అంబేద్కర్-కమ్యూనిస్టులు
స్వాతంత్రోద్యమ తొలినాళ్లలో అంబేద్కర్ కమ్యూనిస్టులు కలసి పని చేశారు 1927 మహద్ లో డా.బి.ఆర్. అంబేద్కర్ ప్రారంభించిన చెరువు నీళ్లు తోడుకోవడం, మనుస్మృతి దహనం వంటి మహత్తర పోరాటాలను నాడు కమ్యూనిస్టులు బలపరిచారు. ఆయన ముఖ్య సహచరుడిగా ఉన్న ఆర్.బి. మోరే, దాదాసాహెబ్ బావురావు గైక్వాడ్ లు నాడు ఈ పోరాటాలన్నింటిలోనూ ముందున్నారు. వారే ఈ పోరాటాలకు ప్రణాళికలు రూపొందించారు. ఆ తర్వాత 1930లో మోరే
కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. నాసిక్ లోని దేవాలయ ప్రవేశంలోనూ కమ్యూనిస్టులు కలసి పని చేశారు. ముంబయి బట్టల మిల్లుల గిర్ని కాంగార్ యూనియన్ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు చేసిన కార్మికపోరాటాలను అంబేద్కర్ బలపరిచాడు 1938లో కార్మికోద్యమాలను అణచివేసేందుకు బ్రిటీషు ప్రభుత్వం అండతో కాంగ్రెసు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడ్డ ప్రొవిజనల్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ నాయకత్వంలోని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలోని యూనియన్లు కలసి పోరాడాయి. కొంకణ్ ప్రాంతంలో ఖోతీ పేరుతో సాగుతున్న కరుడు కట్టిన దళారీ దోపిడీకి వ్యతిరేకంగా పదివేల మంది రైతులు బోట్లమీద ముంబయి అసెంబ్లీ యాత్ర సాగించారు అపూర్వమైన ఈ యాత్రకు అంబేద్కర్ తో పాటు నాటి కమ్యూనిస్టు నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ పోరాటానికి మద్దతుగా రణదివే నాయకత్వంలోని ముంబయి కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగిన పోరాటంగా దీన్ని అభివర్ణించారు. అంబేద్కర్ తో పాటు ఇందులో ముఖ్యపాత్ర పోషించిన శ్యామరావు పరులేకర్ ఈ పోరాటం తర్వాత కమ్యూనిస్టుగా మారాడు. ఇలా వర్గ సమస్యల పైనా కలసి పనిచేశారు భారతదేశంలో అప్పుడప్పుడే అభివృద్ధి అవుతున్న పెట్టుబడిదారీ వర్గంతో పాటు కార్మికవర్గం కూడా ఆవిర్భవించింది. బొంబాయి, కలకత్తా, కాన్పూర్, మద్రాస్ వంటి నగరాలు కార్మిక కేంద్రాలుగా ఉండేవి. అందువల్లనే కమ్యూనిస్టు పార్టీకి బీజాలు కూడా ఈ నగరాల్లో పడ్డాయి. కమ్యూనిస్టు పార్టీ నిర్వహించిన కార్మికోద్యమాలకి మహారాష్ట్రలో అంబేద్కర్ కూడా మద్దతు ఇచ్చాడు. ఆయన మొదట నెలకొల్పిన పార్టీ కూడా ఇండియన్ లేబర్ పార్టీ. 1940ల తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. లేబర్ పార్టీ స్థానంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ని ఏర్పాటుచేశాడు. ఆతర్వాత రిపబ్లికన్ పార్టీగా ఇది రూపాంతరం చెందింది క్రమంగా అంబేద్కర్ కమ్యూనిస్టు వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు. దానికి ఆయన చెప్పిన కారణం కమ్యూనిస్టు పార్టీ బ్రాహ్మణ ఆధిపత్యంలో ఉందని. క్రమంగా ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. దిగువ స్థాయిలో అగ్రకులాల వివక్షతకు గురవుతున్న దళితులను ప్రత్యేకంగా ఆర్్గ నైజ్ చేయాలని భావించాడు. స్వాతంత్ర్యం వచ్చినా అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతుంది. కాబట్టి దళితుల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రత్యేక వేదికల్ని, పార్టీల్ని స్థాపించాడు. కులవ్యవస్థకు హిందూ మతమే పునాదని, ఆ మతాన్ని వదిలేసి మరో మతంలో చేరితే కులం నుంచి బయట పడగలమని నమ్మాడు. అందుకే బొద్దాన్ని స్వీకరించాడు. దీనికి భిన్నంగా సకల కులాల్లోని పీడితులను సమీకరించి ప్యూడల్
వ్యవస్థను నాశనం చేస్తేనే కులవ్యవస్థను కూడా దెబ్బతీయగలమని కమ్యూనిస్టులు భావించారు. అందరిలాగే అంబేద్కర్ కూడా కమ్యూనిస్టు పార్టీ హింసావాదాన్ని ప్రోత్సహిస్తుందని అనుకున్నారు. వర్గపోరాట సిద్ధాంతాన్ని తిరస్కరించారు. వర్గరీత్యా వ్యవసాయ కార్మికుల్లో అత్యధికులు కులం రీత్యా దళితులే. భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి 3000 మంది నేలకొరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి అంబేద్కర్ నుంచి నైతికమద్దతు కూడా లభించలేదు. కమ్యూనిస్టులతో ఆయనకున్న విభేదమే ఇంతటి మహత్తర పోరాటానికి మద్దతు తెలపకుండా ఆయనకు అడ్డుతగిలింది. ఒక రకంగా స్వాతంత్ర్యోద్యమంలో ఈ మూడు స్రవంతులు సమాంతరంగా కొనసాగుతూ వచ్చాయి
అస్తిత్వవాదం బలపడిన నేపథ్యంలో అంబేద్కర్ కమ్యూనిస్టు వ్యతిరేకి అని కమ్యూనిస్టులకు అంబేద్కర్ అంటే పడదన్న బలమైన భావనని ముందుకు తెచ్చారు. కమ్యూనిస్టులతో అంబేద్కర్ కి ఎన్ని విభేదాలున్నా రెండు విషయాల్లో ఆయన ఏకీభవించారు. భారతదేశానికి సోషలిజం కావాలని ఆయన కోరుకున్నాడు. మార్క్స్ కోరుకున్న తరహా సోషలిజం కాకపోవచ్చు. ఫేబియన్ సోషలిజాన్ని ఆయన కాంక్షించారు. మార్క్స్ కి ముందున్న ఊహాజనిత సోషలిస్టు తరహా వారిలో ఆయన ఒకడు. భూమిని జాతీయం చేయాలని, ఫ్యాక్టరీలను ప్రభుత్వ రంగంలో నడపాలని ఆయన తన ప్రత్యామ్నాయ కార్యక్రమంలో పేర్కొన్నారు. దళితులకు భూమిపై ఆధిపత్యం రాకుండా ఆత్మగౌరవం కూడా రాదని అంబేద్కర్ పార్లమెంటులో వాదించారు. రెండు ప్రధానమైన అంశాలలో కమ్యూనిస్టు పార్టీ మినహా మరే ఇతర పార్టీ ఆయనతో ఏకీభవించదు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ కార్యక్రమంలో ఇలాంటి అనేక అంశాలను ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, ఆయన చివరి పుస్తకం 'మార్క్స్, బుద్ధుడు' ఈ రెంటి మధ్య ఆయన తేల్చుకోవాల్సి వచ్చినప్పుడు చివరికి బుద్ధిజం వైపే మొగ్గు చూపారు. ఆయన మార్క్సిజాన్ని పూర్తిస్థాయిలో అధ్యయనం చేయలేకపోయాడని ప్రముఖ అంబేద్కరిస్ట్, మేధావి అనంద్ తేల్ తుంబుడే అన్నాడు. రెండో విషయం వర్గానికి సంబంధించి భారతదేశంలో వర్గాలు లేవని ఆయన ఏనాడు చెప్పలేదు. ఇది వర్గ సమాజమని అయితే ఈ వర్గం వృత్తాకారంలో చుట్టుముట్టబడిన కులం రూపంలో ఉందని నమ్మాడు. రాజకీయ విప్లవం జరగడానికి ముందు సాంఘిక మత విప్లవాలు కూడా జరగాలని అలాంటివి భారతదేశ చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయని ఆయన తన రచనలలో వెల్లడించాడు. కుల నిర్మూలన పుస్తకంలో కమ్యూనిస్టులను ఉద్దేశించి మీరు ఈ రోజు కులానికి వ్యతిరేకంగా పోరాడకపోతే రేపు సోషలిజం వచ్చిన తర్వాత అయినా దాన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీన్నే మరో మాటలో చెప్పాలంటే సాంస్కృతిక విప్లవం అంటాం. ఏ వ్యవస్థలోనైనా సాంస్కృతిక విప్లవం ఆవశ్యకత ఉంటుంది. సోషలిజంలోనూ ఇది అవసరమే. అంబేద్కర్ ఏనాడు కుల అస్తిత్వవాదాన్ని ప్రబోదించలేదని ఆనంద్ టెల్ టుంబ్టే అన్నారు.అంబేద్కర్ కులనిర్మూలన కోరుకున్నారు. అందుకు భిన్నంగా కుల అస్తిత్వం కులవ్యవస్థను బలపరుస్తుంది. కుల అస్తిత్వం పోతేనే కులనిర్మూలన జరుగుతుంది. ఇప్పుడు అస్తిత్వవాదులు అంబేద్కర్ పేరుతో కమ్యూనిస్టులపై చేసే అనేక విమర్శలు అంబేద్కర్ బోధనలకు వ్యతిరేకం. కులాల ఆధిపత్యానికి, దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడాలని అంబేద్కర్ బోధించారు. అంతేకానీ కులాల మధ్య పోరాటాన్ని కాదు కులాల మధ్య పోరాటం వర్గ ఐక్యతను బలహీనపరుస్తుంది. పెట్టుబడిదారులు
దాన్నే కోరుకుంటారు.
అంబేద్కర్ ఆర్థిక పోరాటాలకు వ్యతిరేకం కాదు. ఆర్ధికంగా బలపడితేనే సామాజికంగా ఆధిపత్యాన్ని ఎదుర్కొనే శక్తి వస్తుందని ఆయన చెప్పాడు. అందుకే ఆయన భూసమస్య, రిజర్వేషన్లు, ఉపాధి, విద్య వంటి సమస్యలకు ఆయన ప్రణాళికలో పెద్దపీట వేశారు. ప్రభుత్వరంగం ఆవశ్యకతను ఆయన గుర్తించారు అంబేద్కరిస్టులమని చెప్పుకునే పాలకపార్టీల నేతలు ఎవరూ నేడు రిజర్వేషన్లకు ముప్పు తెస్తున్న ప్రైవేటీకరణను వ్యతిరేకించడం లేదు. తద్భిన్నంగా ప్రైవేటు పెట్టుబడిలో వాటా కోసం డిమాండు చేస్తున్నారు. రాజ్యాధికారం అంటే రాజ్య నిర్వహణలో వాటా అంటున్నారు. వాటాల కోసం సాగే పోరాటం సామాజిక న్యాయాన్ని సాధించలేదు. అది కొద్దిమంది వ్యక్తులకు లేదా సమూహాలకు మాత్రమే మేలు చేస్తుంది. అత్యధిక మంది శ్రామికులుగానే మిగిలిపోతారు. పీడనకు గురవుతుంటారు. ఆర్ధిక స్వాతంత్ర్యం లేకుండా ఆత్మగౌరవం రాదు. ఆర్ధికంగా ఎంతోకొంత బలపడి నిలదొక్కుకున్నవారే దళిత ఉద్యమాలకు నాయకత్వం వహించ గలుగుతున్నారు. అట్టడుగున వున్న దళితులు ఇప్పటికీ ఆర్థిక అవసరాల కోసం కూడా పోరాడాల్సి వస్తున్నది. అందుకే తమలాగా బాధపడే ఇతర కులస్తులతో కూడా కలసి వారు పోరాడుతున్నారు.
___వి.శ్రీనివాసరావు(సామాజిక న్యాయం_కమ్యూనిస్టు పార్టీ నుండి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి