కూలి పని
ఇప్పుడు కూలి పనిని చూద్దాం.
కార్మికునికి ఇచ్చే కనీస కూలే కూలిపనికి చెల్లించే సగటు ఖరీదు. అంటే కార్మికుడు కార్మికునిగా బతకడానికి తప్పనిసరిగా కావలసిన తిండీ తిప్పల ఖరీదు. కూలిపనితో కార్మికుడు సంసాదించేది కేవలం తన శరీరాన్ని నిలుపుకోడానికీ తనలాంటివాళ్లను కనడానికీ, వాళ్లు బతికి బట్టకట్టడానికీ బొటాబొటీగా సరిపోతుంది. ఈ సంపాదనలో కొంత అనుభవించి కొంత మిగుల్చుకొని దానితో ఇతరుల శ్రమపై పెత్తనం చేయడానికి ఏమాత్రం వీల్లేని సంపాదన ఇది. ఈ సంపాదనలో మిగులు ఉండదు. ఈ పద్ధతిలో పెట్టుబడిని వృద్ధి చేయడానికే కార్మికుడు బతుకుతాడు. పాలకవర్గ ప్రయోజనాలను అతడు నెరవేర్చినంత మేరకే అతన్ని వారు బతకనిస్తారు. మేము రద్దు చేయాలని కోరేది సరిగ్గా కార్మికుల ఈ దౌర్భాగ్యపు సంపాదనా స్వభావాన్నీ, దాన్ని వారు అనుభవించే స్వభావాన్నీ మాత్రమే.
పెట్టుబడీదారీ సమాజంలో మిగులు కార్మికుల శ్రమ అనేది అప్పటికేగుబడిన శ్రమను పెంచడానికి తోడ్పడే సాధనం మాత్రమే. కమ్యూనిస్టు సమాజంలో పోగుబడిన శ్రమ కార్మికుని మనుగడను విస్తృతం చేయడానికీ సుసంపన్నం చేయడానికి పెంపొందించడానికీ తోడ్పడే సాధనం అవుతుంది.
కనుక, పెట్టుబడీదారీ సమాజంలో గతం వర్తమానాన్ని శాసిస్తుంది; కమ్యూనిస్టు సమాజంలో వర్తమానం గతాన్ని శాసిస్తుంది. బూర్జువా సమాజంలో పెట్టుబడికి స్వాతంత్య్రం ఉంటుంది; దానికొక వ్యక్తిత్వం ఉంటుంది. కాగా బతికున్న మనిషికి స్వాతంత్య్రం ఉండదు; వ్యక్తిత్వమూ ఉండదు.
ఈ పరిస్థితుల్ని రద్దుచేయడం అంటే స్వేచ్ఛనీ స్వాతంత్ర్యాన్నీ రద్దుచేయడమే అని బూర్జువావర్గం అంటుంది. నిజమే. సందేహం లేదు. బూర్జువా స్వేచ్ఛనీ బూర్జువా స్వాతంత్ర్యాన్నీ బూర్జువా వ్యక్తిత్వాన్ని రద్దుచేయడమే మా ఉద్దేశం.
ప్రస్తుత బూర్జువా ఉత్పత్తి పరిస్థితుల్లో స్వేచ్ఛ అంటే వాణిజ్య స్వేచ్ఛ; క్రయ విక్రయాల స్వేచ్ఛ.
అమ్ముడూ కొనుడూ అన్నవే అంతరిస్తే స్వేచ్ఛగా కొనడమూ స్వేచ్ఛగా అమ్మడమూ అన్నవి కూడా అంతరిస్తాయి. మధ్య యుగాల్లో పరిమితులతో కూడిన క్రయవిక్రయాలతోనూ ఆనాటి వ్యాపారులపై ఉన్న నిర్బంధాలతోనూ పోల్చినప్పుడు మాత్రమే స్వేచ్ఛ గురించీ క్రయవిక్రయాల స్వేచ్ఛ గురించీ బూర్జువాలు పలికే బీరాలకు ఏమైనా అర్థం ఉంటే ఉండొచ్చు. కాని క్రయవిక్రయాలనూ, బూర్జువా ఉత్పత్తి పరిస్థితులనూ, అసలు బూర్జువా వర్గాన్నే కమ్యూనిస్టు తరహాలో రద్దు చేయాలంటున్న సందర్భంలో వారి బడాయి మాటలకు బొత్తిగా అర్థం లేదు.
సొంత ఆస్తిని రద్దు చెయ్యాలన్న మా ఉద్దేశం మీకు గుబులు పుట్టిస్తోంది. కాని నేటి మీ సమాజంలో నూటికి తొంబై మందికి సొంత ఆస్తి అన్నదే లేకుండా పోయిందే! వారి చేతుల్లో సొంత ఆస్తి లేదు కనుకనే కొద్దిమంది చేతుల్లో అది ఉంది. అత్యధిక ప్రజానీకం చేతుల్లో లేకపోవడం వల్లనే కొద్దిమంది చేతుల్లో పోగైన ఈ ఆస్తి రూపాన్ని రద్దు చెయ్యాలని అనుకుంటున్నామని మీరు మమ్మల్ని నిందిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే మీ సొంత ఆస్తిని మేము రద్దు చేయదలచాం అని మీరు నిందిస్తున్నారు. మీరు కచ్చితంగా చెప్పారు. సరిగ్గా మా ఉద్దేశమదే.
శ్రమని పెట్టుబడిగా డబ్బుగా కిరాయిగా, గుత్తగా స్వాహా చేయదగిన సామాజిక శక్తిగా మార్చడానికి వీల్లేని క్షణం నుంచీ, వ్యక్తిగత ఆస్తిని పెట్టుబడిగా (బూర్జువా ఆస్తిగా) మార్చడానికి వీల్లేని క్షణం నుంచీ వ్యక్తిత్వం మాయమైపోతుందని మీరంటారు. అంటే మీ ఉద్దేశంలో వ్యక్తి అంటే మధ్య తరగతి ఆస్తి యజమాని తప్ప మరెవ్వరూ
కాదన్న సంగతిని మీరు ఒప్పుకోక తప్పదు. అంటే బూర్జువా వ్యక్తి తప్ప మరెవ్వరూ కాదన్న మాట! అలాగయితే దారికి అడ్డుగా ఉన్న ఆ వ్యక్తిని ఈడ్చిపారేయాల్సిందే. అటువంటి వ్యక్తి ఉంటానికే వీల్లేకుండా చెయ్యాలిసిందే.
సామాజిక ఉత్పత్తులను ఎవరూ సొంతంచేసుకోకుండా ఎవర్నీ కమ్యూనిజం అడ్డుకోదు. కాని అలా సొంతపరుచుకోవడం ద్వారా ఇతరుల శ్రమను లోబరుచుకొనే శక్తి ఎవరికీ లేకుండా మాత్రం చేస్తుంది.
సొంత ఆస్తిని రద్దు చేస్తే పనంతా ఆగిపోతుందనీ, ప్రపంచాన్ని సోమరితనం ముంచెత్తుతుందనీ మీరు ఆభ్యంతరం చెబుతున్నారు.
అదే నిజమైతే పెట్టుబడిదారీ సమాజం వట్టి సోమరితనంతో ఏనాడో అధోగతి పాలయ్యేది. పనిచేసుకొనేవాళ్లు బొత్తిగా సంపాదించలేక పోవడమూ సంపాదనాపరులు పనిచేయక పోవడమూ ఈ సమాజంలో మామూలు పెట్టుబడే లేకపోతే వేతన శ్రమ కూడా ఉండదు అన్నదాన్నే మరో రూపంలో చెప్పిందే చెప్పడమే ఈ మొత్తం అభ్యంతరం చేస్తున్న పని.
భౌతిక వస్తువులను కమ్యూనిస్టు తరహాలో ఉత్పత్తి చేయడానికీ వాటిని అనుభవించడానికీ బూర్జువా అభ్యంతరం చెబుతాడు. అలాగే బౌద్ధిక ఉత్పాదితాలను సైతం కమ్యూనిస్టు పద్ధతిలో సృష్టించడాన్ని అనుభవించడాన్నీ ఆక్షేపిస్తాడు. వర్గ ఆస్తి మాయం కావడమూ అంటే బూర్జువా దృష్టిలో మొత్తం ఉత్పత్తే మాయమై పోయినట్టే; అలాగే వర్గ సంస్కృతి మాయమైతే ఆ దృష్టికి మొత్తం సంస్కృతి మాయమైనట్టే.
ఏ సంస్కృతి పోతుందని అతగాడు విలపిస్తున్నాడో, ఆ సంస్కృతి అత్యధిక ప్రజానీకానికి యంత్రాల్లా పనిచేసే శిక్షణ మాత్రమే.
బూర్జువా ఆస్తిని రద్దు చెయ్యాలన్నది మా ఉద్దేశం. స్వేచ్ఛ, సంస్కృతి, న్యాయం వగైరాల గురించిన మీ భావాలను ప్రమాణంగా చూపించి మాతో కీచులాడకండి. మీ వర్గ అభీష్టమే మీ న్యాయ శాస్త్రం. అదే అందరికీ వర్తించే చట్టంగా మారింది. మీ వర్గం బతకడానికి అవసరమైన ఆర్ధిక పరిస్థితులే మీ అభీష్టాన్నీ దాని ప్రధాన స్వభావాన్నీ దాని దిశనీ శాసిస్తాయి. అలాగే మీ భావాలే బూర్జువా ఉత్పత్తి పరిస్థితుల నుం బూర్జువా ఆస్తి పరిస్థితుల నుంచీ పుట్టాయి.
మీ ప్రస్తుత ఉత్పత్తి విధానం నుంచీ మీ ప్రస్తుత ఆస్తి రూపం నుంచీ తలెత్తే సామాజిక రూపాలను శాశ్వతమైన ప్రకృతి నియమాలనీ అవి అన్ని కాలాలకూ వర్తించే హేతుబద్ధ నియమాలనీ మీరంటారు. అది మీ స్వార్ధపూరితమైన దురవగాహన ఫలితం. అవి నిజానికి ఉత్పత్తి పురోగమనంలో తలెత్తి మాయమయ్యే చారిత్రిక సంబంధాలు మాత్రమే. మీకు ముందున్న పాలక వర్గాలకు కూడా మీకున్న దురవగాహనే ఉండింది. ప్రాచీన ఆస్తి* గురించి మీరు బాగానే అర్ధం చేసుకుంటారు. ఫ్యూడల్ ఆస్తి అశాశ్వతం అన్న విషయాన్ని మీరు చక్కగా ఒప్పుకుంటారు. అదే మీ బూర్జువా ఆస్తి రూపం విషయంలో మాత్రం ఆ మాట మీరు ఒప్పుకోలేరు.
____ మార్క్స్ ఏంగెల్స్
( కమ్యూనిస్టు ప్రణాళిక)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి