ప్రగతిశీల సంస్కృతి


         
   PC: Studio30.com

          "సంస్కృతి'' అంటే, మానవుడు నాగరికతను అలవరచుకొని, నైతిక ప్రవర్తనతో, ప్రాపంచిక దృక్పథాన్ని మెరుగుపరచుకోవడం. ఈ భావన మానవ శ్రమలకు, మనుషుల  కార్యకలాపాలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది. 
      ఒకవైపున, సంస్కృతి అంటే, మానవుడు సృష్టించిన సకల వస్తువులు, సామాజిక విలువలు, సాంస్కృతిక  రూపాలు, వీటన్నింటినీ సంఘటితంచేసే పద్ధతులు. మరోవైపున,   ప్రపంచాన్ని  అర్థం చేసుకొని, దాన్ని మార్చే లక్ష్యంతోజరిగే మనిషి కృషి, చైతన్యవంతంగా చేసే సృజనాత్మక కార్యకలాపాలన్నీ  సంస్కృతి అవుతుంది. ఈ అర్థంలో సంస్కృతి
సమాజపు భావజాలమవుతుంది.అది నైతిక వాతావరణపు సూచికవుతుంది. అది సమాజాన్ని నియంత్రించే ఒక కనిపించని శాసనకర్తవుతుంది.

      సంస్కృతిని  ప్రజాసామాన్యానికి అందుబాటులోకి తెచ్చేందుకు  ఇవి అవసరమని లెనిన్ పేర్కొన్నాడు: అవేమంటే
1) సంస్కృతికి, శ్రామిక ప్రజలకు మధ్య తరతరాలుగా వున్న కృత్రిమమైన అడ్డుగోడలను తొలగించడంం

2) సమస్త సాంస్కృతిక సంపదను ప్రజల ఆస్తిగా మార్చి, ప్రజల ఆలోచనా స్థాయిని పెంచడం. 

3) ప్రజల సృజనాత్మక శక్తుల అభివృద్ధికి, సమాజాన్ని మేధోవంతం చేసేందుకు  చేపట్టే అనేక కార్యకలాపాల్లో  శ్రామిక ప్రజలు పాల్గొనేటట్లు చేసేందుకు తగిన పరిస్థితులను కల్పించడం

    ఈ నూతన ప్రగతిశీల సంస్కృతి  ఒక మనిషిని వేరొక మనిషి దోచుకోవడాన్ని నిర్మూలించే శ్రామికవర్గపు వర్గ పోరాట భావంతో నిండి ఉండాలి.  ఈ సంస్కృతే కమ్యూనిస్టు వ్యవస్థ సంస్కృతి.

       సోషలిస్టు సంస్కృతిలో  అనేక సోషలిస్టు విలువలు  వున్నాయి. ఇవి కమ్యూనిజాన్నీ, నూతన సామాజిక సంబంధాలనూ నిర్మించేందుకు దోహదం చేస్తాయి.  సోషలిస్టు భావాలు  వైవిధ్యం తో ఉంటాయి.ఇవి అంతర్జాతీయంగా  ఏకైక సంస్కృతి స్థాపనకు తోడ్పడతాయి.ఇది అన్ని  సోదర దేశాల సంస్కృతుల  వికాసం తోనూ, పరస్పరం సంపన్నం చేసుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా జరుగుతుంది.

      కొత్త తరహా సంస్కృతి పాత సంస్కృతి నుంచి  నియమబద్ధంగా పరిణామం చెందుతుంది. గతకాలపు ప్రగతిశీల సాంస్కృతిక వారసత్వం, నేటి సృజనాత్మక విజయాల సమ్మేళనం నుంచి అది అభివృద్ధి చెందుతుంది . అయితే ఈ  కొత్త తరహా సంస్కృతిలోశాస్త్రీయ భావజాలాన్ని  అతిముఖ్యాంశంగా చేర్చాల్సి ఉంటుంది.

       అభివృద్ధి చెందిన సోషలిజంలో సంస్కృతి, కేవలం తయారై సిద్ధంగా వున్న బౌద్ధిక విలువల గోడౌనులాగా ఎవరూ పరిగణించరాదు. ఈనాడు సంస్కృతి లక్ష్యం కేవలం మనిషి విద్యా స్థాయిని పెంపొందించడం కాక, అతని ప్రాపంచిక దృక్పథాన్ని తీర్చిదిద్దాలి. వ్యక్తిలో క్రియాశీల చైతన్యాన్నీ, సమున్నత నైతిక గుణాలనీ రూపొందించడం దాని కర్తవ్యం. ఇది శ్రమకు, రోజువారి జీవితానికి సంబంధించిన సాంఘిక సృజనాత్మకతకు, మానవ సంబంధాలకు, సామాజిక ప్రవర్తనలకు సంబం
ధించిన ఉన్నత సంస్కృతి.
      ఇక్కడ రాజకీయ సంస్కృతి కూడా ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. మానవుడు తన కార్యకలాపా లను, సామాజిక పర్యవసానాలను నిర్ధారించే సామర్థ్యంలో అది వ్యక్తమవుతుంది. దానిలో మనిషి రాజకీయ విశ్వాసాలు  ఇమిడివుంటాయి. అది సామాజిక క్రియాశీలతనూ,  పార్టీ విధానాన్ని అమలు పరిచేందుకు సంసిద్ధతనూ వ్యక్తంచేస్తుంది.

      సమాజంలో కళాత్మక, సౌందర్యాత్మక సంస్కృతి వికాసం ప్రజల జీవితంలో శాస్త్రీయ భావాల పాత్ర ను పెంపొందించడం లో ఉపయోగపడుతుంది.  

      ప్రస్తుత సమాజంలో ప్రధాన వైరుధ్యం రెండు సంస్కృతుల మధ్య పోరాటం. అది రెండు భావజాలాల - బూర్జువా, భూస్వామ్య సంస్కృతుల మధ్య పోరాటం. సంక్లిష్టత, నిశితంగా పరిశీలించడం, రూపాల వైవిధ్యం - యివీ ఈ పోరాటపు విశిష్ట లక్షణాలు. ఈ పోరాటంలో గమనించాల్సిందేమంటే  ప్రతి దేశ సంస్కృతిలోనూ రెండు సంస్కృతులు ఉన్నాయని. సామాజిక వైరుధ్యాలతో కూడిన నేటి సమాజంలో  బూర్జువా సంస్కృతిదే పైచేయిగా ఉంటుంది.కానీ అందులోనే ప్రజాతంత్ర, సోషలిస్టు సంస్కృతి మూలాంశాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. సమాజపు  విప్లవకర వర్గాలు ఈ అభివృద్ధికి  చోదకశక్తులుగా వ్యవహరిస్తాయి.

     
“అనేక కమ్యూనిటీల, సమాజాల, గతకాలపు - సంస్కృతుల కలగలుపుగా మన సంస్కృతీ వారసత్వం రూపొందింది. ఈ బహుళ సంస్కృతీ సమ్మేళనమే భారత నాగరికత ప్రత్యేకత. ఇది  ఇతర ప్రపంచదేశాల కన్నా భిన్నమైనది. దీని ఏకశిలా సదృశంగా మార్చలేము." 
                                 ___రొమీలా థాపర్.

 "ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే సంస్కృతి" అనే నినాదం కేవలం ఆర్యజాతి అగ్రవర్ణాల ఆధిపత్యానికి అధిక సంఖ్యాక మత దురహంకారానికి నిదర్శనం. 
జవహర్‌లాల్‌ నెహ్రు తన “డిస్కవరీ ఆఫ్ ఇండియా" గ్రంధంలో యిలా రాస్తారు.

"జాతి, మత, భాషా విభేధాలు ఎన్ని వున్నా భారత ప్రజలు స్థూలంగా ఒకే సామాజిక ఆచారాలు, ప్రవర్తన కలిగి వుంటారు. దీనికి కారణం దీర్ఘకాలంగా వారు కలిసి చేస్తున్న శ్రమ, మరింత ఉన్నత జీవనం కోసం పడుతున్న ఉమ్మడి పోరాటం. వారు పడే కష్టం, చేసే శ్రమ (drudgery), వారి సంస్కృతికి మూలం".

   సంస్కృతి - వర్గ పోరాట రంగంగా మారుతుంది

        ఏదైనా సామాజిక వ్యవస్థలో పాలక వర్గాల ప్రయోజనాలను కాపాడే భావజాలమే రాజ్యమేలుతుంది. దీనికి వ్యతిరేకంగా అణగారిన ప్రజల సంస్కృతి కూడా తలెత్తుతుంది. ఆ విధంగా సంస్కృతి వర్గ పోరాట రంగంగా మారుతుంది.

మన దేశంలో  ఆధిపత్య వర్గాల  నుంచి వచ్చిన  సంస్కృతే మిగిలిన వారి సంస్కృతిగా ప్రచారం అవుతోంది.ఇది మెజారిటీ ప్రజల సంస్కృతి కాదు. 80% ప్రజలమీద కేవలం 30% ప్రజల సంస్కృతి రుద్దబడుతోంది. ఇందుకు కారణం సంస్కృతి ప్రజాస్వామికం కాకపోవడం వల్లనే. చాలా మంది పూర్ణకలశం ఇవ్వడం మెజారిటీ ప్రజల సంస్కృతి
అనుకుంటారు. భరత నాట్యం మనందరి సంస్కృతి అనుకుంటారు. శ్రమజీవుల సంస్కృతికి ఇవి ప్రతిబింబం ఎంత మాత్రం కాదు.

ఎన్నో యేళ్ళు సంస్కృతం వంటి భాషలు కొందరికే పరిమితం కావడం వల్ల, సాహిత్యం ఇంకా పరిమితులు ఏర్పరచుకోవడం వల్ల ఇటువంటి అనర్ధాలు జరిగాయి. వాస్తవం మాట్లాడితే రెండు రకాల సంస్కృతులు  ప్రజల్లో చలామణీలో ఉన్నాయి. ఒకటి ఆధిపత్య వర్గాలది. మరొకటి శ్రమజీవులది. ఈ రెండూ ఒకటి కాదు. మెజారిటీ ప్రజల సంస్కృతి అల్ప సంఖ్యాకుల సంస్కృతి రెండు సమాంతరంగా సాగుతున్నాయి.ఆధి పత్యాలవారు తిరునాల జరిపితే, శ్రామిక ప్రజలు
జాతరలు జరుపుకుంటారు.ఆధిపత్యవర్గం శాస్త్రీయ నృత్యాన్ని కీర్తిస్తే, శ్రామిక ప్రజలు జానపద సంబంధ
కోలాటం,చెక్కభజనలు ఆశ్రయించారు.
 అందువల్లనే మన దేశంలో సాంస్కృతిక వైవిధ్యం కనిపిస్తుంది. అయితే ఆధిపత్యాల  వారిదే పైచేయి లో ఉండటానికి కారణం అది ఇప్పుడున్న పాలకవర్గాల ప్రయోజనాన్ని కాపాడే భావజాలానికి ఊతకర్రగా ఉండటమే.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?