గతి తర్కం( dialectics)
గతి అంటే చలనం. ఈ చలనం వల్ల ఏర్పడే మార్పును, అభివృద్ధిని గురించి చేసే తర్కం కాబట్టి అది గతి తర్కం అన్నారు. ''డయలెక్టిక్''అనే గ్రీకు పదానికి సంభాషణ లేక వాద ప్రతివాదం అనే అర్థాలున్నాయి.
యథార్థజ్ఞానం కలగడానికి గతితార్కిక పద్ధతే ప్రధానమని ప్లేటో అభిప్రాయం. ప్లేటో తర్వాత ఈ మార్గంలో ఆలోచనా విధానానికి ప్రాధాన్యత నిచ్చినవారు కారల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగిల్స్.
Engles and Marx
చర్చల ద్వారా కాని, వాద ప్రతివాదాల ద్వారా కాని ఎదుటి వారి అభిప్రాయాలలోని లోపాలను బయటపెట్టి చివరకు సత్యాన్ని నిరూపించే శక్తిని గతి తర్కం అన్నారు గ్రీకు తత్త్వవేత్తలు .
గతితర్కానికి ప్రతినిధైన బుద్దుడు ఆత్మను తిరస్కరిస్తూ ప్రపంచం మార్పు చెందుతూ నిరంతర చలనంలో వుంటుందని సూత్రీకరించాడు.ఇది భారతీయ తత్వశాస్త్రంలో ఒక విప్లవాత్మక లక్షణం.
గతి తర్కం గురించి మార్క్సిస్టు తత్వ వేత్తలు, చాలా సరళంగా, సూటిగా, చెప్పారు: 'ప్రకృతి, మానవ సమాజం, ఆలోచనలలో, సంభవించే
చలనం-వికాసాల (motion and development) శాస్త్రం తప్ప, గతి తర్కం మరేమీ కాదు.' (On Dialectical Materialism, Marx-Engels-Lenin, P.91).
గతి తర్కం ప్రకారం ఈ ప్రపంచం నిరంతరం మార్పు చెందుతుంది. ప్రపంచంలో ప్రతిదీ పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. నిరంతరం చలనంలో ఉంటుంది. ఈ మార్పులకు ప్రధాన కారణం ప్రతి దానిలోను ఉన్న పరస్పర విరుద్ధ అంశాల మధ్య ఘర్షణలోనేనని చెబుతుంది.ఆ ఘర్షణలో పాతది నశిస్తూ, కొత్తది అభివృద్ధి చెందుతూ, కింద స్థాయి నుండి పై స్టాయికి, నిమ్న స్థితి నుండి ఉన్నత స్థితికీ మార్పు కొనసాగుతుంది. అంటే కేవలం మార్పు కాదు అది ముందుకు పోతుండే మార్పు. గతి తర్కం చూసే పద్ధతి ఇది.
ప్రకృతిలోగాని, సమాజంలోగాని, ఏ
వస్తువైనా, కనిపించే ఏవిషయమైనా, స్థిరంగా ఉండదనీ; పుట్టి, పెరిగి, అంతమయ్యే క్రమంలో, నిరంతర చలనంలో, ఉంటుందనీ, చెబుతుంది గతి తర్కం. ప్రతి దాన్ని 'చలనం'లో ఉన్న విషయంగా పరిశీలించాలని చెపుతుంది గతి తర్కం.
హెరాక్లిటస్ (క్రీ.పూ.540-480) అనే ప్రాచీన గ్రీకు తత్వ వేత్త, విశ్వంలో ఉన్న ఈ చలన స్వభావాన్ని వివరిస్తూ 'ఒకే నదిలో రెండు సార్లు స్నానం చెయ్యలేం', అని ఒక ఉదాహరణ ఇచ్చాడు. అంటే మార్పు నిరంతరం అని అర్థం.
గతి తర్కంలో, అభివృద్ధి', 'వికాసం', అంటే, ఒక దశ తర్వాత మరొక దశలో ఏదో ఒక కొత్త విషయం సంభవిస్తూనే ఉంటుంది అని అర్థం. ప్రకృతి కాని, మానవ సమాజం కాని, ఉన్న స్థితిలో ఎక్కడా నిలిచిపోవు. సృష్టి, అలాగే మానవ సమాజం, అంతమయ్యే వరకూ, అభివృద్ధి చెందుతూనే ఉంటాయి - అంటే ఒక దశ తర్వాత మరొక దశలో ఏదో ఒక కొత్త విషయం సంభవిస్తూనే ఉంటుంది.
ప్రపంచంలో, ప్రకృతిలో ఏ విషయమూ ఒంటరిగా లేదనీ, ఒకటి తక్కిన విషయాల్లో సంబంధంలో ఉంది కాబట్టి అన్ని విషయాల్లో భాగంగా దాన్ని అర్థం చేసుకోవాలని గతి తర్కం చెప్తుంది.
గతి తార్కిక పద్ధతి ప్రకారం ప్రపంచంలో ఏదీ స్థిరంగా ఉండదనీ, ప్రతీదీ ఉనికిలోకి వస్తూ మారుతూ, నశిస్తూ ఉంటుంది. అందువల్ల గతి తర్కం, ఒక వస్తువు లేక చర్చించే విషయం, ఎలా, ఏ సూత్రాల ప్రకారం ఉనికిలోకి వచ్చింది, అభివృద్ధి చెందింది, ఎలా మారుతోంది, అన్న వాటిని అధ్యయనం చేస్తుంది.
గతి తర్కం అభివృద్ది కి సంబంధించిన సూత్రాలను కనుగొంటుంది. ఈ సూత్రాలు మనకు తెలుసుకుంటే గడచి పోయిన దాని గురించి పరిశీలించగలుగుతాం.భవిష్యత్తుకు సంబంధించిన సూత్రాలను సరిగ్గా అంచనా కూడా చేయగలుగు తాం. అందువలన గతి తార్కిక పద్ధతి శాస్త్రీయ విజ్ఞానాన్ని అధ్యయనం చేయడానికి ఉపకరిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి