బూర్జువాలు( పెట్టుబడీదారులు) అంటే ఎవరు?

         (pc: Wikipedia)
   ఇంతవరకు నడచిన సమాజపు చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే అనే మొదటి వాక్యం తో కమ్యూనిస్టు మానిఫెస్టో ప్రారంభమవుతుంది. ఈ వర్గం పోరాటం బూర్జువా వర్గానికి, కార్మికుల మధ్య జరుగుతుందనే విషయాన్ని మార్క్స్ చెప్పాడు. బూర్జువా వర్గం పెరిగే కొద్దీ మార్క్స్ చెప్పిన వర్గపోరాట సిద్దాంతం మరింత స్పష్టంగా అందరికీ అర్థమయింది.

     బూర్జువా యుగానికి ఒక విశిష్టమైన లక్షణం వుంది.  అది వర్గ వైరుధ్యాలలోని సంకీర్ణతను తొలగించింది. అంతకంతకూ మొత్తం సమాజమంతా బూర్జువావర్గం, కార్మికవర్గం అనే రెండు మహత్తర శత్రు శిబిరాలుగా, పరస్పరాభిముఖాలైన రెండు మహా వర్గాలుగా నిలబెట్టింది.

పట్టణాలలోని చేతిపనివాళ్లూ, వర్తకులూ ఫ్యూడల్ ప్రభువుల పెత్తనానికి లోబడకుండా స్వతంత్రులుగా బతకవచ్చునని ఆ దేశపు రాజులు శాసనాలు చేసేవాళ్ళు. ఇది ఊరకే రాలేదు.    
          ఫ్యూడల్(భూస్వామ్య) ప్రభువుల కింద దాసులుగా వున్నవాళ్లు పారిపోయి దూరపు పట్టణాలు చేరి, అనేక పోరాటాల తర్వాత యీ స్వాతంత్ర్యం సంపాదించుకొన్నారు. ఆ పట్టణాలనే కమ్యూన్లు అనేవాళ్లు. పట్టణాలలోని సరుకుల ఉత్పత్తివల్లా, వర్తకంవల్లా రాజులకు ఆదాయం వచ్చేది. అంతేగాక రాజులకు, ఫ్యూడల్ ప్రభువులకూ రాజకీయ వైరుధ్యం వుండేది. ఈ కారణాలవల్లా, పట్టణ ప్రజల పోరాటాల ఫలితంగానూ పై  శాసనాలు వచ్చాయి.
ఈ స్వతంత్ర పౌరులనుండే తొలి బూర్జువాలు (పెట్టుబడి దారులు) అభివృద్ధి చెందారు.అప్పుడే వచ్చిన ఆవిరి యింజన్లను,  యంత్రాలను వీరు స్థాపించగలిగారు. దీనిని మయకోవస్కీ తన లెనిన్ కావ్యం లో వీరి ఎదుగుదల గురించి ఇలా కవిత్వీకరించాడు.

"ధనస్వామ్యం తన చిన్నతనంలో ఏమంత చెడ్డది కాదు.
దానిది గొప్ప వ్యాపార దృష్టి.
పెట్టుబడిదారు కష్టపడి పని చేశాడు.
బట్టలు మాసి పోతాయనే భయం లేకుండా!
భూస్వామ్య యుగపు దుస్తులు మన కుర్రాడికి చాల లేదు. బిగుసుకు పోయాయి.
ఇప్పుడు మాత్రం మన కుర్రాళ్లకి సరి పోతున్నాయా?
విప్లవాలను పెంచాడు
వసంత పుష్పాల్లాగ ‘మార్సెల్యేస్' పాటను
గొంతెత్తి అరిచాడు. 
అతడెన్నో యంత్రాలను కనిపెట్టాడు.
ఎందర్నో తనకింద బానిసల్ని చేశాడు.
ప్రపంచం అంతటా కోటానుకోట్ల కార్మికులను
తయారు చేశాడు.
రాజుల్నీ జమీందారుల్ని ఒక్క గుటకలో మింగాడు.

            __ మయకోవస్కీ( లెనిన్ కావ్యం)

      ఈలోగా మార్కెట్లు విస్తరిస్తూనే వున్నాయి. సరుకులకు గిరాకీ పెరుగుతూనే వుంది. వచ్చిన ఉత్పత్తి కూడా చాలలేదు.   యంత్రాలను పెద్ద పెద్ద ఎత్తున  పెట్టారు.దాంతో వాటి స్థానంలో బ్రహ్మాండమైన ఆధునిక పరిశ్రమలు వచ్చాయి. పారిశ్రామిక మధ్య తరగతి పోయి వాళ్ళ స్థానంలో పారిశ్రామిక కోటీశ్వరులు వచ్చారు. వీరే ఆధునిక బూర్జువాలు.వీరే కార్మిక సైన్యాల మీద అధిపతులయ్యారు.   

అమెరికా ఖండ ఆవిష్కరణతోనూ, ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకొనిపోయే సముద్ర మార్గాన్ని కనిపెట్టడంతోనూ అప్పుడప్పుడే తల యెత్తుతున్న బూర్జువా వర్గానికి మంచి అవకాశాలు లభించాయి. హిందూ మహాసముద్రంలోని దేశాలలోనూ, చైనాలోనూ వున్న మార్కెట్లూ, అమెరికాలో తెల్లవాళ్ళు స్థిరపడడమూ, వలస దేశాలతో వర్తకమూ, మొత్తం సరుకులూ డబ్బూ ఎక్కువ కావడం, ఇవన్నీ వాణిజ్యానికి, సముద్రయానానికీ, పరిశ్రమలకూ కనీవిని ఎరగని ఊపును యిచ్చాయి. ఫలితంగా పతనోన్ముఖమైన ఫ్యూడల్ సమాజంలోని విప్లవ శక్తులు వేగంగా అభివృద్ధి చెందాయి.

    ఆధునిక బూర్జువావర్గ మనేదే దీర్ఘ కాలిక అభివృద్ధి ఫలితంగా యేర్పడిందనీ, ఉత్పత్తి విధానాల్లోనూ మారకపు విధానాల్లోనూ జరిగిన అనేక విప్లవాల పర్యవసానమని మనకు అర్థమౌతున్నది.

       బూర్జువావర్గం అభివృద్ధి చెంది అది అడుగడుగునా రాజకీయంగా కూడా పురోగమించింది. ఒకప్పుడు ఫ్యూడల్ పెత్తనంకింద అణగారినవర్గంగా వుండిన బూర్జువా వర్గం, తరువాత మధ్య యుగపు కమ్యూన్లలో( చిన్న పట్టణాలు)  పరిపాలక సంఘాలుగా వుండిన బూర్జువావర్గం, ఆధునిక ప్రజా ప్రాతినిధ్యపు రాజ్యంలో రాజకీయ అధికారం సాధించుకొంది. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజుల పెత్తనం కింద ఉండింది ప్రారంభం లో. తరువాత కాలంలో వారే అధికారం సంపాదించుకున్నారు. 
        ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బూర్జువా వర్గపు సమష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ గా ఉంది.
         చారిత్రకంగా బూర్జువా వర్గం అత్యంత విప్లవకరమైన పాత్ర నిర్వహించింది. అది ఆధిపత్యం లోకి రాగానే 
1.అన్ని దేశాల్లో   ఫ్యూడల్ సంబంధాలను తెంచింది.
"జమీందార్ల కోరలు పీకేశారు.
గ్రామాల్లో చేతిపనులకి ఆవిరి శక్తి ఇచ్చారు.
నగరాల్ని దోచుకున్నారు.
బ్యాంకుల పొట్టల్లో
బంగారం నింపేశారు."
       _ మయకోవస్కీ( లెనిన్ కావ్యం)
మన దేశంలో మాత్రం అది ఫ్యూడల్ వర్గంతో కలిసి పనిచేసింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఫ్యూడల్ వర్గం బలహీనపడి,కార్పొరేట్( పెద్ద బూర్జువా) బలపడింది.
2.కల్మషంలేని గ్రామీణ సంబంధాలను నిర్మూలించి వాటిని డబ్బు సంబంధాలు గా మార్చి వేసింది.
3.మనిషికీ మనిషికీ మధ్య డబ్బు లావాదేవీ తప్ప
మరేమీ లేకుండా చేసింది.మనిషి విలువను రూపాయల్లోకి మార్చింది. ఎన్నికల్లో అదే పని చేస్తోంది మన దేశంలో.
4."వ్యాపార స్వాతంత్ర్యం"అనే ఏకైక రౌడీ స్వాతంత్ర్యాన్ని నెలకొల్పింది. 
5.గతంలో ప్రజల భక్తి గౌరవాలకు పాత్రమైన వృత్తులనన్నిటినీ బూర్జువా వర్గం నీచస్థాయికి తీసుకువచ్చింది. వైద్యులనూ, న్యాయవాదులనూ, కవులనూ, శాస్త్రవేత్తలనూ అది తనకింద కూలికి పనిచేసే నౌకర్లుగా మార్చివేసింది.కార్పొరేట్ ఆసుపత్రులు ఇదే పని చేస్తున్నాయి. కవులను ప్రకటనల తయారీకి వాడుకొంటున్నారు. 
6. గుడిని, బడిని వ్యాపారంగా మార్చేశారు.
పవిత్ర మనుకున్నదంతా మైలపడిపోతున్నది. కార్పొరేట్ స్కూళ్లు పెరిగాయి. భక్తి వ్యాపారం గా మారిపోయింది. గుడి కట్టి దాని చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు.

       ఒక్క మాటలో చెప్పాలంటే, బూర్జువావర్గం మత రాజకీయ భ్రమల ముసుగుచాటున జరిగే దోపిడీని తొలగించి, దాని స్థానంలో నగ్నమైన లజ్జారహిత, ప్రత్యక్ష, పాశవిక దోపిడీని నిలిపింది.
మనిషికీ మనిషికీ మధ్య స్వలాభం తప్ప, డబ్బు చెల్లింపులు తప్ప ఇక ఏ సంబంధాన్ని అది మిగల్చలేదు.

     చివరకు మానవుడు భ్రమలు తొలగించుకొని తన నిజమైన జీవన పరిస్థితులనూ, తోటి మానవులతో తనకు గల సంబంధాలను వెదుక్కొక  తప్పలేదు.

     బూర్జువావర్గం ఉత్పత్తిచేసే సరుకులకు నిత్యం విస్తరించే మార్కెట్ కావాలి. ఆ అవసరమే  ప్రపంచీకరణ కు మార్గం వేసింది.వారు ప్రవేశించిన చోట జాతీయ పరిశ్రమలన్నీ నాశనమయ్యాయి. టెక్నాలజీ నుంచి ఉపయోగించుకుంటూ కొత్త పరిశ్రమలు స్థాపించారు.ఇంటర్నెట్,టి.వి.,సెల్ ఫోను వంటి టెక్నాలజీ ద్వారా అత్యంత వెనుకబడిన అటవిక జాతులను కూడా నాగరికతలోకి లాగేస్తోంది. అది దేన్ని సంస్కృతి గా చెపుతుందో అదే చలామణి అయి వారంతా స్వీకరించే పరిస్థితి ఏర్పడుతుంది.

         ఆస్తిని కొద్దిమంది చేతుల్లో కేంద్రీకరణ జేసి రాజకీయాన్ని కూడా కేంద్రీకరణ చేసింది. బూర్జువాల  పాలన మొదలై ఇంకా వందేళ్ళయినా పూర్తి కాలే. కాని ఇంతకు ముందు తరాలన్నీ కలిసి సృష్టించిన కార్మికశక్తి కంటే విస్తారమైన, బ్రహ్మండమైన కార్మికులను, సాంకేతిక పరికరాలను అది తన పాలనలో సృష్టించింది. అయితే పెట్టుబడి అనేది సమష్టి ఉత్పాదితం. అనేక మంది ఐక్యంగా కృషి చేస్తేనే అది  వుంటుంది. 

" అదనపు విలువల కన్నపు దొంగల్ని కన్నంలోనే పట్టుకున్నాడు మార్క్స్. 
అధిక లాభపరుల బొడ్డు దాకా నైనా కన్నెత్తి చూడడాని కితరులు భయపడే వేళ
కార్ల్ మార్క్స్ కార్మికుల్ని
వర్గ పోరాటంలోకి నడిపించాడు"
               _ మయకోవస్కీ( లెనిన్ కావ్యం)

    శ్రామికవర్గం ఆధునిక పరిశ్రమ ప్రత్యేక సృష్టి. అది దాని అతి ముఖ్య సృష్టి.ఈ శ్రామిక వర్గమే బూర్జువా వర్గానికి ఎదురు నిలబడిన వర్గాలన్నిటిలోకి  ఒక్కటే నిజమైన విప్లవకర వర్గం. 

గ్రాంస్కీ ప్రకారం 19వ శతాబ్దపు ఇటలీలో బూర్జువా వర్గం భూస్వామ్య వర్గాలతో ఏనాడూ తలపడలేదు.ఇటలీ ఉత్తరభాగంలో అత్యంత ఆధునిక పెట్టుబడిదారీ సంబంధాలు ఏర్పడితే, మిగతా దేశంలో, ముఖ్యంగా దక్షిణభాగంలో మాత్రం అత్యంత వెనుకబడిన, కాలం చెల్లిన నిర్మాణాలు పట్టుబట్టి కొనసాగాయి.దాంతో ఆదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య బలహీనపడి, ఫాసిజం పుట్టుకకు దారి తీసిందని భావించారు.అయితే స్వాతంత్య్ర సాధనలో ఇటాలియన్ జాతీయ రాజ్యాంగ ఐక్యత ఏర్పర్చడంలో ఇటలీలో బూర్జువా వర్గానికి సాపేక్షికమైన ప్రగతిశీల పాత్ర వుందని ఆయన పేర్కొన్నారు. 

    భారతదేశంలో  ఇదే విధంగా బూర్జువా వర్గం ప్రవర్తించింది. స్వాతంత్ర్య పోరాట సమయంలో బూర్జువావర్గంలోని కొన్ని సెక్షన్లు ప్రగతిశీల పాత్ర వహించాయనడం నిస్సందేహం. అయితే ముఖ్యంగా ఐదు  అంశాలను మనం గమనించాలి.

1 భారత బూర్జువా వర్గంలోని కీలకరంగాలుగా ఉండిన టాటా హౌస్ వంటివి జాతీయోద్యమ కాలంలో  బ్రిటిష్ అధికారానికే సన్నిహితంగా వుండేవి. 

2. ప్రధానంగా గాంధీజీ ద్వారా జాతీయోద్యమానికి సన్నిహితులైన బిర్లాలవంటివారు, బ్రిటిష్ అధికారంతో ఒక పక్క మిళితమౌతూ మరో పక్క పోటీపడే వైఖరిని అనుసరించారు. చిన్న బూర్జువా వర్గ సెక్షన్లు మాత్రం పూర్తిగా వ్యతిరేకించేవారు. 

3. ప్రజా ఉద్యమాల పట్ల బూర్జువా వర్గం ఎప్పుడూ అనుమానంతోనే వుండేది.  అందువల్ల దేశ విభజనకు దారి తీసినా సరే ఏదో ఒక పరిష్కారానికి అది ఆరాటపడింది. విప్లవంకన్నా దేశ విభజనే మంచిదని చెప్పింది.

4. స్వాతంత్య్రానంతరం బూర్జువావర్గం భూస్వామ్యవర్గాలతో   మైత్రిని కుదుర్చుకుంది. పాత, కొత్త భూస్వామ్యశక్తులతో కూడా ఈ మైత్రి సాగించింది. పేదరైతుల, గ్రామీణ కార్మికుల, కట్టుబానిసకూలీల, ఆదివాసీల వంటి వారి జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు అనువైన భూసంస్కరణలను అడ్డుకుంది. 

5.   తన వ్యాపార  ప్రయోజనాల కోసమైనా సరే భారత సమాజాన్ని పరివర్తన చేయడానికి బదులు ఈ బూర్జువావర్గం సామ్రాజ్యవాదంతో రాజీపడడమే సులభమని భావించింది. వారు అనారోగ్యకరమైన, సామాజికంగా వెనుకబడిన, కొద్ది పాటి నిరక్షరాస్యులు, అర్థ నిరక్షరాస్యులైన కార్మికవర్గంతో సరిపెట్టుకున్నారే తప్ప, తమ ఆధిపత్యం చేజారే ఎలాంటి సామాజిక పరివర్తనను చేపట్టలేదు. 

       మన భారతీయ సమాజంలో  సోషలిస్టు పరివర్తనకోసం  బూర్జువా వర్గం తన విప్లవ కర్తవ్యాలను కొన్ని కూడా పూర్తిగా నెరవేర్చలేక పోయింది. అందువల్లనే ఫాసిజానికి గల లక్షణాలను పాలకవర్గం రూపొందించుకోగలిగింది. ఇప్పుడు మతచాంధసవాదం,ఫాసిజం లక్షణాలతో  అధికారం లోకి వచ్చిన  పాలకులు  కార్పొరేట్ వర్గానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు.

( 2000లోప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురించిన
జయించేందుకో ప్రపంచం ఉంది పుస్తకం ఆధారంగా)

(కమ్యూనిస్టులకు తమ అభిప్రాయాలూ, లక్ష్యాలూ దాచుకోవడమంటే అసహ్యం. 
అస్థిత్వములో ఉన్న పరిస్థితులన్నింటినీ బలప్రయోగంతో కూలదోయడం ద్వారానే
తమ లక్ష్యాలను సాధించుకోగలమని వారు బహిరంగంగానే ప్రకటిస్తారు.
కార్మికులు పోగొట్టుకొనే దేమీ లేదు తమ సంకెళ్ళు తప్ప)


కామెంట్‌లు

  1. చాలా సులభం అయిన వాక్యాలలో పెట్టుకుందాం రీ వర్గం ఎలా అభివృద్ధి అయ్యిందో , మానవి సంబంధాలన్నింటిని డబ్బు సంబంధాలు గా ఎలా మార్చిందొ వివరించారు

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?