జ్ఞానం అంటే ఏమిటి?
జ్ఞానం అంటే ఏమిటి?
___ మావో
వర్గ సమాజం ఏర్పడినప్పటి నుండి ప్రపంచంలో రెండే రకాల జ్ఞానాలున్నాయి. ఒకటి ఉత్పత్తికోసం పోరాడేజ్ఞానం, మరొకటి వర్గ పోరాటం జ్ఞానం. ఈ రెండు రకాల జ్ఞానాల ఘనీభవించిన రూపాలే ప్రకృతి శాస్త్రం, సామాజిక శాస్త్రం. ప్రకృతి గురించిన జ్ఞానం, సమాజాన్ని గురించిన జ్ఞానం. ఇంకొక రకమైన జ్ఞానం ఏదైనా వుందా? లేదు.
సమాజంలోని ఆచరణాత్మక కార్యక్రమంతో ఏమాత్రం సంబంధంలేని పాఠశాలలో చదివే విద్యార్థులను పరిశీలిద్దాం. వాళ్ళ స్థితి ఏమిటి? ఇటువంటి ప్రాథమిక పాఠశాలలో చదివిన వ్యక్తి అక్కడి నుండి అటువంటి విశ్వ విద్యాలయంలోకి ప్రవేశిస్తాడు. ఆ విధంగానే పట్టభద్రుడవుతాడు. అతడు విజ్ఞాన నిధిగా భావించబడతాడు. అయితే అతనికున్నదంతా పుస్తక విజ్ఞానం మాత్రమే అతను ఇప్పటి వరకు ఏ ఆచరణాత్మక కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. తాను నేర్చుకున్న దానిని ఏ జీవిత రంగానికి అన్వయించలేదు. అటువంటి వ్యక్తిని పూర్తిగా అభివృద్ధి చెందిన మేధావిగా భావించగలమా? పరిగణించలేమనేదే నా అభిప్రాయం. ఎందుకంటే, అతని జ్ఞానం అసంపూర్ణం. అయితే సంపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి?
సంపూర్ణ జ్ఞానం అంతా రెండు దశలలో ఏర్పడుతుంది. మొదటి దశ ఇంద్రియజ్ఞానం. రెండో దశ హేతుబద్ధమైన జ్ఞానం. ఈ రెండవ దశ మొదటిదశకు అభివృద్ధి జ్ఞానం దశ. పుస్తకాల నుండి విద్యార్థులు నేర్చుకున్నది. ఈ రకమైన జ్ఞానం. వాళ్ళ జ్ఞానం అంతా సత్యమే అని అనుకున్నా, అది వాళ్ళ వ్యక్తిగత అనుభవం నుండి సంపాదించిన జ్ఞానం మాత్రం కాదు. అది ఉత్పత్తి కోసం జరిగిన పోరాటం, వర్గపోరాటాలు అనుభవాన్ని క్లుప్తీకరిస్తూ వాళ్ళ ముందు తరం వాళ్ళు రూపొందించే సూత్రాలకు సంబంధించిన జ్ఞానం మాత్రమే. ఈ రకమైన జ్ఞానాన్ని విద్యార్థులు తప్పనిసరిగా పొందవలసిందే. అయితే, ఒక రకంగా చూస్తే అది కేవలం పుస్తక జ్ఞానమేనని, అది ఇతరుల ద్వారా తెలుసుకున్న జ్ఞానమే తప్ప, తమచే ఇంకా పరీక్షించబడని జ్ఞానమేనని వాళ్ళు అర్ధం చేసుకోవాలి. జీవితంలోనూ, ఆచరణలోనూ దీన్ని సక్రమంగా అన్వయించడం ముఖ్యం. పుస్తక జ్ఞానం మాత్రమే పొంది, 'వాస్తవంతో ఇంకా సంబంధం లేనివారూ, అతి తక్కువ ఆచరణానుభవం కలవారూ తమ లోటుపాటుల్ని గుర్తించి, మరింత నమ్రతగా వుండాలని నేను సలహా ఇస్తున్నాను.
పుస్తక జ్ఞానం మాత్రమే కలవారిని నిజమైన మేధావులుగా ఎలా మార్చగలం? వాళ్ళని ఆచరణలో భాగస్వాముల్ని చేయాలి. ఆచరణాత్మక కార్యకర్తలుగా తయారు చేయాలి.
సిద్ధాంత సంబంధమైన పనిలో నిమగ్నులైన వాళ్ళు ముఖ్యమైన ఆచరణాత్మకమైన సమస్యల్ని అధ్యయనం చేసేలా చేయడమొక్కటే దానికి మార్గం. ఈ మార్గంతోనే మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం.
బహుశా నేను చెప్పింది కొంతమందికి కోపం కలిగించవచ్చు. "నీ వివరణ ప్రకారం మార్క్స్ కూడా మేధావిగా పరిగణించబడడు," అని వాళ్ళంటారు. వాళ్ళు అంటున్నది తప్పని నేనంటాను. మార్క్స్ విప్లవోద్యమ ఆచరణలో పాల్గొన్నాడు. విప్లవ సిద్ధాంతాన్ని కూడా
సృష్టించాడు. పెట్టుబడిదారీ విధానంలోని అతి సాధారణ అంశమైన సరుకుతో ప్రారంభించి, ఆయన పెట్టుబడిదారీ సమాజపు ఆర్థిక నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజు సరుకుల్ని చూస్తూనే వున్నారు. వాడుతూనే వున్నారు. కానీ వారు వాటిని పట్టించుకోలేనంతగా వాటికి అలవాటుపడిపోయారు. మార్క్స్ ఒక్కడే సరుకుల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేశాడు. వాటి అభివృద్ధిని గూర్చి ఆయన బ్రహ్మాండమైన పరిశోధన చేశాడు. విశ్వవ్యాప్తంగా వున్న దాని నుండి పూర్తిగా శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఆయన ప్రకృతిని, చరిత్రని, శ్రామికవర్గ విప్లవాన్ని అధ్యయనం చేసి, గతితార్కిక భౌతికవాదాన్ని, చారిత్రక భౌతికవాదాన్ని, శ్రామికవర్గ విప్లవ సిద్ధాంతాన్ని సృష్టించాడు. ఈ విధంగా మార్క్స్ సంపూర్ణంగా అభివృద్ధి చెందిన మేధావికాగలిగాడు. మానవ విజ్ఞాన పరాకాష్ఠకి ప్రతినిధి కాగలిగాడు. పుస్తక జ్ఞానం కలవాళ్ళతో మాత్రమే పోలిస్తే ఆయన పూర్తిగా భిన్నమైనవాడు.
పోరాటాలు చేసే క్రమంలో మార్క్స్ విపులంగా పరిశోధనలు, అధ్యయనాలు చేశాడు. దానిలో నుండి సూత్రీకరణలు చేశాడు. ఆ సూత్రీకరణలను మళ్ళీ ఆచరణలో పరీక్షించాడు. దీనినే మనం సైద్ధాంతిక కార్యక్రమం అంటాం. ఈ రకమైన పని ఎలా చెయ్యాలో నేర్చుకునే చాలా మంది కామ్రేడ్స్ మన పార్టీకవసరం. ఈ రకమైన సైద్ధాంతిక పరిశోధనలు చేయటం నేర్చుకోగల కామ్రేడ్స్ చాలా మంది మన పార్టీలో వున్నారు. వాళ్ళలో చాలామంది తెలివైన వాళ్ళు, మనం ఆశపెట్టుకోదగిన వాళ్ళు వున్నారు. వాళ్ళ విలువలను మనం గుర్తించాలి. అయితే వాళ్ళు సరైన సూత్రాలను పాటించాలి. లోగడ చేసిన తప్పుల్ని తిరిగి చేయకూడదు. పిడి వాదాన్ని విడనాడాలి. పుస్తకాల్లో సిద్ధంగా వున్న మాటలకే పరిమితం కాదు.
__Mao
చక్కటి వాఖ్యానము చేశారు
రిప్లయితొలగించండిక్లారిటీ గా బాగుంది
ఇంకా ఉదాహరణలు ఇస్తే బాగుణ్ణు.
ధన్యవాదములు💐💐