కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్).
(pic source: cpimthrissurdc.wordpress.com)
1920 లో స్థాపించబడిన అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ విప్లవాత్మక వారసత్వం తో మార్క్సిజం-లెనినిజం కు సంబంధించిన శాస్త్రీయ, విప్లవాత్మక సిద్ధాంతాలతో ఏర్పడింది సిపిఎం.
స్వాతంత్ర్యానంతరం కాంగ్రెస్ పాలకులు విదేశీ రుణాలపై మారటోరియం ప్రకటించి బ్రిటిష్‌పెట్టుబడులను స్వాధీనం చేసుకునే బదులు వారితో మరింతగా కుమ్మక్కయ్యారు. ధనస్వాములను భుజాన మోశారు. అవకాశవాద పోకడలతో అస్తవ్యస్త పరిస్థితి సృష్టించారు. ఈ నేపథ్యంలో మరింత సమరశీల పోరాటాలకు సిద్ధమయ్యే బదులు వారిపట్ల మెతక వైఖరి అనుసరించాలని కమ్యూనిస్టు ఉద్యమంలోనే కొందరు ప్రతిపాదించారు.
దాంతో విభేదించిన పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్, బి.టి.రణదివే, హరికిషన్ సింగ్ సూర్జిత్, పి.రామమూర్తి, ప్రమోద్‌దాస్‌గుప్తా, మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబాసు, నంబూద్రిపాద్, ముజఫర్ అహ్మద్, తదితరులు తీవ్ర సైద్ధాంతిక పోరాటం నడిపారు. అంతేగాక సరైన విప్లవకర సిద్ధాంత కోసం ప్రజా పోరాటాల పదును పెంచడం కోసం నూతన సంస్థను స్థాపించాలన్న నిర్ణయానికి వచ్చారు.. ఈ ఏర్పాటులో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన సుందరయ్య, బసవపున్నయ్య, మోటూరు హనుమంతరావు, నండూరి ప్రసాదరావు, తరిమెల నాగిరెడ్డి లతో పాటు ఇంకా అనేకులు ముఖ్యపాత్ర వహించారు. వారు ఈ ఆలోచనలు చేస్తున్న దశలోనే 1962లోనే చైనా యుద్ధాన్ని సాకుగా చూపి కమ్యూనిస్టు ఉద్యమంలో కొంత మందిని జైలుపాలు చేశారు. అయినా గట్టిగా నిలబడి 1964 జూలై7 నుంచి జూలై 12 వరకూ తెనాలిలో జాతీయ సదస్సు జరిపి నూతన పార్టీ స్థాపనకై నిర్ణయించారు.
మొత్తంపైన నిర్బంధం మధ్యనే కలకత్తాలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 7, 1964 వరకు జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏడవ జాతీయ మహాసభలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడింది. పుచ్చలపల్లి సుందరయ్య తొలి ప్రధాన కార్యదర్శి అయ్యారు. అప్పటినుండి ఇప్పటివరకు సిపిఎం ఎప్పుడు స్వతంత్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఈ దేశ పరిస్థితులకు తగిన నిర్దిష్ట విధానాన్ని నిర్ణయించుకుంటూ ముందుకు సాగుతోంది.
దాంతో కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) జాతీయ స్థాయిలో గణనీయంగా బలహీనపడింది.
సిపిఎం పూర్తిగా ఏర్పడక ముందే సిపిఎం పై ప్రభుత్వం దాడి ప్రారంభించింది. చైనాతో తలెత్తిన సరిహద్దు సంఘర్షణను సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని చెప్పడం పెద్ద అపరాధంగా చిత్రించబడింది. సిపిఎం నేతలపై చైనా ఏజంట్లని ముద్ర వేశారు. లోక్‌సభలో అప్పటి హోంమంత్రి గుల్జారీ లాల్ నందా సిపిఎంపై ఆరోపణలతో ఒక చిట్టా చదివారు. అంతేగాక దేశమంతటా వున్న సిపిఎం నేతలను అర్థరాత్రి అరెస్టు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ముఖ్యమైన నాయకులంతా జైళ్లపాలయ్యారు. బ్రిటిష్ వారు ఏ విధంగా కాంగ్రెస్‌ను గాక కమ్యూనిస్టుపార్టీని నిషేధించారో అలాగే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం కూడా సిపిఎంపై కక్ష గట్టి ఆదిలోనే దాడి చేసింది. ఇందుకోసం ప్రివెంటివ్ డిటెన్షన్ (పిడి)చట్టాన్ని పెద్ద ఎత్తున ప్రయోగించింది. అయితే అలా నాయకులందరినీ అరెస్టు చేసి జైళ్లలో కుక్కినా ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఎంతో ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడ్డారు. సమస్యలపై ఉద్యమాలు సాగించారు. బంజరు భూముల పంపిణీ, డ్రైనేజీల మరమ్మత్తులు వంటి అంశాలపై పోరాడారు.
సిపిఎం లోని కొంత మంది అతివాదులు చైనా మార్గం లో రైతాంగం సాయుధపోరాటం జరపాలని పట్టుపట్టారు. 1964 లో వారు సిపిఎం నుండి నక్సలైట్లు గా చారుమజుందార్ ఆధ్వర్యంలో విడిపోయారు. నక్సలైట్ ఉద్యమం బెంగాల్లో మొదలైనప్పటికీ ఈ అతివాదులు ఆంధ్ర ప్రదేశ్ లో అధికంగా ఉండటం చేత సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలహీనపడింది. కేవలం ఐదారు మంది నాయకులు మాత్రమే ప్రధానంగా రాష్ట్రంలో నిలబడ్డారు అక్కడక్కడా జిల్లాలలో కొద్దిమంది మాత్రమే సిపిఎం వైపు నిలబడ్డారు.
1964 లో సిపిఐ (ఎం) ఏర్పడే నాటికి 1,18,683 గా ఉన్న పార్టీ సభ్యత్వం 2014 నాటికి 10,48,678 కు పెరిగింది. మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాన్ని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా వర్తింపజేయడానికి పార్టీ ప్రయత్నించింది. ప్రజాస్వామ్య విప్లవం కోసం వ్యూహాలను రూపొందించడం, సామ్రాజ్యవాద, పెట్టుబడి దారీ విధానాలతోనూ ( బూర్జువా) , భూస్వామి దోపిడీని అంతం చేసే బూర్జువా ప్రజాతంత్ర విప్లవ కార్యక్రమాన్ని తీసుకురావడంలో నిమగ్నమై ఉంది. ప్రముఖ వామపక్ష పార్టీగా సిపిఐ (ఎం) వామపక్ష ప్రజాస్వామ్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో తనదైన కర్తవ్యం నిర్వహించి, రాజకీయాలలో మార్పులకు చేయూత నిచ్చింది. పశ్చిమ బెంగాల్‌లో సిపిఐ (ఎం) మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అన్వయించింది. పార్టీ మనుగడను , ఆర్థిక , అభివృద్ధి విధానాలతో కేరళ , పశ్చిమ బెంగాల్లో పరిపాలన చేసింది.
దోపిడీ పీడనలకు వ్యతిరేకంగాఅంతర్జాతీయ ఆధిపత్య పోకడలకు ప్రతిఘటనగా 'మతోన్మాద రాజకీయాలపై రణభేరిగా' కుల వివక్షపై మోగే శంఖారావంగా యువతీ యువకుల ఆశయ స్వచ్ఛతకు నిదర్శనంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తిగా అర్ధశతాబ్ది పూర్తి చేసుకున్న ప్రజాస్వామ్య ప్రగతిశీల రాజకీయ శక్తి సిపిఐ (ఎం).
దేశంలో చాలా పార్టీలు రకరకాల అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాయి. అనేక విధాల అవకాశవాదాలతో రంగులు మార్చాయి. కాని సిపిఐ (ఎం),వామపక్షాలు ఈ యాభై ఏళ్లలోనూ సామ్యవాద భావజాలానికి లౌకిక ప్రజస్వామ్య విలువలకు అంకితమై వాటిని కాపాడేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాయి.ఈ దేశంలో ఎర్రజండా ఎగిరిన రోజునుంచి స్వాతంత్ర్యం సామ్యవాద భావజాలం కోసం కమ్యూనిస్టులు అంకితమైనారు.
ప్రస్తుతం సి.పి.ఎం లోక్ సభలో సంఖ్య 3, రాజ్య సభలో 5 ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సి.పి .ఎం అధికారంలో వున్న రాష్ట్రం కేరళ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి