కార్మికులూ కమ్యూనిస్టులూ 1
శ్రామిక వర్గు ప్రయోజనామే కమ్యూనిస్టుల ప్రయోజనం
మొత్తం శ్రామికవర్గంతో కమ్యూనిస్టుల సంబంధం ఎలా ఉంటుంది? కమ్యూనిస్టులు ఇతర శ్రామికవర్గ పార్టీలకు వ్యతిరేకంగా వేరే పార్టీగా ఏర్పడరు. శ్రామికవర్గ ఉమ్మడి ప్రయోజనాలకు భిన్నంగా విడిగా కమ్యూనిస్టులకు ఏ ప్రయోజనాలూ లేవు.
వాళ్లు శ్రామికవర్గ ఉద్యమాన్ని తమకు నచ్చిన మూసలో పోత పోయడానికి ఏ సొంత సంకుచిత సూత్రాలను రూపొందించరు.
కమ్యూనిస్టులకూ ఇతర శ్రామికవర్గ పార్టీలకూ గల తేడా ఇంత మాత్రమే:
1. వివిధ దేశాల శ్రామికులు చేసే జాతీయ పోరాటాల్లో సమస్త శ్రామికవర్గానికీ గల ఉమ్మడి ప్రయోజనాలను కమ్యూనిస్టులు గుర్తుచేస్తారు. వాటికి వారు ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడ శ్రామికుల జాతీయతతో ప్రమేయం లేదు. 2. బూర్జువా వర్గంతో కార్మికవర్గం చేసే పోరాటం వివిధ దశలుగా అభివృద్ధి చెందుతుంది. ఆ దశలన్నింటిలోనూ కమ్యూనిస్టులు ప్రతిచోటా ఎప్పుడూ శ్రామిక ఉద్యమం మొత్తానికి ప్రతినిధులుగా ఉంటారు.
కనుక, కమ్యూనిస్టులు ఆచరణలో ప్రతి దేశంలోనూ కార్మికవర్గ పార్టీలన్నిటికంటే పురోగాములుగానూ అత్యంత దృఢ సంకల్పులుగానూ ఉంటారు. మిగతా పార్టీలన్నిటినీ వారు ముందుకు నెడతారు. మరోవైపున కార్మికవర్గం పయనించే మార్గాన్ని మొత్తంగా వారు సైద్ధాంతికంగా గ్రహించగలరు. మొత్తంగా కార్మికోద్యమ పరిస్థితుల్నీ దాని సాధారణ అంతిమ ఫలితాల్నీ కూడా వారు అర్థం చేసుకోగలరు. కనుక, ఈ విషయంలో అత్యధిక కార్మిక జనసామాన్యానికి లేని వెసులుబాటు వారికి ఉంటుంది.
కమ్యూనిస్టుల తక్షణ కర్తవ్యం ఇతర కార్మిక వర్గ పార్టీలకి ఉన్నదే. కార్మికులు ఒక వర్గంగా రూపొందాలి; బూర్జువా వర్గ ఆధిపత్యాన్ని కూలదోయాలి; కార్మికవర్గం రాజకీయ అధికారాన్ని గెలుచుకోవాలి. ఎవరో ఒక అభినవ విశ్వ సంస్కర్త కనుగొన్న భావాలపైనో లేదా సూత్రాలపైనో కమ్యూనిస్టుల నిర్ధారణలు ఆధారపడవు.
స్థూలంగా చెప్పాలంటే నేటి వర్గ పోరాటాల నుంచీ మన కళ్ల ముందే జరుగుతున్న చారిత్రిక ఉద్యమం నుంచీ తలెత్తే వాస్తవ సంబంధాలను అవి వ్యక్తం చేస్తాయి. అంతే. ఇక, అమలులో ఉన్న ఆస్తి సంబంధాలను రద్దు చేయడమన్నది కమ్యూనిజం ప్రత్యేకత కానే కాదు.
చారిత్రిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కారణంగా గతంలో ఆస్తి సంబంధాలన్నీ ఎప్పటికప్పుడు చారిత్రిక మార్పులకు గురవుతూనే ఉన్నాయి.
ఉదాహరణకు ఫ్రెంచి విప్లవం బూర్జువా ఆస్తికి అనుకూలంగా ఫ్యూడల్ ఆస్తిని రద్దు చేసింది.
కమ్యూనిజం ప్రత్యేకత ఏ ఆస్తినయినా రద్దు చేయడం కాదు. బూర్జువా ఆస్తిని రద్దు చేయడం మాత్రమే. వర్గ వైరుధ్యాల మీదా, అల్ప సంఖ్యాకులు అధిక సంఖ్యాకులను దోచుకోవడం మీద ఆధారపడి ఉత్పత్తినీ అనుభోగాన్నీ నిర్వహించే వ్యవస్థలన్నింటిలోనూ బూర్జువా సొంత ఆస్తి వ్యవస్థే చివరిది. అది అత్యంత ర్ణమైనది.
ఈ అర్థంలో కమ్యూనిస్టుల సిద్ధాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పొచ్చు. సొంత ఆస్తి రద్దు.
మనుషులు కష్టపడి స్వయంగా ఆస్తి సంపాదించుకొనే హక్కును రద్దు చేస్తామని కమ్యూనిస్టులమైన మమ్మల్ని నిందిస్తున్నారు. అన్నిరకాల వ్యక్తిగత స్వేచ్ఛకీ,
స్వాతంత్ర్యానికీ, కార్యకలాపాలకూ ఆ ఆస్తే మూలం అని వారంటున్నారు. కష్టపడి సంపాదించిన ఆస్తి అట! స్వయంగా సంపాయించిన ఆస్తి అట!
బూర్జువా ఆస్తి అనేది రాకపూర్వమే సన్నకారు రైతులూ చిన్న చేతిపనులవాళ్లూ సంపాదించుకొంటున్న ఆస్తి గురించి మీరు మాట్లాడుతోంది. ఆ ఆస్తిని మేము రద్దు చేయాల్సిన అవసరమే లేదు. పారిశ్రామిక అభివృద్ధి వల్ల అది ఇప్పటికే చాలా వరకూ నాశనం అయ్యింది. రోజూ ఇంకా నాశనం అవుతూనే ఉంది.
లేదా మీరంటున్నది బూర్జువా సొంత ఆస్తి గురించా?
కూలి పని వల్ల కార్మికుడికి ఆస్తి ఏమైనా పోగుబడుతోందా? వీసమంత కూడా లేదు. కూలి పని పెట్టుబడిని సృష్టిస్తుంది. అంటే కూలి పనిని దోచుకొనే ఆస్తిని పుట్టిస్తుంది. మళ్లీ తాజాగా దోచుకోడానికి కొత్తగా కూలీలను పుట్టిస్తే తప్ప పెరగలేని ఆస్తిని సృష్టిస్తుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆస్తి అనేది పెట్టుబడికీ కూలిపనికీ మధ్య వైరుధ్యంపైన ఆధారపడి ఉంది. వైరుధ్యంలో ఉన్న ఈ రెంటినీ చూద్దాం.
పెట్టుబడిదారుడిగా ఉండడం అంటే కేవలం ఉత్పత్తిలో వ్యక్తిగత హోదా మాత్రమే కాదు, సామాజికంగా కూడా హోదా కలిగి ఉండడం. పెట్టుబడి అనేది సమష్టి ఉత్పాదితం. అనేకమంది ఐక్యంగా కృషి చేస్తేనే అది సచేతనంగా ఉంటుంది. అంతిమంగా చెప్పాలంటే, మొత్తం సమాజ సభ్యులందరి సమైక్య చర్యలవల్లనే అది సాధ్యమవుతుంది.
కనుక పెట్టుబడి ఒక వ్యక్తిగత శక్తి కాదు. అది ఒక సామాజిక శక్తి. కాబట్టి, పెట్టుబడిని ఉమ్మడి ఆస్తిగా మారిస్తే, అంటే, మొత్తం సమాజ సభ్యులందరి ఆస్తిగా మారిస్తే, వ్యక్తి ఆస్తిని సామాజిక ఆస్తిగా మార్చినట్టు కాదు. అలా చేయడం వల్ల ఆస్తికి అంతకుముందున్న సామాజిక స్వభావం మారుతుంది; ఆస్తి తన వర్గ స్వభావాన్ని కోల్పోతుంది.
___మార్క్స్ ఏంగెల్స్
(కమ్యూనిస్టు ప్రణాళిక)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి