స్వామినాథన్ కమిటీ సిఫారసులు
దేశంలో మెజారిటీ ప్రజలు జీవనోపాధి కోసం సాగుపై ఆధారపడుతున్నప్పటికీ జాతీయాదాయంలో వ్యవసాయ వాటా తగ్గుతున్నది. అమెరికాలో కేవలం రెండు శాతం మంది మాత్రమే వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ లెక్కన భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడినవారు అల్పాదా యాలపై జీవిస్తున్నారని రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్వామినాథన్ ఎవరు..?
ప్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్‌ను హరితక్రాంతికి మార్గదర్శకుడిగా రైతులు కొలుస్తారు. తమిళనాడుకు చెందిన ఆయన స్వతహాగా జన్యుశాస్త్రవేత్త. 1966లో మెక్సికోకు చెందిన విత్తనాన్ని పంజాబ్‌కు తెచ్చి దేశీయ రకాలుగా మార్చారు. అత్యధికంగా గోధుమ పండే విత్తనాన్ని సృష్టించారు.
అప్పటి యూపీఏ సర్కారు రైతుల స్థితిగతు లపై ఆరా తీయటానికి వెళ్లినప్పుడు స్వామినాథన్ గురించి తెలుసుకున్నది. అన్నదాతకు అండగా నిలిచేలా 2004 నవంబర్ 18న స్వామినాథన్ కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్ పలు సిఫారసులు చేస్తూ ఐదు రిపోర్టులను కేంద్రానికి సమర్పించింది. ఉత్పాదక వ్యయానికి అదనంగా 50 శాతం జోడించి కనీస మద్దతు ధర ప్రకటించాలని సూచించింది. ప్రధానం గా..మార్కెట్‌లో వినియోగదారునికి లభ్యమయ్యే ధరకు రైతులకు గిట్టుబాటు అయ్యే రేటుకు మధ్య వ్యత్యాసం ఎక్కు వగా ఉంటున్నది.
ఒక ఉత్పత్తి పంట పొలం నుంచి వినియోగ దారునికి చేరే క్రమంలో ఐదు దశల్లో ధర జోడిస్తారు. ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, రవాణా వంటి దశలుంటే.. ఇందులో కొంత మాత్రమే రైతుకు లాభం చేకూరుతున్నది. అందువల్ల దళారుల జోక్యం అధికంగా ఉన్నదని కమిటీ గుర్తించింది. దేశం మొత్తం మీద సగటు సాగు ఖర్చుని పరిగణనలోకి తీసుకుని మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. కానీ సాగుఖర్చు ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుంది. వీటితో పాటు వ్యవసాయ ధరలు, వ్యయాల కమిషన్ పరిగణనలోకి తీసుకునే ప్రాతిపదిక ధరలు తాజాగా ఉండాలని కూడా అభిప్రాయపడింది. బంజరు, బీడు భూములను పేదలకు పంచాలని, ఆదివాసీలకు పశువులను పెంచటానికి అవసరమైన విధంగా భూములు వాడుకునే అవకాశం కూడా కల్పించాలని ప్రతిపాదించింది.
పండించిన పంటకు సరైన ధర రాక.. అన్నదాత ఆత్మహత్యలు చేసుకుంటున్న తీరుపై కమిటీ ప్రత్యేకంగా సూచనలిచ్చింది. రాష్ట్రాల స్థాయిల్లో రైతు కమిషన్, పట్టడన్నెం పెట్టే రైతన్న ఆరోగ్యం బాగున్నప్పుడు సేద్యం బాగుంటుంది. అందువల్ల అతనికి ఆరోగ్యపరమైన బీమా సదుపాయం కూడా కల్పించాలని ప్రతిపాదించింది.
వ్యవసాయోత్పత్తులకు మంచిధర లభించటానికి కమిటీ సిఫారసులు ఇవే..
1. ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50 శాతం లాభం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలి.
2. కనీస మద్దతు ధర నిర్ణయానికి ప్రాతిపదికగా తాజా గణాంకాలే తీసుకోవాలి. దీనివల్ల వాస్తవిక వ్యయాల ఆధారంగా మద్దతు ధర నిర్ణయించడానికి ఆస్కారం కలుగుతుంది.
3. సాగు వ్యయం వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాల రైతులు లబ్దిపొందితే.. మరికొ న్ని రాష్ట్రాల రైతులు నష్టపోతున్నారు. అందువల్ల రాష్ట్రాల వారీగా మద్దతు ధరలు ప్రకటించాలి. లేని పక్షంలో సంబంధిత రాష్ట్రాలు బోనస్ ప్రకటించడం ద్వారా రైతులకు అండగా నిలవాలి.
4. మద్దతు ధర నిర్ణయంలో రైతు ప్రతినిధులకు భాగస్వామ్యం కల్పించాలి. క్షేత్ర పరిస్థితులపై అవగాహన ఉన్న ప్రతినిధులకు బదులు.. మద్దతు ధర నిర్ణయంలో వాస్తవిక పరిస్థితులను వివరించలేని వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులపై ఆధారపడటం సబబు కాదు.
5. కనీస మద్దతు ధరల గురించి రైతులకు ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారం తెలియజేయాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి