బూర్జువాలూ కార్మికులూ


*బూర్జువాలూ కార్మికులూ*

ఇంతవరకూ సాగిన సమాజ చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే. ** స్వతంత్రుడూ బానిసా, పాలకవర్గ సభ్యుడూ సామాన్యుడూ, దొరా దాసుడూ, గిల్డులో వృత్తి సంఘ యజమానీ జర్నీమాన్, ఒక్క మాటలో చెప్పాలంటే పీడకుడూ పీడితుడూ ఒకరికి ఒకరు ఎదురూ బొదురూ శత్రువులుగా నిలబడ్డారు. ఒకప్పుడు ప్రచ్ఛన్నంగా, మరొకప్పుడు బాహాటంగా నిరంతరాయంగా పోరు జరిపారు. ఈ పోరు వల్ల ఒక్కోసారి సమాజం మొత్తంగా విప్లవాత్మక పునర్నిర్మాణానికి గురి అయింది. ఒక్కోసారి ఇరు వర్గాలూ సర్వనాశనం అయ్యాయి.

బూర్జువా వర్గం అంటే ఆధునిక పెట్టుబడిదారీ వర్గం. సామాజిక ఉత్పత్తి సాధనాల సొంతదార్లే బూర్జువాలు. వారు వేతన కార్మికుల్ని (కూలీలను) పనిలో పెట్టే యజమానులు. శ్రామిక వర్గం అంటే సొంత ఉత్పత్తి సాధనాలు లేనందున, బతకడానికి తమ శ్రమ శక్తిని ఇతరులకు అమ్ముకోక తప్పని వర్గం. అదే ఆధునిక కార్మికవర్గం. (1888 నాటి ఇంగ్లీషు ముద్రణకి ఏంగెల్స్ ఇచ్చిన వివరణ

** ఇక్కడ చరిత్ర అంటే ఆనాటి లిఖిత చరిత్ర మాత్రమే. కమ్యూనిస్టు ప్రణాళిక మొదట వెలువడిననాటికి వర్గాలూ ఆస్తి లేని ఆదిమ సమాజం గురించి ఏమీ తెలియదు. రష్యాలో ఒకప్పుడు భూమిపై ఉమ్మడి యాజమాన్యం ఉందని ప్రణాళిక వెలువడిన కొంత కాలానికి హక్స్ తౌసిన్ (August von Haxthausen, 1792-1866) కనుగొన్నాడు. జర్మన్ జాతులన్నీ ఆదిమ సమాజం నుంచే మొదలయ్యాయని మౌరర్ (Georg Ludwig von Maurer (1790-1872)) రుజువు చేశాడు. ఇండియా నుంచి ఐర్లండు దాకా ప్రతిచోటా గ్రామ సమాజాల్లో ఆదిమ సమాజపు జాడలు కనిపిస్తాయని ఆయన అన్నాడు. మోర్గాన్ (Lewis Henry Morgan, 1818-1881) ఆదిమ సమాజాల అంతర్నిర్మాణాన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. ఆదిమ ప్రజా సమూహాలు అంతరిస్తూనే సమాజం వేర్వేరు వర్గాల చివరికి శత్రువర్గాలుగానూ విడిపోతుంది. "నేను నా 'కుటుంబం పుట్టుక, సొంత ఆస్తి, రాజ్యాంగ యంత్రం' గ్రంథంలో ఆదిమ సమాజాల విచ్ఛిత్తిని వివరించడానికి యత్నించాను." అని ఏంగెల్స్ పేర్కొన్నాడు.

ఇంతకుముందున్న చారిత్రక యుగాల్లో సమాజం దాదాపు ప్రతిచోటా అనేక తరగతులుగా అనేక సాంఘిక అంతస్తులుగా విభజించబడింది. ఈ విభజన సంక్లిష్టంగా ఉండేది. ప్రాచీన రోమ్లో పాలక వర్గీయులూ వీరులూ సామాన్యులూ బానిసలూ ఉండేవారు. మధ్య యుగాల్లో ఫ్యూడల్ దొరలూ పరాధీన రైతులూ దాసులూ గిల్డు*లో యజమానులూ కార్మికులూ అప్రెంటిస్ లూ ఉండేవారు. దాదాపు ప్రతి వర్గంలోనూ తిరిగి అంతర్గతంగా అనేక అంతస్తులున్నాయి.

ఫ్యూడల్ సమాజపు శిధిలాల నుంచే ఆధునిక బూర్జువా వర్గం మొలకెత్తింది. అది వర్గ వైరుధ్యాలను రద్దు చేయలేదు. కాకుంటే, పాతవాటి స్థానంలో కొత్త వర్గాలనూ కొత్త దమన పద్ధతులనూ కొత్త పోరాట రూపాలనూ తెచ్చిపెట్టింది. అంతే.

మనది బూర్జువా యుగం. దీనికి విశేషమైన లక్షణమొకటి ఉంది: అది వర్గ వైరుధ్యాలను సరళం చేసింది. సమాజం అంతకంతకూ రెండు మహా శత్రు శిబిరాలుగా విడిపోతోంది. బూర్జువా వర్గమూ శ్రామిక వర్గమూ అనే రెండు మహా వర్గాలు ఒకదానికి సవాలుగా మరొకటి ఎదురు నిలిచాయి.

మధ్య యుగాల్లోని భూ దాసుల నుంచి చట్టబద్ధ హక్కులున్న బర్హర్లు (నగర స్వతంత్ర పౌరులు) పుట్టారు. వీరి నుంచే తొలి బూర్జువాలు తయారయ్యారు.

అమెరికా ఖండాన్నీ ఆఫ్రికా ఖండం చుట్టూ పోయే సముద్ర మార్గాన్నీ కనుక్కోవడం వల్ల అప్పుడే ఎదుగుతున్న బూర్జువా వర్గానికి కొత్తగా మరిన్ని అవకాశాలు వచ్చిపడ్డాయి. ఇండియా చైనా మార్కెట్లు, అమెరికాను వలసగా మార్చడము వలసలతో వాణిజ్యమూ, సరుకులూ డబ్బూ పెరగడమూ- ఇవన్నీ వాణిజ్యానికీ నౌకాయానానికీ పరిశ్రమకీ ఇంతకముందు ఎన్నడూ కనీవినీ ఎరుగనంతగా ప్రేరణ ఇచ్చాయి. కనుక తోస్తే పడిపోయే దశలో ఉన్న ఫ్యూడల్ సమాజంలో విప్లవ శక్తులు శీఘ్రంగా అభివృద్ధి చెందాయి.

ఫ్యూడల్ పరిశ్రమ రంగంపై గిల్డుల గుత్తాధిపత్యం ఉండింది. పరిశ్రమలో కొత్తవారికి ప్రవేశంలేని వ్యవస్థ అది. కొత్త మార్కెట్ల పెరుగుతున్న అవసరాలను

(* గిల్డుల్లో Guild-master పూర్తి సభ్యుడు. అతను గిల్టు యజమాని కాదనీ, గిల్డులో యజమాని అనీ ఏంగెల్స్ వివరణ ఇచ్చాడు. అందుకే గందరగోళాన్ని నివారించడానికి Guild master ని నేను వృత్తినంఘ యజమాని అని తెనిగించాను. గిల్డులో యజమానులకూ నిపుణులైన కార్మికులకూ సభ్యత్వం ఉంటుంది. అప్రెంటిస్ లకు ఉండదు.")

అది ఏమాత్రం తీర్చలేకపోయింది. కనుక దాని స్థానంలో కార్ఖానా వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థను నడిపే మధ్య తరగతివాళ్లు వృత్తి సంఘ యజమానులను పక్కకు నెట్టివేశారు. ప్రతి కార్ఖానాలోనూ శ్రమ విభజన పెరగడం వల్ల గిల్టుల్లో వివిధ వృత్తి సంఘాల మధ్య ఉన్న విభజన మాయమయింది.

ఇంకా మార్కెట్లు నిత్యం విస్తరిస్తూనే ఉన్నాయి. గిరాకీ అదేపనిగా పెరుగుతూనే ఉంది. కార్ఖానాల ఉత్పత్తి కూడా చాలలేదు. అప్పుడు ఆవిరియంత్రాలూ ఇతర యంత్రాలు వచ్చి పారిశ్రామిక ఉత్పత్తిలో విప్లవం తెచ్చాయి. భారీ ఆధునిక పరిశ్రమలు వచ్చాయి. కార్ఖానాలు పోయాయి. వాటిని నడిపిన మధ్య తరగతి పారిశ్రామికులు పోయి పారిశ్రామిక కోటీశ్వరులు వచ్చారు. వాళ్లే ఆధునిక బూర్జువాలు. వాళ్లే మొత్తం పారిశ్రామిక సైన్యానికి నాయకులు.

ఆధునిక పరిశ్రమ ప్రపంచ మార్కెటుని స్థాపించింది. దీనికి అమెరికా ఆవిష్కరణ అనేది మార్గం సుగమం చేసింది. దీని వల్ల వాణిజ్యమూ నౌకాయానమూ నేలపై రవాణా అపారంగా పెరిగాయి. ఈ అభివృద్ధి వల్ల తిరిగి పరిశ్రమ మరింతగా విస్తరించింది. పరిశ్రమలు, వాణిజ్యం, నౌకాయానం, రైల్వేలు ఇలా పెరిగే కొద్దీ బూర్జువా వర్గమూ పెరిగింది. దాని పెట్టుబడి పెరిగింది. మధ్య యుగాల నుంచి వచ్చిన వర్గాలన్నిటినీ అది వెనక్కి నెట్టేసింది.

దీనంతటి నుంచీ ఒక విషయాన్ని గమనిస్తాం: బూర్జువా వర్గం అనేది ఓ సుదీర్ఘమైన అభివృద్ధి క్రమంలో పుట్టింది. ఉత్పత్తి విధానాల్లోనూ మార్పిడి విధానాల్లోనూ జరిగిన అనేక విప్లవాల పరంపర కారణంగా అది పుట్టింది.

బూర్జువా వర్గం తన అభివృద్ధిలో అడుగు ముందుకువేసిన ప్రతి సందర్భంలోనూ రాజకీయంగా కూడా పురోగమించింది. ఒకనాడది ఫ్యూడల్ ప్రభువర్గం పెత్తనం కింద పీడిత వర్గం. అటువంటిది తర్వాత మధ్య యుగాల నగర కమ్యూన్ల*లో

(* ఇటలీలోనూ ఫ్రాన్సులోనూ నగరవాసులు తమ స్వతంత్ర సమాజాలకు కమ్యూన్లు అని పేరు పెట్టుకొన్నారు. ఫ్యూడల్ దొరల నుంచి స్వతంత్ర హక్కులను కొన్నిచోట్ల కొనుక్కున్నారు; కొన్నిచోట్ల గెలుచుకొన్నారు. ఫ్రాన్సులో తమ నగర సమాజాలకు ఇంకా రాజకీయ హక్కులు రాకముందే వాటిని వారు కమ్యూన్ అనే పేరుతో పిల్చుకొన్నారని ఏంగెల్స్ వివరించాడు. ఆర్థిక అభివృద్ధికి ఇంగ్లండునీ రాజకీయ అభివృద్ధికి ఫ్రాన్సునీ అత్యుత్తమ నమూనాలుగా మార్కు స్వీకరించాడు*). అను

స్వయంపాలిత సాయుధ సమాజంగా ఎదిగింది. ఒకచోట అది (ఇటలీ జర్మనీల్లో లాగ) స్వతంత్ర నగర రిపబ్లిక్ గా ఉంది. మరో చోట అది (ఫ్రాన్సులో లాగ) పన్నులు కట్టే మూడో శక్తిగా ఉంది. ఆ తర్వాత కార్ఖానాల దశలో అది ప్రభువర్గానికి వ్యతిరేకంగా ఒక పోటీ శక్తిగా మారి అర్ధ భూస్వామ్య రాచరికాలకో లేదా నిరంకుశ రాచరికాలకో ఊడిగం చేసింది. ఆ రకంగా అది పెద్ద రాజరికాలన్నిటికీ మూలస్తంభంగా నిలబడింది. అదే బూర్జువా వర్గం చివరికి ఇవ్వాళ ప్రపంచ మార్కెటూ ఆధునిక పరిశ్రమా ఏర్పడిన తర్వాత ఆధునిక ప్రజా ప్రాతినిధ్యం ఉన్న రాజ్యంలో ఏకైక రాజకీయ పెత్తందారుగా మారింది. ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం అనేది మొత్తం బూర్జువా వర్గపు సమష్టి వ్యవహారాలు చక్కబెట్టే కమిటీ మాత్రమే.

బూర్జువా వర్గం చారిత్రకంగా అత్యంత విప్లవకరమైన పాత్ర పోషించింది.

బూర్జువా వర్గం పైచేయి సాధించిన ప్రతిచోటా మొత్తం పితృస్వామిక, ఫ్యూడల్,

ప్రశాంత సంబంధాలన్నిటినీ ఖతం చేసింది. మనిషిని "పుట్టుకతోనే అధికులైనవారితో” బంధించిన అమాంబాపతు సంబంధాలన్నిటినీ నిర్దాక్షిణ్యంగా ఛిన్నాభిన్నం చేసింది. మనిషికీ మనిషికీ మధ్య స్వలాభం తప్ప, డబ్బు చెల్లింపులు తప్ప ఇక ఏ సంబంధాన్నీ అది మిగల్చలేదు. మతోన్మాదాన్నీ రణోత్సాహాన్నీ చిల్లర అనురాగాలనీ వేడి నిట్టూర్పుల్నీ ఈ స్వర్గ సంబరాన్నిటినీ అది సొంత లాభనష్టాల బేరీజు అనే అతి చల్లటి నీటి గుంటలో ముంచేసింది. అది మనిషి విలువను మార్పిడి విలువగా లెక్క కట్టింది. అంతకుముందున్న అసంఖ్యాకమైన శాశ్వత హక్కులన్నిటినీ తొలగించింది. వాటి స్థానంలో ఒకే ఒక అడ్డగోలు స్వేచ్ఛని నెలకొల్పింది. అదే వాణిజ్య స్వేచ్ఛ. దీన్నంతటినీ ఒక్క మాటలో చెప్పొచ్చు: మత రాజకీయ భ్రమల మాటున సాగే దోపిడీని తొలగించి దాని స్థానంలో నేరుగా బాహాటంగా సిగ్గూ ఎగ్గూ లేని పాశవిక దోపిడీని అది ప్రవేశపెట్టింది.

ఇంతకుముందు ప్రజలు భక్తి గౌరవాలతో ఆదరించిన వృత్తులను అది నీచపర్చింది. వైద్యుడినీ న్యాయవాదినీ పురోహితుడినీ కవినీ శాస్త్రవేత్తనీ అది తన జీతగాళ్లుగా మార్చుకొంది.

కుటుంబం నుంచి దాని మమతానురాగాల మేలి ముసుగును చించిపారేసి కుటుంబ సంబంధాలన్నిటినీ కేవలం డబ్బు సంబంధాలుగా అది కుదించింది. మధ్యయుగాల్లో పాశవికమైన ఆవేశాల ప్రదర్శనను తిరోగమనవాదులు

మెచ్చుకొంటారు. కాని దానికి అనుబంధంగానే ఉండిన ఆనాటి పచ్చి నిష్క్రియా పరత్వాన్ని బూర్జువావర్గం ఎత్తి చూపించింది. మనిషి కార్యశీలత ఏమి సాధించగలదో చరిత్రలో మొట్టమొదటిసారి అది నిరూపించింది. ఈజిప్టు పిరమిడ్లనీ రోమ్ కాల్వలనూ గోథిక్ దేవాలయాలను మించిన అద్భుతాలను అది సృష్టించింది. ఒకనాటి సామూహిక వలస ప్రయాణాలనూ మత దండయాత్రలనూ మరిపించే మహా యాత్రలను అది సాగించింది.

ఉత్పత్తి పరికరాల్లో నిరంతరాయంగా విప్లవం తేకుండా బూర్జువా వర్గం మనలేదు. ఆ రకంగా అది ఉత్పత్తి సంబంధాల్లోనూ మొత్తం సామాజిక సంబంధాల్లోనూ విప్లవం తెస్తుంది. ఇందుకు భిన్నంగా, అప్పటికున్న ఉత్పత్తి విధానాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకోవడమే పాత యుగాల పారిశ్రామిక వర్గాలన్నింటి మనుగడకు మొదటి షరతు. ఉత్పత్తిలో నిత్య విప్లవమూ, సకల సామాజిక పరిస్థితులనూ నిరంతరాయంగా కల్లోలపర్చడమూ అంతులేని అనిశ్చయత్వమూ ఇవీ బూర్జువా యుగాన్ని - అంతకుముందున్న అన్ని యుగాల నుంచీ వేరుజేసి చూపుతాయి. నిశ్చితమైన గడ్డకట్టుకుపోయిన అన్నిరకాల పాత సంబంధాలతో పాటు వాటిని అంటిపెట్టుకొని ఉండే పరమ పావనమైన అభిప్రాయ దురభిప్రాయాలు కూడా ఈ యుగంలో తుడుచు పెట్టుకుపోయాయి. కొత్తగా ఏర్పడే సంబంధాలు సైతం ఇంకా స్థిరపడకముందే పాతబడి పక్కకి పోతున్నాయి. గట్టిగా ఉన్న ప్రతిదీ గాలిలో కలిసిపోతోంది. పవిత్రం అనుకొన్న ప్రతిదీ మైలపడుతోంది. చివరికి మనిషి తన భ్రమలు తొలగించుకోక తప్పదు. తన నిజమైన పరిస్థితులనూ తనలాంటివారితో తనకి ఉన్న సంబంధాలనూ గ్రహించక తప్పదు.

తన ఉత్పత్తులకు నిరంతరాయంగా పెరిగే మార్కెటు కావాలి కనుక ఆ అవసరం బూర్జువా వర్గాన్ని ప్రపంచం నలుమూలలకూ తరుముతుంది. అది ప్రతిచోటా గూడు కట్టుకోవాల్సిందే; ప్రతిచోటా నివసించాల్సిందే; అన్నిచోట్లా సంబంధాలను ఏర్పర్చుకోవలసిందే.

బూర్జువా వర్గం మొత్తం ప్రపంచాన్ని తన మార్కెటు చేసుకొంది. కనుక అది ప్రతి దేశంలోనూ జరిగే ఉత్పత్తికీ విని నికీ జాతీయ స్వభావం కాక అందుకు అతీతమైన స్వభావాన్ని కల్పించింది. అది పరిశ్రమల కాళ్ల కింద అంతకుముందున్న జాతీయ పునాదిని తొలగించింది. ఆ రకంగా తిరోగమనవాదులకు ఎంతో ఆవేదన

కల్గించింది. పాత కాలంలో నెలకొన్న పరిశ్రమలన్నీ నాశనమయ్యాయి. మిగిలినవి రోజూ నాశనమౌతూనే ఉన్నాయి. వాటి స్థానంలో రకరకాల కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. నాగరిక జాతులన్నిటికీ చావో బతుకో నిర్ణయించగలవి కూడా వాటిలో ఉన్నాయి. దేశంలో ఉత్పత్తి జరిగినా ముడి పదార్థాలను ప్రపంచం నలుమూలల నుంచీ తెచ్చుకొనే పరిశ్రమలున్నాయి. ఉత్పత్తి స్వదేశంలో జరిగినా ఆ ఉత్పత్తి అయిన సరుకుల్ని స్వదేశంలోనే కాక దేశ దేశాల్లో అమ్మే పరిశ్రమలున్నాయి. పాత కాలపు అవసరాలు స్వదేశ ఉత్పత్తులతోనే తీరేవి. కాని కొత్త అవసరాలు వచ్చాయి. వాటిని తీర్చడానికి వివిధ శీతోష్ణగ్రతులున్న దూర దేశాల సరుకులు అవసరమయ్యయి. ఇంతకుముందు జాతులూ ప్రాంతాలూ తమకున్నదానితో సరిపెట్టుకుంటూ దేనిపాటికది ఒంటరిగా ఉండేవి. ఇప్పుడు మొత్తం ప్రపంచం నలుమూలలా ఇచ్చి పుచ్చుకోవడమూ ఒకరిపై ఒకరు ఆధారపడడమూ జరుగుతోంది. భౌతిక ఉత్పత్తికే కాదు, బౌద్ధిక ఉత్పత్తికి కూడా ఇది వర్తిస్తుంది. ఆయా దేశాల మేధో ఉత్పాదితలు మొత్తం ప్రపంచపు ఉమ్మడి ఆస్తులుగా మారుతున్నాయి. జాతీయ సంకుచితత్వమూ ఒంటెత్తు ధోరణీ రాను రాను అసాధ్యం అవుతున్నాయి. అనేక జాతీయ ప్రాంతీయ సాహిత్యాల నుంచి విశ్వ సాహిత్యం పుడుతోంది.

ఉత్పత్తి పరికరాలన్నీ అతి వేగంగా మెరుగవడం వల్లనూ, వార్తా రవాణా సౌకర్యాలన్నీ అపారంగా పెరగడం వల్లనూ బూర్జువా వర్గం అత్యంత ఆటవిక జాతులతో సహా అన్ని దేశాలనూ నాగరికతలోకి లాగుతుంది. తన సరుకుల చౌక ధరలు అనే భారీ ఫిరంగులతో అది చైనా గోడలన్నిటినీ కూలగొడుతుంది. ఎంతటి మొండి విదేశీ ద్వేషులయిన ఆటవికులయినా లొంగిపోయేలా చేస్తుంది. బూర్జువా ఉత్పత్తి విధానాన్ని అనుసరించక పోతే అంతమైపోయే ప్రమాదం వల్ల అన్ని జాతులూ ఆ విధానాన్ని స్వీకరించక తప్పని పరిస్థితిని సృష్టిస్తుంది. నాగరికత అన్నదాన్ని అది అన్ని జాతుల్లోకీ జొప్పిస్తుంది. అంటే ఆ జాతులన్నీ బూర్జువా జాతులుగా మారేలా చేస్తుంది. దీన్ని ఒక్క మాటలో చెప్పవచ్చు:

బూర్జువా వర్గం తనలాంటి ప్రపంచాన్నే సృష్టిస్తుంది.

బూర్జువా వర్గం గ్రామసీమలను నగరాలకు లోబడి ఉండేలా చేసింది. అది బ్రహ్మాండమైన నగరాలను సృష్టించింది. గ్రామీణ జనాభాతో పోలిస్తే నగరాల జనాభాని అపారంగా పెంచింది. ఆ రకంగా గ్రామీణ జీవితంలోని మౌఢ్యం నుంచి గణనీయమైన
సంఖ్యలో జనాభాని రక్షించింది. అది గ్రామాలను నగరాలపై ఆధారపడేలా చేసినట్టే ఆటవిక, అర్ధ ఆటవిక దేశాలను నాగరిక దేశాలపై ఆధారపడేలా చేసింది. రైతాంగ ప్రధాన దేశాలను బూర్జువా దేశాలపై ఆధారపడేలా చేసింది. ప్రాచ్యాన్ని పశ్చిమంపై ఆధారపడేలా చేసింది.

జనాభా, ఉత్పత్తి సాధనాలూ, ఆస్తిపాస్తులూ చెల్లా చెదురుగా ఉండటాన్ని బూర్జువా వర్గం రాను రాను తొలగిస్తుంది. అది జనాభాని ఒకచోటికి పోగేస్తుంది. ఉత్పత్తి సాధనాలను కేంద్రీకరిస్తుంది. ఆస్తిని కొద్దిమంది చేతుల్లో సాంద్రీకరిస్తుంది. రాజకీయ కేంద్రీకరణే దీని తప్పనిసరి పర్యవసానం. అంతకుముందు సొంత ప్రయోజనాలతో సొంత చట్టాలతో, సొంత ప్రభుత్వాలతో, సొంత పన్నుల విధానాలతో దేనిమట్టుకు అది స్వతంత్రం గానో లేదా కొద్దిపాటి అరకొర సంబంధాలతోనో మనుగడ సాగిస్తున్న ప్రాంతాలన్నింటినీ కలిపి ఒకే దేశంగా అది ముద్దజేసింది. ఒకే ప్రభుత్వంతో, ఒకే శాసనావళితో, ఒకే జాతి వర్గ ప్రయోజనాలతో, ఒకే సరిహద్దుతో, ఒకే కస్టమ్స్ ఒకే గా వాటిని మార్చింది.

బూర్జువా వర్గ పాలన మొదలై ఇంకా వందేళ్లయినా పూర్తి కాలేదు. కాని ఇంతకుముందు తరాలన్నీ కలిసి సృష్టించిన ఉత్పత్తి శక్తులకంటే విస్తారమైన, బ్రహ్మాండమైన ఉత్పాదక శక్తుల్ని అది తన పాలనలో సృష్టించింది. మానవునికి దాస్యంచేసే ప్రకృతి శక్తులూ, యంత్రాలూ, ఆవిరిశక్తితో నౌకాయానమూ, రైలు మార్గాలూ, విద్యుత్ టెలిగ్రాఫ్లూ, మొత్తం ఖండాలకు ఖండాలనే సాగులోకి తేవడమూ, నదీ జలాలను కాలవలకి మళ్లించడమూ, మంత్రం వేసి పుట్టించినట్టుగా జనాభా పెరుగుదలా - ఇలాంటి ఉత్పత్తి శక్తులన్నీ సామాజిక శ్రమ గర్భంలో నిద్రిస్తున్నాయని ఇంతకుముందటి శతాబ్దాల్లో దేనికయినా కనీసం లీలా మాత్రంగానయినా తెలుసా?

ఏ ఉత్పత్తి, మార్పిడి సాధనాల పునాది పైన బూర్జువా వర్గం పెరిగిందో ఆ సాధనాలు ఫ్యూడల్ సమాజంలోనే పుట్టాయి. అయితే అవి క్రమంగా పెరిగి ఒక దశకు చేరుకోగానే ఉత్పత్తికీ మార్పిడికి చెందిన ఫ్యూడల్ పరిస్థితులు వాటి పెరుగుదలకు అడ్డుపడ్డాయి. అంటే ఫ్యూడల్ వ్యవసాయ వ్యవస్థగానీ, కార్ఖానాల వ్యవస్థగానీ, మొత్తంగా ఫ్యూడల్ ఆస్తి సంబంధాల వ్యవస్థగానీ అప్పటికే ఒక స్థాయిలో పెరిగిన ఉత్పత్తి శక్తుల్ని ఇముడ్చుకోలేకపోయాయి. ఫ్యూడల్ సంబంధాలు ఉత్పత్తి శక్తులకి సంకెళ్లుగా మారాయి. ఆ సంకెళ్లు బద్దలవక తప్పలేదు; అవి బద్దలయాయి. వాటి స్థానంలో ఎటువంటి షరతులూ లేని పోటీ ప్రవేశించింది. దానితో పాటు దానికి అనుగుణమైన సామాజిక వ్యవస్థ వచ్చింది; రాజకీయ వ్యవస్థ కూడా వచ్చింది. ఆర్ధిక రాజకీయ రంగాలపై బూర్జువా పెత్తనం కూడా వచ్చింది.

అటువంటి పరిణామమే మరొకటి మన కళ్లముందే జరుగుతోంది. బూర్జువా ఉత్పత్తి సంబంధాలూ బూర్జువా మార్పిడి సంబంధాలూ బూర్జువా ఆస్తి సంబంధాలూ ఉన్న బూర్జువా సమాజం మనది. మంత్రం వేసి బ్రహ్మాండమైన ఉత్పత్తి సాధనాలనూ మార్పిడి సాధనాలనూ సృష్టించినట్టున్న ఈ బూర్జువా సమాజం ఇవ్వాళ తను పుట్టించిన దెయ్యాలను తానే అదుపుచేయలేని మాంత్రికునిలా తయారయింది. అనేక దశాబ్దాలుగా సాగిన పారిశ్రామిక చరిత్ర, వాణిజ్య చరిత్ర అంటే, ఆధునిక ఉత్పత్తి సంబంధాల మీద ఆధునిక ఉత్పత్తి శక్తులు చేస్తున్న తిరుగుబాటు చరిత్రే తప్ప వేరు గాదు. అంటే బూర్జువా వర్గానికీ దాని పెత్తనానికీ ఆసరా ఇచ్చే బూర్జువా ఆస్తి సంబంధాల మీదనే తిరుగుబాటు అది. దీనికి ఉదాహరణగా పదే పదే వస్తున్న సంక్షోభాలనే చూపించవచ్చు. అవి వచ్చినపుడల్లా బూర్జువా సమాజాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. రాను రాను మరింత తీవ్రంగా. ఈ సంక్షోభాల్లో ఉత్పత్తి అయిన వస్తువుల్లోనే కాక ఇంతకుముందున్న ఉత్పత్తి శక్తుల్లో ఓ పెద్ద భాగం నాశనమవుతుంది. ఈ సంక్షోభాల్లో అమితోత్పత్తి అనే ఓ అంటువ్యాధి వ్యాపిస్తుంది; గత యుగాల్లో ఇటువంటి అంటువ్యాధి పుట్టడం అసాధ్యం. దానివల్ల హఠాత్తుగా మొత్తం సమాజం తాత్కాలికంగా ఆటవిక దశలో ప్రవేశించిందా అన్నట్టు ఉంటుంది. కరువు కాటకాలో, సర్వ వినాశకమైన యుద్ధమో వచ్చి ప్రాణాధార వస్తువుల సరఫరాను ధ్వంసం చేసినట్టు ఉంటుంది. ఆ కారణంగానే పరిశ్రమలూ వాణిజ్యమూ ధ్వంసం అయినట్టుగా ఉంటుంది. దీనంతటికీ కారణం, అతి నాగరికత, అతి ప్రాణాధార వస్తు సంపద, అతి పారిశ్రామిక సంపద, అతి వాణిజ్యం. ఇప్పుడు సమాజానికి అందుబాటులో ఉన్న ఉత్పత్తి శక్తులు ఇక ఏమాత్రం బూర్జువా ఆస్తి పరిస్థితులను పెంచడానికి సిద్ధంగా లేవు. ఈ పరిస్థితులే వాటికి సంకెళ్లుగా మారాయి. ఆ సంకెళ్ల కంటే బలంగా ఉత్పత్తి శక్తులు పెరిగాయి. ఈ సంకెళ్లను దాటి పెరిగినప్పుడల్లా మొత్తం బూర్జువా సమాజం అస్తవ్యస్తం అవుతుంది. బూర్జువా ఆస్తి మనుగడకే ముప్పు ముంచుకొస్తుంది. బూర్జువా సమాజం సృష్టించే ఉత్పత్తి శక్తుల్ని ఇముడ్చుకోలేనంతగా దాని పరిస్థితులు ఇరుకవుతాయి. ఈ సంక్షోభాల నుంచి బూర్జువా వర్గం ఎలా బయటపడుతుంది? ఒకవైపున అది పెద్ద ఎత్తున తాను సృష్టించిన ఉత్పత్తి శక్తుల్ని బలవంతంగా నాశనం చేస్తుంది. మరోవైపున అది కొత్త మార్కెట్లను గెలుచుకోవాలి. పాత మార్కెట్లను మరింత క్షుణ్ణంగా దోచుకోవాలి. అంటే మరింత విస్తారమైన, మరింత వినాశనకరమైన సంక్షోభాలకు మార్గాన్ని సుగమం చేయడమన్న మాట. సంక్షోభాలను నిరోధించడానికి ఉన్న తరుణోపాయాలను మరింత తగ్గించడమన్న మాట!

ఫ్యూడలిజాన్ని బూర్జువా వర్గం నేలకూల్చడానికి వాడిన ఆయుధాలే ఇప్పుడు బూర్జువా వర్గాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయి.

బూర్జువా వర్గం తనను ఖతం చేసే ఆయుధాలను మాత్రమే సృష్టించలేదు. ఆ ఆయుధాలను పట్టుకోగలిగిన మనుషుల్ని కూడా పుట్టించింది. వారే శ్రామికులు. ఆ వర్గమే ఆధునిక కార్మిక వర్గం.

ఏ మేరకు బూర్జువా వర్గమూ దాని పెట్టుబడి పెరిగితే ఆ మేరకు శ్రామికవర్గం పెరుగుతుంది. పని దొరికినంత కాలమే బతకగలిగిన కూలీల వర్గమది. దాని శ్రమ పెట్టుబడిని పెంచగలిగినంత కాలమే దానికి పని దొరికే వర్గమది. ఈ శ్రామికులు ఏ రోజుకా రోజు తమని తాము అమ్ముకుంటే తప్ప బతకలేరు. అన్ని అమ్మకపు వస్తువుల్లాగే వారూ ఒక సరుకే. కనుక పోటీ వల్ల ఏర్పడే కష్టనష్టాలన్నిటికీ మార్కెటు వల్ల ఏర్పడే ఎగుడు దిగుళ్లన్నటికీ వారు గురవుతారు.

యంత్రాలను పెద్ద ఎత్తున ఉపయోగించడం వల్లనూ శ్రమ విభజన వల్లనూ శ్రామికుల పని వ్యక్తిగత స్వభావాన్ని కోల్పోయింది. కనుక ఆ పనిలో అతనికి బొత్తిగా ఆకర్షణ లేకుండా పోయింది. శ్రామికుడు యంత్రానికి ఒక తోకలా మారాడు. ఆ పని అతి సరళంగానూ ఒకే రీతిగా విసుగుపుట్టించేదిగానూ అయింది. ఆ పనికి అవసరమైన ఒడుపుని ఎవరైనా అతి సులభంగా నేర్చుకోగలిగిందిగా అది మారింది. కనుక పనివానికి అయ్యే ఖర్చు కుదించబడింది. అతను పనిలో కొనసాగడానికీ తన జాతిని కని పోషించడానికి అవసరమయ్యే పోషకాలకు మాత్రమే అది పరిమితమైంది. శ్రమ ధర ఎంత అంటే దానిని తయారుచేయడానికి ఎంత ఖర్చు అవుతుందో అంత. దానికయ్యే ఖర్చే దాని ధర. ఏ సరుకు ధర అయినా అంతే.

(* శ్రామికుడు అమ్మేది శ్రమని కాదనీ శ్రమశక్తిననీ తర్వాత మార్పు సవరించాడు*). అను.

కనుక పని ఎంత రోత పుట్టించేదిగా మారితే ఆ మేరకు జీతం అంత తగ్గుతుంది. అంతేగాదు. ఏ మేరకు యంత్రాల ఉపయోగమూ పని విభజనా పెరిగితే ఆ మేరకు శ్రమ భారం కూడా పెరుగుతుంది. అది పని గంటలు పెంచడం ద్వారా జరగవచ్చు. లేదా ఆ పని గంటల్లోనే మరింత ఎక్కువ శ్రమను గుంజవచ్చు. లేదా యంత్రాల వేగాన్ని పెంచడం ద్వారా కూడా ఇది సాధించవచ్చు.

పిత్రుస్వామిక యజమాని నడిపే కార్ఖానాని పారిశ్రామిక పెట్టుబడిదారుడు నడిపే భారీ ఫాక్టరీగా ఆధునిక పరిశ్రమ మార్చింది. కార్మిక సమూహాలను ఫాక్టరీలలో అచ్చం సైనికదళాలను నడిపినట్టుగా నడుపుతారు. సాధారణ సైనికులపైన సైనిక అధికారుల దొంతర ఉన్నట్టే, కార్మికులపైన కూడా వివిధ హోదాలతో కార్మిక అధికారులూ ఉంటారు. శ్రామికులు బూర్జువా వర్గానికీ బూర్జువా రాజ్యాంగ యంత్రానికీ మాత్రమే బానిసలు కారు. వీరు ప్రతి రోజూ ప్రతి గంటా యంత్రానికి బానిసలు; తనిఖీ చేసే మేస్త్రీకి బానిసలు; అన్నింటినీ మించి బూర్జువా యజమానికి బానిసలు. లాభమే తన ఏకైక లక్ష్యం అని ఏ మేరకు ఈ నిరంకుశత్వం బాహాటంగా ప్రకటిస్తుందో ఆ మేరకు ఇది నీచంగానూ ద్వేషం రగిలించేదిగానూ కసి పుట్టించేది. గానూ ఉంటుంది.

ఆధునిక పరిశ్రమ అభివృద్ధి చెందేకొద్దీ శారీరక శ్రమలో ఏ నైపుణ్యంతోనూ పనిలేదు, గొప్ప బలమూ అవసరం లేదు అన్న పరిస్థితి వస్తుంది. ఆ దశలో యజమానులు మగవాళ్లకు బదులు ఆడవాళ్లను పనిలో పెట్టుకొంటారు. అప్పుడు స్త్రీ పురుష భేదాలకీ వయో భేదాలకీ ఎటువంటి విశేషమూ ఉండదు. అందరూ శ్రమ పరికరాలే. కాకపోతే వయసుని బట్టీ స్త్రీ పురుష భేదాలను బట్టీ జీతనాతాల్లో కోత ఉంటుంది.

దోపిడి బూర్జువా యజమానితో పూర్తి కాదు. తర్వాత ఆ వర్గంలోని మిగతావాళ్లు కార్మికుడి పైన పడి మరింత దోచుకొంటారు. భూస్వామి (ఇంటి యజమాని), దుకాణదారుడు, వడ్డీ వ్యాపారి తదితరులు అతడిని పీక్కు తింటారు.

మధ్య తరగతిలో కిందివాళ్లు క్రమంగా కార్మికవర్గంలో మునిగిపోతారు. వీరిలో చిన్న వ్యాపారులూ, రిటైరైన వ్యాపారులూ, చిల్లర కొట్టువాళ్లూ, చేతి పనులవాళ్లూ, రైతులూ ఉంటారు. ఎందుకంటే, వీరి దగ్గరున్న పెట్టుబడి భారీ పరిశ్రమలను నడపడానికి చాలదు. వీరు పెద్ద పెట్టుబడిదార్లతో పోటీ పడలేక దివాళా తీస్తారు.

పైగా కొత్త ఉత్పత్తి విధానాలు వచ్చాక వీరి ప్రత్యేకమైన నైపుణ్యాలన్నీ కొరగాకుండా పోతాయి. కనుక అన్ని వర్గాల నుంచీ కొత్తవాళ్లు కార్మికవర్గంలో కలుస్తారు.

శ్రామికవర్గ అభివృద్ధిలో వివిధ దశలున్నాయి. బూర్జువా వర్గంతో దాని పోరాటం పుట్టుకతోనే ఆరంభమవుతుంది. మొదట కార్మికులు విడి విడిగా ఎవరికివారు పోరాడతారు. తర్వాత ఒకేచోట ఒకే ఫాక్టరీలో పనిచేసేవాళ్లంతా కలిసి పోరాడుతారు. ఈ పోరాటాలన్నీ తమని నేరుగా దోచుకొనే విడి బూర్జువా యజమానుల మీదనే జరుగుతాయి. మొదట వారు బూర్జువా ఉత్పత్తి పరిస్థితులపై పోరాడరు; వారు ఉత్పత్తి పరికరాలపై దాడి చేస్తారు; తమ శ్రమతో పోటీచేసే విదేశీ సరుకులను ధ్వంసం చేస్తారు; యంత్రాలను పగలకొడతారు; ఫాక్టరీలను తగలబెడతారు; తమ బలంతో మళ్లీ మధ్య యుగాలనాటి పనివాని హోదాని తిరిగి సాధించాలని కోరుకుంటారు.

ఈ దశలో కార్మికులు ఒకరికొకరు సంబంధం లేకుండా దేశమంతటా విసిరేసినట్టుంటారు. తమ మధ్య ఉండే పోటీ వల్ల ఎక్కడికక్కడ చీలిపోయి ఉంటారు. ఎక్కడైనా వారు కలిసికట్టుగా సంఘటిత బృందాలుగా ఏర్పడితే దానికి కారణం స్వయంగా కార్మికుల ఐకమత్యం కాదు. అది బూర్జువాల ఐకమత్యం వల్ల జరుగుతుంది. బూర్జువా వర్గం ఆ దశలో తన సొంత రాజకీయ లక్ష్యాలను సాధించుకోవాలంటే మొత్తం శ్రామికవర్గాన్ని కదిలించక తప్పదు. కొంత కాలంపాటు అలా కదిలించగలిగిన శక్తి దానికి ఉంటుంది. ఈ దశలో కార్మికులు పోరాడేది తమ సొంత శత్రువులతో కాదు. తమ శత్రువుల శత్రువులతో మాత్రమే. అంటే, రాజరికపు అవశేషాలపైన, భూస్వాములపైన, పారిశ్రామికులు కాని బూర్జువాలపైన, పెట్టీ బూర్జువాలపైన వారు పోరాడుతారు. ఈ దశలో మొత్తం చరిత్ర గతి బూర్జువా వర్గం చేతుల్లో సాంద్రీకరించ బడుతుంది. ఈ పోరాటంలో దొరికే ప్రతి విజయమూ బూర్జువా వర్గానికే దక్కుతుంది.

పరిశ్రమ అభివృద్ధి అయ్యేకొద్దీ కార్మికుల సంఖ్య పెరుగుతుంది. వాళ్లు మరింతగా పోగవుతారు. వారి బలం పెరుగుతుంది. తమ బలం పెరిగిందన్న సంగతి వారు గ్రహిస్తారు. యంత్రాలు వచ్చి కార్మికుల జీతాలను ప్రతిచోటా ఒకేలా కుదిస్తాయి. విడిగా ప్రతి కార్మికునిలోనూ ఉండిన ప్రత్యేక లక్షణాలన్నిటినీ అవి రూపుమాపుతాయి. దీనివల్ల వివిధ కార్మికుల భిన్న ప్రయోజనాలూ విభిన్న జీవిత విధానాలూ అంతమై అవి ఒకేలాగా తయారవుతాయి. బూర్జువాల మధ్య పోటీలు పెరగడం వల్లనూ  దానిమూలంగా వచ్చే సంక్షోభాల వల్లనూ శ్రామికుల జీతాలు మరింతగా ఎగుడు దిగుడులకు గురవుతాయి. యంత్రాలు నిరంతరాయంగా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. వారి జీవనాధారాలు మరింత సంకట స్థితిలో పడతాయి. కార్మికులకూ యజమానులకూ మధ్య జరిగే విడి ఘర్షణలు రెండు వర్గాల మధ్య జరిగే పోరాటాలుగా మారతాయి. అప్పుడు బూర్జువాలకు వ్యతిరేకంగా శ్రామికులు ట్రేడ్ యూనియన్లను ఏర్పాటుచేసుకోవడం మొదలు పెడతారు. తమ వేతనాల స్థాయిని నిలబెట్టుకోవడానికి వాళ్లంతా ఏకమవుతారు. అప్పుడప్పుడూ జరిగే ఈ తిరుగుబాట్లకు ముందుగానే సన్నద్ధంగా ఉండడం కోసం వారు శాశ్వత సంఘాలను ఏర్పరుచుకొంటారు. ఈ పోరాటాలు అక్కడక్కడా దొమ్మీలుగా మారతాయి.

అప్పుడప్పుడూ కార్మికులు గెలుస్తారు. కాని ఇది తాత్కాలికమే. ఆ పోరు వల్ల కార్మికులకు ఒనగూరే నిజమైన లాభం కేవలం వారి గెలుపు కాదు. వారి మధ్య నిత్యం పెరిగే ఐక్యతే వారికి దక్కే అసలైన ఫలం. ఆధునిక పరిశ్రమ సృష్టించిన వార్తా రవాణా సౌకర్యాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికుల మధ్య ఒకరితో ఒకరికి సంబంధాలు ఏర్పడతాయి. ఇది వారి మధ్య ఐక్యత పెంచుతుంది. స్థానికంగా ఎక్కడికక్కడ వేర్వేరుగా జరిగే ఒకేలాంటి శ్రామిక పోరాటాలన్నిటినీ కలిపి సమైక్యంగా రెండు వర్గాల మధ్య జరిగే ఏకైక జాతీయ పోరాటంగా మల్చడానికి ఈ పరస్పర సంబంధాలే తోడ్పడతాయి. నిజానికి, ప్రతి వర్గ పోరాటమూ ఒక రాజకీయ పోరాటమే. మధ్య యుగాల్లో దరిద్రపు రహదారులున్న పరిస్థితుల్లో బర్హరులు (నగర పౌరులు) ఇటువంటి ఐక్యతను సాధించడానికి శతాబ్దాలు పట్టింది. ఇప్పుడు రైల్వేల మూలంగా ఆధునిక కార్మికులు కొన్ని సంవత్సరాల్లోనే ఆ ఐక్యతను సాధిస్తారు.

కార్మికులు ఒక వర్గంగా సమైక్యం కావడమూ, ఒక పార్టీగా సంఘటితం కావడమూ అన్న లక్ష్యం వాళ్ల మధ్య వాళ్లకున్న పోటీ కారణంగానే దెబ్బతింటుంది. శ్రామిక వర్గం పడిపోయినా నిత్యం అది పైకి లేస్తుంది. బలపడుతుంది. స్థిరపడుతుంది. మరింత శక్తిశాలిగా మారుతుంది. బూర్జువా వర్గంలోని చీలికలను ఉపయోగించుకొంటుంది. కార్మికుల ప్రత్యేక ప్రయోజనాలను చట్టపరంగా గుర్తించేలా చేస్తుంది. ఇంగ్లండులో పది గంటల పని బిల్లును అది సాధించింది ఈ విధంగానే.

స్థూలంగా పాత సమాజంలో జరిగే ఘర్షణలు శ్రామికవర్గ అభివృద్ధికి తోడ్పడతాయి. బూర్జువా వర్గం నిరంతరం ఎవరితో ఒకరితో యుద్ధంలో మునిగి  ఉంటుంది. మొదట ప్రభువర్గంతో, తర్వాత బూర్జువా వర్గంలోనే పరిశ్రమల అభివృద్ధి వల్ల నష్టపోయేవాళ్లతో, మొదటి నుంచి చివరిదాకా విదేశీ బూర్జువా వర్గంతో అది యుద్ధంలో ఉంటుంది. ఈ యుద్ధాలన్నిటిలోనూ శ్రామికవర్గాన్ని సాయం కోరక తప్పదని దానికి అర్థమవుతుంది. కనుక, అది శ్రామికవర్గాన్ని రాజకీయ రంగంలోకి లాగుతుంది. బూర్జువా వర్గమే శ్రామికవర్గానికి రాజకీయ విద్య నేర్పుతుంది. మామూలు విద్య కూడా నేర్పుతుంది. భవిష్యత్తులో తనతో యుద్ధంచేయడానికి అవసరమయ్యే ఆయుధాలను ఆ రకంగా శ్రామికవర్గానికి బూర్జువా వర్గమే సమకూరుస్తుంది.

పరిశ్రమ పురోగమించే కొద్దీ బూర్జువా వర్గంలోని కొన్ని విభాగాలు మొత్తంగా శ్రామికవర్గం లోకి నెట్టబడతాయి. లేదా వారి జీవిత పరిస్థితులు ప్రమాదంలో పడతాయి. ఈ సంగతిని ఇంతకుముందే పేర్కొన్నాం. వారి వల్ల కూడా శ్రామికులకు కొత్త జ్ఞానమూ కొత్త ప్రగతీ అందుతాయి.

చివరిగా, వర్గ పోరు అటో ఇటో తేలిపోయే సమయం దగ్గరకి వచ్చినపుడు, పాలక వర్గంలో సాగుతున్న విచ్ఛిత్తి ప్రక్రియ, నిజానికి పాత సమాజంలో మొత్తంగా సాగుతున్న విచ్ఛిత్తి ప్రక్రియ స్పష్టమైన ప్రచండ రూపాన్ని సంతరించుకొంటుంది. పాలక వర్గంలోనే ఒక చిన్న విభాగం తన వర్గంతో తెగతెంపులు చేసుకొని భవిష్యత్తును శాసించే విప్లవ వర్గమైన శ్రామికవర్గంతో చేతులు కలుపుతుంది. గతంలో ప్రభువర్గానికి చెందిన ఒక విభాగం చీలిపోయి వచ్చి బూర్జువా వర్గంతో ఎలా కలిసిందో, అలాగే ఇప్పుడు బూర్జువా వర్గంలో ఒక విభాగం శ్రామిక వర్గంతో కలుస్తుంది. ముఖ్యంగా బూర్జువా సిద్ధాంతకారుల్లో చరిత్రగతి మొత్తాన్ని సిద్ధాంత పరంగా గ్రహించే స్థాయికి ఎదిగినవాళ్లు శ్రామికవర్గంతో చేతులు కలుపుతారు.

బూర్జువా వర్గానికి ఎదురు నిలబడిన వర్గాలన్నిటిలోకీ శ్రామికవర్గం ఒక్కటే | ఇవ్వాళ నిజమైన విప్లవకర వర్గం. మిగిలిన వర్గాలు ఆధునిక పరిశ్రమ కారణంగా క్రమంగా క్షీణించి ఆఖరికి అదృశ్యమవుతాయి. అలా కాక, శ్రామికవర్గం ఆధునిక పరిశ్రమ ప్రత్యేక సృష్టి. అది దాని అతి ముఖ్య సృష్టి.

మధ్య తరగతిలో కింది శ్రేణివాళ్లు, అంటే చిన్న చిన్న పరిశ్రమలవాళ్లూ దుకాణదారులూ చేతిపనివాళ్లు రైతులూ - వీరంతా కూడా బూర్జువావర్గంతో పోరాడుతారు. అయితే వాళ్లు పోరాడేది, తాము మధ్యతరగతివాళ్లుగా కొనసాగటానికే  తప్ప మార్పు కోసం కాదు. అంటే వీళ్లు యథాస్థితివాదులు. విప్లవకారులు కాదు. వీళ్లు చరిత్ర గతిని వెనక్కి మళ్లించడానికి ప్రయత్నిస్తారు. కనుక వీరు ప్రగతి నిరోధకులుగా కూడా ఉంటారు. వీళ్లు శ్రామికవర్గంలో కలిసిపోబోతున్న సందర్భంగా మాత్రమే విప్లవకరంగా ఉంటారు. అప్పుడు మాత్రమే వీరు తమ తక్షణ ప్రయోజనాల కోసం కాక, భవిష్యత్ ప్రయోజనాల కోసం పోరాడుతారు. అప్పుడు తమ పాత దృక్పధాన్ని వదిలిపెట్టి శ్రామికవర్గ దృక్పథాన్ని స్వీకరిస్తారు.

ప్రమాదకర వర్గం (అలగా జనం) కూడా ఉంది. ఇది సమాజంలో పేరుకొన్న చెత్త. పాత సమాజపు అట్టడుగు పొరలు ఒడ్డుకు వెలిగక్కిన కుళ్లిన పదార్ధం అది. శ్రామిక విప్లవం కారణంగా అది ఎప్పుడన్నా మళ్లీ సమాజ ప్రవాహంలోకి కొట్టుకురావచ్చు. కాని దాని బతుకుని బట్టి, అది ప్రగతి నిరోధకుల దగ్గర గడ్డి తిని వాళ్లు పన్నే కుతంత్రాల్లో కూలిబంటుగా ఉండే అవకాశమే ఎక్కువుంది.

కార్మికుల జీవన పరిస్థితుల్లో పాత సమాజానికి చెందిన అంశాలన్నీ దాదాపుగా అంతరించాయి. ఈనాటి కార్మికునికి ఆస్తి లేదు. భార్యా బిడ్డలతో అతనికి ఉన్న సంబంధానికీ బూర్జువా కుటుంబ సంబంధాలకీ ఎక్కడా పొంతనే లేదు. ఆధునిక పారిశ్రామిక శ్రమ అంటే పెట్టుబడికి లోబడి ఉండే ఆధునిక దాస్యం. ఈ దాస్యం ఫ్రాన్సులో ఎంతో ఇంగ్లండులోనూ అంతే. జర్మనీలో ఎంతో అమెరికాలోనూ అంతే. కనుక ఈ దాస్యం కార్మికునిలో జాతీయ స్వభావం అన్నది మచ్చుకు కూడా లేకుండా తుడిచివేసింది. చట్టం, నీతి, మతం అనేవన్నీ బూర్జువా వర్గ అభిప్రాయ దురభిప్రాయాలనీ వీటిలో ఒక్కొక్కదాని మాటున ఒక్కో బూర్జువా స్వార్ధం దాగి ఉందని శ్రామికుడు అనుకొంటాడు.

ఇంతకుముందు అధికారంలోకి వచ్చిన వర్గాలన్నీ ఆస్తులను, ఆదాయాన్ని తాము ఎలా అనుభవించారో ఆ విధానాన్నే మొత్తం సమాజం మీద రుద్దారు. ఆ రకంగా సమాజంలో తమకు అప్పటికే ఉన్న స్థానాన్ని అవి భద్రపరుచుకోవాలనుకొన్నాయి. అలాకాక, కార్మికులు సామాజిక ఉత్పత్తి శక్తులకు అధిపతులు కావాలంటే, ఆదాయం సంపాదించే తమ గత విధానాన్ని రద్దుచేసుకోవాలి. అంతేకాదు. గతంలో ఉన్న ఇతర సంపాదనా మార్గాలన్నింటినీ రద్దు చేయాలి. కార్మికులకు భద్రపరుచుకోవడానికీ పదిలపరుచుకోవడానికీ ఏమీలేదు. సొంత ఆస్తికి గతంలో ఉన్న సకల భద్రతలనూ సకల హామీలనూ ధ్వంసం చేయడమే వాళ్ల జీవిత లక్ష్యం.

ఇంతవరకూ జరిగిన చారిత్రిక ఉద్యమాలన్నీ అల్ప సంఖ్యాకుల ఉద్యమాలే. లేదంటే అవి అల్ప సంఖ్యాకుల ప్రయోజనాల కోసం జరిగిన ఉద్యమాలు. కాని ఈనాటి శ్రామిక ఉద్యమం అలా కాదు. అది అత్యధిక సంఖ్యాకుల ప్రయోజనాల కోసం అత్యధిక సంఖ్యాకులు బుద్ధిపూర్వకంగా, స్వతంత్రంగా నడిపే ఉద్యమం. శ్రామికవర్గం ఈనాటి సమాజంలో అట్టడుగు పొరలో ఉంటుంది. అది కదలాలన్నా. లేచి నిలబడాలన్నా తనపై ఉన్న పొరలన్నిటినీ పైకి గాలిలోకి విసరాల్సిందే.

బూర్జువావర్గంతో శ్రామికవర్గం చేసే పోరాటం మొదట జాతీయ పోరాటంగానే ఉంటుంది. అయితే అది స్వభావంలో కాదు. స్వరూపంలో మాత్రమే. ఏ దేశపు శ్రామికవర్గమైనా తన సొంత బూర్జువావర్గంతోనే లెక్క తేల్చుకోవాలి.

శ్రామికవర్గ అభివృద్ధిలో అత్యంత సాధారణ దశలన్నిటినీ పేర్కొన్నాము. ఇవాల్టి సమాజంలో ప్రచ్ఛన్నంగా రగులుతున్న అంతర్యుద్ధం బహిరంగ విప్లవంగా బద్దలయే దశ వరకూ వివరించాము. అంటే బూర్జువా వర్గాన్ని బలవంతంగా కూలదోయడం ద్వారా శ్రామికవర్గ అధికారానికి పునాదులు పడే దశ వరకూ చిత్రించాం.

గత చరిత్రలో ప్రతి సమాజమూ పీడకవర్గానికీ పీడితవర్గానికీ మధ్య వైరుధ్యాల పునాదిపైనే బతికిందని మనం ఇప్పటికే గమనించాం. కానీ ఒక వర్గాన్ని పీడించాలంటే ఆ పీడితవర్గం తన బానిస బతుకుని కొనసాగించడానికైనా హామీ ఇవ్వాలి. భూస్వామ్య యుగంలో దాసులు క్రమంగా నగరాల్లో కమ్యూన్ సభ్యులుగా ఎదిగారు. ఆ యుగంలోనే నిరంకుశ రాచరికం కింద పెట్టీ బూర్జువాలు క్రమంగా బూర్జువాలుగా ఎదగ గలిగారు. కాని ఈనాటి బూర్జువావర్గ ఆధిపత్యం కింద, ఈనాటి పారిశ్రామిక క్రమంలో ఆధునిక శ్రామికుడు ఎదగడం మాట అటుంచి నానాటికీ అడుగుకి పోతున్నాడు. తన వర్గ సాధారణ జీవన స్థాయిలో కూడా నిలబడలేక ఇంకా అడుగుకి ఇంకా లోతుకి కూరుకుపోతున్నాడు. కార్మికుడు బుక్కాపకీరుగా మారుతున్నాడు. అతని ఈ దారిద్ర్యం జనాభా కంటే, సంపద కంటే వేగంగా పెరుగుతోంది. కాబట్టి ఈ సమాజాన్ని పాలించే అర్హతను బూర్జువా వర్గం కోల్పోయిందన్నది స్పష్టం. తన జీవిత విధానాన్ని ఒక అత్యున్నత శాసనంగా సమాజం మీద రుద్దడానికి దానికి ఎంతమాత్రమూ అర్హత లేదు. తన బానిసకు బానిస బతుకునయినా నమ్మకంగా చూపించగల సత్తా దానికి లేదు. తన బానిస శ్రమ మీద బతకాల్సిన వర్గం అది. కాని ఆ పరిస్థితి మారి ఆ బానిసే దాని బిచ్చం మీద ఆధారపడాల్సి వస్తే అటువంటప్పుడు బూర్జువా వర్గం కింద సమాజం ఇక ఎంతమాత్రమూ బతకలేదు. అంటే సమాజానికీ బూర్జువావర్గ మనుగడకీ పొత్తు కుదరదు.

బూర్జువావర్గం మనుగడా, దాని పెత్తనమూ సాగాలంటే తప్పనిసరిగా పెట్టుబడి ఏర్పడాలి. అది వృద్ధి కావాలి. పెట్టుబడి ఉండాలంటే కూలికి పనిచేసేవాళ్లుండాలి. కూలి అనేది కార్మికుల మధ్య పోటీ మీదనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. పారిశ్రామిక పురోగమనాన్ని పెంపొందించేది బూర్జువా వర్గమే. అయితే దాని పర్యవసానాలను గ్రహించకుండానే అది పెంపొందిస్తుంది. ఇంతకుముందు పోటీ వల్ల ఎవరికి వారే అన్నట్టుండే శ్రామికులు ఈ పారిశ్రామిక పురోగమనంలోనే ఒకరితో ఒకర సహకరించుకుంటూ విప్లవకరంగా ఐక్యమవుతారు. ఏ పునాదిపై ఆధారపడి బూర్జువా వర్గం సంపదలను సృష్టించి వాటిని స్వాహా చేస్తోందో ఆ పునాదులనే ఈ పారిశ్రామిక అభివృద్ధి కూల్చివేస్తుంది. కనుక బూర్జువా వర్గం ప్రధానంగా ఉత్పత్తిచేసేది తనకు గోరీ కట్టే శక్తుల్నే.

బూర్జువావర్గ పతనమూ తప్పదు. కార్మికవర్గ విజయమూ తప్పదు.

__ మార్క్స్, ఏంగెల్స్
(కమ్యూనిస్టు ప్రణాళిక_2)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..