అగ్ని సరస్సున వికసించిన వజ్రం మేడే



    
                         
                  కార్మికుల త్యాగాల కొలిమిలో పుట్టింది 
                  మే డే..
                  మేడే కార్మికులకు పండుగ దినం కాదు. 
                  అది కార్మికుల హక్కుల దీక్షా దినం

                " ప్రపంచ కార్మికులారా! ఏకం కండి! పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప" అంటూ '8 గంటల పని కోసం కార్మిక వర్గం కదం తొక్కిన దినం మేడే. త్యాగాలబాటలో ఎర్రబాటలో పోరాడి హక్కులను సాధించుకున్న దినం మేడే. ఇది అంతర్జాతీయ దినం. ప్రపంచ కార్మికులందరూ ముక్తకంఠంతో నినదించే సమైక్యతా దినం మేడే
            మేడే స్ఫూర్తి నేటికీ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కార్మిక సంఘాలన్నీ ప్రదర్శనలు, బహిరంగసభలు జరుపుతూనే
ఉన్నాయి. ఇలా మేడేకు ప్రాముఖ్యత ఎలా వచ్చింది? మేడే ఎలా ఆవిర్భవించింది? ఎందువల్ల కార్మికవర్గం మేడేను జరుపుకుంటోంది? మేడే ప్రాముఖ్యత రోజురోజుకూ ఎందుకు పెరుగుతోంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్లాలి.
వెళ్లామా!
             ధనస్వామ్యం పదఘట్టనలో పీడిత లోకం అలమటిస్తున్న సందర్భమది. 19వ శతాబ్దమంతా పారిశ్రామిక విప్లవంతో సమాజంలో పెనుమార్పులు వచ్చాయి. యంత్రాలు వచ్చాయి. కరెంటు వచ్చింది. కరెంటు దీపం లేని కాలంలో ప్రొద్దు పొడిచినప్పటి నుండి ప్రొద్దుగుంకేవరకూ పని చేయించేవారు. కరెంటు దీపం వచ్చాక రాత్రిపూట కూడా పనులు చేయించడం మొదలు పెట్టారు. యజమానులు స్పష్టమైన పనిగంటలు లేకుండా పొద్దస్తమానం చాకిరీ చేయించుకునేవారు. ఉదయం వెళ్లిన కార్మికుడు ఏ అర్ధరాత్రితో ఇంటికి దొంగలా చేరుకునే వాడు. ఒళ్లంతా హూనమై కాసింత తిని నడుం వాల్చేవాడు. వీటికి తోడు అతి తక్కువ వేతనాలు ఉండేవి. కనీస సదుపాయాలు లేవు. చట్టబద్ధమైన రక్షణ లేదు. ఇలాంటి మూర్ఖమైన, నగ్నమైన దోపిడీ కార్మికులపై కొనసాగుతుండేది.
             శ్రమజీవుల గొంతుకలన్నీ ఒకటవసాగాయి. సెప్టెంబర్ 28, 1864లో సెయింట్ మార్టిన్ హాల్ లో  అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐడబ్ల్యూఏ) ఏర్పాటైంది.ఇది శ్రమజీవుల సంఘీభావ పరంపరలో ఒక పెద్ద మైలురాయి. ఈ సంఘం అన్ని దేశాల్లోని కార్మికుల పోరాటాలకు మద్దతునిచ్చింది. అవసరమైనపుడు ఆర్థిక సహాయం చేయటానికి ముందుకొచ్చింది.
                1866 ఏప్రిల్ 18న లండన్ వైర్ గ్రీటింగ్ ఫ్యాక్టరీ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. యాజమాన్యం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కొత్త కార్మికులను పాతవారి స్థానంలో ఇతర దేశాల నుంచి పిలుచుకుంది. డబ్ల్యూఏ ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ దేశాల్లోని కార్మికుల మద్దతు కోరింది. ఫలితంగా యజమానుల ఆట సాగలేదు. సమ్మె జయప్రదమైంది. డిమాండ్లు నెరవేరాయి.
              1868లో ఇనీవాలో జరిగిన 3వేల మంది భవన నిర్మాణ కార్మికుల సమ్మె జర్మనీ, ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, బెల్జియం కార్మికుల సంఘీభావంతో విజయవంతమైంది. 


1869లో బెల్జియం దేశంలోని గని కార్మికుల సమ్మెకు ఐడబ్ల్యూఏ పిలుపుతో అంతర్జాతీయ సంఘీభావం వ్యక్తమైంది. గని కార్మికులపై ఆనాటి ప్రభుత్వం పోలీసు చర్య జరిపింది. కార్మికులు క్షతగాత్రులయ్యారు. బాధిత కుటుంబాల కోసం ఐడబ్ల్యూఏ విధులు సేకరించి పంపింది.
          1871లో పారిస్ కమ్యూన్ ఘటన అంతర్జాతీయంగా కార్మికులకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. పారిస్ కమ్యూన్ లో
కార్మిక వర్గం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. ఇది మొత్తం కార్మిక వర్గ చైతన్య పోరాటంలో మొట్టమొదటి మైలురాయి.


కానీ ఒకటిన్నర నెలలోనే పెట్టుబడీదారీ వర్గం ఆ ప్రభుత్వాన్ని కుట్రపన్ని పతనం చేసింది.ఇది కార్మికవర్గానికి నిరాశ కలిగించింది. అప్పటికి మార్క్స్ ఉన్నాడు.ఆసంఘటన అతని సిద్ధాంతాన్ని రుజువు చేసింది. అందుకే కార్మిక వర్గం అధికారంలోకి వచ్చాక కొంతకాలం నిరంకుశంగా ఉండి పెట్టుబడీదారీ విధానం తిరిగి తలెత్తకుండా జాగ్రత్త పడాలన్నాడు.
         1871 ఏప్రిల్ 6న పారిస్ కమ్యూన్ కార్మిక ప్రభుత్వానికి మద్దతుగా లండన్లో లక్షలాది మందితో ప్రదర్శన జరిపారు. నిధులు సేకరించి పంపారు. పారిస్ కమ్యూన్ సంఘటనతో మిగతా దేశాల్లోని కార్మికులు, పాలకులు తమ దేశాల్లోని అంతర్జాతీయ కార్మిక సంఘంపై ఉక్కుపాదం మోపారు. దాంతో 1876 నాటికీ సంఘంకార్యకలాపాలుతగ్గిపోయాయి. అయినప్పటికీ కార్మికుల్లో చైతన్యం పెరిగింది. 8 గంటల పని విధానం కావాలన్న చైతన్యం అన్ని దేశాలకార్మికుల్లో ప్రజలింది. అమెరికాలోని చికాగోలో కార్మికుల 8 గంటల పని హక్కు నినాదం ప్రపంచ కార్మికుల సింహ గర్జనగా మారింది. 


ఈ నేపథ్యంలో 1806లో అమెరికాలోని కార్మికులు, తమ యజమానులు అత్యంత అమానుషమైన పరిస్థితుల్లో తమతో  రోజుకు 19 నుంచి 20 గంటల సేపు పని చేయిస్తున్నారని ఆందోళన చేశారు. పది గంటల పని దినాన్ని కోరారు. ఈ కోర్కెను కోరుతూ 1827లో ఉప్పర పని కార్మికులు సమ్మె చేశారు. వాన్ బురేన్ నాయకత్వంలో ఉండిన అమెరికా ఫెడరల్
ప్రభుత్వం కార్మికుల పోరాటానికి తలొగ్గి, ప్రభుత్వ కార్మికులందరికీ పది గంటల పని దినాలను నిర్ణయించింది.  
 
            ఇలా 30 ఏళ్లు గడిచాయి.

         1857లో కార్మికులు  పది గంటల పని విధానాన్ని ప్రభుత్వ ప్రయివేటు రంగాలన్నీ అమలు జరపాలని కోరారు. 


కార్మికులు ఈ డిమాండ్ తో ఆందోళనలు ప్రారంభించారు. కానీ ప్రభుత్వం ఆ కార్మికులను అరెస్ట్ చేసింది.1864 అర్బోబర్ లో అమెరికా, కెనడా ఆర్గనైజ్డ్ లేబర్ యూనియన్ల 4వ మహాసభ జరిగింది. 1886లో ఈ యూనియన్ అమెరికా కార్మికుల సమాఖ్యగా పేరు మార్చుకుంది. 1886 మే నుండి 8 గంటల పని చట్టబద్ధమైన పని దినంగా ఉండాలని సమాఖ్య పిలుపునిచ్చింది. ఈ పిలుపుపై కార్మికుల్లో గొప్ప స్పందన వచ్చింది. ప్రభుత్వం అంగీకరించకపోతే  మే 1 నుండి సమ్మెలు జరపాలని కూడా పిలుపునిచ్చింది.
        రేపటి ఉషస్సు కోసం  కార్మిక లోకం ఏకం కావడం అనివార్యమైంది.1886 మే 1వ తేదీకి కొద్ది మాసాల ముందు నుంచి వలస వచ్చిన కార్మికులు, స్థానిక కార్మికులు, పురుషులు, మహిళలు, బానిసలు, అందరూ పని గంటల తగ్గింపుకై పోరాటంలోకి రావడం మొదలైంది. ఆ పోరాటంలోకి 25 లక్షల మంది ప్రవేశించారు. 

ఒక్క చికాగో నగరంలోనే 4లక్షల మంది మే 1 సమ్మెకు మద్దతు పలుకుతూ ఉద్యమంలోకి వచ్చారు.
యజమానులు, అమెరికా ప్రభుత్వం ఈ సమ్మెను అణచివేయాలని నిశ్చయించాయి. 
              1886 మే ఒకటవ తేదీన కార్మికులు సమ్మెను ప్రారంభించారు. మే మూడో తేదీన చికాగోలో గల మెక్ కార్మిక్ రీపర్ ఫ్యాక్టరీలో 8 గంటల పని దినం కోరుతూ కార్మికులు సమ్మెకు దిగారు. 
             వారికి బదులుగా ఇతర కార్మికులను పనిలోకి పెట్టుకుంది యాజమాన్యం. దీనికి నిరసనగా కార్మికులు ప్రదర్శనలు జరిపారు. ఈ ప్రదర్శనను పోలీసులు అడ్డుకుని కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఇద్దరు కార్మికులు మరణించారు. చాలామంది గాయపడ్డారు.

         పోలీసుల దురాగతానికి నిరసనగా 1886 మే నాలుగో తేదీన నగరంలో 'హే' మార్కెట్ ప్రాంతంలో ప్రదర్శన,బహిరంగ సభ ఏర్పాటు చేశారు. 

పట్టిన పిడికెళ్లే పోటెత్తిన జెండాగా మారింది. ఆనాటి ఊరేగింపులో ఎవరో 'కసి తీర్చుకుందాం.. సాయుధంగానే ఈ కక్ష తీరాలి' అని కూడా నినాదాలు ఇచ్చారు. దీంతో పోలీసులకు దడ పుట్టింది.
           జహిరంగసభ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఆవేశపూరిత ప్రసంగాలు సహజంగానే జరిగాయి. కేవలం ఎనిమిది గంటలే కాదు, పెట్టుబడిదారీ విధానాన్ని సమూలంగా మార్చేదాకా మన పోరాటం ఆగదు' అని మరికొందరు నినాదాలు ఇచ్చారు. వీరిని ప్రభుత్వం అనార్కిస్టులుగా ఆరోపించింది. యజమానులకు ఈ పోరాటం కంటగింపుగా ఉంది. దీన్ని భగ్నం చేయాలన్న తలంపు వారిలో ఉంది. 
          అప్పుడు సమయం రాత్రి పది గంటల వుతోంది. అక్కడ  200 మంది కన్నా ఎక్కువ లేరు. కార్మిక నాయకుడు పార్సన్స్, ఫీల్డెన్ ను సభకు పరిచయం చేస్తున్నాడు. ఫీల్డన్ పది నిమిషాలు ప్రసంగించాడు. ఫీల్డన్ ప్రసంగం ముగింపు దశలో ఉంది.
            జోన్ ఫీల్డ్, విలియం ల నాయకత్వంలో 180 మంది పోలీసుల దళం అక్కడికి చేరింది. పోలీస్ ట్రక్ కూడా దగ్గరలోనే నిలిచి ఉంది. కెప్టెన్ వార్డ్ సభికుల వైపు తిరి అక్కడున్న వారంతా వెళ్లిపోవాలని ఆజ్ఞాపించాడు. "మేము శాంతియుతంగా కార్యక్రమం జరుపుతున్నాం గదా!ఎందుకు వెళ్లిపోవాలి"అని ఫీల్డెన్ ప్రశ్నించాడు. 
                సరిగ్గా అదే సమయంలో పోలీసుల మధ్య ఒక బాంబు పడింది. ఈ బాంబు తీవ్రతకు ఒక పోలీసు అధికారి వెంటనే మరణించాడు. 


దాంతో పోలీసులు సభికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు కార్మికులు మరణించారు. ఏది జరగకూడదని కార్మికులను కున్నారో అదే చికాగో వీధిలో  జరిగింది. 
               
             చికాగో నేల కార్మికుల రక్తంతో  తడిసింది.

          దుష్ప్రచారం, విధ్వంసం రాజ్యమేలిన తరుణంలో ఆ బాంబును సోషలిస్టులు, అనార్కిస్టులు, కమ్యూనిస్టులు వేసినారని ప్రచారం చేశాయి పాలకవర్గాలు. ఫలితంగా
కార్మిక నివాస ప్రాంతాలన్నింటిపై దాడులు జరిగాయి. బలవంతంగా గృహాలన్నీ సోదా చేశారు. వారంటు లేకుండా ఇళ్లపై దాడులు జరిగాయి. అమాయకులను చిత్రహింసలకు గురి చేశారు. చికాగో నగరమంతా విధ్వంసపాలన జరిగింది. పోలీసులు కార్మిక నాయకులను, అనుమానితు లను 'రాడికల్స్' పేరుతో నిర్బంధంలోకి తీసుకున్నారు.
            మే 27వతేదీన 31 మందిపై నేరం ఆరోపిస్తూ కేసులు పెట్టారు. పోలీసులు సమ్మెకు నాయకత్వం వహించిన అల్సర్స్ పార్సన్స్, అగస్ట్ స్పైస్, ఆడాల్ఫ్ ఫిషర్,జార్జి ఏంగిల్స్, లింగ్, స్క్వాజ్, నీటీ, ఫీల్డన్లను అరెస్ట్ చేశారు.

            విచారణ ప్రారంభమైంది. నిందితులలో ఎవరైనా బాంబు విసిరినట్లు గానీ, పెట్టినట్లు గానీ ప్రభుత్వం రుజువులేమీ చూపించలేకపోయింది. అలాగే నిందితులు బాంబు విసిరినట్లుగా కూడా ఎలాంటి ఆధారాలూ చూపలేకపోయింది. ఈ చర్యను నిందితులు ప్రోత్సహించినట్లు గానీ, సమర్థించినట్లు గానీ రుజువు చేయలేకపోయింది. పైగా వారి ఉపన్యాసాలన్నీ శాంతియుతంగా ఉన్నాయని, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలూ లేవని ఆనాటి మేయర్ హేరిసన్ వాంగ్మూలం ఇచ్చాడు. 

            ఉపన్యాసకుడు పార్సన్స్ తనతోపాటు తన భార్యను, ఇద్దరు పిల్లలను సభకు తీసుకొచ్చాడు. ఇది వారి కార్యక్రమం శాంతియుతంగా ఉండాలని వారు కోరుకున్నారనడానికి నిదర్శనంగా నిలిచింది. అయినప్పటికీ వీరంతా కుట్రదారులని, వీరి ఉద్యమాన్ని తీవ్రంగా ఆలచివేయాలంటే, ఇలాంటి పోరాటవాదులకు హెచ్చరికగా ఉండాలంటే వీరి ఉరి తీయాలని కోర్టులో యజమానులు వాదించారు.

          ఎనిమిది మంది కార్మిక నాయకులను ఆరాచకవాదులనే పేరుతో, హత్య కేసులు పెట్టి ఒక తంతుగా నిర్వహించారు.
         ‌పాలవకర్గాలకు అండగా నిలిచిన న్యాయస్థానం ప్రస్తుతం న్యాయస్థానాలు పాలకవర్గాలకు ఏ రకంగా కొమ్ము కాస్తున్నాయో, అలాగే ఆనాటి న్యాయస్థానం న్యాయాన్ని పక్కన పెట్టి వారికి ఉరిశిక్ష విధించింది. ఫలితంగా అల్సర్స్ పార్సన్స్ ఆగస్ట్ స్పైస్, ఆడల్ఫ్ ఫిషర్, జార్జి ఏంగిల్స్, స్పేస్ లను 1987 నవంబర్ 11న ఉరి తీశారు.

                "మా మాటలకన్నా మా మూగబోయిన గొంతులే రణఘోషగా మోగే కాలం తప్పక వస్తుంది" అంటూ ఉరితీతకు ముందు వారంతా గర్జించారు. వారు ఎలుగెత్తిన శంఖారావం ఇప్పటికీ ప్రపంచమంతా వినిపిస్తోంది.

            చికాగో చరిత్రలో కనీవినీ ఎరుగనంత పెద్ద ప్రదర్శన జరిగింది. వారి శవపేటికల వాహనం వెంబడి దాదాపు 5 లక్షల మందివచ్చి వారికి నివాళుల ర్పించారని అంచనా. వాల్టీమ్ శ్మశానంలో వారి శవాలను ఖననం చేశారు. తరువాత వారి స్మారక చిహ్నంను అక్కడ ఆవిష్కరించారు. అట్టమీద బొమ్మలో ఉన్నదే ఆ స్మారక చిహ్నం. ఆ స్మృతి చిహ్నంపై అగస్ట్ స్పీస్ చివరి మాటలు ఇలా రాశారు. "మాయమాటల కన్నా మా మూగబోయిన గొంతులే రణఘోషగా మోగే కాలం తప్పక వస్తుంది" అని.
            

         తక్కిన నాయకులకు న్యాయస్థానం యావజ్జీవ శిక్ష ప్రకటించింది. నేరం రుజువు కాలేదని 1893లో విడుదల చేశారు. అంటే ఉరి శిక్ష, యావజ్జీవ శిక్ష కార్మికులపై పెట్టిన అక్రమ కేసులని తేలిపోయింది. అమెరికా న్యాయం ఎంత బూటకమైందో ఆనాడే ప్రపంచానికి బహిర్గతమైంది. 
        అమెరికా చరిత్రలోనే ఈ హే మార్కెట్ కేసు విచారణ ఒక తంతులా జరిగి న్యాయం అపహాస్యం పాలై నిందితులు తీరని అన్యాయానికి గురైనారని విజ్ఞులు ఏనాడో తేల్చి చెప్పారు.

         వీరి త్యాగాలకు గుర్తుగా కార్మిక పోరాటాలకు చిహ్నంగా ప్రభుత్వాలు, యజమానుల అణచివేతలు బూటకపు శిక్షలు, న్యాయాలకు వ్యతిరేకంగా మే 1ని ప్రపంచ కార్మిక దినంగా జరపాలని 1889లో పారిస్ లో జరిగిన సోషలిస్టు మొదటి ఇంటర్నేషనల్ మహాసభ నిర్ణయించింది. మే 1న ప్రపంచ కార్మికులంతా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించాలని తీర్మానించారు. కార్మిక వర్గం కోరుతున్న కోర్కె అంతర్జాతీ యమైనది. ఆ కోర్కెను అణచివేస్తున్న పెట్టుబడిదారులు అంతర్జాతీయంగా ఉన్నారు. కావున కార్మికులు అంతర్జాతీయంగా ఐక్యం కావాలని ఈ పిలుపు సారాంశం. దీన్ని యజమామల కనుసన్నల్లో మెలిగే ప్రభుత్వాలు గుర్తించాయి. అందుకనే కార్మిక వర్గాన్ని సంఘటితం కాకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి.

          1890 మే 1వ తేదీన ఇటలీలో కార్మికులు నిర్వహించిన ప్రదర్శన పై పోలీసులు కాల్పులు జరిపారు. రష్యా, బ్రెజిల్, ఐర్లాండ్ దేశాలలో మొట్టమొదటిసారిగా 1891లో మేడే ప్రదర్శన జరిపారు. చైనాలో 1920లో మేడే జరిపారు. రష్యా
విప్లవ స్ఫూర్తితో 1927లో ఇండియాలో కలకత్తా, బొంబాయి, మద్రాసులో కార్మికులు మేడే జరిపారు. 1905లో ప్రజల తిరుగుబాటు సంవత్సరంగా మేడేను నిర్వహించాలని, ఫ్యాక్టరీలు, మిల్లులో పని నిలుపుదల చేయాలని లెనిన్ పిలుపునిచ్చారు. 2004 మే 1న ఇంగ్లండ్ లో జరిగిన ప్రదర్శనలో కార్మికులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. అందుకే దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే మేడే ప్రభావం ఇప్పటికీ కార్మిక వర్గంపై ఉందని, పెట్టుబడిదారుల గుండెల్లో ఆది రైళ్లు పరిగెత్తిస్తుందని అన్ని దేశాల్లో మేడే నిరంతరాయంగా అదే స్ఫూర్తితో కార్మికులు నిర్వహిస్తున్నారు.

మన దేశంలో మేడే

        మన దేశంలో 1862లో హౌరా రైల్వే కార్మికులు 8 గంటల పని దినం కొరకు డిమాండ్ చేశారు. మేడే ఏర్పడిన అనంతరం దేశంలోని కార్మికులు ఐక్యంగా మేడేను నిర్వహించలేకపోయారు. కేవలం కమ్యూనిస్టు పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు మాత్యమే ఆచరిస్తున్నాయి.
          1920లో బొంబాయిలో వస్ర కార్మికుల సమ్మె జరిగింది. జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 2 వరకూ జరిగింది. సమ్మెలు ఐక్యంగా జరిగేవి కావు. కానీ బయటివారి జోక్యం వల్ల కార్మికులు ఐక్యంగా పోరాడేవారు. వారి పోరాట ఫలితంగా
యాజమాన్యాలు 12 గంటల పనిని 10 గంటలకు తగ్గించాయి. బోనస్ చెల్లించాయి. సమ్మె కాలంలో రెండుసార్లు సైన్యం కాల్పులు జరిపింది. ఇద్దరు కార్మికులు మరణించారు.

           మన దేశంలో మొట్టమొదటిసారిగా మేడేను 1923లో మద్రాసు (ఇప్పటి చెన్నయ్) నగరంలో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ సందర్భంలో ఎర్రజెండాను ఎగురవేశారు. ఆ పార్టీ నాయకుడు సింగరవేలు చిట్టియార్ 1923లో రెండు చోట్ల మేడే నిర్వహణకు సన్నాహాలు చేశారు. మద్రాసు హైకోర్టు ఎదురుగా ఒక సమావేశం, మరొకటి ట్రిప్లికేన్ బీచ్ లో. 
        దేశంలో చాలా రాష్ట్రాల్లో మేడేను సెలవు దినంగా ప్రకటించారు. మేడే సాధారణంగా కమ్యూనిస్టు, సోషలిస్టు పార్టీ ఉద్యమాలకు సంబంధించినదిగా ఎక్కువమంది భావిస్తారు. లేబర్ డేను హిందీలో కామ్ గార్  దిన్ అని, మరాఠీలో కామ్ గార్ దివస్ అని, తమిళంలో ఉజైవర్ దినం అని అంటారు.
           1927లో బొంబాయిలో కార్మికులు మేడే జరిపారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా బొంబాయిలో 90 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అంతర్జాతీయంగా సంఘీభావం కార్మికుల్లో వ్యక్తమైంది. ఆ సందర్భంలోనే స్వాతంత్ర్యానంతరం మాత్రం కార్మికవర్గ సంస్థ ఏఐటీయూసీ నుంచి ఐఎన్టీయూసీ విడిపోయింది. కాంగ్రెస్ అనుబంధ సంఘంగా మారింది. ఏఐటీయూసీ విధానాలతో  విభేదించి  1970లో ఏఐటీయూసీ నుంచి సీఐటీయూ విడిపోయింది.ఏఐటియుసి సిపిఐ కి సిఐటియు సి పి ఎం కు అనుబంధంగా మారాయి. బి ఎం ఎస్ కార్మిక సంఘం బి.జెపి కి అనుబంధం గా ఉంది.
           బి ఎం ఎస్ మేడేను జరపక పోగా విశ్వకర్మ జయంతి ని మేడే గా జరపాలని భావిస్తోంది. చాలా కార్మిక సంఘాలు 'మేడే'ను పండుగ దినంగా జరుపుతున్నాయి. వాస్తవానికి ఇది ఒక దీక్షా దినం.కార్మికుల పక్షాన నిలబడి పోరాడే సంఘాలు మాత్రం 'మేడే'ను దీక్షాదినంగా పరిగణిస్తున్నాయి.

 దీన్నే మహాకవి శ్రీశ్రీ తన 'దేశ చరిత్ర'లో ఇలా వినిపిస్తాడు.

చైనాలో రిక్షావాలా
చెక్ దేశపు గని పనిమనిషి
ఐర్లాండున ఓడకలాసీ
అణగారిన ఆర్తులందరూ
హెటహిట్, జాలూ, నీగ్రో
ఖండాంతర నానాజాతులు
చాటిస్తారొక చారిత్రక యదార్థ తత్వం
దీర్ఘశృతిలో, తీవ్ర ధ్వనిలో వినిపిస్తారాక విప్లవ శంఖం.

           ప్రపంచీకరణ నేపథ్యంలో పని భారం పెరుగుతోంది. టెక్నాలజీ పెరిగింది. దీన్ని ఉపయో గించుకుంటూ కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగి స్తున్నారు. కాంట్రాక్టు కార్మికులు పెరిగారు. ఉపాధి కరువై నిరుద్యోగులవుతున్నారు. అభద్రతాభావం పెరిగింది. పనిగంటలు, సమ్మె చేసే హక్కు పెన్షన్ తదితర హక్కుల్ని తొలగిస్తున్నాయి.దాంతో అమర వీరుల త్యాగాలు వృధా పోకుండా కార్మికులు తమ హక్కులు కోసం పోరాటం చేస్తున్నారు. 

         ప్రభుత్వాలు  పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా కరోనా ముసుగులో  సరళీకరణ విధానాలు కొనసాగిస్తూ , పనిచేస్తున్నాయి. ఇవన్నీ అమెరికాలాంటి సంపన్న దేశాల కోసం  అమలు చేస్తున్నవే. అందుకే అన్ని దేశాల్లోని కార్మికులు, ఉద్యోగులు "ఉపాధి రహిత అభివృద్ధి" పేరిట జరిగే సంస్కరణలను వ్యతిరేకిస్తూ 'మేడే' స్ఫూర్తితో ఐక్య పోరాటాలను నడపాల్సిన అవసరం ఉంది.

    __ పిళ్లా కుమారస్వామి,9490122229


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?