శ్రామికవర్గం ఒక్కటే నిజమైన విప్లవకర వర్గం


 శ్రామికవర్గ అభివృద్ధిలో వివిధ దశలున్నాయి. బూర్జువా వర్గంతో దాని పోరాటం పుట్టుకతోనే ఆరంభమవుతుంది. మొదట కార్మికులు విడి విడిగా ఎవరికివారు పోరాడతారు. తర్వాత ఒకే చోట ఒకే ఫాక్టరీలో పనిచేసేవాళ్లంతా కలిసి పోరాడుతారు ఈ పోరాటాలన్నీ తమని నేరుగా దోచుకొనే  బూర్జువా యజమానుల మీదనే జరుగుతాయి. మొదట వారు బూర్జువా ఉత్పత్తి పరిస్థితులపై పోరాడరు; వారు ఉత్పత్తి పరికరాలపై దాడి చేస్తారు; తమ శ్రమతో పోటీచేసే విదేశీ సరుకులను ధ్వంసం చేస్తారు; యంత్రాలను పగలకొడతారు; ఫాక్టరీలను తగలబెడతారు; తమ బలంతో మళ్లీ మధ్య యుగాలనాటి పనివాని హోదాని తిరిగి సాధించాలని కోరుకుంటారు.

ఈ దశలో కార్మికులు ఒకరికొకరు సంబంధం లేకుండా దేశమంతటా విసిరేసినట్టుంటారు. తమ మధ్య ఉండే పోటీ వల్ల ఎక్కడికక్కడ చీలిపోయి ఉంటారు. ఎక్కడైనా వారు కలిసికట్టుగా సంఘటిత బృందాలుగా ఏర్పడితే దానికి కారణం స్వయంగా కార్మికుల ఐకమత్యం కాదు. అది బూర్జువాల ఐకమత్యం వల్ల జరుగుతుంది. బూర్జువా వర్గం ఆ దశలో తన సొంత రాజకీయ లక్ష్యాలను సాధించుకోవాలంటే మొత్తం శ్రామికవర్గాన్ని కదిలించక తప్పదు. కొంత కాలంపాటు అలా కదిలించగలిగిన శక్తి దానికి ఉంటుంది. ఈ దశలో కార్మికులు పోరాడేది తమ సొంత శత్రువులతో కాదు. తమ శత్రువుల శత్రువులతో మాత్రమే. అంటే, రాజరికపు అవశేషాలపైన, భూస్వాములపైన, పారిశ్రామికులు కాని బూర్జువాలపైన, పెట్టి బూర్జువాల పైన వారు పోరాడుతారు. ఈ దశలో మొత్తం చరిత్ర గతి బూర్జువా వర్గం చేతుల్లో సాంద్రీకరించ బడుతుంది. ఈ పోరాటంలో దొరికే ప్రతి విజయమూ బూర్జువా వర్గానికే దక్కుతుంది.

పరిశ్రమ అభివృద్ధి అయ్యే కొద్దీ కార్మికుల సంఖ్య పెరుగుతుంది. వాళ్లు మరింతగా పోగవుతారు. వారి బలం పెరుగుతుంది. తమ బలం పెరిగిందన్న సంగతి వారు గ్రహిస్తారు. యంత్రాలు వచ్చి కార్మికుల జీతాలను ప్రతిచోటా ఒకేలా కుదిస్తాయి. విడిగా ప్రతి కార్మికునిలోనూ ఉండిన ప్రత్యేక లక్షణాలన్నిటినీ అవి రూపు మాపుతాయి. దీనివల్ల వివిధ కార్మికుల భిన్న ప్రయోజనాలూ విభిన్న జీవిత విధానాలూ అంతమై అవి ఒకేలాగా తయారవుతాయి. బూర్జువాల మధ్య పోటీలు పెరగడం వల్లనూ
దానిమూలంగా వచ్చే సంక్షోభాల వల్లనూ శ్రామికుల జీతాలు మరింతగా ఎగుడు దిగుడులకు గురవుతాయి. యంత్రాలు నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. వారి జీవనాధారాలు మరింత సంకట స్థితిలో పడతాయి. కార్మికులకూ యజమానులకూ మధ్య జరిగే  ఘర్షణలు రెండు వర్గాల మధ్య జరిగే పోరాటాలు గా మారతాయి. అప్పుడు బూర్జువాలకు వ్యతిరేకంగా శ్రామికులు ట్రేడ్ యూనియన్లను ఏర్పాటు చేసుకోవడం మొదలు పెడతారు. తమ వేతనాల స్థాయిని నిలబెట్టుకోవడానికి వాళ్లంతా ఏకమవుతారు. అప్పుడప్పుడూ జరిగే ఈ తిరుగుబాట్లకు ముందుగానే సన్నద్ధంగా ఉండడం కోసం వారు శాశ్వత సంఘాలను ఏర్పరుచుకొంటారు. ఈ పోరాటాలు అక్కడక్కడా దొమ్మీలుగా మారతాయి.

అప్పుడప్పుడూ కార్మికులు గెలుస్తారు. కాని ఇది తాత్కాలికమే. ఆ పోరు వల్ల కార్మికులకు ఒనగూరే నిజమైన లాభం కేవలం వారి గెలుపు కాదు. వారి మధ్య నిత్యం పెరిగే ఐక్యతే వారికి దక్కే అసలైన ఫలం. ఆధునిక పరిశ్రమ సృష్టించిన వార్తా రవాణా సౌకర్యాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికుల మధ్య ఒకరితో ఒకరికి సంబంధాలు ఏర్పడతాయి. ఇది వారి మధ్య ఐక్యత పెంచుతుంది. స్థానికంగా ఎక్కడికక్కడ వేర్వేరుగా జరిగే ఒకేలాంటి శ్రామిక పోరాటాలన్నిటినీ కలిపి సమైక్యంగా రెండు వర్గాల మధ్య జరిగే ఏకైక జాతీయ పోరాటంగా మల్చడానికి ఈ పరస్పర సంబంధాలే తోడ్పడతాయి. నిజానికి, ప్రతి వర్గ పోరాటమూ ఒక రాజకీయ పోరాటమే. మధ్య యుగాల్లో దరిద్రపు రహదారులున్న పరిస్థితుల్లో బర్ఘరులు (నగర పౌరులు) ఇటువంటి ఐక్యతను సాధించడానికి శతాబ్దాలు పట్టింది. ఇప్పుడు రైల్వేల మూలంగా ఆధునిక కార్మికులు కొన్ని సంవత్సరాల్లోనే ఆ ఐక్యతను సాధిస్తారు.

కార్మికులు ఒక వర్గంగా సమైక్యం కావడమూ, ఒక పార్టీగా సంఘటితం కావడమూ అన్న లక్ష్యం వాళ్ల మధ్య వాళ్లకున్న పోటీ కారణంగానే దెబ్బతింటుంది. శ్రామిక వర్గం పడిపోయినా నిత్యం అది పైకి లేస్తుంది. బలపడుతుంది స్థిరపడుతుంది. మరింత శక్తిశాలిగా మారుతుంది. బూర్ణువా వర్గంలోని చీలికలను ఉపయోగించుకొంటుంది. కార్మికుల ప్రత్యేక ప్రయోజనాలను చట్టపరంగా గుర్తించేలా చేస్తుంది. ఇంగ్లండులో పది గంటల పని బిల్లును అది సాధించింది ఈ విధంగానే.

స్థూలంగా పాత సమాజంలో జరిగే ఘర్షణలు శ్రామికవర్గ అభివృద్ధికి తోడ్పడతాయి. బూర్జువా వర్గం నిరంతరం ఎవరితో ఒకరితో యుద్ధంలో మునిగిఉంటుంది. మొదట ప్రభువర్గంతో, తర్వాత బూర్జువా వర్గంలోనే పరిశ్రమల అభివృద్ధి వల్ల నష్టపోయేవాళ్లతో, మొదటి నుంచి చివరిదాకా విదేశీ బూర్జువా వర్గంతో అది యుద్ధంలో ఉంటుంది. ఈ యుద్ధాలన్నిటిలోనూ శ్రామికవర్గాన్ని సాయం కోరక తప్పదని దానికి అర్థమవుతుంది. కనుక, అది శ్రామికవర్గాన్ని రాజకీయ రంగంలోకి లాగుతుంది. బూర్జువా వర్గమే శ్రామికవర్గానికి రాజకీయ విద్య నేర్పుతుంది. మామూలు విద్య కూడా నేర్పుతుంది. భవిష్యత్తులో తనతో యుద్ధం చేయడానికి అవసరమయ్యే ఆయుధాలను ఆ రకంగా శ్రామికవర్గానికి బూర్జువా వర్గమే సమకూరుస్తుంది.

పరిశ్రమ పురోగమించే కొద్దీ బూర్జువా వర్గంలోని కొన్ని విభాగాలు మొత్తంగా శ్రామికవర్గం లోకి నెట్టబడతాయి. లేదా వారి జీవిత పరిస్థితులు ప్రమాదంలో పడతాయి. ఈ సంగతిని ఇంతకుముందే పేర్కొన్నాం. వారి వల్ల కూడా శ్రామికులకు కొత్త జ్ఞానమూ కొత్త ప్రగతీ అందుతాయి.

చివరిగా, వర్గ పోరు అటో ఇటో తేలిపోయే సమయం దగ్గరకి వచ్చినపుడు పాలక వర్గంలో సాగుతున్న విచ్ఛిత్తి ప్రక్రియ, నిజానికి పాత సమాజంలో మొత్తంగా సాగుతున్న విచ్ఛిత్తి ప్రక్రియ స్పష్టమైన ప్రచండ రూపాన్ని సంతరించుకొంటుంది పాలక వర్గంలోనే ఒక చిన్న విభాగం తన వర్గంతో తెగతెంపులు చేసుకొని భవిష్యత్తును శాసించే విప్లవ వర్గమైన శ్రామికవర్గంతో చేతులు కలుపుతుంది. గతంలో ప్రభువర్గానికి చెందిన ఒక విభాగం చీలిపోయి వచ్చి బూర్జువా వర్గంతో ఎలా కలిసిందో, అలాగే ఇప్పుడు బూర్జువా వర్గంలో ఒక విభాగం శ్రామిక వర్గంతో కలుస్తుంది. ముఖ్యంగా బూర్జువా సిద్ధాంతకారుల్లో చరిత్రగతి మొత్తాన్ని సిద్ధాంత పరంగా గ్రహించే స్థాయికి ఎదిగినవాళ్లు శ్రామికవర్గంతో చేతులు కలుపుతారు

బూర్జువా వర్గానికి ఎదురు నిలబడిన వర్గాలన్నిటిలోకీ శ్రామికవర్గం ఒక్కటే ఇవ్వాళ నిజమైన విప్లవకర వర్గం. మిగిలిన వర్గాలు ఆధునిక పరిశ్రమ కారణంగా క్రమంగా క్షీణించి ఆఖరికి అదృశ్యమవుతాయి. అలా కాక, శ్రామికవర్గం ఆధునిక పరిశ్రమ ప్రత్యేక సృష్టి. అది దాని అతి ముఖ్య సృష్టి.

(కమ్యూనిస్టు ప్రణాళిక నుండి)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?