పరాయీకరణ సిద్ధాంతాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి?
“మన జ్ఞానానికి సార్ధకత లేదు. మన విశ్వాసాల మీద మనకు విశ్వాసం లేదు. మన విలువల మీద మనకు గౌరవం లేదు. మన దేవుడి మీద మనకి భక్తి లేదు. మన నాస్తికత్వం మీద మనకు నమ్మకం లేదు. మనమీద మనకి గౌరవం లేదు. మన తోటివాళ్ళ మీద మనకు మమకారం లేదు. మన ప్రజాస్వామ్యం మీద మనకు అవగాహన కాని గురి కాని లేదు. మన జ్ఞానానికి, విశ్వాసానికీ పొంతన లేదు. విశ్వాసానికీ, ఆచరణకు పొందిక లేదు. భూమి బల్లపరుపుగా వున్నప్పుడు మాత్రమే ఇలాంటి జీవితం కళ్ళబడు తుంది. మన భూమి బల్లపరుపుగా వున్నది గనుకనే మన సమాజం ఇలా వుంది." పతంజలి రచన 'పిలక తిరుగుడు పువ్వు' నవలలో మేజిస్ట్రేటు భూమి బల్లపరుపుగా ఉందని తీర్పు చెబుతూ చేసిన వ్యాఖ్యలివి.
ఈ మాటలు మన ప్రస్తుత సమాజ పరిస్థితిని చాలా చక్కగా వర్ణిస్తున్నాయి. ప్రతి వాక్యం మన చెంప చెళ్ళుమనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బతుకుతున్న వారు పోనీ సుఖంగా వున్నారని చెప్పగలమా? ముమ్మాటికీ వీరంతా ఎంత మాత్రం సుఖంగా లేరని ఢంకా బజాయించి చెప్పవచ్చు. మనలో ఆర్థిక బాధలు లేనివారు కూడా సుఖంగా లేరు. ఎందుకు? అనడిగితే సమాధానం చెప్పలేము. నిజానికి మనకు తెలియదు.
" 'కుక్క కుక్క కోసమే!' అనే జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది. వీళ్ళకు?" వీర బొబ్బిలి స్వగతం.
'తను తనకోసమే అనే తెలివిడి కుక్కకుంది. కాని, మనిషికి లేదెందుకో'అని వాపోతున్నాడు పతంజలి. మనిషి మనిషి కోసం, లేదా మనుషుల కోసం కాక మానవేతరమైన డబ్బు, వస్తువులు, అధికారం, గుర్తింపు, కీర్తి మొదలైన వాటికోసం
బతకడం మనం చూస్తున్నదే! ఇలా మనిషి మనిషి కాకుండా పోవడమే పరాయీకరణ. దీనికి నిజ జీవితం నుండి, సాహిత్యం నుండి వందల రుజువులు చూపవచ్చు. మానవాళిని అమానవీయం చేసే ఇంత దుష్టశక్తి జనించడానికి మూల కారణం ఏమిటి? అ తెలుసుకోవాలంటే మార్క్స్ పరాయీకరణ సిద్ధాంతం తెలుసుకోవాల్సిందే.
పరాయీకరణ సిద్ధాంతం మార్కిజానికి ఆరంభ స్థానం, ఆయువుపట్టు అని చెప్పాలి. మార్క్ కార్మికులకు ప్రబోధించిన విప్లవం యొక్క అంతిమ లక్ష్యం మొత్తం మానవాళి పరాయీకరణను అధిగమించడమే! మనిషిని మనిషిగా బ్రతకనివ్వని పరాయీకరణ కమ్యూనిస్టు సమాజంలోనే అంతమవుతుంది. పెట్టుబడిదారీ సమాజానికి వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్టులకు ఆ వ్యవస్థ గురించి సమగ్ర అవగాహన ఉంటేనే వారి పోరాటం ఫలవంతమౌతుంది. కేపిటలిజం యొక్క అత్యంత దుర్మార్గమైన పర్యవసానం ఈ పరాయీకరణ, శ్రామికుల ఆర్థిక దోపిడీ నుండి జనిస్తుంది ఈ పరాయీకరణ మానవీయమైన దాన్నంతా అమానవీయం చేస్తుందీ వ్యవస్థ.
మార్కిస్టు తత్వశాస్త్రానికి పరాయీకరణ భావన ప్రాతిపదిక అని విమర్శకుల అభిప్రాయం. అయితే ఈ భావనకు రావలసిన ప్రాచుర్యం రాలేదు, అంతగా ఆదరణకు నోచుకోలేదు. కారణం ఏమిటి? ప్రపంచ వ్యాపితంగా కమ్యూనిస్టు సాహిత్యాన్ని ఎక్కువగా వ్యాప్తి చేసిన సోవియట్ యూనియన్ పరాయీకరణ భావనను పక్కన పెట్టింది. ఈ విషయంలో మెజరోస్ సోవియట్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు.మార్క్స్ పరాయికరణ భావనను తొలిసారిగా, ప్రధానంగా 1844 ఆర్థిక తాత్విక రాతప్రతులు అని పిలవబడే నోట్సులో ప్రతిపాదించాడు. దీన్ని మొట్టమొదట 1932లో సోవియట్ యూనియన్ లో ప్రచురించారు. ప్రచురణ బాధ్యతలు నిర్వహించిన పార్టీ కమిటీ మార్క్స్ ప్రతిపాదనను భావవాదాత్మకం అంటూ కొట్టిపారేసిందని ఆయన ఆరోపణ. సోవియట్ కమ్యూనిస్టు పార్టీనే అనుసరించే ప్రపంచ వ్యాపిత కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా ఈ భావనను నిర్లక్ష్యం చేశాయనిపిస్తుంది
ఇదిలా ఉండగా సోవియట్ సమాజంలో పరాయీకరణ తొలగిపోలేదు కాబట్టి పరాయీకరణ అనేది సమాజ పురోగమనంలో అనివార్య పరిణామమని బూర్జువా సామాజికవేత్తలు ప్రచారం చేసుకున్నారు. దీన్ని ఖండిస్తూ స్వతంత్ర మార్క్సిస్టు మేధావులు అనేకమంది గొప్ప పుస్తకాలు రాశారు, రాస్తున్నారు
పరాయీకరణ మనిషిని సమాజం నుండి కూడా వేరుచేస్తుంది. సమాజం వ్యక్తికి అర్ధంకాని, అభేద్య శత్రువులా కనిపిస్తుంది. సమాజం ముందు వ్యక్తి నిస్సహాయునిగా మిగిలిపోతాడు, సమాజాన్ని మార్చడం అసాధ్యమనిపిస్తుంది. ఈ పరిస్థితి నిత్యం మనం చూస్తున్నదే! ప్రపంచాన్ని మానవీయంగా మార్చే మహత్తర కర్తవ్యాన్ని తమ కార్యాచరణ ప్రణాళికగా ఎంచుకున్న కమ్యూనిస్టులకు ఇంతకన్నా పెద్ద అవరోధం మరొకటి ఉండదు.
ప్రస్తుతం మనం జీవిస్తున్న కేపిటలిస్టు సమాజం పరాయికరణను నానాటికీ మరింత తీవ్రం చేస్తున్నది. ప్రజలు తమ జీవితాలనుండి, సమాజం నుండి తమని తాము పరాయివారుగా భావించటం ఆ వ్యవస్థ రక్షణకు అవసరం. తనకు తాను పరాయివాడైన వ్యక్తి తన జీవితాన్ని పరాయి జీవితంలా భారంగా ఈ డుస్తుంటాడు. అటువంటి వ్యక్తి వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా అతని కార్యకలాపాల్లో సమిష్టి భావం, సామాజిక స్పృహ ఉండవు. దీనివల్ల ప్రపంచాన్ని మార్చే ఉద్యమం అంగుళం కూడా ముందుకు సాగదు. అందుచేత కమ్యూనిస్టు శ్రేణుల్లో పరాయీకరణ గురించిన సమగ్ర అవగాహన చాల అవసరం.
__రావు కృష్ణారావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి