ప్రాచీన భౌతిక వాద తాత్విక చింతన
2500 సంవత్సరాల క్రితం(క్రీ.పూ.500నాడు) మనుషులకు ప్రకృతి గురించి తెలిసినది చాలా తక్కువ. ఆ రోజుల్లో భారతదేశంలోనూ, గ్రీస్ లోనూ కొందరు నాస్తికులు ఉండేవారు. ప్రాచీన భారతీయ నాస్తికులను చార్వాకులని, లోకాయతులని అనే వారు.
లోకాయతులు అంటే ఉన్న కనిపించే ఈ లోకాన్నే నమ్మేవారని. వీరు పరలోకాన్ని నమ్మరు. వీరు దేవుడు, ఆత్మ లాంటి ఊహాజనిత నమ్మకాల్ని, కర్మ సిధ్ధాంతాల్ని తిరస్కరించారు. చార్వాకం లేదా లోకాయతం లేదా బృహస్పత్యం భారతదేశపు ప్రాచీన భౌతికవాదం. ఈ వాదాన్ని బోధించిన వాడు చార్వాకుడు . ఇతను ఒక మహర్షి, బృహస్పతి శిష్యుడు. నాస్తిక మత వ్యాప్తి చేసినవాడు. లోకాయత సిద్ధాంత కర్త. చార్వాక, లోకాయత, బార్హస్పతి అని అనేక పేర్లు గలవు ఈ శాఖకు. ‘లోకేషు అయతాః లోకాయత’ ‘లోకాయత’ అంటే ప్రజల తత్వశాస్త్రం అనీ ప్రజల దృక్పధం అనీ అర్ధం చేసుకోవచ్చు.
లోకాయతకు మిగతా తత్వశాస్త్రాల లాగా
ఒక మూల పురుషుడు లేడు. ఇది సామాన్య ప్రజల్లో పుట్టిన ‘అనుమాన’, ‘తర్కా’ ల ప్రభావమే. మనం భగవంతుడికి ప్రసాదం రోజూ పెడుతూనే ఉన్నాం కాని ఆయన ఎప్పుడన్నా దాన్ని తిన్నాడా?ఇలాంటి తర్కాలను లేవదీసి, చివరకు ఆనాటి ఆధ్యాత్మిక వాదులచే తిరస్కరింపబడ్డారు ఈ లోకాయతులు.
14వ శతాబ్ధికి చెందిన మాధవాచార్య తన ‘సర్వదర్శక సంగ్రహం’ లో ఇలా వివరించాడు. “సంపదనూ, కోరికలనూ, మానవ లక్ష్యాలుగా భావించి, సంతోషాన్ని ధ్యేయంగా పెట్టుకున్న విధానాన్ని, సూత్రాలను అనుసరించుతూ, భవిష్యత్ ప్రపంచ వాస్తవికతను నిరాకరించే మానవ సమూహాన్ని చార్వాక సిద్దాంతాన్ని అనుసరించే వారిగా గుర్తించవచ్చు. వారి సిద్దాంతానికి మరోపేరు ‘లోకాయత’. వస్తు రీత్యా ఇది సరైన పేరు. దేవుడు లేడు, ఆత్మలేదు, మరణానంతరం మిగిలేదేమీ లేదు అని చెప్పారు. ఇంద్రియసౌఖ్యాలకి ప్రాధాన్యత నిచ్చిన వీరిని భౌతికవాదులుగా పేర్కొన్నారు ఆనాటి ఛాందసవాదులు.
ఆనాటి సమాజంలో రాజకీయంగా, ఆర్ధికంగా వైదిక సంప్రదాయ వాదులే బలవంతులు.వీరు లోకాయతుల అణగద్రొక్కేశారు.వీరి ప్రాచీన గ్రంథాలను ధ్వంసం చేశారు. చివరకు వీరి గురించి,వీరి ఆచారాలు, సంప్రదాయాల గురించి, వీరి ప్రత్యర్దుల గ్రంథాల లో రాయబడిన వ్యంగ్య వ్యాఖ్యల నుండి తీసుకోవలసి వచ్చింది. క్రీ. పూ. 300 కి చెందిన కాత్యాయనుడు వైయాకరిణి లోకాయతపై ‘భాగురి వ్యాఖ్యానం’ ఉదహరించాడు. అంటే ఆ కాలంలోనే లోకాయత గ్రంధమూ, దానిపై వ్యాఖ్యానమూ ఉన్నాయన్నమాట. ‘బ్రహ్మ సూత్రాల’ భాష్యంతో శంకరాచార్య వీరిని ‘ప్రకృతిజనాః’ (మూర్ఖజనులు) అంటే లోకాయతులనే చెప్పాడు. ‘షడ్ దర్శన సముచ్చయ’ రచయిత హరిభద్రుడు, లోకాయతులను వివేచన లేని గుంపుగా, ఆలోచన లేని సముదాయంగా వర్ణించాడు. ఆ కాలంలో దీని వ్యతిరేకతలోనే దీని ప్రభావం, శక్తి, ప్రాముఖ్యత తెలుస్తాయి. సామాన్య బ్రాహ్మణుడినుండి, పాలకుల వరకు లోకాయత శాస్త్రాన్ని అభ్యసించే వారని అనేక ఆధారాలున్నాయి.
బ్రాహ్మణుడైన సత్యకామా జాబాలి (నాస్తికుడు)శ్రీరాముడికి మత విరోధ భావాలు బోధించాడు. బౌద్ధులు తమ సుత్తాలలో, బ్రాహ్మణులు అభ్యసించే అనేక శాస్త్రాలలో లోకాయత ఒకటని పేర్కొన్నారు. ‘వినయపిటిక’ ప్రకారం, బుద్దుడు ఆపి ఉండకపోతే కొందరు బౌద్ధ సన్యాసులు కూడా లోకాయతను పఠించడానికి సిద్దపడ్డారట.బుద్దఘోషుడు లోకాయతను “వితండవాద శాత్త” అని పిలిచాడు. (పాళీభాషలో శాత్త అంటే సంస్కృతంలో ‘శాస్త్రం’)
మహాభారతంలో అరణ్యపర్వంలో
ధర్మరాజుతో తన చిన్ననాటి విషయాలు ముచ్చటిస్తూ ద్రౌపది ఇలా అంది. తన చిన్ననాడు, తమతో ఉండటానికి ఒక బ్రాహ్మణుడ్ని తన తండ్రి ఆహ్వానించాడనీ, ఆ బ్రాహ్మణుడే తన తండ్రికి, తన సోదరులకు బార్హస్పత్య భావాలను బోధించాడనీ, తనూ వాటిని ఆసక్తితో వినేదాన్ననీ చెప్పింది. ద్రౌపది చెప్పిన విషయాలు విని ధర్మరాజు ఆమెను మత వ్యతిరేక భావాల ప్రభావంలో పడిపోయిందని నిందించాడు. కౌటిల్యుడు తన ‘అర్ధశాస్త్రం’ లో సాంఖ్య, యోగశాస్త్రాలతో పాటు, లోకాయతను కూడా ఉదహరించి, దానిని ‘తర్కశాస్త్రం’ అన్నాడు. బాణుని ‘హర్షచరిత్ర’లో విచ్చేసిన ఋషుల జాబితాలో ‘లోకాయత’ పేరు కూడా ఉంది.
14వ శతాబ్ధపు జైన వ్యాఖ్యాత అయిన గుణరత్నుడు లోకాయతుల గురించి ఇలా చెప్పాడు. జీవితం బుద్బుదప్రాయం అని తలచి, మానవుడు చైతన్య సహితమైన శరీరం తప్ప ఇంక ఏమీలేదు అన్న అభిప్రాయంతో మద్యపానం, మాంసభక్షణ, అదుపులేని లైంగిక క్రియలలో పాల్గొనేవారు. కామానికతీతమైన దేన్నీ వారు గుర్తించరు. వారిని చార్వాకులనీ, లోకాయతులనీ అంటారు. పానం చేయుట, నములుట (భుజించుట) వారి నీతి. నములుతారు కనుక వారిని చార్వికులంటారు. (చర్వ్:నములుట). అంటే వివేచన లేకుండా భుజిస్తారట. వీరి సిద్దాంతం బృహస్పతి ప్రతిపాదించాడు కనుక వారిని బార్హస్పత్యులని కూడా అంటారు. వాస్తవ జగత్తును మినహా , అన్నింటినీ తిరస్కరించి నందువల్లే ఈ తత్వశాస్త్రాన్ని ‘లోకాయత’ అంటారని పంచానన తర్కరత్న ఉవాచ. మొత్తానికి అనాటి వైదికసాంప్రదాయాలనూ, మూఢ నమ్మకాలనూ ఎండగట్టి తిరస్కరించి నందువలనే, ఈ లోకాయతులు అణచివేయ బడ్డారన్నది సుస్పష్టం.
ప్రాచీన భారతంలో హైందవ ధర్మాన్ని,
వేదాలను, వేదోక్త సంప్రదాయాలను ఖండించి, విమర్శించి భౌతిక సిద్ధాంతాలను ప్రతిపాదించిన తత్వవేత్త చార్వాకుడు. ఆయన నాస్తికుడు. 1848లో కమ్యూనిస్ట్, మ్యానిఫెస్టో ప్రకటించిన కార్ల్ మార్క్స్ కు చార్వాకుడు సైద్ధాంతిక మూల పురుషుడని చెప్పవచ్చు. చార్వాకుని భౌతికవాద సిద్ధాంతాలను ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన భగవద్గీత వ్యాఖ్యానంలో ప్రస్తావించారు. దేవుడికి మూలం ఏమిటి అనే ప్రశ్న వేయవద్దంటుంది మతం. దేవుడు స్వయంభువు కాబట్టి ఆ ప్రశ్న తప్పంటుంది. ఆ సమాధానం నచ్చక నాస్తికత్వం పుట్టుకొచ్చింది. తత్వశాస్త్రం రెండు శాఖలుగా చీలింది–భావవాదులుగా, భౌతికవాదులుగా. అప్పటి సమాజంలో ఆర్య సంప్రదాయాలన్నిటినీ నిరసించిన వారు భౌతికవాద శాఖలోకొస్తారు. ఈ కోవకు చెందినవారు చార్వాకుడు, మహావీరుడు, అజిత కేశకంబలి, మఖ్ఖలి గోశాలుడు, పూరణుడు, కాత్యాయనుడు, బుద్దుడు. వీళ్ళందరిలోకీ బుద్దుడే చరిత్రలో నిలిచి పోవడానికి గల కారణాలలో ఒకటి బుద్దుడు ఏ విషయం లోనూ ‘అతి ‘ కి పోకుండా మితం పాటించడం. చార్వాకుడిని గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ చర్చను చార్వాకుడికే పరిమితం చేద్దాం!
భారతీయ తాత్విక చింతన లేచి పడిన ఒక మహా తరంగం చార్వాక (దర్శనం)మతం. దీన్నే లోకాయత దర్శనం అని కూడా అంటారు. చార్వాకుడు చెప్పిన దర్శనం కావటం వల్ల దీన్ని చార్వాక దర్శనమన్నారు కొందరు. చారు+వాక్ = చార్వాక, అంటే చారు= సులభమైన లేక సరళమైన, మధురమైన; వాక్ = శబ్గం, మాటలు, అంటే మధురమైన మాటలు చెప్పే దర్శనమని కొంతమంది భావించారు. దేవతల గురువగు బృహస్పతి రాక్షసుల మీద ఉండే ద్వేషంకొద్దీ వారందరినీ ఇంద్రియలోలురుగా చేయడానికై ఈ దర్శనాన్ని రాశాడని కూడా ఒక కథ ఉంది. అందుకే దాన్ని బార్హస్పత్య దర్శనం అని కూడా అంటారు. ఇప్పుడా గ్రంథం లభించటం లేదు. కాని బౌధ్ధ గ్రంధాల్లో ఈ విషయం ఉటంకిస్తారు. వీరిని చార్వాకులని, పాషండులని, హౌతుకులని, నాస్తికులని, వితండవాదులని శుద్ద తార్కికులని , శుద్ద ప్రత్యక్షవాదులని, వేదబాహ్యులని పిలిచారు. యజ్ఙయాగాది క్రతువులు చేయడం నిరర్థకమనే వీరి వాదన ఉంది. బౌద్ద గ్రంధాలన్నీ దాదాపు లోకాయత మత సిద్దాంతాలను పేర్కొంటాయి.
చార్వాకుల వాదం ఇలా అంటుంది- ‘ఈ సమస్తమైన ప్రపంచంలో ఉన్నదంతా పంచభూతాత్మకం. అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం. ఈ అయిదు భూతాలు పరస్పరం ఒకదానితో ఒకటి ఎప్పుడూ పెనవేసుకొని ఒకదాన్ని మరొకటి పరిగ్రహించి, ఒకటి మరొకదానితో సంసర్గాన్ని కలిగి ఉంటాయి. మానవుడు భుజించిన ఆహారం శరీరంలో జీర్ణమై అనేకమైన ధాతువులుగా మారిపోతుంది. రక్తంగానూ, వీర్యంగాను, శ్లేష్మంగానూ, లాలాజలం గాను లోపల ఉంటుంది. బయట చర్మం, గోళ్ళు వెంట్రుకలుగా మారుతుంది. స్త్రీపురుషుల సంభోగం వల్ల మానవుడు కాని, తదితర ప్రాణులుకాని జన్మిస్తాయి. శరీరం ఆవిర్భవించడంతోపాటే, శరీరంలో ఉండే చైతన్యం కూడ శరీరంతోపాటే వస్తుంది. శరీరం నశించిపోగానే చైతన్యం కూడ నశిస్తుంది(భావవాదులు దీనికి భిన్నంగా చెబుతారు. చైతన్యం ముందు, పదార్థం తరువాత అని, చైతన్యం శాశ్వతం అనీ) . చార్వాకులు దేహమే ఆత్మ అని చెబుతారు. ఆత్మ లేదని అంగీకరించిన వారికి భగవంతునితో నిమిత్తం లేదు. ప్రత్యక్షమే ప్రమాణంగా అంగీకరించిన చార్వాకుల వాదం దేవుడి అస్తిత్వాన్ని తిరస్కరిస్తుంది. ఏకాలంలో ఉన్న మానవుడికయినా తెలిసేది భూతకాలం, వర్తమాన కాలం మాత్రమే. జరుగబోయేది ఎవ్వరికీ తెలియదు. ఆత్మ లేనప్పుడు, శరీరం మరణానంతరం పిడికెడు బూడిదయై పోయినప్పుడు మోక్షం అనేది అర్థరహితమైన శబ్దం. పురోహితశ్రేణి వారి జీవనార్థం వారు కల్పించి నటువంటి తంతే మరణించిన వారికి ఏర్పాటుచేసే శ్రాద్ధాలు, తద్దినాల తంతు అంతా. మరణించిన వారి పేరిట చేసే అన్నదానం, పిండ పితృ యజ్ఙం ఇవన్నీ మానవ మూర్ఖత్వానికి, సంఘ నయవంచనకు నిదర్శనమన్నారు చార్వాకులు .
మన తండ్రో, తల్లో సోదరుడో గ్రామాంతరం వెళ్ళారనుకుందాం. వారి పోషణార్థంగా ఇక్కడ మనం విందుభోజనం చేస్తే అది వారికి అందుతుందా? వీరు వర్ణ వ్యవస్థను నిరసించారు. ఆత్మజ్ఞానం సంపాయించగలమనీ, అదే వాస్తవమైన జ్ఞానమనీ బోధించిన భావవాదుల ప్రతిపాదనను చార్వాక భౌతికవాదులు నిర్ద్వద్వంగా తిరస్కరించారు. ఇంద్రియ జ్ఞానమొక్కటే జ్ఞాన సముపార్జనకు మార్గమని వారు ఖచ్చితంగా చెప్పారు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం- ఇవి పంచేంద్రియాలు. కంటితో చూసి, ముక్కుతో వాసనపట్టి, చెవితో విని, నాలుకతో రుచిచూసి, చర్మంతో తాకి, ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఈ విధమైన ఇంద్రియ జ్ఞానమొక్కటే వాస్తవమైన జ్ఞానమని ప్రతిపాదించారు చార్వాకులు. మూఢ నమ్మకాలను, యజ్ఞ యాగాదులను, వర్ణ ధర్మాన్ని చార్వాకులు ప్రశ్నించారు. గౌతమ బుద్ధుడు, మహవీరుడు వీరి బోధనలతో ప్రభావితులైనారు. చార్వాకులంత తీవ్రంగా కాకపోయినా బౌద్ధులు కూడా వర్ణవ్యవస్థను, బ్రాహ్మణ కర్మకాండల్లోని మూఢత్వాన్ని ప్రశ్నించారు. మొదట వర్ణతత్వాన్ని ఎదిరించిన చార్వాకులు దాన్ని ఒక సాంఘిక ఉద్యమంగా నడపలేకపోయారు. వారి సిద్ధాంతాలను తెలుసుకోటానికి ప్రధానంగా తోడ్పడే గ్రంథం ” సర్వ దర్శన సంగ్రహం ”. చార్వాక సిద్ధాంత బీజాలు, ఉపనిషత్తులులో బృహస్పతి రాసినట్లుగా సూక్తాల్లోనే ఉన్నట్లు ” సర్వ దర్శన సంగ్రహ్ ” కర్త వర్ణించాడు. ” ‘నాస్తికో వేదనిందకః’ అన్నాడు మనువు. వేదాలను నిందించే వాళ్ళంతా నాస్తికులే అంటాడు. దానికి కారణం ఉంది. వేదాలు పూర్తిగా యజ్ఞయాగాలకు ప్రాముఖ్యం ఇచ్చాయి. ప్రకృతి శక్తులకు దైవత్వం ఆరోపించడం ద్వారా దేవుళ్ళు ఏర్పడ్డారు. అప్పుడే వర్ణవ్యవస్థ కూడా పుట్టింది. పదార్ధం వివిధ రూపాలుగా పరిణామం చెందుతూ వస్తోంది.
వాతావరణంలోని ఒక పదార్ధం ద్వారా సజీవ పదార్ధమైన జీవకణం “అమీబా” పుట్టింది. ఈ అమీబా నుండి అనేక పరిణామాల తర్వాత మనిషి జన్మించాడు. మనిషి మెదడులోంచి భావం ఉద్భవించింది– ఇది ఆధునిక భౌతికవాదం. కాని ఈ వాదాన్ని బుద్ధుడికి పూర్వమే చార్వాకులు ప్రచారం చేశారు. క్రీ. పూ. 600. . . అంటే బుద్ధుడి పుట్టుకకు యాభై సంవత్సరాలు పూర్వమే ఈ చార్వాక మతం తలెత్తింది. పరలోకం అనేది అసలు లేదు అన్నది వీళ్ళ వాదం. ఏ రకమైన దివ్యత్వాలు లేవనడం, ఇతర రూపాలపై అపనమ్మకం, దేవుడున్నాడని కాని, లేడనికానీ, అతీంద్రియ శక్తులను కానీ నమ్మక, కేవల నిర్ధారిత నిజాలనే నమ్మేవాడిని హేతువాది అంటారు. హేతువాదులు కూడా చార్వాక సిద్ధాంతాన్ని బలపరిచారు!”మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అనేదొక కట్టుకథ. మరణం తర్వాత జీవితం, స్వర్గం , నరకం వంటివేమీ లేవు. ఇవన్నీ మృత్యువు అంటే భయపడేవారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్ వంటిదే. విడిభాగాలు పాడైన తర్వాత కంప్యూటర్ పనిచేయటం ఆగిపోయినట్టే మెదడు ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు. కన్నుమూసేలోపే మనకున్న శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి. మనం చేసే పనులు అత్యున్నతంగా ఉండటానికి కృషి చేయాలి. 49 ఏళ్లుగా మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉంటోంది. అయినప్పటికీ నేను మృత్యువుకు భయపడటం లేదు. త్వరగా మరణించాలని నేను భావించటం లేదు. నేను కన్నుమూసేలోపు చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉన్నాయి” అని స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం. చార్వాక వాదనకు ఇతని సిద్ధాంతం దగ్గరగా ఉంది.
‘మహాభారతం’ లో శాంతిపర్వంలో ఉన్న ప్రసిద్దమైన చార్వాక వధ కధ గురించి ఇప్పుడు తెలుసుకుందాం! కురుక్షేత్ర మహాసంగ్రామానంతరం, పాండవులు దిగ్విజయంగా తిరిగి వస్తున్న సందర్భంలో వేలకొలదీ బ్రాహ్మణులు నగర ద్వారం వద్ద యుధిష్టురుని ఆశీర్వదించడానికి సిద్దంగా ఉంటారు. వారిలో చార్వాకుడు కూడా ఉన్నాడు. మిగతా బ్రాహ్మణుల అనుమతి తీసుకోకుండానే, ముందుకు వెళ్ళి ధర్మరాజునుద్దేశించి ఇలా అన్నాడు. “ఈ బ్రాహ్మణ సమూహం, నీ రక్త బంధువులను వధించిన నిన్ను శపిస్తోంది. నీ మనుషులనే, నీ పెద్దలనే సంహరించి నీవు సాధించిందేమిటి? నీవు చనిపోయి తీరాలి (నశించాలి)” హఠాత్తుగా జరిగిన చార్వాకుని మాటలకు, అక్కడ సమావేశమైన బ్రాహ్మణులు నిర్ఘాంతపోయారు. యుధిష్ఠిరుడు నైతికంగా గాయపడి మరణించాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికి మిగతా బ్రాహ్మణులు తెలివి తెచ్చుకుని, చార్వాకుడు తమ ప్రతినిధి కాదనీ, బ్రాహ్మణ వేషంలో ఉన్న రాక్షసుడనీ, రాజవిరోధి దుర్యోధనుని మిత్రుడనీ చెప్పారు. అలాగే తమకు రాజు చేసిన ఘనకార్యాల పట్ల మెచ్చుకోలు మాత్రమే కలదని హామీ ఇచ్చారు. నిరసన తెలిపిన చార్వాకుని నిలువునా దహించి వధించివేసారు.
‘మహాభారతం’ ప్రకారం పవిత్రులైన బ్రాహ్మణుల చేతిలో దగ్ధమైపోయిన “చార్వాకుడు అంతకు పూర్వం ఒక రాక్షసుడు. కఠోరమైన తపస్సులు చేసి విపరీతమైన శక్తులు సంపాదించాడు. ఆ తరువాత దేవతలను బాధించి అణచివేయటం ప్రారంభించాడు. ” అని ముద్రవేశారు . ఇది మామూలే, ఆ రోజుల్లో బ్రాహ్మణ సంప్రదాయాలను వ్యతిరేకించే వారిని రాక్షసులు, అసురులుగా ముద్రవేయటం పరిపాటి. చార్వాకుడు యధిష్టిరునికి ఆపాదించిన ఘోరనేరం, బంధువులను, పెద్దలను వధించడం. ఆలోచిస్తే, యుద్ధానికి ముందు అర్జునుడు కూడా ఈ సందిగ్ధంలోనే పడి విచారగ్రస్థుడై యుద్ధం చేయనని శ్రీకృష్ణుని ముందు మోకరిల్లాడు. భగవద్గీత జనించింది ఈ సందర్భంలోనే. సామాన్యుని అభిప్రాయాన్ని మతాతీతంగా, సాహసవంతంగా వెల్లడించి ఆ విధంగా సాంప్రదాయవాదుల చేతిలో బలైపోయాడు చార్వాకుడు.
చార్వాకం ప్రత్యక్ష గ్రహణశక్తిని, అనుభవవాదాన్ని జ్ఞానానికున్న సరైన మూలాలుగా పేర్కొంటుంది. తత్వపరమైన సంశయవాదాన్ని అక్కున చేర్చుకొని వేదాలను, వైదిక సాంప్రదాయాలను, అతీంద్రియాలను ఇది ధిక్కరిస్తుంది.
చార్వాకం భారతీయ ఆధునిక తత్వాల క్రింద వర్గీకరించబడింది. ఇతర హైందవ నాస్తిక(భౌతిక) వాదాలకు ఇదే మొదటిదిగా పరిగణించబడినది.
రామాయణంలోని అయోధ్యకాండలో
108 వ అధ్యాయంలో జాబాలి రాముణ్ణి వనవాసం వెళ్లకుండా రాజ్యాధికారం చేపట్టమని చెపుతాడు. “ఓ జ్ఞానీ! నీవే నిర్ణయించుకో! ఈ సృష్టికి మించినది ఏదీ లేదు. కంటికి కనబడ్డదానికే ప్రాధ్యాన్యతనివ్వు. నీ జ్ఞానానికి మించినదాని గురించి ఆలోచించకు” ఇదీ జాబాలి చెప్పింది.
చార్వాకానికి మూలాలకు వివిధ
సిద్ధాంతాలు ఉన్నాయి. బృహస్పతి చార్వాకానికి ఆద్యుడని ఒక వాదన అయితే, బృహస్పతి సూత్రాలని రచించినది 6వ శతాబ్దానికి చెందిన చార్వాకుడు అని మరొక వాదన ఉన్నది. 12వ శతాబ్దం వరకూ చార్వాకం వెలుగొందగా ఆ తర్వాత అది నామరూపాలు లేకుండా పోయింది.
క్రీ. పూ. 6వ శతాబ్దంలో చార్వాకుడు బ్రహస్పతి సూత్రాలను పొందుపరచాడని ఒక వాదన ఉంది. అయితే క్రీ. పూ 150 లో రచించబడిన గ్రంధాలలో కూడా చార్వాక ప్రస్తావనలు ఉన్నాయి. బౌద్ధ సాహిత్యం ప్రకారం బౌద్ధ, జైన మతాలకు పూర్వమే క్రీ. పూ. 6వ శతాబ్దం నాటికి ఉన్న ఆరు వివిధ నాస్తిక వాదాలలో చార్వాకం, అజీవికం కూడా ఉన్నాయి. చార్వాకులు అధిభౌతిక భావాలైన–పునర్జన్మ, మరణానంతరం శరీరమును వీడే ఆత్మ, మతాచారాల సమర్థత, పరలోకముములు (స్వర్గం, నరకం వంటివి), విధి–లాంటి వాటిని తిరస్కరించారు. కొన్నింటిని చేయటం/ చేయకపోవటం వలన కలిగే సత్ఫలితాలు /దుష్ఫలితాలు వంటి వాటిని తిరస్కరించారు. సృష్టి ప్రక్రియ విశదీకరణకు మానవాతీత కారకాల వినియోగాన్ని కూడా తిరస్కరించారు. వారి ప్రకారం సృష్టి ప్రక్రియ యావత్తూ, ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు ప్రాకృతిక అంశాల అంతర్లీన స్వభావాన్ని బట్టి జరుగుతోంది. అగ్గిలోని వేడి, నీటిలోని చల్లదనం, ప్రొద్దుట వీచే పిల్లగాలిలో జవసత్వాలను అందించే చల్లదనం -ఈ వైవిధ్యం వాటికుండే సహజగుణాల నుండే వచ్చింది. చార్వాకులు వేదాలను, బౌద్ధ గ్రంథాలను తిరస్కరించారు.
నాటినుండి నేటివరకూ భౌతికవాదం పాలకవర్గాల కక్షకు గురౌతూనే ఉంది. ఇది మన దేశంలోనే గాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో జరిగింది.
గ్రీకు భౌతికవాద తత్వవేత్త డెమాక్రటస్ ప్రతిపాదించిన ‘అణువాదం’ ప్రభావాన్ని తట్టుకోలేక భావవాది అయిన ప్లేటో ఆ డెమాక్రటస్ గ్రంథాల్ని తగులుబెట్టమని ఆదేశించాడు. తమ ప్రత్యర్థుల్ని తిట్టాలంటే ”వాడు నాస్తికుడు” అన్న పదాన్ని చాలామంది ఉపయోగించారు. ”అధికారంలో ఉన్న పార్టీచేత ‘వీరు కమ్యూనిస్టులు’ అనే తిట్టుతినని ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా ఉందా?” అని కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్స్, ఎంగెల్స్ ప్రస్తావించారు. ఇప్పటికీ అమెరికాలో ”కమ్యూనిస్టు” అంటే ఏవగింపుగానే చూసే పరిస్థితిని పాలకవర్గాలు కొనసాగిస్తున్నాయి.
(రచన: శారదాప్రసాద్
మాలిక సాహిత్య మాసపత్రికనుండి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి