ఛ నిజమైన స్వాతంత్య్రం కాదంటాడు ఫ్యూజిక్. ఆ స్వేచ్ఛే స్వాతంత్ర్యంగా చలామణి అవుతున్న కాలంలో ఉన్నాం మనం. నాటి ఫాసిస్టుల డాంభికాలనే నేడు వల్లెవేస్తున్న తీరును కంటున్నాం. ఆ కాలానికి, ఈ కాలానికీ ఉన్న పోలికలేమిటో తెలుసుకోవాలి. అందుకు ఈ పుస్తకాలు తప్పక ఉపకరిస్తాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి