మోడీ సర్కారు..ప్రభుత్వ రంగం
మోడీ సర్కారు..ప్రభుత్వ రంగం
🖍️భారతదేశం లోని ప్రభుత్వ రంగాన్ని తమకు ఇష్టులైన కార్పొరేట్ సంస్థలకు, విదేశీ బహుళజాతి సంస్థలకు అప్పజెప్పాలన్న అభిమతాన్ని మోడీ ప్రభుత్వం ఎక్కడా దాచిపెట్టుకోవడంలేదు. ఏ ఆర్థిక సూత్రాలకు అనుగుణంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నదీ ప్రభుత్వం వెల్లడి చేయలేదు. ప్రభుత్వ వ్యయానికి కావలసిన ఆర్థిక వనరులను సమీకరించుకోడానికే ఈ విధంగా చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ఈ ప్రభుత్వానికి ఆర్థిక పరిజ్ఞానం ఏమాత్రమూ లేదని సూచిస్తోంది. దానితోబాటు కార్పొరేట్ సంస్థల కోసం ఈ ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నదని విదితమౌతోంది.
🖍️వలస పాలన నుండి విముక్తి కోసం జరిగిన పోరాటం పర్యవసానంగా ప్రభుత్వ రంగం వచ్చింది. వలస పాలన అంటే ఒక విదేశీ శక్తి మన దేశంమీద రాజకీయ అధికారం చెలాయించడం మాత్రమే అని అనుకోరాదు. మన దేశ సహజ సంపద మీద విదేశీ పెట్టుబడి ఆధిపత్యం చెలాయించడం కూడా. అందుచేత వలస పాలకుల ఆధిపత్యం నుండి విముక్తి పొందడం అంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం పొందడం మాత్రమే కాదు. విదేశీ పెట్టుబడి చేతుల్లో ఉన్న మన దేశ సంపదను మన దేశ ప్రజలందరి తరఫున స్వాధీనం చేసుకోవడం కూడా. ప్రభుత్వ రంగం మన దేశ ప్రజలందరికీ ఉమ్మడి ప్రతినిధిగా వ్యవహరించేందుకే ఏర్పడింది. ఈ బాధ్యతను ఇంకెవరూ నిర్వహించలేరు.
🖍️అదే విధంగా సామ్రాజ్యవాద పెట్టుబడి గుప్పెట్లో ఇరుక్కుపోయిన మన దేశ ఆర్థిక వ్యవస్థను దాని నుండి విడిపించుకుని...ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించుకోవాలంటే మన ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం నెరపదగినది ప్రభుత్వ రంగం మాత్రమే. సామ్రాజ్యవాద పెట్టుబడి స్థానంలోకి రాగలిగిన శక్తి భారతదేశ ప్రైవేటు రంగానికి ఎంతమాత్రమూ లేదన్నది స్పష్టం. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అరువు తెచ్చుకుని ఆ విదేశీ కంపెనీలతో కలిసి జాయింట్ వెంచర్లు నడిపి తన వరకూ ఎంతో కొంత లాభం పొందగలిగిన సామర్ధ్యం మాత్రమే మన ప్రైవేటు రంగానికి ఉండేది. అంతే తప్ప ఆ విదేశీ పెట్టుబడి ఆధిపత్యాన్ని మొత్తంగా తొలగించి ఆ స్థానంలోకి రాగలిగిన శక్తి మన ప్రైవేటు రంగానికి లేదు. పార్లమెంVటు పర్యవేక్షణకు లోబడి వ్యవహరించే ప్రభుత్వ రంగం మాత్రమే దేశ ప్రజలందరి ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించగలదు.
🖍️బ్యాంకులను జాతీయం చేసిన అనంతరం అవి నిర్వహించిన పాత్రను పరిశీలిస్తే ఈ విషయం బాగా బోధపడుతుంది. జాతీయం చేయకమునుపు ప్రైవేటు బ్యాంకులుగా అవి తమ యజమానులుగా ఉన్న కార్పొరేట్ సంస్థలకు అవసరమైన ఆర్థిక వనరులను పోగేసే సాధనాలుగా మాత్రమే వ్యవహరించాయి. జాతీయం చేయబడ్డాక అవి చాలా పెద్దఎత్తున డిపాజిట్లను సమీకరించాయి. చాలా ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న ఉత్పత్తిదారులకు, రైతాంగానికి రుణాలను అందించగలిగాయి. అటువంటి సౌకర్యం అంతవరకూ వారికి ప్రైవేటు బ్యాంకుల నుంచి లభించలేదు. ఇంత విస్తృత స్థాయిలో రైతులకు వ్యక్తిగత రుణాలు గాని, చిన్న ఉత్పత్తిదారులకు రుణాలు కాని పంపిణీ చేయగలిగిన ఆర్థిక నెట్‌వర్క్ ప్రపంచంలో ఏ ఇతర దేశంలోనూ లేదు. ఈ నెట్‌వర్క్ ఏర్పడినందువల్లనే హరిత విప్లవం ఈ దేశంలో సాధ్యమైంది. ఏదో ఒక మేరకు ఆహార భద్రత కల్పించబడింది.
🖍️ఈ విషయం అందరికీ బాగా తెలిసినదే. కాని బిజెపి కి అర్ధం కావడం కోసం మరొకసారి చెప్పాల్సి వస్తున్నది. ఎందుకంటే, ఈ బిజెపి స్వాతంత్య్ర పోరాటంలో ఎన్నడూ పాల్గొన్నది లేదు. ఆహార భద్రత ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో ఆ పార్టీకి అర్ధమైందీ లేదు (ఆహార సామ్రాజ్యవాదానికి మన దేశం తలుపులను బార్లా తెరిచే వ్యవసాయ చట్టాలను చేయడాన్ని బట్టే ఈ సంగతి స్పష్టమైపోతోంది). మోడీ ప్రభుత్వం రాక మునుపే, చాలా కాలం నుంచీ ప్రభుత్వ రంగాన్ని దెబ్బ తీసే నయా ఉదారవాద విధానాల అమలు ఈ దేశంలో మొదలైంది. ప్రైవేటు రంగం ఆర్జించిన రీతిలో ప్రభుత్వ రంగం లాభాలు ఆర్జించడంలేదు కనుక ప్రభుత్వ రంగం అసమర్ధమైనది అన్న వాదనతో ఈ దాడికి రంగం సిద్ధం అయింది. ప్రభుత్వ రంగం ఆవశ్యకత ఏమిటో మౌలికంగానే అవగాహన లేకపోవడం నుంచే ఈ వాదన తలెత్తింది (దానర్ధం ప్రభుత్వ రంగం తప్పనిసరిగా నష్టాలలోనే కొనసాగాలని మాత్రం కాదు).
🖍️ప్రభుత్వ రంగం వాటాలను అమ్మడం ద్వారా సమకూరే సొమ్ము ప్రభుత్వ వ్యయానికి వినియోగించవచ్చునని, తద్వారా ద్రవ్యలోటు పెరగకుండానే ప్రభుత్వ వ్యయాన్ని పెంచవచ్చునని వాదించే వారున్నారు. ఈ వాదననే మోడీ ప్రభుత్వం కూడా ముందుకు తెస్తోంది. అందుకే ద్రవ్యలోటును అదుపు చేయడానికి పెద్ద స్థాయిలో ప్రభుత్వ రంగ వాటాలను అమ్మకానికి పెట్టింది. అయితే ఈ వాదన పూర్తిగా అర్ధరహితం. ఒక ఉదాహరణ ద్వారా దీనిని వివరించవచ్చు. ప్రభుత్వం బ్యాంకుల నుండి రూ. 100 రుణం తీసుకుని దానిని ఖర్చు చేసిందనుకుందాం. దాని పర్యవసానంగా మొత్తంగా డిమాండ్ పెరుగుతుంది. ఆ మేరకు ఉత్పత్తి పెరుగుతుంది. ఆదాయమూ పెరుగుతుంది (సులభంగా విషయాన్ని అర్ధం చేసుకోవడం కోసం విదేశీ లావాదేవీలను కాస్సేపు పక్కన పెడదాం). ఈ క్రమం కొనసాగి మొత్తంగా ప్రైవేటు పెట్టుబడి (ఈ కాలంలో ప్రైవేటు పెట్టుబడిలో ఎటువంటి మార్పూ ఉండదని అనుకుంటే) కన్నా అదనంగా ప్రైవేటు రంగం సాధించిన మిగులు రూ.100 కు చేరుతుంది. ఈ మిగులు బ్యాంకులకు చేరుతుంది. ప్రభుత్వం తొలుత తాను చేసిన రూ.100 వ్యయాన్ని ఫైనాన్సు చేయడానికి బాండ్లను అమ్మి బ్యాంకుల నుండి ఆ రూ.100 సేకరించవచ్చు. ఇది ఒక క్రమం. అయితే ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఇదే రూ.100 వ్యయం చేయడానికి ప్రభుత్వ రంగ వాటాలను అమ్మి సొమ్ము సమీకరిస్తోంది.
🖍️రెండు పద్ధతులకూ మధ్య తేడా ఏమిటి? మొదటి పద్ధతిలో ప్రభుత్వ బాండ్లను అమ్ముతోంది. రెండో పద్ధతిలో ప్రభుత్వ రంగ వాటాలను అమ్ముతోంది. మొదటి పద్ధతిలో ప్రైవేటు రంగానికి దక్కేది బాండ్లు. రెండో పద్ధతిలో దక్కేది ప్రభుత్వ రంగ వాటాలు. కాని రెండో పద్ధతి ద్వారా ప్రభుత్వం అదనంగా ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానికి గల కీలక స్థానాన్ని విదేశీ, స్వదేశీ ప్రైవేటు కంపెనీలకు కట్టబెడుతున్నది.
🖍️ప్రభుత్వం బ్యాంకుల నుండి రుణం తీసుకుని ఖర్చు చేస్తే ఐఎంఎఫ్ కి, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి అభ్యంతరం ఉంటుంది. అదే ప్రభుత్వ రంగ వాటాలనమ్మి ఖర్చు చేస్తే అభ్యంతరం ఉండదు. ఏ విధంగా చేసినా ప్రభుత్వ వ్యయం పెరిగినట్టే కదా? ఏవిధంగా ఖర్చు పెంచినా అభ్యంతరం పెట్టాలి కదా? కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి ప్రభుత్వ రంగ వాటాలను అమ్మి అదనపు ఖర్చు చేస్తే అభ్యంతరం ఉండదు. అంటే ఆర్థిక సూత్రాల ప్రాతిపదికపైన గాక తమ స్వప్రయోజనాల రీత్యా ఐఎంఎఫ్, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వ్యవహరిస్తున్నాయని మనం గ్రహించాలి. వాళ్ళ ఆధిపత్యానికి, దోపిడీకి ప్రధాన ఆటంకంగా ఉన్న ప్రభుత్వ రంగాన్ని అంతం చేయడమే లక్ష్యం. ఇప్పటికే నయా ఉదారవాద విధానాల ఫలితంగా ప్రభుత్వ రంగం దాదాపు నిర్వీర్యం అయిపోయింది. కాని అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి తృప్తి లేదు. ప్రభుత్వ రంగం పూర్తిగా లేకుండా పోవాలని అది కోరుకుంటున్నది.
🖍️ప్రభుత్వ రంగ వాటాలను అమ్మి వనరులను అదనంగా సేకరించడమే మెరుగైన పద్ధతి అని ప్రభుత్వ అధికార ప్రతినిధులు చిత్రీకరించే తాపత్రయంలో ఉన్నారు. ఈ వాదనలో ఏమాత్రం పస లేదు. బాండ్లు విక్రయిస్తే వాటి మీద వడ్డీ ప్రభుత్వం కట్టాలి. అదే ప్రభుత్వ రంగ వాటాలను విక్రయిస్తే, ఆ ప్రభుత్వ రంగం నుండి డివిడెండ్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అటు బాండ్ల మీద కట్టాల్సిన వడ్డీ ఎంత ఉంటుందో, ఇటు ప్రభుత్వ రంగ వాటాల అమ్మకం వలన కోల్పోయే డివిడెండ్ల మొత్తం కూడా అంతే ఉంటుంది. అందుచేత అదనపు ఆదాయ వనరుల సమీకరణ కోసం ప్రభుత్వ రంగ వాటాలను విక్రయించడం ఏవిధంగా చూసినా మెరుగైన ప్రత్యామ్నాయం కాజాలదు.
🖍️అప్పులు చేసి ప్రభుత్వం వ్యయాన్ని పెంచితే తలెత్తే సమస్య ఏమిటి? అలా పెంచిన వ్యయం అంతిమంగా ప్రైవేటు చేతుల్లో మిగులు రూపంలో పోగుబడుతుంది. ప్రైవేటు వ్యక్తుల, సంస్థల దగ్గర అదనంగా మరింత సంపద పోగుబడుతుంది. అదనంగా పోగుపడే ఆ సంపదను ప్రభుత్వం గనుక పన్నుల రూపంలో తిరిగి వసూలు చేస్తే ఇటు ప్రభుత్వం అప్పూ తీరిపోతుంది. అటు ప్రైవేటు వ్యక్తుల, సంస్థల వద్ద నుండే సంపదలో తగ్గిపోయేదేమీ ఉండదు. ఇంతకుముందు ఉన్న సంపద అదే రీతిగా కొనసాగుతుంది. కాని ప్రభుత్వం సంపన్నుల మీద అదనంగా పన్ను వేయడానికి సిద్ధంగా లేదు. అందుచేత ప్రభుత్వం వ్యయం పెరిగితే అదనంగా ప్రైవేటు వ్యక్తుల, సంస్థల దగ్గర సంపద పెరిగిపోతుంది. సమాజంలో సంపద అసమానతలు ఇంకా పెరుగుతాయి.
🖍️అప్పు చేసి ప్రభుత్వ వ్యయాన్ని పెంచే బదులు ప్రభుత్వ రంగ వాటాలను అమ్మినా జరిగేది అంతిమంగా అదే. వారి దగ్గర ప్రభుత్వ రంగ సంస్థల వాటాల రూపంలో అదనంగా సంపద పోగుబడుతుంది. నిజానికి ఆ ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను కారు చౌకగా అమ్ముతారు గనుక చాలా ఎక్కువ సంపద ప్రైవేటు చేతుల్లో పోగుబడుతుంది. అప్పుడూ సమాజం లోని అసమానతలు మరింత తీవ్రంగా పెరుగుతాయి.
🖍️ఇప్పటికే సంపద అసమానతలు తీవ్రంగా ఉన్న మనవంటి మూడో ప్రపంచ దేశంలో ఆ అసమానతలను తగ్గించే బదులు మరింత పెంచే దిశగా ప్రభుత్వ రంగ వాటాలను అమ్మకానికి పెట్టబూనుకోవడం సిగ్గుచేటు. ఆ సంపన్నుల మీద సంపద పన్ను వేసి తద్వారా ప్రభుత్వ వ్యయానికి కావలసిన అదనపు వనరులను సమీకరించి వుంటే అసమానతలు తగ్గివుండేవి.
🖍️ఈ పని చేసే ధైర్యం బిజెపి ప్రభుత్వానికి లేకపోయినప్పుడు కనీసం సంపన్నులు వినియోగించే విలాస వస్తువులపై జిఎస్‌టి అయినా అధికంగా వసూలు చేయడానికి పూనుకోవాలి. ఆ విధంగా చేసినా, ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరి వుండేది. పెరిగిన ప్రభుత్వ వ్యయంతో సంపన్నుల దగ్గర అదనంగా పోగుబడవలసిన సంపద కాస్తా ఈ అదనపు పన్ను రూపంలో వెనక్కి వచ్చేది. కాస్తంతైనా అసమానతలు తగ్గేవి.
🖍️దేశం మొత్తం సువిశాల ప్రయోజనాల రీత్యా చూసినా, ఆర్థిక సూత్రాల ప్రకారం చూసినా, ప్రభుత్వ రంగ వాటాలను అమ్మకానికి పెట్టడం ద్వారా మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే తీవ్ర తప్పిదం చేస్తోందని చెప్పాలి.
ప్రభాత్ పట్నాయక్
(స్వేచ్ఛానుసరణ)
ప్రజాశక్తి దినపత్రిక 31.3.2021 నుండి సేకరణ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి