శత వసంతాల కమ్యూనిస్టు ఉద్యమం
శత వసంతాల కమ్యూనిస్టు ఉద్యమం
కమ్యూనిస్టు పార్టీ ఎన్నిచోట్ల గెలిచింది? ఎక్కడెక్కడ అధికారంలో ఉంది? అన్న ప్రశ్నలకు వచ్చే జవాబులు పరిమిత పరిధినే చూపించవొచ్చు. కానీ, భారతీయ సమాజం మీద, వివిధ రంగాల మీద కమ్యూనిస్టు ఉద్యమం చూపించిన ప్రభావం ఎలాంటిది అంటే మాత్రం - అది చాలా విస్తారమైనది, విస్తృతమైనది, విశిష్టమైనది. సామాన్యుల వైపు, కష్టజీవుల వైపు పట్టుదలతో పనిచేసేది ఎవరు అంటే- ఎవరైనా సరే నిర్ద్వంద్వంగా ఎర్రజెండా వైపు చూపుతారు. జనం ఒక ప్రశ్నయి పిడికిలెత్తినా, ఉద్యమమై వెల్లువెత్తినా దానిని అరుణపతాకపు చైతన్యంగానే సరిపోల్చుతారు. త్యాగనిరతి, పోరాట పటిమ, ఉజ్వల చరిత అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కమ్యూనిస్టుల సొంతం. ఆటుపోట్లు, ఒడుదుడుకులూ ఎన్నయినా ఉండొచ్చు గాక.. ఎర్రజెండా ఎదురొడ్డి నిలుస్తోంది. జనపక్షాన నికరంగా నిలబడుతుంది. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి ఇది శతవసంతాల సందర్భం. భారతదేశంలో ఆ ఉద్యమ ఆవిర్భావ, విస్తరణలపై ఇదొక సంక్షిప్త అవలోకనం.
దేశంలో 19వ శతాబ్దపు చివరలో రైల్వేలు, పరిశ్రమలు స్థాపించడంతో బూర్జువా వర్గం రూపుదిద్దుకుంది. దాంతోపాటే అభివృద్ధి చెందిన కార్మికవర్గ పోరాటాలు దేశంలో కమ్యూనిస్టు ఉద్యమావిర్భావానికి ప్రాతిపదికగా నిలిచాయి. దేశ ప్రజలు 20వ శతాబ్దపు తొలి అర్ధభాగంలో సాగించిన సామ్రాజ్యవాద వ్యతిరేక, ప్రజాతంత్ర ఉద్యమ స్రవంతుల నుండి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి, అభివృద్ధి చెందింది. దేశంలో కమ్యూనిస్టు ఉద్యమావిర్భావానికి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం.. ముఖ్యంగా 'అక్టోబర్ విప్లవం' ఎంతగానో తోడ్పడ్డాయి. నాలుగు ప్రధాన ప్రవాహాల ద్వారా దేశంలో కమ్యూనిస్టు ఉద్యమా విర్భావానికి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం దోహదపడింది.
అంతర్జాతీయ స్ఫూర్తి
ఇది ప్రధానంగా మొదటి ప్రపంచ యుద్ధకాలంలో (1914-18) జరిగింది. మొదటిది, జర్మనీ సహాయంతో స్వాతంత్య్ర సమరం జరప యత్నించి, అక్టోబర్ విప్లవ ప్రభావం వల్ల కమ్యూనిస్టులైన వారి ద్వారా వచ్చింది. రెండవది, ఖిలాఫత్, హిజ్రత్ ఉద్యమాల ద్వారా వచ్చింది. ఈ ఉద్యమాల్లో పాల్గొన్న యువకులు టర్కీ, ఆఫ్ఘనిస్తాన్‌కు వలస వెళ్లారు. వారు అక్టోబర్ విప్లవ ప్రభావం వల్ల అక్కడ కమ్యూనిస్టులుగా మారి, భారతదేశం వచ్చారు. మూడోది, గదర్ పార్టీ ద్వారా వచ్చింది. పంజాబు, తదితర రాష్ట్రాల నుండి అమెరికాకు వలసవెళ్లిన వారు యుద్ధకాలంలో అక్కడ గదర్ పార్టీని స్థాపించారు. భారతదేశంలో సాయుధ తిరుగుబాటుకు సన్నాహాలు చేసిన గదర్ వీరులు అక్టోబర్ విప్లవ ప్రభావం చేత కమ్యూనిస్టులుగా మారారు. నాలుగోది, భారత దేశంలోనే స్వాతంత్య్రోద్యమం నుండి ఆవిర్భవించింది. దేశంలో అతివాద కాంగ్రెస్ వాదులుగానో, విప్లవ కారులు గానో, ఖిలాఫత్ ఉద్యమకారులుగానో ఉంటూ రష్యా విప్లవం వల్ల ఉత్తేజితులై, వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీకి అంకురార్పణ చేశారు. సాయుధ పోరాటం ద్వారా బ్రిటీష్ వారిని భారత గడ్డపై నుండి తరిమికొట్టాలని టెర్రరిస్టు గ్రూపుల్లో చేరిన అనేకమంది తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. గాంధీజీ శాసనోల్లంఘనోద్యమాన్ని అర్ధంతరంగా విరమించడంతో కాంగ్రెస్ విధానాలపై తీవ్రమైన అసంతృప్తికి గురైన జాతీయవాదులూ వివిధ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలో చేరి, తరువాత ఉద్యమకారులయ్యారు. బ్రిటిష్ వలస పాలన నుండి భారత్‌ను విముక్తి గావించేందుకు ఆఫ్ఘనిస్థాన్ మీదుగా నాటి సోవియట్ యూనియన్‌కు వెళ్లిన ముహాజిర్‌ల (వలసపోయినవారు)లో అనేకమంది అక్కడ కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా చేరారు. అప్పటికే అక్కడ కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎన్ రాయ్ సహకారంతో వీరు 1920, అక్టోబర్ 17 భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. ఆ విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. 1920 నుండి బొంబాయి, బెంగాల్ మొదలైన రాష్ట్రాల్లో చిన్న చిన్న గ్రూపులుగా పనిచేస్తూ వచ్చిన కమ్యూనిస్టులు 1925, డిసెంబర్ 26న పారిశ్రామిక పట్టణమైన కాన్పూర్‌లో మహాసభ జరిపి, కమిటీని ఎన్నుకున్నారు.
పార్టీలో చీలికలు..
సిపిఐ 1930లో ఒక ముసాయిదా కార్యాచరణ వేదికను ప్రచురించింది. అది వివిధ వర్గాల ప్రజా సమస్యల పరిష్కారానికి విప్లవ పరివర్తన అవసరమని పేర్కొంది. అయితే ఇది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్య సంఘటనను తిరస్కరించింది. ఈ పొరపాటు అవగాహన వల్ల కమ్యూనిస్టులు ఆ రోజుల్లో ప్రధాన స్రవంతి నుండి వేరుపడిపోయారు.
మీరట్ కుట్ర కేసు ముగిసిన తరువాత కలకత్తాలో పార్టీ అఖిల భారత మహాసభ జరిగింది. ఇందులో ఒక తాత్కాలిక కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. ముసాయిదా రాజకీయ విధాన పత్రాన్ని ఆమోదించారు. జాతీయ బూర్జువా వర్గానికి సామ్రాజ్యవాదులతో గణనీయమైన వైరుధ్యాలున్నాయని ఇది ఆమోదించింది. దీంతో కొత్త దశ పోరాటాలు ప్రారంభమయ్యాయి. కలకత్తా మహాసభ జరిగిన కొద్ది నెలలకే బ్రిటిష్ ప్రభుత్వం 1934 జులైలో పార్టీపై నిషేధం విధించింది.
భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తొలిరోజుల్లో అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ (కొమింటర్న్) సలహాలు, సూచనలు ఇచ్చేది. కామ్రేడ్ లెనిన్ సూచనలకు భిన్నంగా ఎంఎన్ రాయ్ ఇచ్చిన సలహాలు కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒంటెత్తు పోకడల్లోకి తీసుకెళ్లాయి. స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయకూడదన్న ఆయన నిర్ణయంతో కమ్యూనిస్టులు ప్రధాన స్రవంతి నుండి దూరమయ్యారు. 1935లో జరిగిన ఏడవ కమ్యూనిస్టు అంతర్జాతీయ మహాసభ భారతదేశంతో సహా అన్ని వలస దేశాల్లో విశాలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక ఐక్య వేదికలను నిర్మించాలని పిలుపునిచ్చింది. అది పార్టీని ఒంటరితనం నుండి బయటకి వచ్చే వ్యూహన్ని ఇచ్చింది. దానితో పార్టీ ముందుకు అడుగులేయడం ప్రారంభించింది. ఈ కొత్త పంథాలో ప్రజలతో సంబంధాలు బలపడ్డాయి. ఈ వ్యూహానికి అనుగుణంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీతోనూ సహకరించి, పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ వ్యూహాన్ని పార్టీ నాయకులూ కార్యకర్తలూ అనుసరించి, అతి త్వరలో అనేక రాష్ట్రాల్లో పేరుమోసిన కాంగ్రెస్, కాంగ్రెస్ సోషలిస్టు నాయకులుగా ఎదిగారు.
ప్రజాసంఘాలు.. దళిత సమస్యలపై ..
దేశంలో కష్టజీవుల రాజ్యాన్ని స్థాపించాలంటే కార్మిక, కర్షక, విద్యార్ధి, యువజన, సాంస్కృతిక రంగాల్లో సంఘ నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని కమ్యూనిస్టులు గుర్తించారు. పెద్దఎత్తున కార్మికులను సమ్మె పోరాటాల్లోకి సమీకరించారు. ఫలితంగా ఒక్క 1937లోనే దేశవ్యాపితంగా సమ్మెల్లో ఆరు లక్షల మందికి పైగా కార్మికులు పాల్గొన్నారు. మనది వ్యవసాయ దేశం కాబట్టి రైతాంగాన్ని పోరాటాల్లోకి సమీకరించాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఫలితంగా 1936లో అఖిల భారత కిసాన్‌సభ(ఎఐకెఎస్), అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎఐఎస్‌ఎఫ్) స్థాపించారు. అదే ఏడాది అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడింది. 1943లో ఇండియన్ పీపుల్స్ థియేటర్ (ఇప్టా) ఏర్పడింది. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి)ని బలోపేతం చేశారు.
స్వాతంత్య్రోద్యమంలో సామాజికంగా మూడు స్రవంతుల్లో ఉద్యమాలు జరిగాయి. మొదటిది, గాంధీజీ నాయకత్వంలో. మౌలికాంశాలను మార్చకుండానే సామాజిక సేవ కార్యక్రమాల ద్వారా హరిజనులను సమాజంలో అంతర్భాగం చేయవచ్చని, అంటరానితనాన్ని నిర్ములించవచ్చనేది ఈ ఉద్యమాల సారాంశం. రెండవది, అంబేద్కర్ నాయకత్వంలో కులాంతర వివాహాలు, బుద్ధిజంలోకి మారడం వంటి చర్యల ద్వారా కుల నిర్మూలన చేయవచ్చనేది వీరి ఆలోచన. మూడవది, కమ్యూనిస్టుల నాయకత్వంలో. కులవివక్షను పోషించే భూస్వామ్య విధానంపై పోరాటాల ద్వారా సామాజిక మార్పు తేవాలని, సాంఘిక సమానత్వం సాధించాలని కమ్యూనిస్టులు దళితుల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చారు. వారిని ప్రజా సంఘాల్లో సంఘటితం చేశారు.
కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగ ఉద్యమం దేశవ్యాపితంగా ఊపందుకున్నది. భూస్వామ్య వ్యవస్థ రద్దు, దున్నేవారికి భూమి, వెట్టిచాకిరీ రద్దు, కౌలుదారుల హక్కులు, పంటలకు గిట్టుబాటు ధర, భూమి శిస్తు వగైరా సమస్యలు తీసుకుని పోరాటాలు నిర్వహించారు.
స్వాతంత్రోద్యమంలో...
అప్పటివరకూ బ్రిటిష్ వారితో బేరసారాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. కమ్యూనిస్టుల ప్రవేశంతో భారత స్వాతంత్య్ర పోరాటంలో సంపూర్ణ స్వరాజ్యం నినాదం ముందుకు వచ్చింది. 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మహాసభలో ఇద్దరు కమ్యూనిస్టులు మౌలానా హస్రత్ మోహానీ, స్వామీ కుమారానంద 'సంపూర్ణ స్వరాజ్యం' తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సోవియట్ విప్లవంతో స్వాతంత్య్రోద్యమంలో ...స్ఫూర్తి పొందిన కమ్యూనిస్టు పార్టీ దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడంతో పాటు దోపిడీ, పీడనలేని కష్టజీవుల రాజ్యమైన సోషలిస్టు సమాజాన్ని స్థాపించడానికి కంకణం కట్టుకున్నది. దానికోసం ప్రజలను వర్గ, ప్రజా సంఘాల్లో సమీకరించి, అనేక వీరోచిత పోరాటాలు నిర్వహించింది.
స్వాతంత్య్రోద్యమంలో పెరిగిపోతున్న కమ్యూనిస్టుల ప్రాభవాన్ని, వారి భావజాలానికి ప్రజల్లో వస్తున్న ప్రతిస్పందనను చూసి బ్రిటిష్ పాలకులు బెదిరిపోయారు. కమ్యూనిస్టు పార్టీని శైశవదశలోనే అంతం చేసేందుకు వరుసగా మూడు కుట్ర కేసులు బనాయించారు. 1922లో పెషావర్ కుట్ర కేసు, 1924లో కాన్పూర్ కుట్ర కేసు, 1929లో మీరట్ కుట్ర కేసులు పెట్టి, అనేక మంది కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేశారు. 1929-1933 వరకూ సాగిన మీరట్ కుట్రకేసు విచారణను కమ్యూనిస్టులు తమ భావజాలాన్ని దేశమంతటా వ్యాపింపజేయడానికి ఉపయోగించుకున్న తీరు స్ఫూర్తిదాయకం.
రెండవ ప్రపంచ యుద్ధం (1939) దేశ ప్రజలను ఎనలేని కష్టాల్లోకి నెట్టింది. దేశమంతటా కార్మికవర్గ పోరాటాలు పెల్లుబికాయి. సోవియట్ యూనియన్‌పై 1941లో జర్మనీ దాడికి దిగడంతో యుద్ధ పరిస్థితి మారింది. సోవియట్ యూనియన్‌లో కష్టజీవుల త్యాగాలతో నిర్మించబడిన ఈ తొలి సోషలిస్టు రాజ్యాన్ని రక్షించుకోవడం ప్రథమ కర్తవ్యమని పార్టీ అభిప్రాయపడింది. దాన్ని 'ప్రజాయుద్ధం'గా ప్రకటించింది. సరిగ్గా ఈ సమయంలో 1942 ఆగస్టులో కాంగ్రెస్ పార్టీ 'క్విట్ ఇండియా' ఉద్యమాన్ని ప్రకటించింది. ఈ కాలంలో చేసిన కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సి వచ్చిందని పార్టీ తర్వాత ఆమోదించినప్పటికీ ఈ కాలంలో కమ్యూనిస్టులు ప్రజల్లో చురుగ్గా పనిచేశారు.
వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలు
రెండవ ప్రపంచయుద్ధం 1945లో ముగిసింది. ఫాసిస్టు జర్మనీ, దాని మిత్రపక్షాలు ఓడిపోయాయి. సోవియట్ యూనియన్ విజయం సాధించడంతో ప్రపంచవ్యాపితంగా ప్రజా ఉద్యమాలు వెల్లువెత్తాయి. దేశంలో కార్మిక సమ్మెలు, రైతాంగ పోరాటాలు ఊపందుకున్నాయి. వీటిలో 1946-51 వరకు జరిగిన తెలంగాణా సాయుధ తిరుగుబాటు, 1938-49 వరకు పశ్చిమ బెంగాల్‌లో జరిగిన తెభాగా పోరాటం, 1946లో కేరళ జరిగిన పున్నప్ర-వాయలార్, త్రిపుర మహరాజుకు వ్యతిరేకంగా జరిగిన గిరిజన పోరాటం, 1945-47 వరకూ మహారాష్ట్రలో జరిగిన వర్లీ ఆదివాసీల తిరుగుబాటు, 1936 - 48 వరకూ అస్సాంలోని సుర్మాలోయలో జరిగిన పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ముఖ్య రైతాంగ పోరాటాలు.
భారత నావికా తిరుగుబాటు (1946) ఈ పోరాటాలకు పరాకాష్ట. బొంబాయిలోని రాయల్ ఇండియన్ నేవీ (ఆర్‌ఐఎన్) నావికులు 'మంచి ఆహారం కావాలి' తదితర డిమాండ్లతో 1946, ఫిబ్రవరి 18న ప్రారంభమైన సమ్మె రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలన్న డిమాండ్‌తో రాజకీయ సమ్మెగా మారింది. నావికులు 'విప్లవం వర్థిల్లాలి, సామ్రాజ్యవాదం నశించాలి' అనే నినాదాలు చేశారు. వాళ్లలో అనేక మంది నావికులు కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ జెండాలతో పాటు ఎర్ర జెండాలూ పట్టుకోవడం చూస్తే వారిపై కమ్యూనిస్టు పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
మతతత్వంపై పోరాటం
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దోపిడీ లేని స్వతంత్ర భారతాన్ని సాధించుకునేందుకు జరుగుతున్న ఉమ్మడి పోరాటంలో భారత ప్రజలు ఒకవైపు ఐక్యమవుతుంటే మరోవైపు హిందూ ముస్లిం మతాల్లో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మహాసభ, ముస్లిం లీగ్ ప్రజల్లో అతి భయంకరమైన మత ఘర్షణలను రెచ్చగొట్టాయి. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అయిన నాథూరామ్ గాడ్సే, ఆయన అనుచరులు 1948 జనవరి 30 మహాత్మాగాంధీని హత్యచేశారు. దీనికి పూర్తి భిన్నంగా కమ్యూనిస్టులు మత సామరస్యాన్ని కాపాడ టంలోనూ చురుకుగా పనిచేశారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాలు దేశంలో భూ సంస్కరణలు, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాధాన్యతను ముందుకు తెచ్చాయి.
ఫాసిజంపై సోవియట్ విజయం, జాతీయ విముక్తి ఉద్యమాల వెల్లువల నేపథ్యంలో దేశంలో కార్మిక, కర్షక పోరాటాలు బ్రిటిష్ పాలకుల వెన్నులో చలి పుట్టించాయి. దాంతో వాళ్లు దేశంలోని ప్రధాన బూర్జువా పార్టీలైన కాంగ్రెస్, ముస్లింలీగ్‌తో రాజీ కుదుర్చుకున్నారు. బ్రిటిష్ పాలకులు 1947 ఆగస్టు 15న దేశాన్ని విడిచిపోతూ కాంగ్రెస్‌కు, పాకిస్తాన్‌లో ముస్లిం లీగ్‌కు అధికారం అప్పగించారు.
తొలి మహాసభ
పార్టీ మీద 1942లో నిషేధం ఎత్తివేసిన తర్వాత 1943 మే 23 - జూన్ 1 వరకు బొంబాయిలో తొలి పార్టీ మహాసభ జరిగింది. అప్పట్లో పార్టీలో 15 వేల మంది సభ్యులున్నారు. వారిలో 700 మంది మహిళలు. మొదటి పార్టీ మహాసభకు 139 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభ కేంద్రకమిటీని ఎన్నుకుంది. పిసి జోషీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ విధంగా తాష్కెంట్‌లో చిన్న కమ్యూనిస్టుల గ్రూపుగా ప్రారంభమైనప్పటి నుండి 23 ఏళ్ల తర్వాత తొలి పార్టీ మహాసభ జరిపేనాటికి.. అనేక అణచివేతలు, అరెస్టులు ఎదుర్కొని, కష్టసాధ్యమైన పరిస్థితుల్లో పనిచేస్తూ కమ్యూనిస్టు పార్టీ, భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా కార్మిక ప్రజల ఛాంపియన్‌గా ఎదిగింది.
సైద్ధాంతిక విభేదాలు..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో కొత్త పాలకుల వర్గ స్వభావంపైనా, విప్లవ వ్యూహంపైనా అంచనాల విషయంలో కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలు తలెత్తాయి. ఫలితంగా 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. రివిజనిజానికి వ్యతిరేకంగా పోరాడిన విభాగం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) (సిపిఐ(ఎం)) గా ఏర్పడింది. రివిజినిస్టు విభాగం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అన్న పేరును అట్టే పెట్టుకుంది. అతివాద దుస్సాహస పంథా తీసుకున్న భాగం 1968లో చీలిపోయి, సిపిఐ (ఎంఎల్)గా ఏర్పడింది.
నయా ఉదారవాద శకం
దేశం 1991లో నయా ఉదారవాద శకంలోకి ప్రవేశించడంతో శ్రామికవర్గంపై దాడులు మరింతగా పెరిగాయి. అంతర్జాతీయంగా సోవియట్ యూనియన్, సోషలిస్టు వ్యవస్థ కుప్పకూలడంతో పాలకవర్గాలు మరింత దూకుడుగా పెట్టుబడిదారీ విధానం వైపు మళ్లారు. నయా ఉదారవాదంతో బాటే, దేశాన్ని హిందూరాజ్యంగా మార్చడానికి ప్రయత్నించే పచ్చి మితవాద రాజకీయ శక్తులూ పెరిగాయి. నయా ఉదారవాద విధానాలను ప్రజలకు మేలుచేసే విధానాలుగా చిత్రీకరించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విపరీతంగా విస్తరించిన ప్రసార యంత్రాంగాన్ని వినియోగిస్తూ సామాన్య ప్రజల్లో మితవాద ప్రభుత్వాలు పెద్దఎత్తున భ్రమలు కల్పించాయి. దేశసంపదను కార్పొరేట్లకు పెద్దఎత్తున దోచిపెడుతూ, మరోవైపు పేదరికం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోవడానికి కారణభూతమవుతున్న విధానాలను అమలుచేశాయి. అదే సమయంలో ప్రజల దృష్టిని బూటకపు దేశభక్తి నినాదాలవైపు, కులమత వివాదాలవైపు మళ్లించాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రయివేటీకరణకు, ప్రభుత్వ ఆస్తులను చౌకగా అమ్మేయడానికీ, కార్మిక హక్కులను నీరుగార్చడానికీ మరోవైపు దేశంలో ఫాసిస్టు తరహా 'హిందూత్వ' రాజ్యాన్ని నెలకొల్పడానికీ మోడీ నాయకత్వంలో, ఆరెస్సెస్ ఆదేశాలతో జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు అడుగడుగునా పోరాడుతున్నారు.
నేడు ప్రపంచం యావత్తు సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలోనూ సంక్షోభం తాండవిస్తోంది. సంక్షోభ భారాలను శ్రామిక ప్రజలపైకి నెట్టి, తమ గరిష్టలాభాలు కాపాడుకోవడానికి పాలకవర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. కార్మిక, రైతాంగ ఇతర శ్రామిక ప్రజలపై దాడులు అందులో భాగమే.
ఈ పరిస్థితులలో సిపిఐ(ఎం) ఒక ఉమ్మడి కార్యక్రమం ద్వారా వ్యూహాత్మకంగా వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య పోరాటాల అభివృద్ధికిి కృషి చేస్తోంది. ఈ చారిత్రాత్మక కర్తవ్యం చాలా సంక్లిష్టమైనది, కష్టమైనదనడంలో ఎటువంటి సందేహం లేదు. సరైన రాజకీయ విధానాలు అవలంబిస్తూ, ప్రజలతో సంబంధాలు పెంచుకుంటే.. రానున్న రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమం మరిన్ని విజయాలు సాధించడం ఖాయం. ఈ వందేళ్ల అనుభవాలు మనకు ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
రాష్ట్రాల్లో అధికారం..
కార్మిక వర్గ, రైతాంగ ఉద్యమాల ఆధారంగా కమ్యూనిస్టులు దేశంలో ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. తెలంగాణా పోరాట విరమణ జరిగే సమయంలోనే 1952 జనవరిలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లో కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్టు పార్టీకి అధిక స్థానాలు వచ్చాయి. అయితే తెలుగు నేల విభజించబడి ఉన్నందున కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేకపోయారు. కేరళలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించి, ఇఎంఎస్ నంబూద్రిపాద్ తొలి ముఖ్యమంత్రిగా 1957లో అధికారంలోకి వచ్చింది. ప్రజానుకూల చర్యలు తీసుకుంటున్న కమ్యూనిస్టు మంత్రివర్గాన్ని 1959లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల తరువాత 1977లో వామపక్ష సంఘటన ఎన్నికల్లో గెలుపొంది జ్యోతిబాసు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుండి 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రభుత్వం కొనసాగింది. 2011 ఎన్నికల్లో ఓడిపోయింది. త్రిపురలో 1978లో నృపేన్ చక్రవర్తి ముఖ్యమంత్రిగా సిపిఐ(ఎం) నాయకత్వంలో వామపక్ష సంఘటన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1978-1988 వరకు తరువాత 1993-2018 వరకు అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో ఓడిపోయింది. వామపక్ష ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో భూ సంస్కరణలు అమలు జరిపాయి. కౌలుదారుల హక్కులు కాపాడాయి. స్థానిక సంస్థలకు అధికార వికేంద్రీకరణ జరిపాయి. కేరళలో వామపక్ష ప్రభుత్వం బలమైన ప్రభుత్వ విద్యా, ఆరోగ్య వ్యవస్థలను నెలకొల్పింది. పశ్చిమ బెంగాల్‌లో భూ సంస్కరణలు ఎంత పెద్దఎత్తున అమలయ్యాయంటే, దేశంలో భూ పంపిణీ వల్ల లబ్ది పొందిన వారిలో 50 శాతం మంది పశ్చిమ బెంగాల్‌లోనే ఉన్నారు. త్రిపురలో గిరిజను లకూ, గిరిజనేతురులకూ మధ్య ఐక్యత సాధించడంలో వామపక్ష ప్రభుత్వాలు ఎనలేని విజయాలు సాధించాయి.
(Prajasakti, 17-10-2020)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి