కార్మికవర్గం కర్తవ్యం.
కార్మికవర్గం కర్తవ్యం.
ఏదో పెట్టుబడిగా వచ్చే లాభం ద్వారా కాక కేవలం తమ శ్రమను అమ్ముకోవడం ద్వారా మాత్రమే జీవనోపాధి సంపాదించుకునే వారిని కార్మికులు లేదా శ్రామికులు అంటారని ఏంగెల్స్ నిర్వచించారు. వీరి మనుగడ వీరి శ్రమకు గల గిరాకీపై ఆధారపడి ఉంటుంది. వీరి మనుగడ, విశృంఖలమైన పోటీవల్ల కలిగే అస్థిర పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని ఏంగెల్స్ పేర్కొన్నాడు.
తన శ్రమ శక్తి అమ్మకం ఏకైక జీవనాధారంగా ఉన్నవాడే కార్మికుడు. కార్మికుడు ప్రతిదినమూ తన సేవలను వేలంలో అందరికంటే ఎక్కువగా పాడిన పెట్టుబడిదారునికి అమ్ముతాడు. కార్మికుడు ఒక యజమానికి గానీ, భూమికి గానీ చెందడు. కార్మికుడు తనను తాను ఎవరికి అద్దెకు ఇచ్చుకుంటాడో, ఆ పెట్టుబడిదారుని తనకు ఇష్టం వచ్చినపుడు వదిలిపెడతాడు. పెట్టుబడిదారుడు తనకు తోచినప్పుడు, అతని నుంచి తనకిక
ఏ లాభమూ లేదా అనుకున్నంత లాభం రాకపోయినా వెంటనే అతన్ని పని నుంచి తొలగిస్తాడు.
ఆవిరియంత్రం (స్టీమ్ ఇంజిన్) వివిధ రకాల వడికే యంత్రాలు, మరమగ్గం తదితర అనేక యంత్రాలు కనిపెట్టడంతో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఈ యంత్రాలు చాలా ఖరీదైనవి కేవలం పెద్ద పెట్టుబడిదారులు మాత్రమే కొనగలిగేవిగా ఉండేవి. వీటి వల్ల అంతకు ముందున్న ఉత్పత్తి విధానం పూర్తిగా మారిపోయింది. రాట్నాలు, చేనేత మగ్గాలతో శ్రామికులు ఉత్పత్తి చేయగలిగిన దానికంటే చౌకగా, మరింత శ్రేష్టమైన సరుకులను యంత్రాలు ఉత్పత్తి చేయడం వల్ల శ్రామికులు జీవనోపాధి కోల్పోయారు.
ఈ యంత్రాల వల్ల పరిశ్రమలన్నీ పెద్ద పెట్టుబడిదారుల చేతుల్లోకి వెల్లిపోయాయి. చేతివృత్తిదారుల కొద్దిపాటి ఆస్తులు (పనిముట్లు, చేనేత మగ్గాలు వగైరా) నిరుపయోగమయ్యాయి. శ్రామికులకు మిగిలేదేమీ లేకుండా పోయింది.
ఒకసారి యంత్రాలు, ఫ్యాక్టరీ వ్యవస్థల ప్రవేశంతో ఇక అవి పరిశ్రమలో అన్ని శాఖలనూ వడివడిగా ఆక్రమించడం మొదలెట్టాయి. జౌళి వస్త్రాలపై ముద్రణ, పుస్తకాల ముద్రణలకు సంబంధించిన శాఖలు, కుమ్మరి సామాన్లు, ఇనుప సామాన్యు తయారీ శాఖలు ఇలాంటి వారిలో చెప్పుకోదగ్గవి. శ్రమ విభజన అనేక మంది కార్మికుల మధ్య మొదలైంది. ఇంతకు పూర్వం ఒక వస్తువును మొత్తంగా తయారు చేసిన కార్మికుడు ఇప్పుడు కేవలం అందులో ఒక భాగాన్ని మాత్రమే తయారు చేసే స్థితికి వచ్చాడు.
ఇది పరాయీకరణకు దారితీసింది. యంత్రాలు కార్మికులు చేసే ఉత్పత్తి కన్నా , అంతకంటే ఎంతో బాగా ఉత్పత్తి చేయగల పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఫ్యాక్టరీల వ్యవస్థ బాగా విస్తరించింది. అవన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉండిపోయాయి. ఇక అక్కడ కూడా కార్మికు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సంపూర్ణంగా కోల్పోయారు. క్రమేపీ చేతివృత్తి, పరిశ్రమలు కూడా ఫ్యాక్టరీ వ్యవస్థ అధిపత్యంలోకి వచ్చాయి. చేతివృత్తిదారులు దారుణంగా దెబ్బతిన్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీలో రెండు వర్గాలు మెల్లమెల్లగా పుట్టుకొచ్చాయి. అవి
1)బడా పెట్టుబడిదారుల వర్గం: వీళ్లు అప్పటికే నాగరిక దేశాలన్నింటిలోను జీవనాధార సాధనాలన్నింటి పైనా,ఉత్పత్తి కి కావలసిన ముడి సరుకులు, పరికరాలు (యంత్రాలు, ఫ్యాక్టరీలు, వగైరా) అన్నింటిపైనా పూర్తిగా యాజమాన్యం కలిగి ఉన్నారు. ఈ వర్గాన్నే బూర్జువా వర్గం లేదా కార్పొరేట్ వర్గమని పిలుస్తారు.
2) కార్మిక వర్గం: ఏ ఆదాయమూ లేక తమ జీవనం కోసం తమ శ్రమను అమ్ముకోవలసిన స్థితికి వచ్చిన వ్యక్తుల వర్గం. ఈ వర్గాన్ని కార్మిక వర్గం అంటారు.
అనేక బహుళ జాతి సంస్థ ల పెట్టుబడిదారులు తమ పరిశ్రమల నిర్వహణకు బ్యాంకు ల ద్వారా, ప్రజల షేర్ల ద్వారా పెట్టుబడులు సేకరించారు. ప్రజల వాడకానికి మించి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. దాంతో తయారైన వస్తువులన్నీ అమ్ముడుపోక వాణిజ్య సంక్షోభం ఏర్పడింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఫ్యాక్టరీ యజమానులు దివాళా తీశారు. కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
కొన్నాళ్లు ఇతర దేశాలను ఆక్రమించుకొని తమ వ్యాపారాన్ని పెంచుకున్నారు.కొంతకాలం తరువాత మెల్లమెల్లగా మిగిలిన ఉత్పత్తులు అమ్మకమయ్యాయి. ఫ్యాక్టరీలు తిరిగి నడవడం మొదలైంది. వేతనాలు పెరిగాయి. క్రమక్రమంగా వాణిజ్యం, పరిశ్రమలు మునుపటి కంటే కూడా ముమ్మరం కాజొచ్చాయి. అయితే మళ్లీ ఎంతో కాలం తిరగక ముందే వర్తకపు సరుకులు మరీ ఎక్కువగా ఉత్పత్తయ్యాయి. మరో సంక్షోభం వచ్చింది. దాంతో ప్రపంచీకరణ మార్గాన్ని చేపట్టారు. తమ ఉత్పత్తులు అన్ని దేశాల లో అమ్ముకోవడానికి బాటలు వేసుకున్నారు. అయినప్పటికీ సంక్షోభాలు వారిని వదిలి పెట్టడం లేదు.ఈ విధంగా గత శతాబ్దల నుంచి పరిశ్రమలు ఉచ్చస్థితి లోనూ,మరోసారి సంక్షోభంలోనూ ఊగిసలాడుతూ ఉండటం మొదలైంది. 1896,1929,1990,2000,2008,2020
లలో ఇలా క్రమబద్ధంగా మళ్లీ మళ్లీ సంక్షోభాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి సంక్షోభమూ గతంలో కంటే అత్యంత దారుణ దారిద్య్రాన్ని కార్మికులకు తెచ్చి పెట్టింది. ప్రతి సంక్షోభమూ ఒక కల్లోలాన్ని సృష్టించింది.
ప్రపంచ కార్పరేట్ వర్గం తమ పెట్టుబడులను విస్తరణకు ఫైనాన్స్ పెట్టుబడి
మార్గాన్ని ఎంచుకున్నారు.వీరి లక్ష్యం లాభార్జనే. శాస్త్ర సాంకేతిక రంగ విప్లవం వల్ల ఎన్నడూ లేనంత స్థాయిలో వీరు బ్రహ్మాండమైన ఉత్పత్తిని,ఉత్పత్తి శక్తులను సృష్టించారు. కానీ మానవజాతిని పట్టి పీడిస్తున్న ఆకలి, రోగాలు, పౌష్టికాహార లోపం వంటి సమస్యలను తొలగించలేకపోయాయి. 1998 హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు ఇలా పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలోని 440 కోట్ల ప్రజానీకంలో కనీస పారిశుద్ధ్యం కూడా లేని పేటల్లో బతికేవారు 3/5వ వంతు, రక్షిత మంచినీటికి నోచుకోని వారు 1/3వ వంతు. గృహవసతి లేని వారు 1/4వ వంతు. ఆధునిక వైద్య సేవలకు నోచుకోని వారు 1/5వ వంతు. చిన్న పిల్లల్లో 1/5వ వంతు. ఐదో తరగతి దాటరు. దాదాపు అదే సంఖ్యలో పౌష్టికాహార లోపం ఉంది. ప్రస్తుతం దూకుడుగా అమలవుతున్న స్వేచ్ఛా మార్కెట్ విధానాలు సంపన్న దేశాలలోని ప్రజానీకాన్ని కూడా విడిచిపెట్టలేదు. ఆ నివేదిక ఓఈసీడీ దేశాలలో పది కోట్ల మంది అల్పాదాయ వర్గాల పేదలు ఉన్నారని, 20 కోట్ల మంది 60 సంవత్సరాలు దాటి బ్రతకకపోవచ్చని, పది కోట్ల మందికి ఇళ్లు లేవని, 3.70కోట్ల మంది నిరుద్యోగులని పేర్కొంది.
మనిషిని, ప్రకృతిని తన లాభాపేక్షణ వలన ప్రపంచ పెట్టుబడిదారీ విధానం వల్ల ప్రపంచ పర్యావరణానికి ముప్పు తెచ్చిపెట్టింది. భోగ భాగ్యాలతో తులతూగే సంపన్న దేశాలు అతి నిర్లక్ష్యంగా భూమిపై గల వనరులను వినియోగించడం వల్ల పర్యావరణం దిగజారి భూగోళానికే ప్రమాదం ఏర్పడింది.
ఇలాంటి ప్రమాదకర పరిస్థితులలో ఫైనాన్స్ పెట్టుబడి ప్రోద్బలంతో సాగుతున్న వినాశకర ప్రపంచీకరణను వెనక్కు నెట్టడం మినహా మరో దారి లేదు. ప్రపంచీకరణను ప్రతిఘటించడంలో నికరమైన పాత్ర నిర్వహించగలిగేది కార్మికవర్గం తప్ప వేరొకటి లేదు.
కార్మికవర్గ నాయకత్వంలో అన్ని తరగతుల శ్రమజీవులు సంఘటితమై ప్రతిఘటనకు పూనుకుంటే తప్ప ప్రస్తుతం సాగుతున్న సామ్రాజ్యవాదుల ప్రపంచీకరణ దాడిని ఎదిరించడం సాధ్యం కాదు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి