సానుకూలతలు, ప్రతికూలతలు


           pc: vedikka.com
1. అతి అంచనాలు వేయడం రాష్ట్ర, జిల్లా అన్ని స్థాయిల్లోనూ తీవ్రంగా వున్నది. సానుకూలతను ఎక్కువగా, ప్రతికూలతను తక్కువగా, మన బలాన్ని ఎక్కువగా, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా, చేసిన కృషిని వచ్చిన ఫలితాలను ఎక్కువగా, లోపాలను, - బలహీనతలను తక్కువగా చూపించడం జరుగుతుంది. ఇదొక తీవ్రమైన బలహీనత అని కూడా ఎక్కువమంది భావించడంలేదు. అంచనాలు వేసేటప్పుడు, చెప్పేటప్పుడు యథాలాపంగా వ్యవహరిస్తున్నాం. నిర్ణయాలను అమలుచేసిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, అంచనాలు తప్పు అని తెలిసిన తర్వాత కూడా మన లోపాన్ని ఆషామాషీగానే తీసుకొంటున్నాం. వాస్తవాలకు దగ్గరగా అంచనావేయడమనేది ప్రధానమైన, బాధ్యతాయుతమైన పనిగా ఎక్కువ మంది భావించడం లేదు. పొరపాటు అంచనాల పర్యవసానం ఉద్యమానికి హానికరంగా వుంటుందన్న స్పృహ పరిమితంగా వున్నది.
మున్సిపల్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, శాసనసభా ఎన్నికల్లో, ఉద్యమాలు, పోరాటాల సందర్భంలో అతి అంచనాలు స్పష్టంగా కనబడ్డాయి. సరియైన అంచనాలు మినహాయింపులుగానే మిగిలాయి. అతి అంచనాల మూలంగా ఆశించిన ఫలితాలు రానప్పుడు నీరసం, నిస్పృహకు గురవుతున్నాం.

2. పదవీ వ్యామోహం యీ కాలంలో పెరిగింది. ప్రజా పునాది వుండి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు వున్నాయనుకున్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల అరాచకం, క్రమశిక్షణా రాహిత్యం, తిరుగుబాట్లకు దారితీసింది. నకిరేకల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలు దీనికి ఉదాహరణలు. అన్ని జిల్లాల్లో కొంతమంది వ్యక్తులు దీనికి గురయ్యారు. బలహీనమైన ప్రాంతాల్లో కూడా కేంద్రీకరించి కృషి చేస్తున్న నియోజకవర్గాల్లో పదవీ వ్యామోహం, పార్లమెంటరీతత్వం ఎక్కువగా కనబడింది, ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు కన్నా, ఇతరులతో సర్దుబాట్లు చేసుకున్నప్పుడు గెలుస్తామన్న ఆశవుండడంతో యీ పదవీ వ్యామోహ ధోరణి కనబడుతున్నది.

ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 2009 ఎన్నికల్లో ఎన్నికల తర్వాత పార్టీ శ్రేణులు నిశ్చేష్టులైనారు. శత్రువు దాడి పట్టుదలను, కసిని పెంచడానికి బదులు గందరగోళాన్ని సృష్టిస్తున్నది.

3. ప్రజా ప్రాతినిధ్య పదవులను సంపాదించడం ముఖ్యమనే ధోరణి పార్టీలో పెరుగుతున్నది. అది సాధించేందుకు తప్పుడు పద్ధతులకు పాల్పడటం జరుగుతున్నది. పార్టీకి హాని చేయడానికైనా కొంతమంది సిద్ధమవుతున్నారు. నకిరేకల్లో కొంతమంది తిరుగుబాటు జేయడం, ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు మద్దతు కూడగట్టుకోవడానికి విందు ఏర్పాటు చేయడం, ఇబ్రహీంపట్నంలో అభ్యర్థి విషయమై రాష్ట్ర ఆఫీసుపై నాయకులు ప్రోత్సాహంతో కొంతమంది దాడికి పాల్పడడం, పత్రికల్లో పేరువచ్చేట్టు చేసుకోవడం, పార్టీపై ఎగదోలడం ఇందుకు తాజా ఉదాహరణలు. స్థానిక ఎన్నికల్లో యీ ధోరణి యింకా విస్తృతంగా జరుగుతున్నది.

4. ప్రజా ప్రాతినిధ్య పదవులను స్వంత వాటిగా భావించడం, పదవి వలన వచ్చే సౌకర్యాలు, పారితోషికాలు స్వంతానికి వాడుకోవడం, పార్టీకి జమకట్టకపోవడం జరుగుతోంది. సంపాదించుకోవడం తమ హక్కు అనుకునే ప్రజా ప్రతినిధులు కూడా వున్నారు.

5. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను అన్యవర్గ ధోరణులతో వ్యతిరేకించడం, స్థానిక అభ్యర్థి కాదన్న వాదన ఒకచోట మహిళా అభ్యర్థిని ఎందుకు పెట్టాలని, జనరల్ సీట్లో జనరల్ అభ్యర్థినే ఎందుకు పెట్టాలనే పొరపాటు వాదనలు కూడా కొన్ని చోట్ల వస్తున్నాయి.

6. అన్యవర్గ పద్ధతులు అనుసరించయినా గెలవడం అవసరం అన్న ధోరణి పార్టీలో పెరిగింది. డబ్బు ఖర్చు పెడతారని, అర్హులు కాకపోయినా గెల్చే అవకాశం వుందని అభ్యర్థిత్వాలను నిర్ణయించడం జరుగుతున్నది. డబ్బు ఖర్చు బాగా పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఎక్కువగా కనబడుతున్నది. ఓట్లు కొనడం అక్కడక్కడా జరిగింది. గతంలో లేని, డబ్బుకు అమ్ముడుపోయే ధోరణి యిప్పుడు తలెత్తుతున్నది.

7. ప్రజా ప్రతినిధుల పార్టీ ఫ్రాక్షన్లు సక్రమంగా నిర్వహించబడటంలేదు. శాసనసభపక్ష ఫ్రాక్షన్ శాసనసభ సమయంలో సమావేశం అవుతున్నది. సభలో జరిగే అంశాల గురించి చర్చిస్తున్నది. కాని సభ్యుల యొక్క పని, నిబంధనల అమలు వంటి విషయాలను. చర్చించలేదు. క్రింది స్థాయిలో ఫ్రాక్షన్లు జరగడంలేదు. యీ మధ్యకాలంలో స్థానిక సంస్థల ప్రతినిధులు నల్లగొండ జిల్లాలో అత్యధికులు పార్టీని ఖాతరు జేస్తున్న పరిస్థితి లేదు.

8. మన పార్టీ ప్రజా ప్రతినిధులకు, యితర పార్టీల ప్రజా ప్రతినిధులకు పెద్ద వ్యత్యాసం లేదన్న అభిప్రాయం వున్నది. అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. క్రిందిస్థాయిలో అవినీతికి పాల్పడ్డ ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయి. కమీషన్లు, ఫర్సెంటేజ్లు తీసుకోవడం మామూలైపోయింది. ఎమ్ఎల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ధనప్రభావానికి గురయ్యారు. కొంతమంది ప్రజా ప్రతినిధుల జీవనసరళి అనుమానాలకు ఆస్కారమిస్తున్నది. బూర్జువా పార్టీ ప్రజాప్రతినిధుల జీవన సరళి అనుకరణ ఎక్కువయ్యింది. వారు అనుసరించే కొన్ని పొరపాట్లు, పద్ధతులకు మనం గూడ గురవుతున్నాం. కొన్నింటిని సహిస్తున్నాం.

9. ప్రజా ప్రతినిధులపై అజమాయిషీ చేయడం, పార్టీ ప్రమాణాలను పాటించేటట్లు చేయడంలో రాష్ట్ర, జిల్లా కమిటీలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో భాద్యుణ్ణి కేటాయించినా ప్రతినిధుల పర్యవేక్షణ అంశానికి ప్రాధాన్యత రాలేదు. కమిటీలకు కొంతమంది ప్రజా ప్రతినిధులు అతీతంగా, కమిటీలను లెక్కచేయకుండా వ్యవహరించే ఘటనలు కనబడుతున్నాయి.

10. గెలుపు పేరుతో ఆరోపణలున్న వారినే అభ్యర్థులుగా కొన్నిచోట్ల పెట్టాం. రెండు దఫాల నిబంధనను అమలుచేయలేదు. ఎన్నికల్లో నష్టం వస్తుందేమోనన్న సంశయంతో తప్పుడు పద్ధతులను అనుసరిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తున్నాం. నిరంతరం
ఏదోఒక ఎన్నిక వస్తుండడంతో తప్పుడు ధోరణులు కొనసాగడానికి అవకాశమిస్తూనే వున్నాం.

11. ఎన్నికల ప్రయోజనాల పేరుతో పార్టీ విధానాలకు భిన్నంగా కొన్ని విషయాలపై రాజీపడుతున్నాం. గిరిజన ప్రాంతాల్లో 1/70 విషయం ఈ కోవకే వస్తుంది. కొన్నిచోట్ల కులవివక్ష సమస్యను తీసుకోవడానికి సంశయిస్తున్నాం. మిత్రపక్షాలతో సర్దుబాట్ల మూలంగా అవినీతి వంటి కొన్ని సమస్యలపై గట్టిగా మాట్లాడలేకపోతున్నాం.

12. ప్రజా ప్రతినిధులపై తీసుకున్న క్రమశిక్షణా చర్యలు చాలా తక్కువ. 

13. కేంద్రీకరణ విస్తరణ అన్న రెండు కర్తవ్యాలలో విస్తరణపై జిల్లా కమిటీలు తగిన శ్రద్ధ పెట్టలేదు. తమ బాధ్యత కాదన్న ధోరణి వ్యక్తమవుతున్నది.

కేంద్రీకృత ప్రజాస్వామ్యం

1. ఎక్కువ రాష్ట్ర, జిల్లా కమిటీల స్థాయిలో ముఠాతత్వం లేదు. ఒక జిల్లాలో నాయకత్వస్థాయిలో 10 మంది తీవ్రమైన స్థాయిలో ముఠాతత్వానికి పాల్పడ్డారు. పార్టీ విచ్ఛిన్నానికి పూనుకున్నారు. వారి విచ్ఛిన్న ప్రయత్నాలను అధిగమించి పార్టీ నిలదొక్కుకున్నది.

2. కొన్ని జిల్లాల కార్యదర్శివర్గ కమిటీలలో అనైక్యత ధోరణి కన్పిస్తున్నది. 

3. డివిజన్ స్థాయిలో ముఠాతత్వం అక్కడక్కడా కన్పిస్తున్నది.

4. నాయకత్వ స్థాయిల్లో వ్యక్తిగత పోకడలు అన్ని జిల్లాల్లో ఒకరో, యిద్దరో నాయకుల్లో వ్యక్తమవుతున్నది.

5. కమిటీ చర్చలను బయటచెప్పడం, లూజుగా మాట్లాడటం, పత్రికలకు లీక్చేయడం వంటి ఘటనలు కొన్ని ముఖ్యమైన జిల్లాల్లో, విద్యార్ధి రంగ కేంద్రంలో ఒకరిద్దరిలో జరిగాయి. 
6. ఫెడరల్ ధోరణి తీవ్రమైన స్థాయిలో లేదు. కొన్ని జిల్లాలు రాష్ట్ర స్థాయి క్యాంపెయిన్స్ కార్యక్రమాలతో కొన్ని సందర్భాల్లో సమన్వయం చేసుకోవు.

7. నిర్మాణ సమస్యలను పరిష్కరించడంలో, ప్రజా ప్రతినిధులను పర్యవేక్షణ చేయడంలో అన్నిస్థాయిల కమిటీల్లో ఉదారవాదం, అశ్రద్ధ తీవ్రంగా వుంది. కొన్ని కమిటీలలో యీ ధోరణి మరింత తీవ్రంగా వుంది.

8. మహాసభల్లో పార్టీ పదవులను దక్కించుకొనేందుకు ప్రయత్నాలు చేసిన ఘటనలు
అక్కడక్కడా జరిగాయి.

3. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలలో జిల్లా కమిటీ స్థాయిలో సమిష్టి పని విధానం వుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో రాష్ట్ర చర్చించుకుందా సంబంధించిన నిర్ణయాన్ని కార్యదర్శివర్గమే తీసుకోవడం కేంద్రీకృత అనుగుణంగాలేదు.

10. వివిధ సందర్భాల్లో పార్టీ మహాసభ తర్వాత క్రమశిక్షణా చర్యలకు గురైన పార్టీ సభ్యులు 132 మంది. రాష్ట్ర కమిటీలో 4గురు, జిల్లా కమిటీ సభ్యులు 10 మంది, డివిజన్ కమిటీ సభ్యులు 86 మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడ్డాయి. కొంత మంది బహిష్కరణకు

కమ్యూనిస్టు ప్రమాణాలు

1. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితులలో వస్తున్న మార్పులు పార్టీపై కూడా ప్రభావా చూపుతున్నాయి. వినిమయవాదం పెరిగింది. ప్రైవేటు రంగం, సంస్థలు పెరగడంతో విరాళాలు, వసూళ్ళు కూడా పెరిగాయి. బూర్జువా పార్టీలతో సర్దుబాట్లు వున్నప్పుడు, ప్రభుత్వంలో ప్రభావం వుంటుందనుకొన్నప్పుడు, ప్రజాబలం వున్నచోట, యూనియన్లు వున్నచోట దాతల నుండి విరాళాలు బాగా వసూలవుతున్నాయి. ఆర్థికంగా బాగు అభిమానులు కూడా విరాళాలు ఉదారంగా యిస్తున్నారు. పట్టణాలు, పారిశ్రామిక వ్యాపార కేంద్రాలలో నిధులు ఉద్యమ బలానికి మించి కూడా వసూళ్ళవుతున్నాయి. పెద్దమొత్తాలు యిచ్చే దాతలందరూ పార్టీపట్ల సానుకూలతతోనే యిస్తున్నారని చెప్పలేం. వారిలో పద్ధతులు అనుసరించకుండా వున్నవారు బహుతక్కువగా వుంటారు. ప్రస్తుతం వారందరినుండీ నిధులు వసూలు చేస్తున్నాం. తక్షణ వివాదం వుంటేనో, ప్రత్య ప్రజలకు, ఉద్యమాలకు హానిచేస్తుంటేనో విరాళాలు తీసుకోవడం లేదు. 
2. పెద్ద దాతలనుండి అవసరమైన నిధులు సమకూర్చుకుంటున్నందున ప్రజలనుండి
నిధులు వసూలు చేయడంపై శ్రద్ధ తగ్గుతున్నది. అక్కడక్కడా కొన్ని కమిటీలు ప్రజలనుండి నిధుల వసూళ్ళకు శ్రద్ధపెడుతున్నప్పటికీ ఆ ఒరవడి బలహీనపడుతున్నది.. 
3. ప్రజాసంఘాలు కూడా విరాళాలకు పెద్ద దాతలపై, వ్యాపార ప్రకటనలపై ఆధారపడటం పెరిగింది.
4. పార్టీలో అవినీతి పద్ధతులు ఆందోళనకర స్థాయిని చేరుతున్నాయి. తప్పు కాదనుకోవడం, సర్దుకు పోవడం, డబ్బు రూపంలో కాకుండా వస్తు రూపంలో తీసుకుంటే అవినీతి కాదనుకోవడం పెరిగింది. ప్రభుత్వ పథకాలు- ఇళ్ళు కేటాయింపు, రీగా పనులు, ఫించన్లు కేటాయింపు వగైరాలలోని అక్రమాలపై పోరాడానికి వెనుకంజ వేస్తున్నారు. కొంతమంది స్థానిక ప్రజా ప్రతినిధులు పర్సెంటేజ్లు, కమిషన్లు తీసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు, ఇళ్ళ స్థలాల కేటాయింపులో అనర్హులైనప్పటికీ తప్పుడు పద్ధతుల్లో లబ్ధి పొందేందుకు కొంతమంది కార్యకర్తలు ప్రయత్నించారు. కార్యకర్తలు అవినీతికి పాల్పడిన ఘటనలు ఈ కాలంలో పెరిగాయి. అధికారులకు లంచాలు ఇప్పించడం పెరిగింది. ఇది తప్పదన్న వాదన కూడ వస్తున్నది.

5. జీవనం ఆడంబరంగా వుండాలనే ధోరణి, ఆధునిక సౌకర్యాలను పొందాలనే ధోరణి కార్యకర్తల్లో పెరిగింది. అందుకోసం అక్రమ పద్ధతులు అనుసరించడం ఎక్కువైంది. మోటార్ వాహనాలు, సెల్ ఫోన్లు లేకపోతే పనిచేయలేమనే స్థితి వస్తున్నది. ఆడంబరమైన దుస్తులు ధరించకపోతే ప్రజలను ఆకర్షించలేం అన్న అభిప్రాయాలు కూడా కార్యకర్తలలో వ్యక్తమవుతున్నాయి. ఆచరణ కూడా కన్పిస్తుంది. కార్పొరేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ వైద్య సంస్థల్లోనే విద్య, వైద్యాన్ని పొందాలన్న దృష్టి పెరుగుతున్నది. వీటన్నింటికీ పార్టీ డబ్బు యివ్వాలనే కోర్కెలు బలపడుతున్నాయి. పార్టీకి తెలియకుండానే రకరకాల రూపాల్లో వాటిని సంపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో వాహనాలను పార్టీ అనుమతిలేకుండా తీసుకుంటున్నారు. అవసరం వున్నా, లేకపోయినా కారులు వినియోగించే పద్ధతి పెరిగింది. విరాళాలకు కొదవలేదనే పేరుతో ఉద్యమస్థాయికి మించిన భారీ ఆఫీసులను

పురోగామి విలువలు

1. కర్మకాండలు చేయడం కార్యకర్తల్లో అక్కడక్కడా కన్పిస్తున్నది. వాటిని సమర్థించుకొనే వైఖరి పెరుగుతున్నది. ప్రజలనుండి దూరం కాకుండా వుండటం కోసం, కుటుంబం వత్తిడి, నా ప్రమేయం లేకుండా బంధువులే చేశారు వంటి సాకులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజలముందు బహిరంగంగా వివాదం కాకుండా వుండేందుకు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు పర్యటనలలోదేవాలయాలను దర్శించడం, కర్మకాండలు చేయడంకోసం తలవెంట్రుకలు తీసుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, సాంప్రదాయపద్ధతుల్లో పెళ్ళిళ్ళు చేయడం వంటివి కొంత మందిలో వ్యక్తమయ్యాయి. కట్నాలు తీసుకోవడం విస్తారంగా వుందని రిపోర్టుల్లో వున్నది. కొత్త హోల్టైమర్స్లో వీటికి అతీతంగా వుండాలనే ఆదుర్ధాగాని, ఎదిరించాలనే పట్టుదలగాని తక్కువగా వుంది.

2. ఆర్భాటంగా శుభకార్యాలు నిర్వహించడం (పెళ్ళిళ్ళు, బారసాలలు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు పెరిగింది. కొత్తగా వచ్చిన పూర్తికాలం కార్యకర్తలు యీ ధోరణికి గురవుతున్నారు.

3. ప్రత్యక్షంగా కులతత్వానికి నాయకత్వం గురిఅయిన ఘటనలు దాదాపు లేవు. అక్కడక్కడ. కొద్దిమంది కార్యకర్తలు పార్టీ అవగాహనకు భిన్నంగా కుల సంఘాల నాయకులుగా ఉ న్నారు. కొంత మంది వర్గ దృక్పథంతో కాకుండా కుల ఆలోచనలతో చర్చలు చేసిన. ఘటనలున్నాయి. ఎన్నికల్లో కులం ఉపయోగపడుతుంది అని ఆశపడి ఒకటి రెండు చోట్ల కొంత మంది వ్యవహరించారు. కుల సంఘాల సమావేశానికి సభలకు ఒకరిద్దరు నాయకులు వెళ్ళారు. సామాజిక తరగతుల సమస్యల పై సంఘాలు ఏర్పరిచి కృషి చేస్తున్న సందర్భంలో కుల సిద్ధాంతాలు ప్రచారం చేసే మేధావులు, సంస్థల నాయకులతో కలసి పని చేస్తున్నప్పుడు వారిని ప్రభావితం చేసే కన్నా మనమే ప్రభావితమవుతున్నాం. 
4. మతాచారాలను నమ్మడం నాయకత్వ కార్యకర్తలలో దాదాపు లేదు. కుటుంబం, ప్రజల ఒత్తిడి పేరుతో అక్కడక్కడా కొంతమంది పాటించిన సందర్భాలున్నాయి. ప్రతిఘటించాలనే దాని కన్నా సర్దుకుపోవాలనే ధోరణి ఈ కాలంలో కార్యకర్తలలో ఎక్కువై పోయింది. ఆఖరుకు మేడే కార్యక్రమాలలో కూడా నివారించడానికి బదులుగా అనేకమంది నాయకులు కొబ్బరికాయలు కొడుతున్నారు.
ప్రజలు పాల్గొనే కొన్ని కార్యక్రమాల సందర్భంలో కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం వంటి పనులు చేయాలని వత్తిడి తెచ్చినప్పుడు అనేకమంది వాటిని పాటిస్తున్నారు. వివిధ పండగల సందర్భంలో ప్రజలు పోగైనప్పుడు అటువంటి వాటికి హాజరై కొన్ని ఆచారాలు అనుసరిస్తున్నారు. ప్రజల వత్తిడిలేకపోయిన సందర్భాల్లో కూడా కొంతమంది నాయకులు దేవాలయాలకు వెళ్ళిన ఘటనలు వున్నాయి.
5. మహిళల పట్ల ఫ్యూడల్ దృక్పథం నగ్నంగా కనపడకపోయినా వివిధ రూపాలలో కొనసాగుతున్నది. సమానంగా గౌరవంగా మహిళల పట్ల వ్యవహరిస్తున్నామని దాదాపు అందరూ చెప్పారు. అయినా అక్కడక్కడా కొంతమంది చులకనగా వ్యాఖ్యలు చేయడం. చేయిచేసుకోవడం వంటి ఫిర్యాదులు వచ్చాయి. సామాజిక జీవితంలోకి మహిళలు రావడానికి ప్రోత్సహించడంలో ఈకాలంలో పురుష కార్యకర్తల్లో అయిష్టత పెరిగింది. కుటుంబంలో ఫ్యూడల్ భావాలపై మహిళల్లో పెరుగుతున్న ఆచార భావాలతో సర్దుకుపోవటం పెరిగింది. 
6. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆస్తుల వివరాలను క్రమబద్ధంగా ప్రతి సంవత్సరం తీసుకుని పరిశీలించడం లేదు. ఈకాలంలో నాయకులు, కార్యకర్తల వద్ద వాహనాలు, సెల్ఫోన్లు విరివిగా వినియోగిస్తున్నారు. కొంతమంది పార్టీ అనుమతి తీసుకుంటున్నా అత్యధికులు సమాచారం ఇవ్వకుండానే సమకూర్చుకుంటున్నారు. ఈ సౌకర్యాలు ఎలా వచ్చాయి? అక్రమంగానా? సక్రమంగానా? అన్న అనుమానాలు పార్టీలోను, బయట వస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు అన్ని రంగాలలో తామరతంపరగా పెరగడంతో అక్రమంగా డబ్బులు సంపాదించుకోగల్గే అవకాశాలు కూడా ఈకాలంలో బాగా పెరిగాయి. కొంతమంది నాయకులు, కార్యకర్తలు పార్టీ పద్ధతులకు విరుద్ధంగా వీటిని సమకూర్చు కున్నారని, అవినీతికి పాల్పడి అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆస్తిపాస్తులను నిరంతరం పరిశీలించేందుకు ఇప్పటివరకు యంత్రాంగం లేదు. అటువంటి యంత్రాంగం అవసరమున్నది.

7. పార్టీ సభ్యత్వం ఈకాలంలో బాగా పెరిగింది. ఇందులో చాలా భాగం లూజుసభ్యత్వం. వారిని రాజకీయంగాను, నిర్మాణపరంగా తర్ఫీదు చేయకపోవడంతో అన్ని రకాల ఫెడధోరణులు పార్టీలో ప్రవేశించి కొనసాగుతున్నాయి. మూఢనమ్మకాలు, ఆచారాలు, దురలవాట్లు యథాతథంగానే వుంటున్నాయి. నచ్చినంత లెవీ చెల్లించడం జరుగుతున్నది. సభ్యత్వాన్ని నిలబెట్టుకునేందుకు నాయకత్వం కూడా వాటన్నింటితో రాజీవైఖరి తీసుకుంటున్నది.

8. పూర్తికాలం కార్యకర్తలలో కెరీరిస్టు ధోరణి, అలవెన్సు కోసం పని చేసే ధోరణి ఎక్కువయింది. ఎక్కువ సమయం వృధా చేయడం జరుగుతున్నది. వినిమయవాదం పెరిగింది.

మీడియా

పార్టీకి, ప్రజా ఉద్యమాలకు మీడియాలో ప్రచారం రావాలని కోరుకోవడం, అందుకు సమంజసమైన పద్ధతిలో ప్రయత్నం చేయడం సరైనది. కాని వ్యక్తిగత ప్రచారం కోసం. ప్రాకులాడటం అందుకు అవసరానికి మించి మీడియా వారితో సంబంధాలు సాగించడం. తప్పు, మీడియా వారిని మంచి చేసుకోవడమనే పేరుతో పార్టీ విషయాలను చర్చించడం, సమాచారం అందించడం అక్కడక్కడా జరుగుతున్నాయి. ఎన్నికల సందర్భంలో తన అభ్యర్థిత్వం గురించి వ్రాయించుకున్న ఘటనలు కూడా కొన్ని వున్నాయి. పార్టీ అంతరంగిక చర్చలను లీక్ చేస్తున్న సందర్భాలు ఎక్కువవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో పార్టీని అప్రతిష్ట చేసే పద్ధతిలో, శత్రువుకుపయోగపడే పద్ధతిలో విచ్ఛిన్నకులు మీడియాను వినియోగించుకున్నారు. నల్లగొండ జిల్లా కార్యదర్శివర్గంలో జరిగిన చర్చలు ఒకసారి లీక్ అయ్యాయి. బూర్జువా మీడియా అందులో కార్పొరేట్ మీడియా యొక్క వర్గ స్వభావాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేక తత్వాన్ని మర్చిపోయి వాటిపై భ్రమలు కార్యకర్తలు పెంచుకుంటున్నారు. ఇటువంటివారు పార్టీ గురించి వస్తున్న అసత్యాలను, తప్పుడు కథలను, వక్రీకరణలను అనాలోచితంగా నమ్మే పరిస్థితి ఎక్కువవుతున్నది.
ఫ్లెక్సీ బోర్డులు, వ్యాపార ప్రకటనలు వ్యక్తిగత ప్రచారం కోసం కొన్ని జిల్లాల్లో వినియోగిస్తున్న సందర్భాలు వున్నాయి. 

జమా ఖర్చుల నిర్వహణ:

పిసి ఆడిట్ కమిటీ రాష్ట్ర కేంద్రం అకౌంట్స్తో బాటు అన్ని జిల్లా కమిటీలు, రాష్ట్ర ప్రజా సంఘాలు, ప్రజాశక్తి బుక్ హౌస్ అకౌంట్స్ పరిశీలిస్తోంది. ఆయా కమిటీల అకౌంట్లో వస్తున్న లోపాలను ఎప్పటికప్పుడు నివేదికల ద్వారా సంబంధిత జిల్లా కార్యదర్శులకు, ప్రజా సంఘాల బాధ్యులకు, సబ్ కమిటీ బాధ్యులకు తెలియజేస్తూ, పర్యవేక్షణ బాధ్యతలలో గల రాష్ట్ర కమిటీ/ సెక్రటేరియట్ బాధ్యులకు కూడ నకళ్ళు పంపి సమాచారం ఇస్తున్నది.

మెజారిటీ జిల్లా కమిటీలు అకౌంట్స్ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని కమిటీలు సాంకేతికంగా అకౌంట్స్ సక్రమంగా వ్రాయడంలో వెనుకబడి వున్నాయి. ఆడిట్ కమిటీ తమ నివేదికల ద్వారా అకౌంట్స్లో లోటుపాట్లను తెలియజేస్తున్నప్పటికీ
కొన్ని కమిటీలు తరువాత అకౌంట్స్ వ్రాసుకోవడంలో మెరుగుదల కన్పించడం లేదు. ఆడిట్ కమిటీ నివేదికలకు వివరణలు ఇవ్వడంలో కూడ కొన్ని కమిటీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అన్ని కమిటీల వారు తమ అకౌంట్స్ను రాష్ట్ర అడిట్ కమిటీ పరిశీలనకు పంపుతున్నప్పటికీ, ఒక జిల్లా కమిటీ, రెండు రంగాల కమిటీలు ఆడిట్ చేయించటం లేదు. కొన్ని జిల్లాలు, రంగాలు ఆడిట్ చేయించడంలో జాప్యం చేస్తున్నాయి.

దాదాపు అన్ని కమిటీలు ఆయా కమిటీలు, సంఘాల పేరున బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నాయి. అయితే ఏకవ్యక్తి నిర్వహణలోనే ఎక్కువగా ఉన్నాయి. కనీసం ఇద్దరు బాధ్యులు నిర్వహించే విధంగా మార్పు తీసుకు రావాలి. అయినప్పటికీ పరిమితులను మించి చేతి నగదు నిల్వలు ఉంచుతున్నారు. ఈ పరిమితులను పాటించవలసి ఉంది. ఇంకా ఒకటి రెండు కమిటీలు తమ నిల్వలను వడ్డీ ఆదాయల నెపం మీద వ్యక్తుల వద్ద డిపాజిట్లు నిర్వహిస్తున్నాయి.

అకౌంట్స్ రాయడంలో శిక్షణ ఇవ్వడం కోసం రాష్ట్ర స్థాయిలో అకౌంట్స్ వర్కుషాపులు నిర్వహించి, జిల్లా స్థాయిలో వర్కుషాపుల నిర్వహణకు కృషి చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, తూ. గోదావరి, కృష్ణ, నెల్లూరు, విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు, వరంగల్, హైదరాబాద్ ఖమ్మం జిల్లా కమిటీలు ఇటువంటి వర్కుషాపులు నిర్వహించాయి. మిగిలిన వారు కూడ నిర్వహించాల్సి ఉంది.

డివిజన్ స్థాయిలో పార్టీ అక్కౌంట్స్ నిర్వహణ సక్రమంగా లేదు. ప్రజా సంఘాల అక్కౌంట్స్ అయితే మరీ అధ్వాన్నంగా వున్నాయి. కొన్ని చోట్ల ప్రజా సంఘాలు, పార్టీ జమా ఖర్చులంతా కలిసిపోయి వుంటున్నాయి. కొన్ని మండలాలకు నాయకులు ఎవరికి వారు వసూలు చేయడం, ఖర్చుపెట్టడం జరుగుతున్నది. అకౌంట్స్ నిర్వహణే లేదు. 

ఉదారవాదం.

ఏదైనా పొరపాటు ధోరణి దృష్టికొచ్చినప్పుడు చర్చించడం తప్ప దిద్దుబాటు కార్యక్రమం ఒక ఉద్యమంగా జరగడం లేదు. మహాసభల సందర్భంలో అనేకాంశాల తోపాటు ఈ అంశాలు కూడా చర్చించబడుతున్నాయి. పొరపాటు ధోరణులను సత్వరం అరికట్టాలి. వాటిపట్ల నిశితంగా, కఠినంగా వ్యవహరించాలన్న దృక్పథం పైనుంచి క్రింది స్థాయివరకు కొరవడింది. రాష్ట్రకేంద్రం దృష్టికి వస్తున్న ఆయా సమస్యలను సంబంధిత కమిటీల దృష్టికి వెంటనే తెస్తున్నప్పటికీ అవి పరిష్కారమయ్యేవరకు వెంటబడటం లేదు. ఈ ఉదారవాద వైఖరి కొంత నష్టం చేస్తున్నాయి. కొన్ని జిల్లా కేంద్రాల దృష్టికి సమస్యలొస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తూ కాలయాపన చేస్తున్నాయి. అవి ముదిరి తీవ్ర దశకు చేరుకుని నష్టం కల్గిస్తున్నాయి. 

ముగింపు:

             వివిధ సందర్భాలలో కొన్ని పెడధోరణులు ఆందోళనాకరమైన స్థాయికి పెరిగాయి. అవినీతి వివిధ రూపాలలో పెద్ద జాఢ్యంగా మారింది. పదవీ వ్యామోహంతో తప్పుడు పద్ధతులు అవలంభించడం ఎక్కువయ్యింది. బూర్జువా పార్టీల నాయకులు ఆడంబర జీవితం మనకూ ఆదర్శమైనదిగా భావించడం, అనుసరించడం కొంతమంది నాయకులు, కార్యకర్తలలో పెరిగింది. ఎన్నికలలో గెలుపు కోసం బూర్జువా పార్టీల పద్ధతులను అనుసరించడం తప్పు కాదని, అవసరమని కూడా భావించడం బలపడింది. బూర్జువా పద్ధతులు వివిధ స్థాయిలలో బలంగా ప్రవేశించాయి.

కొన్ని ముఖ్యమైన విషయాలలో బూర్జువా భూస్వామ్య పార్టీలకు మనకూ వ్యత్యాసం లేకుండా పోయింది. వర్గ దృక్పథం వదిలేసి బూర్జువా పార్టీల మాదిరిగా ఆలోచించే ధోరణి కార్యకర్తలు, నాయకులలో వ్యాపించింది. క్రిందిస్థాయిలో అదింకా బలంగా వున్నది. ఎన్నికల అవసరాల పేరుతో ఈపద్ధతులను సమర్థించుకోవడం జరుగుతుంది. నిరంతరం ఏదో ఒక ఎన్నిక రావడం పార్టీయావత్తూ వాటిలో నిమగ్నం కావడం ఈ పొరపాటు ధోరణులు బలపడటానికి దోహదపడుతున్నాయి. ఎన్నికల ఎత్తుగడలలో భాగంగా బూర్జువా భూస్వామ్య పార్టీలతో జరుగుతున్న సర్దుబాట్లు అనేక రూపాలలో తీవ్ర దుష్ప్రభావాలు పార్టీపై పడుతున్నాయి. తాత్కాలిక ప్రయోజనం కోసం చూస్తే బూర్జువా పద్ధతులు అనుసరించడం దీర్ఘకాలంలో పార్టీని, ప్రజాపునాదిని బలహీనపరుస్తున్నది. సరళీకరణ విధానాల తర్వాత ప్రైవేటు రంగం విస్తరించింది. మండల, గ్రామస్థాయి వరకు రకరకాల కొత్త వ్యాపారాలు, వృత్తులు ప్రవేశించాయి. ఆదాయమార్గాలు, సంపాదనామార్గాలు క్రొత్తవి వచ్చాయి, నయా సంపన్నులు రాజకీయాలలో కూడా ప్రవేశిస్తున్నారు. రాజకీయాలలో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. తమ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీల నాయకులకు నిధులు సమకూరుస్తున్నారు. మన ఉద్యమం బలంగా వున్న చోట ప్రభావం చూపగలే చోట మన నాయకులను కూడా ప్రలోభ పెట్టడానికి వెనకాడటం లేదు. అలాగే మన కార్యకర్తలలో కూడా కొంతమంది పరిస్థితులు కలిసొచ్చిన చోట నయా సంపన్నులు కాగల్గుతున్నారు. చుట్టూ సమాజంలో అనేకమందికి వస్తున్న అవకాశాలను చూసి కొంతమంది కార్యకర్తలు. అటువైపుకి ఆకర్షించబడుతున్నారు. హైదరాబాదు, రంగారెడ్డి వంటి జిల్లాల్లో మీడియాలోకి, రియల్ఎస్టేట్ రంగంలోకి కొంతమంది కార్యకర్తలు వెళ్లడం దీనికి ఉదాహరణ. ఈ వాతావరణం కూడా పార్టీలో అన్యవర్గధోరణులకు కారణమవుతున్నాయి.

పొరపాటు ధోరణులు అరికట్టి పార్టీ నిర్మాణాన్ని పదునుగా వుంచుకోవాలంటే పై నుండి క్రిందిస్థాయి వరకు రాజకీయ చైతన్యాన్ని, అవగాహనను పెంచాలి. అయితే అదొక్కటే చాలదు. ఎన్నికలు, ప్రజాప్రతినిధులు, జమాఖర్చులు, విరాళాల వసూళ్ళు, వాహనాలు, తదితర సౌకర్యాలు, వివాహాలు, అంత్యక్రియలు, తదితర కార్యాలు, ఆచార వ్యవహారాలు. మొదలగు అంశాలకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి వ్యవస్థీకృతం చేసి ఖచ్చితంగా అమలు చెయ్యాలి. ఈ అమలును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలుగా మహాసభల మధ్య మధ్యంతర సమీక్షను చెయ్యాలి.

దిద్దుబాటు ఉద్యమ చర్చల్లో వచ్చిన సమస్యల జాబితాను తయారుచేసి వాటిని నిర్ధిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలి. 
దిద్దుబాటు ఉద్యమాన్ని శాఖల స్థాయివరకు నిర్వహించాలి.
రూపొందించిన మార్గదర్శకాల ప్రాతిపదికగా రాజకీయ విద్యను నిర్వహించాలి.

(CPM రాష్ట్ర దిద్దుబాటు నివేదిక _2009)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?