సంక్షోభం నుంచి సంక్షోభానికి!
పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తి క్రమాలు, అంత మృదువు గానూ, అంత నిరాటంకం గానూ జరిగిపోతూ వుండవు. ఈ విధానంలో, కొన్ని సంవత్సరాల కొకసారి చాలా శాఖల్లో 'సరుకుల రాసి’లో చాలా భాగం అమ్మకాలు లేకుండా నిలిచి పోయే పరిస్థితి ఏర్పడుతూ వుంటుంది. అలాంటి పరిస్థితే 'సంక్షోభం' (క్రైసిస్).
సరుకు, అమ్ముడు పోకుండా నిలిచిపోతే, తర్వాత జరగాల్సిన విషయాలన్నీ కూడా నిలిచి పోతాయి. అంటే, లాభాలూ వడ్డీలూ రావు, పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాదు. ఇలా అన్నీ నిలిచిపోతాయి.
ఇలాంటి 'సంక్షోభాల'కూ దారి తీసే పరిస్థితుల్ని, కొన్ని అంశాలుగా ఇలా విభజించవచ్చు
1. సమాజంలో 'సమిష్టి ప్లాను'కి అవకాశం లేక పోవడం.
2.ఎక్కువ లాభం కోసం పోటీ.
3. ఉత్పత్తుల్ని కార్మికులు కొనలేకపోవడం,
4.'అదనపు విలువ'(అంటే మిగులు సంపద) గుట్టల్ని, పెట్టుబడిదారీ వర్గం మాత్రమే వాడవలసి వుండడం
నిజానికి, ఈ అంశాలన్నీ ఒక దానితో ఒకటి సంబంధం వుండే విషయాలే.
పెట్టుబడిదారీ విధానంలో భారీ పరిశ్రమలు ప్రారంభమయ్యాకే ఈ 'సంక్షోభాలు' ప్రారంభమయ్యాయి. మొదటి సంక్షోభం 1825 లో వచ్చింది. తర్వాత ఒక దాని తర్వాత ఒకటిగా సంక్షోభాలు వచ్చి పోతూనే వున్నాయి. మళ్లీ 1929లో అతి పెద్ద సంక్షోభం వచ్చింది. ఇది దాదాపు 6 సంవత్సరాలు 1935వరకు ఉండింది. 2008లో మళ్లీ వచ్చింది.
సంక్షోభాన్ని వేరు వేరు కోణాల్లో, వేరు వేరు పేర్లతో చెప్పవచ్చు. పారిశ్రామిక సంక్షోభం, వర్తక సంక్షోభం, క్రెడిట్ సంక్షోభం, డబ్బు సంక్షోభం - వంటి పేర్లతో! అన్నిటి సారాంశమూ ఒకటే.
'పారిశ్రామిక సంక్షోభం' అంటే, పునరుత్పత్తి క్రమానికి ఆటంకాలేర్పడడం. 'వర్తక సంక్షోభం' అంటే, సరుకుల అమ్మకాలకు ఆటంకాలేర్పడడం. 'క్రెడిట్ సంక్షోభం' అంటే, అప్పుల చెల్లింపులకూ, అప్పులు దొరకడానికి ఆటంకాలేర్పడడం.
'డబ్బు సంక్షోభం' అంటే, డబ్బు చలామణీకి ఆటంకాలేర్పడడం.
ఈ సంక్షోభాలన్నిటినీ కలిపి 'ఆర్థిక సంక్షోభం' అనవచ్చు. వీటన్నిటికీ మూల కారణం ఒక్కటే.అది సరుకుల సంక్షోభం.దానికి సంబంధించినవే పైవన్నీ.
పెట్టుబడిదారులకు, సంక్షోభ కాలంలో, లాభాలు కొంత తగ్గిపోయి వుంటాయి కాబట్టి, అప్పుడు అదంతా సంపాదించే కొత్త ప్రయత్నాలకు పూను కుంటారు. 'ఉత్పత్తి శక్తుల్ని పెంచే పని' అప్పుడు ప్రారంభమవుతుంది.
ఎక్కువ లాభం సంపాదించాలంటే, ఎక్కువ సరుకుని అమ్మాలి. ఎక్కువ సరుకుని అమ్మాలంటే, సరుకుని ఇతర పెట్టుబడిదారుల కన్నా తక్కువ ధరతో ఇవ్వగలగాలి. సరుకుని తక్కువ ధరతో ఇవ్వాలంటే, దాని ఉత్పత్తి ఖర్చుని తగ్గించగలగాలి. ఉత్పత్తి ఖర్చుని తగ్గించాలంటే, ఉత్పత్తి శక్తిని ఇంకా పెంచాలి. ఈ రకంగా, 'రేషనలైజేషన్' పేరుతో 'ఉత్పత్తి శక్తుల్ని పెంచే పని' చేపడతారు. పెట్టుబడిదారీ విధానంలో 'రేషనలైజేషన్'అంటే, 'టెక్నాలజీని' మార్చడం! కొత్త
టెక్నాలజీని ప్రవేశపెట్టి కార్మికుల్ని తగ్గించడం!
దాంతో నిరుద్యోగం పెరుగుతుంది.
మేధోశ్రమల కార్మికులు తమ మేధస్సులన్నీ ఉపయోగించి యంత్రాల్ని మరింత శక్తి వంతంగా మారుస్తారు. కొత్త యంత్రాల్ని కనిపెడతారు. ఆ యంత్రాల్ని ఉపయోగించవలసిన కార్మికులు, వాటి మీద మళ్ళీ కొత్త ట్రయినింగులు పొందుతారు.
మళ్ళీ అన్ని శాఖల్లోనూ కొత్త ఉత్పత్తి క్రమాలు నడుస్తూ వుంటాయి. 'వ్యాపార ప్రపంచంలోకి మళ్ళీ ఉత్సాహం ప్రవేశిస్తుంది. సరుకుల అమ్మకాలు తేలిగ్గా సాగిపోతూ వుంటాయి. పెట్టుబడి దారులందరూ పాత సంక్షోభపు పీడ కలని దాదాపు మరిచిపోతారు. క్రమంగా, వేరు వేరు శాఖల్లో ఉత్పత్తి శక్తులు అస్తవ్యస్తంగా విస్తరిస్తాయి. మళ్ళీ ఎక్కడో ఏదో జరుగుతుంది. మళ్ళీ సరుకులు పేరుకు పోతూ వుంటాయి. మళ్ళీ ఒకటి రెండు శాఖల్లో అమ్మకాలు మందగించడం ప్రారంభమవుతుంది. క్రమంగా అది ఎక్కువ శాఖలకు విస్తరిస్తుంది. ఉత్పత్తి క్రమాలు కుంటు పడడం ప్రారంభమవుతుంది. కార్మికుల్ని పనుల్లోంచి తీసివెయ్యడం అధికమవుతుంది. అంతా మళ్ళీ వెనకటి రకం గానే జరిగిపోతూ వుంటుంది. మళ్ళీ సంక్షోభం! మళ్ళీ సరుకుల గుట్టలు! మళ్ళీ కార్మికుల బాధలు! అంతా మళ్ళీ వెనకటి లాగానే! అయితే, సంక్షోభం తీవ్రత, ఆ యా పరిస్తితుల్ని బట్టి రకరకాలుగా వుంటుంది.
ఇలా వచ్చే సంక్షోభానికీ ఇంకో సంక్షోభానికీ మధ్య వుండే వ్యవధి 10 సంవత్సరాలు కావచ్చు. 15 సంవత్స రాలు కావచ్చు; రక రకాలుగా వుండవచ్చు. సంక్షోభం సాగే వ్యవధి కూడా రక రకాలుగా వుండవచ్చు.
అమ్మకాలు సుఖంగా వున్న దశ 'బూమ్' అయితే, అమ్మకాలు చాలా తగ్గిపోయిన దశ 'స్టాగ్నేషన్' లేదా 'డిప్రెషన్' అంటారు.
సంక్షోభాలు మరింత ప్రమాదకరంగా మారి
మొత్తం పెట్టుబడి దారీ సమాజానికే చావు బతుకుల సమస్య తెచ్చి పెడుతున్నాయి. ఈ సంక్షోభాలు వచ్చినప్పుడల్లా ఉత్పత్తి అయిన సరుకుల్లోనే గాక, గతంలో సృష్టించ బడిన ఉత్పాదక శక్తుల్లో కూడా పెద్ద భాగం నాశనం చేయబడుతుంది. గతంలో అసంభవంగా కనిపించే ఒక 'అంటు రోగం', ఈ సంక్షోభ సమయాల్లో చెలరేగుతుంది. ఇది 'మితిమీరిన ఉత్పత్తి' అనే అంటు రోగం. హఠాత్తుగా, మానవ సమాజం, తాత్కాలిక ఆటవిక దశలో ప్రవేసించినట్లు కనిపిస్తుంది. కరువో, కాటకమో, సర్వ విధ్వంసక ప్రపంచ యుద్ధమో వచ్చి సకల ప్రాణాధార వస్తువుల సరఫరానూ భగ్నం చేసినట్లుంటుంది. పరిశ్రమలూ, వాణిజ్యమూ ధ్వంసమైనట్లుంటుంది. కారణం యేమంటే, మితి మీరిన నాగరికత, మితి మీరిన వస్తు సంపద, మితి మీరిన పరిశ్రమలు, మితి మీరిన వాణిజ్యం! సమాజం చేతిలో వున్న ఉత్పాదక శక్తులు, ఇక ఎంత మాత్రమూ పెట్టుుబడిదారీ ఆర్థిక ప్రగతికి అనుకూలంగా ఉండవు. అవి, తనకు సంకెళ్లుగా తయారైన ఈ ఆర్థిక వ్యవస్థ కంటే బాగా బలీయమైనాయి. దాంతోబూర్జువా( పెట్టుుబడిదారీ)ఆస్తి వ్యవస్థకే ప్రమాదం ఏర్పడుతుంది.
బూర్జువా సమాజపు నియమాలు, తాము సృష్టించిన సంపదను ఇముడ్చుకోవడానికి తమకే ఇరుకుగా మార్చాయి. మరి, ఈ సంక్షోభాలను బూర్జువా వర్గం యే విధంగా అధిగమిస్తుంది?
ఒక వైపున ఉత్పాదక శక్తుల్లో కొంత భాగాన్ని విధి లేక ధ్వంసం చేయడం ద్వారా,
మరో వైపున కొత్త మార్కెట్లను జయించడం
(యుద్దాలు చేయడం, సామ్రాజ్య వాదం, ప్రపంచీకరణ) ద్వారానూ,
పాత మార్కెట్లను మరింత కట్టుదిట్టంగా దోచుకోవడం(పెట్టుబడి దారీ దేశాలు కూటమి కట్టడం, వగైరా)ద్వారానూ.
(ఇవన్నీ తాత్కాలిక చర్యలు)కానీ ఈ చర్యలు
మరింత విస్తృతమైన, మరింత విధ్వంసకమైన సంక్షోభాలకు బాట వేస్తాయి.సంక్షోభ నివారణావకాశాలను తగ్గిస్తాయి.
( కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక, మార్క్స్ - ఏంగెల్స్)
__రంగనాయకమ్మ (సంక్షోభాలు)
(సిపిఐయంయల్( న్యూడెమోక్రసీ) ప్రచురణ నుండి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి