కార్మికులంటే పరిశ్రమల్లో పని చేసే వారేనా?
కార్మికులంటే పరిశ్రమల్లో పని చేసే వారేనా?
__ ఎస్ ఆర్ శంకరన్ ఐఎఎస్ ( రిటైర్డు)
భారతదేశంలో విధానపరమైన చర్చల్లో ఎప్పుడూ కూడా 'కార్మికుడు' అంటే పరిశ్రమల్లో పని చేసే 'పారిశ్రామిక కార్మికుడు' అనే ఉద్దేశంలోనే మాట్లాడుతున్నారని జాన్ బ్రిమెన్ చాలా ముఖ్యమైన పరిశీలన చేశారు. కార్మికులంటే పరిశ్రమల్లో పని చేసే వారేనన్న అపోహ ప్రబలంగా ఉంది. కానీ ప్రపంచచరిత్రలో ఎప్పుడూ కూడా కార్మిక వర్గంలో గ్రామీణ, వ్యవసాయ కార్మికులే అధిక సంఖ్యలో ఉంటారు. వాళ్ళలో చాలా మంది దుర్భరమైన పరిస్థితుల్లో, రకరకాల అణచివేతలను ఎదుర్కొంటూ దయనీయంగా జీవితాలను నెట్టుకు వస్తున్నవారే. వీళ్ళు శ్రమకోర్చి ఎక్కువ సమయం కష్టపడతారు. చివరికి వారికి దక్కే ప్రతిఫలం చాలా తక్కువ సంపదను సృష్టించేది వారు. ఆర్థికరంగం నిలదొక్కుకుని, అభివృద్ధి పథంలో నడిచేలా చేసేది వారు. అయినా అభివృద్ధి ఫలాల్లో వారికి భాగం ఉండదు. వారు కష్టపడి సాధించిన పురోగతిలో న్యాయంగా వారికి దక్కాల్సిన వాటా వారికి దక్కటం లేదు. ఈ శ్రమ దోపిడీ, దుర్భర పరిస్థితుల వల్ల గ్రామీణ పేదలు పొట్ట చేత బట్టుకొని ఉపాధి కోసం పట్టణాలకు వలసపోతున్నారు. ఈ దృశ్యం ఎంతటి హృదయ విదారకంగా ఉంటుందో జాన్ బ్రిమెన్ మన కళ్ళ ముందు ఉంచే ప్రయత్నం చేశారు...
"పల్లెల నుంచి వలస వచ్చిన వాళ్ళు పట్టణాల్లో దినసరి కూలీలుగా రోజుల వెళ్ళబుచ్చుతున్న తీరును ఒక్కసారి తల్చుకోండి... రోజూ పొద్దున్నే వాళ్ళు మార్కెట్ కూడ Centres దగ్గర నిలబడి-తమ శ్రమనీ, శక్తినీ ఆ పూట ఎవరు కొనుకుంటా అన్నట్టు దీనంగా ఎదురుచూపులు చూస్తుంటారు. వాళ్ళలో కాస్త పనిముట్లు, నైపుణ్యం ఉన్నవారు కొంత ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో కనబడుతుంటారు. మిగతా వాళ్ళు ఈ రోజు గడుస్తుందా? లేదా? అన్నంత దైన్యంతో చూస్తుంటారు. చివరికి వాళ్ళంతా మార్కెట్ వస్తువులే. వాళ్ళ శ్రమ శక్తిపై బేరాలు జరుగుతాయి. ప్రాణంలేని వస్తువుల్లా వాళ్ళు అతికష్టం మీద బేరంలో అమ్ముడుపోయి...ఆ పూటకు పని చెయ్యాల్సిన చోటకు చేరుకుంటారు. ఇదంతా ఉత్పత్తి విధానాలను తల్లకిందులు చెయ్యటమే. కర్మాగారాల్లో ఉత్పత్తి పరిస్థితుల నుంచి మళ్ళీ అంతా ముక్కలు ముక్కలుగా విడిపోయి... కార్మికులు ఒక్కొక్కళ్ళూ మానవ కర్మాగారాలుగా తయారవు తున్న పరిస్థితి నెలకొంటోంది. ఫలితంగా కార్మిక విధానాలు, కార్మికుల పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతోంది..... పని చేస్తున్నంతకాలం వాళ్ళు పట్టుమని పదిరోజులపాటు ఒక చోట స్థిరంగా ఉండటానికి ఉండదు. పని చేసే సత్తువ ఉన్నంతకాలం వాళ్ళు దినసరివేతను వలస కార్మికులుగా కొనసాగాల్సిందే. పొలాల్లో పనిచేసే వ్యవసాయ కార్మికులు, గ్రామాల్లో ఇతరత్రా పనులు చేసేవారు చాలాసార్లు పొట్టచేతబట్టుకొని దేశదిమ్మరుల్లా పనులు వెతుక్కుంటూ ఊరూవాడా తిరుగుతుంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అంతా నెత్తిన మూటలు పెట్టుకునిపోతూ ఎక్కడ పని దొరికితే అక్కడే గుడిసెలు వేస్కుని కాలం గడుపుతుంటారు. పట్టణ శివార్లలో, మురికివాడల్లో ఎక్కడ ఖాళీస్థలం దొరికితే అక్కడే చేతికందిన వస్తువులు... విరిగిన చెక్కలు, ప్లాస్టిక్ ముక్కలు, పాత డబ్బారేకులు, చింకి పాతలు, చివరికి అట్టముక్కల తోనైనా సరే ఓ గుడిసె వేస్కుని అందులోనే తల దాచుకుంటారు".
గ్రామీణ ప్రాంతాల్లో భూముల్లేని పేద కూలీల స్థితిగతులను మెరుగుపరచేందుకు మన రాజ్యం (State) వీసమెత్తు కృషి కూడా చెయ్యటం లేదు. వాళ్ళను పూర్తిగా గాలికి వదిలేసింది. ఒకవేళ ఏమన్నా చేస్తున్నట్టు చూపిస్తున్నా అక్కడ జరుగుతున్నది మాత్రం శూన్యమే వని బ్రిమెన్ కూడా సరిగ్గానే నిర్ధారణకు వచ్చారు. వీళ్ళే కాదు... వ్యవసాయంలో కాకుండా ఇతరత్రా రంగాల్లో ఉన్న కూలీలు, పట్టణాల్లోని అసంఘటిత కూలీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఒక పక్క సరళీకరణ విధానాల పేరుతో ప్రభుత్వం తన సామాజిక బాధ్యతల నుంచి క్రమేపీ వైదొలుగుతుండటానికి తోడు కార్మికరంగంలో కూడా 'సంస్కరణలు' అమలు చెయ్యా లన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో కార్మికులను ఆయా రంగాల నుంచి బయటకు పంపించేందుకు ఉద్వాసన విధానాలు' (Exit Policies) సిద్ధమయ్యాయి. వాళ్ళకు ఉన్న ఆ కాస్త ఉద్యోగ భద్రతా కూడా లేకుండా చేసేందుకు రంగం సిద్ధమైంది. వీళ్ళ పరిస్థితే ఇలా ఉంటే ఇక అసంఘటిత రంగంలో వారి పరిస్థితి గురించి చెప్పుకోటానికి ఏముంటుంది? కార్మికసంఘాలు కూడా వారి జీవితాలను పెద్దగా మెరుగుదిద్దలేక పోతున్నాయి. ఈ విషయంలో బ్రిమెన్ పరిశీలన గుర్తు చేస్కోవటం అవసరం : "ప్రభుత్వరంగంలో భద్రత గల ఉద్యోగాల్లో ఉన్న ఉన్నత, మధ్యస్థాయి 'బ్లూ కాలర్' కార్మికులను సమైక్యపరచటం, అట్నుంచి బ్యాంకుల్లాంటి సంస్థల్లోని 'వైట్ కాలర్' ఉన్నతోద్యోగుల గురించి పట్టించుకోవటంలో తలమునకలుగా ఉన్న కార్మిక సంఘాల నాయకులకు అస్సలు ఏ కాలరూ లేని, చింకి పాతల అసంఘటిత కూలీలూ, కార్మికులూ ఎక్కడ కనిపిస్తారు?"
(‘ప్రపంచీకరణ’ భారతదేశంలో సమానత్వం, సాంఘిక న్యాయం నుండి) (29.9.2000)
(EQUALITY AND SOCIAL JUSTICE IN A GLOBALISING INDIA)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి