సమానత్వం, సాంఘిక న్యాయం
*సమానత్వం, సాంఘిక న్యాయం*
దేశంలో అధిక సంఖ్యాకులైన దళితులు ఈ 21వ శతాబ్దం ఆరంభంలో కూడా అవమానాలకు, అణిచివేతలకు బలి అవుతూనే ఉన్నారు. 'స్వేచ్ఛ' అనేది వారికి నేటికీ అంద నంత దూరంలోనే ఉంది. షెడ్యూల్డు కులాలవారు ఎదుర్కొంటున్న వివక్ష కేవలం పేదరికం వల్ల వచ్చింది కాదు. మిగతా పేదలు అనుభవించే వివక్షకు, వారు అనుభవించే వివక్ష చాలా భిన్నంగా ఉంది. కులసమాజం కబంధహస్తాల్లో చిక్కుకొన్న వారు 'అంటరానితనం' అనే దుర్భర దురన్యాయానికి గురవుతున్నారు. దేశంలోని మిగతా పేద వర్గాల్లాగే అన్ని రకాల పీడనలనూ అనుభవిస్తూ అదనంగా కులపరమైన పీడనను కూడా ఎదుర్కొంటున్నందున వీరిని ప్రత్యేక విభాగంగా గుర్తించకతప్పదు. నేటికీ షెడ్యూల్డు కులాల్లో నిరక్షరాస్యత భారీగా ఉండటాన్ని బట్టి చూస్తే- కొన్ని వేల సంవత్సరాలుగా వీరిని విద్యకు ఎంత దూరంగా ఉంచారో అర్థం చేస్కోవచ్చు. దీని ప్రభావం సమకాలీన, భవిష్య సమాజంపై బలంగా ఉంటుంది. ఆస్తిపాస్తులు, సామాజికహోదా, విద్య, ఆరోగ్యం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా వారు సమాజంలో అట్టడుగునే ఉన్నారు. చివరికి జీవన ప్రమాణాల విషయంలో కూడా వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. మన దేశం గురించి ఏ కొంచెం తెలిసిన వాళ్ళకైనా-గ్రామాల్లో షెడ్యూల్డు కులాలవారి ఇళ్ళను ఊరి వెలుపలకు నెట్టివేసిన వాస్తవం తెలియకుండా ఉండదు.
మన దేశంలో నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ప్రభావం వ్యవసాయ రంగంపై బలంగా ఉంది. ఏదో కొన్ని ప్రాంతాల్లో తప్పించి, దేశంలో ఎక్కడ చూసినా వ్యవసాయ రంగం కుల వ్వవస్థతో బలంగా ముడిపడి ఉంది. భూములు ఎక్కువగా పైకులాలకు చెందిన వారివద్దే ఉండటం గమనార్హం. బడా భూస్వాములంతా 'ఉన్నత కులాలవారే కాగా మధ్యకులాలకు చెందినవారు ఎక్కువగా మోతుబరీ, సన్నకారు రైతులుగా ఉన్నారు. అట్టడుగున షెడ్యూల్డు కులాలు, తెగలవారు, బలహీన వర్గాల వారు వ్యవసాయ కూలీలు'గా కాలం గడుపుతున్నారు. ఇవాల్టికీ గజం భూమిలేని కూలీల్లో దళితులు, గ్రామీణ పేదలే ఎక్కువ. పంటభూమి లేక పోవటమే వీళ్లంతా ఎన్నాళ్ళైనా నిరుపేదలుగా మిగిలిపోతుండటానికి కారణం. పైగా సామాజికంగా కూడా వీళ్ళ పరిస్థితి బలహీనంగా ఉండటంతో భూమిలేని ఈ పేదలు ఇతరుల భూముల్లో తమ శ్రమ శక్తిని ధారపోస్తూనే ఉండాల్సి వస్తోంది. వ్యవసాయరంగంలో ఈ తారతమ్యాలకు భూములు కొన్ని వర్గాలవారి గుప్పెట్లోనే ఉండిపోవటం ప్రధాన కారణం. కులాల మధ్య స్పష్టమైన విభజనలు స్థిరీకరింపబడటానికి కూడా ఇది దోహదం చేస్తోంది. కాబట్టి ఎటువంటి సంస్కరణలు చేపట్టినా భూముల నియంత్రణ వ్యవహారాన్ని పట్టించు కోకపోతే ఆ సంస్కరణలు సాధించేది చాలా తక్కువ. కంటితుడుపు ఫలితాలు తప్పించి సమూలమైన మార్పు సాధ్యపడదు. దళితుల్లో ఎవరన్నా కొద్దిమంది పైకిఎదిగారంటే వాళ్ళు కొద్దోగొప్పో భూమి సంపాదించుకున్న తర్వాతే అది సాధ్యపడిందని ఎంతోమంది పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. వారి ఎదుగుదలలో భూమి పాత్ర కీలకం.
భూసంస్కరణల వల్ల ఆదాయం పెరగటం, కూలీలు, వారి పిల్లల జీవన ప్రమాణాలు పెరగటం వంటి తక్షణ ఫలితాలే కాకుండా దీర్ఘకాలికంగా కూడా పరాధీనత తగ్గుతుంది. దోపిడీకి గురవుతున్న ప్రజల సంఖ్యా తుగ్గుతుంది. సొంత ఇంటికోసం చిన్నస్థలం, పండించుకు తినటానికి కొద్దిపాటి భూమి ఉంటే - అవి ఎంత చిన్నవైనా-దళితుల విముక్తికి, స్వేచ్ఛకు ఎంతో ఉపకరిస్తాయి. పరాధీనతను తగ్గించి సొంతకాళ్ళమీద నిలబడేలా విశ్వాసాన్ని ఇస్తాయి. గ్రామాల్లోని పేదలకైతే కొద్దిపాటి భూమిఉంటే సామాజికహోదా కూడా పెరుగుతుంది. అక్కడ సమానత్వం అంటే భూమిపై సమాన యాజమాన్య హక్కులు కలిగి ఉండటం అవుతుంది. కాబట్టి భూమిని బదిలీ చేయడటం, పంపిణీ చెయ్యటం అంటే కొంత అధికారాన్ని బదిలీ చేసినట్టని మనం గుర్తించాలి. భూములు పంపిణీవల్ల అధికారం, ఆస్తి, హోదా, స్థాయి ఒక సమూహంనుంచి మరో సమూహానికి బదిలీ అవుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భూములు పంపిణీ వల్ల గ్రామీణ వ్యవస్థలోని పేదలను అభ్యున్నతి, అభివృద్ధి పథంవైపు మరల్చినట్టవుతుంది.
బాబాసాహెబ్ అంబేద్కర్ - దేశంలోని భూమి మొత్తాన్ని జాతీయంచేసి, ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలను నడపాలని కాంక్షించారు. వ్యవసాయాన్ని ఒక ప్రభుత్వ పరిశ్రమగా తీర్చిదిద్దాలని, దానిలో భాగంగా భూములను వ్యవసాయ క్షేత్రాలుగా విభజించి, వాటిని సాగు చేసే సామూహిక బాధ్యతను గ్రామీణ బృందాలకు అప్పగించాలని ఆయన అభిప్రాయ పడ్డారు. కుల వివక్షలు, జాతి వివక్షలు లేకుండా ఆ గ్రామీణ బృందాల్లో అందరూ ఉంటారని ఆయన నిర్వచించారు. అలా ఏర్పడిన వ్వవస్థలో ఇంక భూస్వాములు, కౌలుదార్లు, కూలీలనే తారతమ్యాలకు తావుండదు. దేశంలో కూలీలుగా బతుకుతున్న కోట్లాది మంది 'అంటరాని' ప్రజల సమస్యకు ఈ ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాల ఏర్పాటు ఒక్కటే ఉత్తమ పరిష్కారమని ఆయన భావించారు. అయితే దీన్నంతటినీ ప్రభుత్వ విధానంగా నిర్దేశిస్తూ రాజ్యాంగంలో పొందుపరచలేక పోయినప్పటికీ ఈ స్ఫూర్తికి ఆయన రాజ్యాంగంలో ప్రముఖ స్థానం ఇచ్చారు. 39 వ అధికరణంలో ప్రభుత్వం భూసంస్కరణలకు కట్టుబడి ఉంటుందన్న విస్పష్ట హామీ. మాత్రం చేర్చగలిగారు. రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో భాగంగా ఉన్న ఈ అధికరణం-జాతి వనరుల నియంత్రణ, యాజమాన్యం అందరికీ అందుబాటులోకి వచ్చేటట్లుగా చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని, ప్రభుత్వ విధానాలు ఈ లక్ష్యసాధన దిశగా ఉండాలని, ఆర్థిక విధానాల నిర్వహణ కూడా సంపద అంతా కొద్దిమంది చేతుల్లో ఉండేలా కాకుండా జాతి సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం వినియోగమయ్యేలా చూడాలని స్పష్టంచేస్తోంది. 38 వ అధికరణం-హోదాలు, స్థాయిలు, అవకాశాల విషయంలో ఎటువంటి అసమానతలూ లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ఆదాయాల్లో అంతరాలను సాధ్యమైనంత తగ్గించి వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తోంది.
స్వతంత్రం వచ్చిన కొత్తల్లోను, ఆ తర్వాత 60 ల్లోను, 70 ల్లో కూడా 'భూసంస్కరణలకు' అన్ని వర్గాల నుండి మద్దతు, ఆదరణ ఎక్కువగా ఉండేది. ఈ సంస్కరణలవల్ల దేశంలో సమానత్వం, జాతీయ సామర్థ్యం పెరుగుతాయన్న విశ్వాసం ఎక్కువగా ఉండేది. చివరికి 80 ల్లోను, దరిదాపుగా 90 ల వరకు కూడా భూసంస్కరణలనేది ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల ప్రధాన ఎజెండాలో ప్రముఖంగా ఉండేది. విధాన రూపకల్పన సమయంలో ఆ ప్రస్తావన తరచుగా వినబడుతుండేది. కానీ ఇవాళ పరిస్థితి పూర్తిగా తారుమారుగా ఉంది. ఒకప్పుడు సామాజిక పరివర్తనకు, అభివృద్ధికి అత్యంత కీలకమని భావించిన భూసంస్కరణల అంశం ఇవాళ సామాజిక, రాజకీయ రంగాల్లో అదొక అంశంగానే కనిపించటంలేదు. ఆ ఊసుకూడా పెద్దగా వినిపించటంలేదు. ఇందుకు సోషలిజానికి ఎదురుగాలులు ఎక్కువవటం, ప్రపంచీకరణ రాజ్యమేలుతుండటమే ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇవాళ భూసంస్క రణల మాట ఎవరన్నా ఎత్తినా ఏదో నామమాత్రంగానే ప్రస్తావిస్తున్నారు గానీ చిత్తశుద్ధితో దాని అమలును కాంక్షించి మాత్రం కాదు. ఇవాళ మేధావి వర్గానికి అది రోమాంచకమైన సిద్ధాంతం. రాజకీయ నాయకులకు జనం ముందు వల్లించే ఓ ఊకదంపుడు నినాదం. భూమిలేని పేదలకు మాత్రం తీరని కల, వీడని ఆశ.
(‘ప్రపంచీకరణ’ భారతదేశంలో సమానత్వం, సాంఘిక న్యాయం నుండి)(29.9.2000)
(EQUALITY AND SOCIAL JUSTICE IN A GLOBALISING INDIA)
__ ఎస్ ఆర్ శంకరన్ ఐఎఎస్ ( రిటైర్డు)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి