అభివృద్ధికి హక్కులు ఆటంకమా?


      pc: prajatantranews.com
         
        
        స్వాతంత్ర్యానంతర   రెండు దశాబ్దాల్లో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి అంతా పెట్టుబడిదారుల అభివృద్ధే. సంక్షేమ రాజ్యం పేరుతో ప్రభుత్వం కాపాడింది పెట్టుబడిదారుల, ధనవంతుల ప్రయోజనాలే. నిత్యావసర ధరలు పెరిగి జీవన ప్రమాణం తగ్గిపోయి ప్రజలు పేదరికంలోకి నెట్టబడ్డారు. ఇందిరాగాంధీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 'గరీభీ హఠావో' నినాదాన్ని యివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే గతంలో జరిగిన అభివృద్ధి దేశంలో పేదరికాన్ని సృష్టించిందిగానీ తగ్గించలేదు పోయిందని అర్థమైంది.

     ఇందిరాగాంధీ గరీభీ హఠావో నినాదం కంటే ముందు జాతీయకరణ విధానాన్ని తెచ్చింది. జాతీయకరణ విధానం 'సోషలిజం' తీసుకు రావడానికి మార్గమని ప్రచారం చేసింది. ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా నిజమని నమ్మారు. ప్రభుత్వం బ్యాంకులను, నూనె బావులను బొగ్గు గనులను జాతీయం చేసింది. బ్యాంకులు పారిశ్రామిక వేత్తలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని, రైతులకు రుణసౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారనీ, బ్యాంకులు పేదలకు, సన్నకారు రైతులకు సులభతరంగా రుణసౌకర్యాలు కల్పించడం అవసరమనీ, బ్యాంకుల జాతీయకరణ అందుకోసమేమని ప్రచారం చేశారు. అంటే గతంలో బ్యాంకులు, ప్రభుత్వ రుణ సంస్థలు పారిశ్రామిక వేత్తలకు, పెద్ద పెద్ద పెట్టుబడి దారులకు ఉపయోగపడ్డాయని ఒప్పుకోవటమే. గతంలో అనుసరించిన పారిశ్రామిక విధానాలలో (1948, 1958) పరిశ్రమల్లో గుత్తాధి పత్యం ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. కాని 1963లో వజారి కమిటీ నివేదిక ప్రకారం ప్రైవేటు పెట్టుబడి దారులు పరిశ్రమలపై గుత్తాధిపత్యం సాధించారనీ, 75 పారిశ్రామిక కుటుంబాలు దేశంలోని పారిశ్రామిక రంగాన్ని శాసిస్తున్నాయని తెలుస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి వ్యాపార గుత్తాధిపత్య నియంత్రణ చట్టంను 1970లో తీసుకునివచ్చారు. దీన్ని ఎం.ఆర్.టి.పి చట్టం అంటారు. నూతన పారిశ్రామిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ చట్టాన్ని పూర్తిగా సవరించి పెట్టుబడులపై పరిమితిని తొలగించారు. గతంలో 20కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ప్రభుత్వ అనుమతి పొందవలసిన అవసరం కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉండేది. (రాజీవ్ గాంధీ ఈ పరిమితిని 100 కోట్లకు పెంచారు. తరువాత 500 కోట్లకు పెంచాలని డిమాండు చేశారు.)
         Indira Gandhi, then prime minister
       పేదరికం నిర్మూలించడానికి, నిరుద్యోగం తొలగించడానికి వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఈ చర్యలన్నీ దేశంలో ఏర్పడిన సంక్షోభాన్ని ప్రజల ఆందోళనలను నిరోధించడానికి అవలంబించినవే. భూసంస్కరణలు అమలు చేయక పోవడం వలన గ్రామీణ పేదలు అనంతృప్తి కి గురై రైతాంగ పోరాటాలు ముందుకు వచ్చాయి. పారిశ్రామిక రంగంలో సంక్షోభం ఏర్పడి కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేపట్టారు. 1974లో దేశవ్యాపితంగా రైల్వే కార్మికులు సమ్మె చేశారు. 1980లో బొంబాయి జౌళి మిల్లు కార్మికులు దాదాపు 2 సం||ల కాలంపాటు సమ్మె  చేశారు. ఈ అలజడులు, ఆందోళనలు దేశాభివృద్ధిని కుంటుపరుస్తాయని, శాంతి భద్రతలు క్షీణించి పోయాయని, 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాజకీయ అసమ్మతిని, ప్రజల ఆందోళనలను అణిచివేయడం జరిగింది. పేదరికం తొలగించడానికి, దేశ ప్రగతి సాధించడానికి అత్యవసర పరిస్థితి అవసరమని చాలా మంది సమర్థించారు. అభివృద్ధి జరగాలన్నా, ప్రజలు బుద్ధిగా పనిచేయాలన్నా నిరంకుశ ప్రభుత్వం అవసరమని మధ్యతరగతి ప్రజలు కోరుకోవడం మనకు తెలిసిందే. అభివృద్ధికి హక్కులు ఆటంకమనే ఆలోచన బలపడింది. అభివృద్ధి ప్రజల సామాజిక ఆర్థిక సంబంధాల్లో స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, సమానత్వాన్ని తీసుకు రావాలి. స్వేచ్ఛ సమానత్వం, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్య హక్కులు అభివృద్ధికి ఆటంకమని భావించడం లేదా ఆలోచించడం అప్రజాస్వామికం. దాంంతో ఇందిరాగాంధీ అత్యవసర పాలనకు, నిరంకుశ పోకడలకు దేశంలోని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య శక్తులు ఆందోళన చేసి ఆమెను అధికారం నుండి తొలగించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?