మితవాద పార్టీలు-కార్పొరేట్లు
మితవాద పార్టీలు-కార్పొరేట్లు
ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యాన్ని సాధించిన అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో దేశంలోని బడా పెట్టుబడిదారీ వర్గం కలిసిపోయింది. అందుచేత బడా పెట్టుబడిదారీ వర్గాన్ని(corporates) విమర్శించడమంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ద్వారా వచ్చిన పెట్టుబడీదారీ అనుకూల విధానాలను విమర్శించడమే అవుతుంది.
ప్రస్తుత కాలంలో ద్రవ్య పెట్టుబడి అంతర్జాతీయ స్వభావాన్ని పూర్తిగా సంతరించు కుంది. ఇది ఆయా జాతీయ ప్రభుత్వాలని ధిక్కరించగల, శాసించగల శక్తి కలిగివుంది. ఏదైనా ఒక దేశంలో ఒక ప్రభుత్వం గనుక ఈ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనాన్ని సవాలు చేయాలనుకుంటే ముందు ఆ దేశం ప్రపంచీకరణ వల నుండి బైట పడవలసి వుంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ద్రవ్య పెట్టుబడుల ప్రవాహం ఏ ఒక్క దేశపు నియంత్రణలోనూ లేదు. ఆయా దేశాల ఆర్థిక స్వయంనిర్ణయాధికారాన్ని లెక్కచేయని విధంగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వ్యవహరిస్తోంది.
ఏదో ఒక మేరకు నయా ఉదారవాద విధానాల(ప్రపంచీకరణ విధానాల) అమలును వ్యతిరేకిస్తూ వచ్చిన స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి ఆరెస్సెస్ అనుబంధ సంస్థలను పక్కనపెట్టి మోడీ నాయకత్వంలో హిందూత్వ-కార్పొరేట్ కూటమి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న తీరు చూస్తే మనకు అర్థం అవుతుంది. తాను అధికారంలోకి రావడానికి తోడ్పాటును అందించిన కార్పొరేట్లకు మోడీ ప్రధాని పదవిని చేపట్టాక అన్ని విధాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు.
యూరప్ కు చెందిన పదహారు పచ్చి మితవాద పార్టీలు ఉమ్మడిగా ఒక ప్రకటన చేస్తూ నయా ఉదారవాద విధానాలకు తమ సంపూర్ణ మద్దతును తెలిపాయి. వాటిలో హంగేరీ కి చెందిన విక్టర్ ఆర్బన్ నాయకత్వంలోని ఫైడెజ్ పార్టీ, ఫ్రాన్స్ లో మారినే లి పెన్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్, ఆస్ట్రియా కు చెందిన ఫ్రీడమ్ పార్టీ, పోలెండ్ కు చెందిన లా అండ్ జస్టిస్ పార్టీ, స్పెయిన్ కు చెందిన వోక్స్, ఇటలీ కి చెందిన నార్తర్న్ లీగ్, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీలు ఉన్నాయి. మితవాద పార్టీల వ్యవహారం ఏ దేశానికి మినహాయింపు కాదని మనకు స్పష్టం అవుతోంది.
Prabhat Patnaik
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి