కార్మికులను దోపిడీ చేసే స్వేచ్ఛనిచ్చిన ప్రపంచీకరణ

         ప్రధాన మంత్రి  పాములపర్తి వెంకట   నరసింహారావు, అప్పటి ఆర్థిక మంత్రి అయిన  మన్మోహన్  సింగ్ సరళీకృత విధానాలను అవలంబించటం మొదలు పెట్టారు. ఈ నియో-లిబరల్ విధానాలు ఆంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు, నియంత్రణల సడలింపులు, ప్రైవేటీకరణ, పన్నుల సంస్కరణలు, ద్రవ్యోల్బణ నియంత్రణా చర్యలకు ద్వారాలు తీశాయి. అది మొదలు అధికారంలో ఏ రాజకీయ పార్టీ ఉన్నా సరళీకరణ విధానాలను మరింత  వేగంగా
ముందుకు తీసుకు వెళుతున్నారు.
ప్రపంచ బ్యాంక్ అన్ని షరతులూ ఒప్పుకున్నారు. మూలధనంలో నిర్మాణ మార్పులు మొదలయ్యాయి. భారతదేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక మొదలైంది. లైసెన్స్ నిబంధనను తొలగించడానికి పరిశ్రమలకు రాయితీలు ఇచ్చారు.పారిశ్రామిక ఉదారవాదం వేగంగా వ్యాపించింది. పబ్లిక్ సెక్టార్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఆలోచన మొదలైంది.

        ' స్వేచ్చావ్యాపారం,', 'పోటీ', 'సామర్ధ్యం', 'అభివృద్ధి' మొదలయిన భావాలకు ప్రాచుర్యం లభించింది. జాతీయకరణ నినాదంపోయి ప్రైవేటీకరణ నినాదం వచ్చింది. స్వయం సమృద్ధి, స్వాలంబనల స్థానంలో విదేశీ పెట్టుబడులకు 'స్వేచ్ఛ' ప్రపంచీకరణ' లక్ష్యాలు పారిశ్రామిక విధానాల్లో చోటు చేసుకున్నాయి. పారిశ్రామిక రంగంలో గుత్తాధిపత్యం పెరుగుతున్నయది. లైసెన్సు విధానం రద్దుతో బహుళజాతి సంస్థలు మనదేశ మార్కెట్టును స్వాధీనం చేసుకోవడం మొదలైంది.

ప్రభుత్వ జోక్యం తగ్గిపోయి, పెట్టుబడిదారులు కార్మికులను దోపిడీ చేసే స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వం సామాజిక బాధ్యత నుండి తప్పుకొని ఆర్థిక రంగాన్ని పెట్టుబడిదారుల ప్రయోజనాలకు వదిలివేసింది. రాజ్యాంగంలోని ఆశయాలకు, ఆదేశిక సూత్రాలకు తిలోదకాలు యిచ్చింది. అందుకనుగుణంగా గతంలో ప్రజలకు, కార్మికులకు రక్షణను కల్పించిన చట్టాలలో మార్పులు చేసింది. కొత్త పారిశ్రామిక సంబంధాల బిల్లును ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నది. దేశ ప్రయోజనాలు, దేశసార్వభౌమత్వం, విదేశీ పెట్టుబడులకు ప్రపంచబ్యాంకుకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలకు తాకట్టు పెట్టింది. వేల కోట్ల రూపాలయు విలువ చేసే ప్రభుత్వరంగ పరిశ్రమల సంస్థల ఆస్తులను ప్రైవేటు పెట్టుబడి దారులకు కారుచౌకగా అమ్ముతున్నది. ఖాయిలా పరిశ్రమలను మూసివేయడానికి అవకాశాన్ని కల్పిస్తూ వేలాది మంది కార్మికులను నిరుద్యోగులుగా మార్చేసింది. గతంలో ప్రభుత్వ ఆధీనంలో వున్న సామాజిక సేవా రంగాలను -విద్య వైద్యం, రవాణా సౌకర్యాలు, సమాచార సౌకర్యాలు, ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలకు కనీస అవసరాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ప్రజల ప్రయోజనాలను, వారి జీవన ప్రమాణాలను, దెబ్బతీసే 'అభివృద్ధి' నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల ప్రధాన లక్ష్యం ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి, సామాజిక ఆర్థిక వత్తిడులకు గురిచేసి, వారి సామాజిక ఆర్థిక సంబంధాల్లో ఘర్షణను సృష్టించడం.వారి అసహాయత, అభద్రత ఆధారంగా పెట్టుబడి యదేచ్ఛగా దోపిడీ చేయడమే నూతన ఆర్థిక విధానాలు తీసుకవచ్చే 'స్వేచ్చావ్యాపారం' 'పోటీ'ల సారాంశం. ఈ విధానాలు భారత రాజ్యాంగంలో గుర్తించబడిన జీవించే హక్కును హరించివేస్తాయి. జీవించే హక్కుకూ జీవనోపాధికి సంబంధం వుంది. ఎందుకంటే జీవించే హక్కు కేవలం పశువులా బ్రతకటం కాదు. పనిహక్కు అంటే గాడిదలా పనిచేయడం కాదు. ప్రతిమనిషి సుఖంగా, సంతోషంగా, గౌరవంగా బ్రతకడం అనే విస్తృతార్థంలో జీవించే హక్కును అర్థం చేసుకోవాలి.
      పి.వి. నర్పింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కోటి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన విధానాలవల్ల కోటిమంది నిరుద్యోగులు పెరిగారు.

           ప్రభుత్వ అంచనాల ప్రకారం పేదరికం తగ్గుతున్నదని లెక్కలు చూపెట్టారు. కాని నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత పేదరికం పెరుగిందని నిపుణులు చెప్పారు. 

      పి.వి.నర్సింహారావు ప్రభుత్వం మాతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టినప్పటి నుండి కార్మిక రంగం తన నిరసనను తెలియజేస్తూనే ఉండేది. సంవత్సరానికి ఒకసారి దేశవ్యాపితంగా సమ్మెలు జరిగాయి. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, కార్పోరేషన్సు ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పిలుపు వచ్చి దేశవ్యాపితంగా సమ్మె చేశారు. మన రాష్ట్రంలో విద్యుత్ రంగంలోని50 వేల మంది ఉద్యోగులు ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే నిరసన తెలియజేసి ఆపగలిగారు. టెలికాం ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా సమ్మె చేశారు. అలాగే పోస్టల్ ఉద్యోగులు నిరసన తెలియజేశారు దేశవ్యాపిత నిరసనలు, ఆందోళనలు జరిగినా పి.వి. ప్రభుత్వం నూతన
ఆర్థిక విధానాలను అమలు చేసుకుంటూ ముందుకెళ్లింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?