జర్మన్ ఐడియాలజీ ఏం చెపుతోంది?
1845వేసవి కాలంలో మాంచెస్టరు నుంచి బ్రస్సెల్స్ కు తిరిగి వచ్చేసరికి తాము రాసిన పవిత్ర కుటుంబం గ్రంథానికి యువ హెగెలియన్స్ నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. దాంతో పవిత్ర కుటుంబంలో పూర్తిగా వివరించని అంశాల గురించి తెలియ జేయాల్సిన అవసరాన్ని గుర్తించారు
మార్క్స్, ఏంగెల్స్ లు. వారిరువురూ రాసిన 'జర్మన్ ఐడియాలజీ' అనే పుస్తకాన్ని విడుదల చేశారు.
కార్మికవర్గం కమ్యూనిస్టు వ్యవస్థను సాధిస్తుందని, శాస్త్రీయ కమ్యూనిస్టు సిద్ధాంతానికి తాత్విక ప్రాతిపదికగా చరిత్ర పట్ల భౌతికవాద దృక్పథాన్ని స్పష్టం చేశారు. గతంలో జరిగిన విప్లవాలు వర్గాలనూ, వర్గ పాలనను తొలగించలేదు. కమ్యూనిస్టు విప్లవం పాలనను, వర్గాలనూ అంతం చేస్తుందని విశదీకరిస్తూ అదే సమాజ పురోగమనానికి మార్గమని, సామాజిక చలన నియమాలు ఈ సత్యాన్ని రుజువు చేస్తున్నాయని ఈ గ్రంథంలో వివరించారు.
ప్రకృతి, మానవుల మధ్య వున్న పరస్పర చర్యల ద్వారా అంటే ప్రకృతి - మానవుల గతితర్కంపై మానవ జాతి నాగరికత నిర్మాణమైందని చారిత్రిక భౌతికవాదం రుజువు చేసింది. మరో మాటలో మానవుల భౌతిక జీవనాన్ని గురించి "జర్మన్ ఐడియాలజీ" లో మార్క్స్, ఏంగెల్స్ లు ఇలా చెప్పారు. "వ్యక్తులు వారి జీవితాన్ని ఎలా వ్యక్తం చేస్తారో అలాగే ఉంటారు. వారు చేసిన ఉత్పత్తి లోనే వారు వ్యక్తమౌతారు. వారు ఏది ఏవిధంగా ఉత్పత్తి చేశారో వారలాగే కనపడతారు. అందుకనే వ్యక్తులు ఎలా వుంటారనేది ఉత్పత్తి యొక్క భౌతిక పరిస్థితులపై ఆధారపడుతుంది." మార్క్స్ మరింత ముందుకు వెళ్ళి ఉత్పత్తి అంటే సామాజిక ఉత్పత్తి అని అన్నారు. ప్రకృతి ని తనకనుకూలంగా మార్చడంలో మానవుడుగా, తనకూ, ప్రకృతికీ మధ్య ఉత్పత్తి సాధనాలైన పనిముట్లను, సాంకేతిక పరికరాలను ప్రవేశపెడతాడు. ఈ సామాజిక పరిణామం నిత్యం సాగుతూనే వుంటుంది.
ప్రకృతిని ఉయోగించుకునే ప్రక్రియే ఆస్తి. వాస్తవంలో భాష , ఆస్తి వినియోగ మూలం ఒక్కటే. ఆస్తి లేకుండా ఉత్పత్తి లేదు. బానిస ఆస్తి, భూస్వామ్య ఆస్తి, పెట్టుబడిదారి ఆస్తి,సామ్యవాద ఆస్తి ఇవన్నీ సామాజిక ఆస్తి రూపాలు.వాస్తవంలో మార్క్స్ అన్నట్లు ఉత్పత్తిలో ఆస్తి కలిసే వుంటుంది.
ప్రకృతితో మానవుడు పరస్పర సంఘర్షణ పడుతూ పదార్థాన్ని మార్పు చేస్తూ, ప్రకృతి నియమాలను అర్థం చేసుకుంటూ మానవుడు కూడా మార్పుకు లోనౌతాడు. ప్రకృతిపై ఆధిపత్యాన్ని సాధిస్తాడు. దాని కోసం ఉన్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉన్నత ప్రమాణం గల పనిముట్లను మానవుడు ఉపయోగిస్తాడు. ఫలితంగా ఉత్పత్తి శక్తులు(శ్రామికులు) అభివృద్ధి చెందుతాయి. సామాజిక ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు(శ్రామికులకు పనిముట్ల తో గల సంబంధాలు) కలిసి ఉత్పత్తి విధానమౌతుంది. ఇది సమాజానికి సంబంధించిన ఆర్థిక నిర్మాణానికి ప్రాతిపదిక. దీనిపైనే ఉపరి నిర్మాణాలు(కళలు, సాహిత్యం,రాజకీయంమొ.వి) తయారవుతాయి.
భావవాద భౌతికవాదాల మధ్య జరుగుతున్న ఘర్షణలో మార్క్స్ చెప్పిన శాస్త్రీయ సిద్దాంతం విజయం సాధించింది. "నేను ఆలోచిస్తున్నాను. కనుక నేను వున్నాను" అనే రెనెడెకార్టే జవాబుకు "నేను ఉన్నాను. అందుకే నేను ఆలోచిస్తున్నాను. " అని ప్రతి జవాబు నిచ్చాడు మార్క్స్. ఇది మార్క్స్ ప్రాపంచిక దృక్పథం నుండి వచ్చింది.
___సీతారాం ఏచూరి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి