దిద్దుబాటు ఉద్యమం ఎందుకు?


దిద్దుబాటు ఉద్యమం
 వర్గసమాజంలో పాలకవర్గాలు రాజ్యవ్యవస్థను అదుపుచేస్తూ ఉంటాయి. వారి భావజాలం సమాజంపై ఆధిపత్యం కలిగి ఉంటుంది. అలాంటి సమాజంలో కమ్యూనిస్టుపార్టీలోకి అన్యవర్గ భావజాలం ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంటుంది. పార్టీ సిద్ధాంతాన్ని, స్వభావాన్ని నీరుగార్చడం ద్వారా పాలక వర్గాలు కమ్యూనిస్టుపార్టీని బలహీనపరిచేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తాయి. అందుచేత కమ్యూనిస్టుపార్టీ అలాంటి ప్రభావాలను, చొరబాటును నిరంతరం ప్రతిఘటిస్తూ ఉండాలి. పార్టీ తన విప్లవ స్వభావాన్ని కాపాడుకోవాలంటే దిద్దుబాటును నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి తప్ప, ఏదో ఒక్కసారి కార్యక్రమంలా ముగించకూడదు. పొరపాటు ధోరణులను, బలహీనతలను తొలగించుకొని, పార్టీని మరింత సమైక్యం చేయడం, బలోపేతం చేయడం దిద్దుబాటు ఉద్యమ లక్ష్యంగా ఉంటుంది.

 పార్టీలోని పొరపాటు ధోరణులకు వ్యతిరేకంగా దిద్దుబాటు ఉద్యమాన్ని చేపట్టాలని పార్టీ 19వ మహాసభ నిర్ణయించింది. దీనికోసం 1996 దిద్దుబాటు ఉద్యమ పత్రాన్ని తాజాపరచాలని కేంద్ర కమిటీని ఆదేశించింది. 15వ లోక్సభ ఎన్నికల ఫలితాల సమీక్ష అలాంటి దిద్దుబాటు ఉద్యమ ఆవశ్యకతను నొక్కి చెప్పింది.

 దిద్దుబాటు ఉద్యమం కోసం పార్టీ కేంద్ర కమిటీ 1996లో ఒక పత్రాన్ని ఆమోదించింది. 1996-97లో పార్టీలో జరిగిన దిద్దుబాటు ఉద్యమానికి ఇది ప్రాతిపదికగాపనిచేసింది. 12 సంవత్సరాల తర్వాత సమీక్ష జరుపుకుంటే, ఈ కాలంలో 1996 పత్రంలో పేర్కొన్న కొన్ని సమస్యలను చేపట్టి వాటి అమలుకు కృషి చేసినప్పటికీ, దిద్దుబాటు ఉ ద్యమాన్ని నిరంతరాయంగా, నికరంగా కొనసాగించలేకపోయామని మనం ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఉదాహరణకు కేరళలో ముఠాతత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ధరణకు కృషి ఇటీవల సంవత్సరాలలో చేపట్టిన ఒక ముఖ్యమైన పని. గత దిద్దుబాటు ఉద్యమంలో మరొక బలహీనత ఏమంటే దిద్దుబాటు ప్రక్రియ పైనుండి అంటే పిబి మరియు సిసి నుండి జరగలేదు.

1996 పత్రం పార్టీలోకి అన్యవర్గధోరణులు ప్రవేశించడం, పార్టీ సభ్యులపై ప్రభావం చూపడానికి ఉన్న భౌతిక పరిస్థితులను, వాతావరణాన్ని సరైన విధంగా గుర్తించింది. సమాజంలో రైతాంగం, పెటీబూర్జువా వర్గం ప్రధానంగా ఉన్న భారత దేశంలో, బూర్జువా, అర్ధప్యూడల్ వాతావరణంలో పార్టీ పనిచేస్తున్నపుడు, పార్టీలోకి అన్యవర్గధోరణులు, విలువలు, అలవాట్లు ప్రవేశించే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. అన్యవర్గ ధోరణులు పార్టీలో ప్రవేశించేందుకు ప్రాతిపదికగా వుండే పరిస్థితులను, కారణాలను 1996 నివేదిక స్పష్టంగా పేర్కొంది. అవి:

(1) సోషలిజానికి ఎదురుదెబ్బ నేపథ్యంలో మార్క్సిజంపై సైద్ధాంతిక దాడి విస్తృతమై, పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదు అన్న ప్రచార ప్రభావం వుంది.
 (2) సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, సరళీకృత విధానాలు ఉధృతమయ్యాక మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, వినియోగదారీ తత్వం, వ్యక్తిగతవాదాలు విస్తృతమయ్యాయి. ఇలాంటి విలువలను మీడియా ప్రచారంలో పెట్టింది.

(3) సోషలిజానికి ఎదురు దెబ్బ తగిలిన నేపధ్యంలో అభివృద్ధి నిరోధక, దురహంకార, ఛాందసవాద సిద్ధాంతాల, శక్తుల జోరు అధికమయింది. భారత దేశంలో కూడా అభివృద్ధి నిరోధక, మతత్వ శక్తులు బలం పుంజుకున్నాయి. అస్తిత్వవాద రాజకీయాల ప్రభావం కనిపించింది. అలాంటి పరిణామాలు పురోగామి, శాస్త్రీయ భావాల వ్యాప్తికి వ్యతిరేకమైనవి. 
(4) వర్గశక్తుల పొందికను మార్చడానికి జరిపే పోరాటం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కమ్యూనిస్టు ఉద్యమం నెమ్మదిగాను, అసమానంగాను పెరగడం, ప్రస్తుత బూర్జువా వ్యవస్థతో సర్దుకుపోవాలన్న ధోరణికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. పార్టీలోకి ప్రవేశించిన చాల మందికి పార్టీ పట్ల, కార్యక్రమ లక్ష్యాల పట్ల ప్రాధమికమైన అవగాహన కూడా ఉండటం లేదు.
(5) బూర్జువా పార్టీలతో ఎత్తుగడల రీత్యా పెట్టుకునే పొత్తులు, ప్రత్యేకించి ఎన్నికల సర్దుబాట్లు, పార్టీలో బూర్జువా తరహా పనిపద్ధతులు చొరబడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఈ పార్టీలు ధనబలాన్ని వినియోగించడం, అవి అనుసరించే బూర్జువా పద్ధతులు మన శ్రేణులపై వత్తిడి కల్పిస్తున్నాయి.

(6) పార్టీలో అధిక సభ్యులు ఇటీవల కాలంలో పార్టీలో చేరిన వారే. కొత్త సభ్యులకు, నిరంతరం పునః శిక్షణ అవసరమైన పాత సభ్యులకు సైద్ధాంతిక, రాజకీయ శిక్షణ జరపడంలో మన శక్తిసామర్ధ్యాల లోపం ఉంది. అందుచేత పార్టీలో రాజకీయ చైతన్యం స్థాయి తక్కువగా ఉంటున్నది. దీనికి నిర్మాణపరమైన బలహీనతలు కూడ తోడు కావడంతో అన్యవర్గధోరణులు మన పార్టీలోకి చొరబడే పరిస్థితులు ఏర్పడినాయి.

      1996 పత్రంలో పేర్కొన్న ఈ అన్ని అంశాలూ ఇప్పటికీ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. 
 అయితే కీ అప్పటి దిద్దుబాటు ఉద్యమం తర్వాత దశాబ్దం పైగా గడిచింది. అందుచేత ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఏమి మార్పులు వచ్చాయి అన్న విషయాలను మనం చూడాల్సి ఉంది.

(1) మొదటిగా పైన పేర్కొన్న అంశాలలో కొన్ని మరింత బలపడ్డాయి, తీవ్రత ప్రగాఢమయింది. ఉదాహరణకు, సరళీకృత, నయా ఉదారవాద విధానాలు మొదలయి రెండు దశాబ్దాలు అయింది. పెట్టుబడి ప్రాబల్యం పెరగడంతో అన్ని రంగాలలోను పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరించింది. ప్రైవేటు రంగం ఆర్ధిక వ్యవస్థలోనే కాకుండా విద్య, ఆరోగ్యం, ఇంకా మౌలిక సదుపాయాలను సైతం ఆక్రమించింది. మార్కెట్ చోదిత పెట్టుబడిదారీ విలువలను మీడియా ద్వారా ప్రచారం చేయడం, ప్రత్యేకించి ప్రైవేటు ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిన తర్వాత బాగా అధికమయింది. ప్రజల చైతన్యం మీద దాడి నేడు నేరుగా, దుర్మార్గంగా జరుగుతున్నది. అన్యవర్గ ధోరణులు, విలువలు పార్టీ శ్రేణులను ఇంతకు ముందెన్నడూ లేనంతగా దెబ్బతీస్తున్నాయనడంలో సందేహం లేదు.

(2) నయా ఉదారవాద విధానాల ప్రభావం కేవలం ఆర్థిక వ్యవస్థకే పరిమితం కాలేదు, రాజకీయ రంగం కూడ వాటి వల్ల తీవ్రంగా ప్రభావితమయింది. సంపద కేంద్రీకరణతో పాటుగా వాణిజ్య - రాజకీయ బంధం రంగంలోకి వచ్చింది. అన్ని స్థాయిల్లోను కార్పొరేట్, వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ వ్యవస్థ పెనవేసుకు పోయాయి. రాజకీయాల్లో ప్రత్యేకించి ఎన్నికల్లో ధనం పాత్ర విపరీతంగా పెరిగింది. 

 (3)గత  1996 దిద్దుబాటు పత్రం తర్వాత ఈ పన్నెండు సంవత్సరాల కాలంలోను
బూర్జువా పార్టీలతో అనేక స్థాయిలలో సంబంధాలు, ప్రత్యేకించి ఎన్నికల సర్దుబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాపార, రాజకీయ బంధం పెరిగినదానికి అనుగుణంగా డబ్బునియోగం, ఇతర బూర్జువా పద్ధతులు కూడ అధికం అయ్యాయి. ఇవి మన శ్రేణుల స్థాయిని దెబ్బతీస్తాయి.

ప్రస్తుత పార్టీ సభ్యుల్లో 40 శాతం మంది 2001 తర్వాత పార్టీలో చేరిన వారే, కొత్తగా చేరిన అత్యధికులు పార్టీ మౌలిక దృక్పధాన్ని ఆకళింపు చేసుకోవలసి ఉంది. వర్గ, ప్రజాపోరాటాలలో నిగ్గుతేలాల్సి ఉంది. పార్టీ విద్యను అందించే యంత్రాంగాన్ని మనం విస్తరించినప్పటికీ కొత్తగా పార్టీలో చేరిన వారి తర్ఫీదు, పాత వారికి పరిజ్ఞానం పెంచడంలో దాని శక్తి చాలడం లేదు. అందుచేత పార్టీ సభ్యుల రాజకీయ సైద్ధాంతిక స్థాయి ఉండాల్సినంత ఉండటం లేదు. అలాంటి పరిస్థితి పార్టీలో అన్ని రకాలైన ఫ్యూడల్, బూర్జువా, పెటి బూర్జువా ధోరణులు ఆవిర్భవించడానికి దారితీస్తున్నది.

(5) పార్టీ సభ్యుల వర్గ పొందికను పరిశీలించినట్లయితే 75 శాతం సభ్యులు కార్మిక వర్గం, పేదరైతులు, వ్యవసాయ కార్మికుల నుండి వచ్చారు. కాని నాయకత్వ కమిటీల్లో వీరు 30 శాతం మాత్రమే ఉన్నారు. 70 శాతం మంది మధ్యతరగతి, ఇతర వర్గాలకు చెందిన వారున్నారు. ఇదే అన్యవర్గ ప్రభావాలకు ప్రాతిపదికను కల్గిస్తున్నది.

(6) సిపిఐ(ఎం) అతి పెద్ద వామపక్షం. మూడు రాష్ట్రాలలో వామపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలకు అది నాయకత్వం వహిస్తున్నది. జాతీయ రాజకీయాలలో నిర్వహిస్తున్న పాత్ర దృష్ట్యా పాలక వర్గాలు మన పార్టీపై దాడిని తీవ్రం చేశాయని 19వ మహాసభ గమనించింది. అలాంటి దాడి కార్పొరేట్ మీడియాలో కూడ ప్రతిబింబిస్తున్నది. పార్టీకి, నాయకత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఈ మీడియాలో పెద్దఎత్తున వస్తున్నాయి. మార్క్సిజం, కార్మికవర్గ సిద్ధాంతం ఆధారంగా పార్టీ తీసుకునే వైఖరులను దెబ్బతీసే విధంగా ఈ ప్రచారం ఉ ంటుంది. పార్టీ ప్రతిష్టను, రాజకీయాలను దెబ్బతీసి తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి వత్తిడి నిరంతరం ప్రయోగించబడుతుంది.

7. పార్టీలో పొరపాటు ధోరణులు అభివృద్ధి చెందాయని పొలిట్ బ్యూరో పంపిన ప్రశ్నావళికి రాష్ట్రకమిటీల సమాధానాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా కొత్త పొరపాటు ధోరణులు కూడ ఆవిర్భవించాయి. వీటికి, పైన పేర్కొన్న అంశాలకు సంబంధం ఉంది. కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు ఉల్లంఘించబడినప్పుడు, పార్లమెంటరీ పెడ ధోరణులు, కమ్యూనిస్టు ప్రమాణాల ఉల్లంఘన జరిగినపుడు రాష్ట్రాలు కొన్ని చర్యలు తీసుకున్నాయి. అయితే ఇవిచాలవు. అంతేకాకుండా సమస్య ఉత్పన్నమయినపుడు దాని లక్షణాలపైన చర్మలు తీసుకుంటున్నాం. దాని మూలాల్లోకి వెళ్లి పూర్తిగా నివారించడానికి అన్యలను క్రమబద్ధంగా తీసుకోవడం తగినతంగా జరగడం లేదు. దాని మౌలిక లక్షణాలను నిర్మూలించే విధంగా రాజకీయ, సైద్ధాంతిక, నిర్మాణపమైన చర్యలు అవసరమైనంతగా తీసుకోవడం లేదు. పార్టీని సైద్ధాంతికంగా ఏకం చేసేందుకు కేంద్ర కమిటీ రాబోయే కాలంలో సైద్ధాంతిక సమస్యలను చేపట్టనున్నది.

పార్లమెంటరీ కత్వం- ఒక సంస్కరణవాద పెడధోరణి

సిపిఐ(ఎం) వర్గ, ప్రజాపోరాటాలను నిర్వహిస్తూ, ప్రజా ఉద్యమాలను నిర్మిస్తున్నది. ప్రజలకు పెంచుకునేందుకు పార్టీ పార్లమెంటరీ, పార్లమెంటేతరంగాను కలిపి కృషి చేస్తున్నది. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ లోతుగా వేళ్లూనుకుని ఉంది. రాజకీయ వ్యవస్థలో అది ఒక మౌలిక అంశంగా ఉంది. అందుచేత పార్లమెంటరీ వేదికల మీద పనిని, పార్లమెంటేతర రంగాలలో పనిని సమన్వయం చేసుకుంటేనే పార్టీ ముందుకు పోగలదు. పార్లమెంటరీ పనిపట్ల ఇది సరైన దృక్పథం. కాని దీనికి భిన్నంగా పార్లమెంటరీ తత్వం, ఎన్నికల అవకాశవాదం పార్టీ మౌలిక దృక్పథాన్ని దెబ్బతీస్తాయి. 1996 పత్రం ఈ పెడ ధోరణిని సరిగానే గుర్తించింది;

"పార్లమెంటరీతత్వం అనేది వ్యక్తిగతంగా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ద్వారా లభించే పదవుల కోసం, అధికారం కోసం వెంపర్లాటగా మాత్రమే చూడరాదు. పార్టీ కార్యకలాపాలను కేవలం ఎన్నికల పనికి మాత్రమే పరిమితం చేయడం, ఎన్నికల్లో పోటీచేయడం ద్వారానే పార్టీ ముందుకు పోగలదని భ్రమించడం పూర్తిగా సంస్కరణవార దృక్పథం. ప్రజా ఉద్యమాలు నిర్మించకపోవడం, నిరంతర ప్రజాపోరాటాలు నిర్వహించకపోవడం, పార్టీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం పార్లమెంటరీ దృక్పథ ఫలితమే 9. సమస్య మరింత పెరిగిందని గత దశాబ్దకాలపు అనుభవం స్పష్టం చేస్తున్నది. పార్లమెంటరీ అవకాశవారం బాగా పెరిగిందని రాష్ట్రాల నుండి వచ్చిన సమాధానాలు తెలియచేస్తున్నాయి. అభ్యర్థులుగా ప్రకటించకపోతే తిరుగుబాటు చేసే కామ్రేడ్ల సంఖ్య ఈ కాలంలో పెరిగింది. త్రిపురలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించకపోవడంతో తిరుగుబాటు చేసిన ఒక రాష్ట్రకమిటీ సభ్యుడిని పార్టీ నుండి బహిష్కరించవలసి వచ్చింది. తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఒక రాష్ట్రకమిటీసభ్యుడిని బహిష్కరించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మరింత కొట్టొచ్చినట్లు కనిపించాయి. అక్కడ ఇద్దరు రాష్ట్రకమిటీ సభ్యులను బహిష్కరించాల్సి వచ్చింది. గత లోక్సభ కాలంలో పార్టీని వీడిన ముగ్గురు ఎంపీలు పార్టీ నుండి బహిష్కరణకు గురయ్యారు. వారిలో ఇద్దరు తిరిగి తమను అభ్యర్థులుగా నిర్ణయించనందుకే వెళ్లిపోయారు.

 అన్య వర్గ బూర్జువా ప్రభావాల చొరబాటు పార్లమెంటరీ అవకాశం వాదం బహిర్గతమవుతున్న రూపాలలో ఒకటి. సుఖమైన జీవనం గడపాలని, మరిన్ని సదుపాయాలు పొందాలని ప్రయత్నించడం కూడ పార్లమెంటరీతత్వంతో ముడివడి ఉన్నాయి. ఎంఎల్ఎలు, ఎంపీలు వేతనాలు, సదుపాయాలు రూపంలో పొందేవి, పార్టీ కార్యకర్తలుగా పొందేవాటికన్నా చాల ఎక్కువగా ఉండటం వల్ల, అలాంటి స్థానాలను పొందాలన్న కోర్కె, వెంపర్లాట అధికమవుతున్నది. చాల రాష్ట్రాలలో ఎంఎల్ఎల, ఎంపీల వేతనాలలో, అలవెన్స్లలో ఎక్కువభాగాన్ని పార్టీ తీసుకోవడం లేదు. అయినప్పటికీ కొందరు శాసనసభ్యులు పార్టీకి చెల్లించాల్సిన వీని సక్రమంగా చెల్లించడం లేదు, ఎంఎల్ఎ అభివృద్ధి నిధులలో అనుసరించాల్సిన పద్ధతులను పాటించడం లేదు. ఎన్నికైన ప్రతినిధులు కొందరు తమ పనిని పార్టీ, ప్రజాసంఘాల పనితో సమన్వయం చేసుకోవడం లేదు. ప్రత్యేకించి బలహీనమైన రాష్ట్రాలలో ఇది జరుగుతున్నది.

 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు, పార్టీ కమిటీలు బూర్జువా పార్టీలు అనుసరించే పద్ధతులను అనుసరించడం అన్న ధోరణి ఇటీవల కాలంలో కనిపిస్తున్నది. ఇంతకు ముందు పేర్కొన్నట్లు బూర్జువా పార్టీలతో ఎన్నికల పొత్తులు ఇలాంటి ధోరణులు చోటుచేసుకోవడానికి కారణమవుతున్నాయి. డబ్బు, సారా వినియోగం, ఇతర అవినీతికర పద్ధతులకు పాల్పడటం పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో ఎన్నికల్లో డబ్బు వినియోగం ఇంతకు ముందెన్నడూ లేనంతగా పెరిగింది, అది మరింతగా విస్తరిస్తున్నది. ఎన్నికల్లో బూర్జువా పార్టీలతో పొత్తులు, మన పార్టీ అభ్యర్థులు కొందరు, కొన్ని పార్టీ కమిటీలు బూర్జువా పార్టీల పద్ధతులను అనుకరించడానికి దారితీస్తున్నాయి. మనం అలాంటి పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించాలి. మనం ఎన్నికల్లో పోటీ చేస్తున్నామంటే, ఏదో విధంగా గెలవడమే మన లక్ష్యం కాదన్న విషయాన్ని మన పార్టీ సభ్యులకు తెలియచెప్పాలి.

 పరిస్థితిని అతిగా అంచనా వేయడం, ప్రత్యేకించి ఎన్నికల్లో విజయాల గురించి కొనసాగుతున్నది. ఇది తరచూ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ డిమాండ్లను బలోపేతంచేసుకోవడానికి జరుగుతున్నది. ఎన్నికల్లో పరాజయం పాలయినప్పుడు అలాంటి స్వీయమానసిక అంచనాలు నిరుత్సాహానికి గురికావడానికి దారితీస్తున్నాయి. శాసనసభ, లోక్సభ స్థానాలలో స్థానికులను మాత్రమే అభ్యర్థులుగా పెట్టాలని డిమాండ్ చేయడం కూడ అధికమవుతున్నది.

 మూడంచెల పంచాయతీ వ్యవస్థకు, స్థానిక సంస్థలకు ఎన్నికయిన వారు వ్యవహరించే తీరులో తీవ్రమైన సమస్యలున్నాయని అన్ని నివేదికలు సూచిస్తున్నాయి. బలంగా ఉన్న మూడు రాష్ట్రాలు మినహా ఇతర చోట్ల చాలమంది సర్పంచులు, పంచాయతీ అధ్యక్షులు పార్టీ పరిధిలోగాని, పార్టీ అదుపులో కాని ఉండటం లేదు. వారిలో కొందరు అవినీతికి అక్రమచర్యలకు లోనవుతున్నారు. వారిని సరిచేయడానికి ప్రయత్నించినప్పుడు వారు పార్టీని వీడి వెళ్లిన ఘటనలు కూడ చోటుచేసుకుంటున్నాయి. కొందరు ఇతర పార్టీలలో చేరుతున్నారు. వారికి మార్గదర్శకత్వం వహించడానికి, వారి పనిని పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని 18వ మహాసభలో చర్చించినప్పటికీ అత్యధిక రాష్ట్రాలలో ఆ దిశగా అంతగా పురోగతి లేదు. క్రిందిస్థాయిలో ఎన్నికల్లో గెలుపొందిన వారు పార్టీ విలువలకు భిన్నంగా వ్యవహరిస్తే అది పార్టీని నేరుగా దెబ్బతీస్తుంది.

కేంద్రీకృత ప్రజాస్వామ్యం

 ముఠాతత్వం, కెరీరిజం, వ్యక్తిగతవాదం, సమిష్టిపనివిధానం లేకపోవడం లాంటి అనారోగ్యకర ధోరణులు పార్టీలో ఉన్నాయని, అవి అన్నీ కేంద్రీకృత ప్రజాస్వామ్యం పురోగతికి ఆటంకాలని 1996 పత్రం పేర్కొంది.

 కేరళలో ముఠాతత్వం ప్రబలడానికి మూలకారణం పార్లమెంటరీ తత్వమే. ఎన్నికలలో నిలబడే అభ్యర్థులను ఎంపిక చేసే పార్టీ ఉన్నత స్థాయి కమిటీల్లోను, కీలకమైన పార్టీ స్థానాల్లోను చోటు సంపాదించడానికి ఈ ముఠాలు చేసే పోరాటం అని కేంద్రకమిటీ గుర్తించింది. పార్టీలో స్ధానాలు సాధించేందుకు గ్రూపులవెనుక, వ్యక్తుల వెనుక మద్దతు సమీకరించడానికి ప్రయత్నించడం కేంద్రీకృత ప్రజాతంత్ర సూత్రాలను పూర్తిగా ఉ ల్లంఘించడమే. ముఠాతత్వం ఉన్నపుడు అన్ని రకాల జాడ్యాలు చెలరేగుతాయి. కేరళలో సుదీర్ఘకాలం ముఠాతత్వం కొనసాగిన ఫలితం కనిపించింది. ముఠాతత్వం పంజాబులో పార్టీని ఎలా దెబ్బతీసిందీ మనం చూశాం. మహాసభల్లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి కొన్ని అనైతిక పద్ధతులు అనుసరించాయి. పార్టీ సభ్యులు మరింత రాజకీయంగాసైద్ధాంతికంగా చైతన్యవంతంగా ఉండి, పార్టీ మౌలిక విప్లవ లక్ష్యాలపట్ల అవగాహన కలిగి ఉంటే తప్ప కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించడానికి అడ్డుకట్టవేయలేము. సమిష్టిపనివిధానం లేకపోవడం, విమర్శ, ఆత్మవిమర్శ లేకపోవడం వల్లనే వ్యక్తిగత వాదం అభివృద్ధి చెందుతుంది. కామ్రేడ్లు తమ వ్యక్తిగత ప్రయోజనాలను పార్టీ ప్రయోజనాలకన్నా. మిన్నగా ముందుకు తెచ్చిన సంఘటనలు ఉన్నాయి.

 పార్టీకమిటీల్లో జరిగిన ముఖ్యమైన చర్చలు బూర్జువా మీడియాకు వెల్లడి కావడం పట్ల 1996 పత్రం హెచ్చరించింది. అది ఈ కాలంలో మరింత విస్తరించింది. ఇది కేవలం వార్తల లీకేజీ కాదు, బూర్జువా మీడియాను వ్యక్తిగత, ముఠా ప్రయోజనాలను ప్రతిబింబించేందుకు ఒక పద్ధతి ప్రకారం వాడుకోవడమే. కార్పొరేట్ మీడియా స్వభావం ఏమిటి, అది పార్టీకి వ్యతిరేకంగా ఎలా వినియోగించుకోబడుతుంది అన్న విషయాలను తెలుసుకోకపోవడమే కాదు, కనీసం పరిగణనలోకి సైతం తీసుకోవడం లేదు.

 బ్యురాక్రటిక్ ధోరణులు, విమర్శను సహించలేకపోవడం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనవి. కామ్రేడ్స్ పట్ల నాయకత్వానికి ఉండే ఇష్టాఇష్టాలు కేడర్పట్ల సమిష్టి, సక్రమ అంచనాకు అడ్డుపడతాయి. అదేసమయంలో ఉదారవాదం, వ్యక్తిగతవాదం ఉండనే ఉన్నాయి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఎక్కడైతే అతి కేంద్రీకరణ చోటుచేసుకుంటుందో దాన్ని సరిచేసేందుకు శ్రద్ధపెట్టాలి.

 పార్టీలో వివిధస్థాయిల్లో ఫెడరలిస్టు ధోరణుల సమస్య తలెత్తుతున్నది. వివిధ రకాలయిన జాతులు, భాషలు, సంస్కృతులు ఉన్న భారత్ లాంటి దేశంలో కేంద్రీకృత రాజకీయ విధానాన్ని, ఉమ్మడి నిర్మాణ సూత్రాలను కొనసాగించడం ఒక సవాలు వంటిది. పార్టీ అసమాన అభివృద్ధి కూడ ఈ ధోరణికి ఒక కారణం. ఫెడరలిజం అంటే కేంద్రీకృత రాజకీయ విధానాన్ని ఉల్లంఘించడం, పార్టీ పై స్థాయి కమిటీలను లెక్కచేయకుండా, కేంద్ర విధానానికి భిన్నంగా తమకు నచ్చిన పద్ధతిలో పోవడం. ఇది కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీస్తుంది. అందుచేత ఫెడరల్ ధోరణులను ప్రతిఘటించడం అవసరం.

బూర్జువా సమాజపు ప్రతికూల ప్రభావం- కమ్యూనిస్టు ప్రమాణాలను కొనసాగించడం

 కమ్యూనిస్టు పార్టీకి ప్రధానమైన ఆస్తి కేడరే. వారు నిస్వార్థంగా ప్రజల్లో పనిచేయడం, నిరాడంబరంగా, స్వచ్ఛంగా జీవించడం పార్టీకి ప్రజల మద్దతును సంపాదించడానికి ఒక ప్రధాన అంశంగా ఉపయోగపడతాయి. మనకు పదుల వేలసంఖ్యలో కేడరు ఉన్నారు. ఉద్యమం కోసం ప్రాణాలర్పించిన వారు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాని కొందరు నాయకులు, కేడరు కమ్యూనిస్టు ప్రమాణాలు, విలువలకు అనుగుణంగా లేకపోతే అది ప్రజల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. మనం కూడ బూర్జువా పార్టీల లాంటి వారమే అని భావిస్తారు. 1996 దిద్దుబాటు నివేదిక సమయంతో పోల్చితే కమ్యూనిస్టు విలువలు మరింత దిగజారాయి. విలాసవంతమైన జీవితాలు, కనీస అవసరాలకు మించి సదుపాయాలున్న భవనాలను నిర్మించుకోవడం, పిల్లల పెళ్లిళ్లలో విపరీతంగా ఖర్చుచేయడం, ఆర్భాటంగా పండుగలు జరుపుకోవడం లాంటి అంశాలలో పార్టీలో ప్రవేశించిన బూర్జువా, పెటి బూర్జువా ధోరణులు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాటిని సమకూర్చుకోవడం జరుగుతూనే ఉంది. పార్టీలోపల దీన్ని ప్రశ్నించడం జరగడం లేదు.

తమకున్న ఆదాయవనరులకు మించి ఆస్తులు సంపాదించుకున్న కామ్రేడ్స్ ఉ న్నారు. నాయకులు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, కుమారులు, కుమార్తెలు వారి ఆదాయ వనరులకు మించి ఆస్తులు సంపాదించుకున్న ఘటనలు కూడ ఉన్నాయి.. కొన్ని సందర్భాలలో పార్టీ నాయకుల పిల్లలకు కార్పొరేట్ సంస్థలు తర్వాత ఆ నాయకుని మంచి చేసుకొని ప్రయోజనం పొందవచ్చన్న ఉద్దేశంతో ఉద్యోగాలు ఇస్తున్నాయి.

ఆదాయవనరులకు మించి ఆదాయాలు పొందినపుడు, ఆస్తులు సమకూర్చుకున్నపుడు ప్రజలు దాన్ని గమనిస్తారు. అయితే అలాంటి సందర్భాలలో ఫిర్యాదులు వచ్చిన తర్వాత సైతం వాటిని పరిశీలించి, దర్యాప్తు జరపడానికి పార్టీ కమిటీలు వెనకాడుతున్నాయి.

 వాణిజ్యవేత్తలు, కంపెనీలు, బడా వ్యాపారులు, కంట్రాక్టర్ల నుండి సదుపాయాలు, బహుమతులు స్వీకరించడంలో మార్గదర్శక సూత్రాలను 1996 దిద్దుబాటు పత్రంలో పొందుపరిచాము. అయినా ఈ కాలంలో ఉల్లంఘనలు జరిగాయి. గత రోజుల్లో పార్టీ నాయకత్వ కమిటీల్లో సభ్యులుగా ఉన్నవారు ఇండ్లు కట్టుకోవడానికి, కార్లు, ఇతర ఆస్తులు సమకూర్చుకోవడానికి పార్టీ అనుమతి తీసుకునే వారు. కాని ఇప్పుడు ఈ పద్ధతి చాలా వరకు పాటించబడటం లేదు. ఆ పద్ధతిని పునరుద్ధరించాల్సి ఉంది. అన్యవర్గ ధోరణులలో వ్యక్తమవుతున్న మరొక అంశం- కొన్ని చోట్ల పార్టీ, ప్రజా సంఘాల మహాసభలకు విపరీతంగా ఖర్చుపెట్టడం, పెద్ద పెద్ద పోస్టర్లు, నాయకుల కటౌట్లు, పెద్ద ఎత్తున దుబారాతో రిసెప్షన్లను ఏర్పాటు చేయడం. బూర్జువా నాయకుల మాదిరిగా మన నాయకులకు కూడ ఆహ్వానాలు
పలుకుతున్నారు. అభినందనలు తెలియచేస్తున్నారు.

 కొత్తగా తలెత్తిన సమస్యల్లో ఒకటి పార్టీనాయకులు, కేడరు ఎన్జీఓల నిర్వహణలో భాగస్వాములు కావడం. 18వ మహాసభ ఆమోదించిన 'కొన్ని విధానపరమైన అంశాలు' అన్న పత్రంలో దీనికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు పేర్కొనబడ్డాయి. నిధులకు సంబంధించి ఎలాంటి అదుపు, జవాబుదారీతనం లేకుండానే ఆ ఎన్జీవోలను నిర్వహిస్తున్న పార్టీనాయకులు వాటిని ఖర్చుపెడుతున్న సందర్భాలున్నాయి. దీన్ని నిషేధించాలి. ఎన్జీవోల నిర్వహణపై అజమాయిషీ ఉండాలి. మార్గదర్శక సూత్రాలను కచ్చితంగా పాటించాలి.

 గత రెండు దశాబ్దాల కాలంలో నయా ఉదారవాద విధానాలు, దాన్ని అనుసరించి పెట్టుబడిదారీ, మార్కెట్ విలువలు విస్తరించాయి. సమాజంలోని అన్ని రంగాలను ప్రైవేటు రంగం అక్రమించింది. సమాజానికి సంబంధించిన అన్ని అంశాలపైనా దీని ప్రభావం ఉంది. దీనితో కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. పలు రకాల సంస్థలు, రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలలో చట్టప్రకారం, చట్ట విరుద్ధంగా డబ్బు సంపాదించే మార్గాలు అందుబాటు లోకి వచ్చాయి. దానితోపాటు సంఘటిత నేరాలు పెరిగిపోయాయి. మన పార్టీ బలంగా ఉ న్న చోట్ల ఇలాంటి స్వార్ధపరశక్తులు మన కామ్రేడ్స్ను కూడ ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కంట్రాక్టర్లు, సారా కంట్రాక్టర్లు మన కామ్రేడ్స్లోను, పంచాయతీలు, స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికైన పదవుల్లో ఉన్న వారితోను సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

 రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట్ల అవినీతికి మరింత అవకాశం ఉంది. కేరళలో పార్టీ పత్రిక మేనేజరు ఒకరు ఒక వ్యాపారవేత్త నుండి పెద్ద మొత్తంలో లంచం తీసుకున్న విభ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. కాంట్రాక్టుల్లోను, నిర్మాణ సామగ్రి సరఫరాలోను అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.

కార్మికులనుండి, కాంట్రాక్టర్ల నుండి, ఉపాధి చూపినందుకు ముడుపులు తీసుకున్న ఘటనలు ట్రేడ్ యూనియన్లలో జరిగాయి. పార్టీలో కొందరు కామ్రేడ్స్ అనేక వ్యాపారాల ద్వారా నయాసంపన్నులుగా మారారు. మారిన వారి దృక్పథం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది.

 పార్టీలోను, ప్రజాసంఘాలలోను తమ స్థానాలను దుర్వినియోగం చేసి ధనవంతులు కావడానికి ప్రయత్నాలు జరిగిన ఘటనలున్నాయి. అలాంటి వారు పార్టీలో నాయకత్వస్థానాలలో లేదా ప్రభావం చూపకలిగిన స్థితిలో ఉండటం వల్ల వారిపై దర్యాప్తుజరపడానికి నిరాకరించడం, తటపటాయించడం జరుగుతున్నది. ఇలాంటివన్నీ కమ్యూనిస్టు పార్టీ స్వభావానికి విరుద్ధమైనవి

దృక్పథాన్ని సరిచేసుకొని, పురోగామి విలువలను కొనసాగించడం

 కుల వివక్ష, అస్పృశ్యత, మహిళల అణిచివేతను శాశ్వతం చేసే సామాజిక ఆచారాలు, పురుషదురహంకారం, బాల్యవివాహాలు, వరకట్నం- లాంటి అన్నిరకాల సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటంలో కమ్యూనిస్టులు అగ్రభాగాన ఉండాల్సిన ఆవశ్యకతను 1996 పత్రం నొక్కిచెప్పింది. రెండవ విషయం, పార్టీ సభ్యులు కులభావనలు, -ఇతర సామాజిక పొరపాటు భావనలను, మూఢాచారాలు, తంతులు నిర్వహించడం లాంటి వాటిని విడనాడటం. కమ్యూనిస్టు ప్రమాణాలను పాటించడంలో నాయకత్వం ఆదర్శంగా నిలబడాలి. 1996 తర్వాత ఈ పన్నెండేళ్ల కాలంలో ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకోబడినాయి. అయితే అవి సరిపోయినంతగా లేవు.

గత రెండు పార్టీ మహాసభలు సామాజిక అంశాలను పార్టీ నేరుగా చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. అత్యధిక పార్టీ సభ్యులు అస్పృశ్యతను, కుల వివక్షను పాటించనప్పటికీ, ఆ సమస్యలను తీసుకొని పనిచేయడానికి, ఉద్యమాలు, పోరాటాలు నిర్మించడానికి విముఖత చూపుతున్నారు. అభివృద్ధినిరోధక సామాజిక ఆచారాలకు వ్యతిరేకంగా పోరాడటానికి పార్టీ కమిటీలు విముఖత చూపుతున్నాయి. దళితులపై దాడులు జరిగినప్పుడు ఖండించడం ఒక్కటే చాలదు, అస్పృశ్యత, కుల వివక్ష అణచివేత లాంటి సమస్యలపై నిరంతర ఉద్యమాన్ని కొనసాగించాలి. చాల సందర్భాలలో పార్టీ కేడరు మతాచారాలు, క్రతువులను అనుసరించకుండా పార్టీ కమిటీలు చొరవతీసుకొని నిరుత్సాహపరచడం లేదు.

 మహిళల సమస్యల పట్ల పార్టీలో అవగాహన పెరిగింది. అయినా పురుషదురహంకార వైఖరి కొనసాగుతున్నది. పార్టీలోపల కూడ లైంగిక వేధింపులు జరిగిన ఘటనలు ఉన్నాయి. చాల చోట్ల పార్టీ నాయకులు, కేడరు తమ మహిళా కుటుంబ సభ్యులు పార్టీ కార్యకలాపాలలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం లేదు. పార్టీ కమిటీల్లో మహిళా కేడరుకు బాధ్యతలు అప్పగించడానికి విముఖత చూపుతున్నారు. ఇవన్నీ కూడా పార్టీ సభ్యులకు జండర్ సమస్యపై అవగాహన పెంచాల్సిన ఆవశ్యకతను తెలియచెబుతున్నాయి. 30. పార్టీలో కార్మిక వర్గ దృక్పథం ప్రాధాన్యతను అర్ధం చేసుకోవడంలో తగ్గుదలకనిపిస్తున్నది. దీనికి సంస్కరణవాదం, పార్లమెంటరీ తత్వం, బూర్జువా విలువలతో సర్దుకు పోవడం అన్న వైఖరి కారణం. కార్మిక వర్గపోరాటాలను, సమ్మెలను పార్టీ నాయకత్వం వ్యతిరేకించిన సంఘటనలు కూడ ఉన్నాయి. పార్టీలో వివిధ స్థాయిలలో ప్రజలతో సంబంధాలు బలహీనమవుతున్నాయి.

పార్టీ నిధుల సేకరణ

పార్టీ ఎకౌంట్లను సక్రమంగా నిర్వహించాల్సిన ప్రాధాన్యతను, నిధుల సేకరణలో మార్గదర్శక సూత్రాలను అనుసరించాల్సిన ప్రాధాన్యతను పార్టీ నొక్కిచెబుతూ వస్తున్నది. ప్రజాసమూహాలనుండి కాకుండా, పెద్ద మొత్తాలలో కొద్ది మంది సంపన్నుల నుండి నిధులు సేకరించడం అనే ధోరణి ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంలో పెరిగిపోతున్నది. ప్రజల వద్ద నుండి చిన్న మొత్తాలలో వసూలు చేయాలన్న మార్గదర్శక సూత్రాన్ని అమలు పరచాలి. రాజకీయవేత్తలకు, వాణిజ్యవేత్తలకు బంధం పెరిగిన నయాఉదారవాద ఆర్థిక విధానాల నేపథ్యంలో వాణిజ్యవేత్తల లాబీలు, ఏజంట్ల నుండి పెద్ద మొత్తాలలో వసూలు చేయడానికి అవకాశాలు బాగా పెరిగాయి. నిధులు వసూలు చేయడంలో అలాంటి శక్తులకు చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలి.

   కొన్ని చోట్ల పార్టీ, ప్రజాసంఘాల మహాసభల నిర్వహణ కోసం, ఆఫీసుల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు సేకరించడం జరుగుతున్నది. వీటికి సంబంధించిన లెక్కలను సక్రమంగా నిర్వహించకపోవడం, సంబంధిత కమిటీలకు నివేదించకపోవడం కూడ జరుగుతున్నది. నిధులు వసూలు చేయడంలో పార్టీ సభ్యులకు, కమిటీలకు మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి. వివిధ స్థాయిల్లో పార్టీ కమిటీలు గరిష్టంగా ఎంత వసూలు చేయవచ్చునో పరిమితిని నిర్దేశించాలి. ఎన్నికల సమయంలో బూర్జువా పార్టీలు, నాయకుల నుండి డబ్బు తీసుకోవడాన్ని నిషేధించాలి. వేరే పార్టీలతో కలిసి నిధులు ఖర్చు చేయాల్సిన సందర్భంలో దానికి సంబంధించి మార్గదర్శక సూత్రాలను రూపొందించాలి.

(2009 అక్టోబర్ 23-25, కేంద్రకమిటీ సమావేశాలలో ఆమోదించిన పత్రం)






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?