సోషలిజం భవిష్యత్తు




ప్రపంచ రాజకీయ చిత్రపఠంలో పెట్టుబడిదారీ విధానం అమలు చేస్తున్న దేశాలున్నాయి. అలాగే సోషలిస్ట్ విధానం అమలు చేస్తున్న దేశాలు ఐదు ఉన్నాయి. 5 దేశాల్లో (చైనా, క్యూబా, వియత్నాం, డెమోక్రటిక్ రిపబ్లిక్ కొరియా (ఉత్తర కొరియా), లావోస్) కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో సోషలిస్టు ప్రభుత్వాలు పని చేస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, సంక్షోభం, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలతో ముందుకు నడుస్తున్నాయి. వేగుచుక్కగా ఉన్నాయి. కోవిడ్, ఆర్థిక సంక్షోభంలో ఎదుర్కొన్న తీరు చూసి ఐ.ఎం.ఎఫ్ ప్రతినిధులు కూడా సోషలిస్ట్ దేశాల కృషిని శ్లాఘించాయి,

(1) సోషలిజం అంటే ఏమిటీ ? :

సోషలిజం అనగా ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల చేతుల్లో నుండి జాతీయం చేయబడి ప్రభుత్వ ఆస్తిగా మారుతుంది. భూమి, ఖనిజాలు, ఫ్యాక్టరీలు, నదులు సమస్తము ప్రభుత్వం చేతుల్లో ఉండటమే సోషలిజం.

సోషలిస్టు ఆర్ధిక వ్యవస్థలో ఉత్పత్తి శక్తులకు యజమాని కార్మిక వర్గమే. కనుక సంపద అంతా సమాజానికే చెందుతుంది. శ్రామిక ప్రజల అవసరాలు తీర్చడానికి సంపదను వినియోగించడం జరుగుతుంది. మిగులు సంపదను దేశ అభివృద్ధికి, రక్షణ రంగానికి, సంక్షేమ పధకాలకు ఖర్చు చేయడం జరుగుతుంది.

పెట్టుబడిదారీ సమాజంలో ఉత్పత్తి సాధనాలు వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. కనుక ఉత్పత్తిపై వ్యక్తి అజమాయిషి ఉంటుంది (ఉదా : అనిల్ అంబాని, గౌతం అదాని) సోషలిస్టు సమాజంలో ఉత్పత్తి సాధనాలు సామాజిక ఆస్తిగా ఉంటాయి. అప్పుడు ఉత్పత్తి సామాజిక స్వభావం కలిగి ఉంటుంది అనగా ఉత్పత్తి సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే ప్రణాళికా బద్దంగా ఉత్పత్తి సాధిస్తారు. ఆవిధంగా ఉత్పత్తి సామాజిక స్వభావం కలిగి ఉంటుంది.

సోషలిజంలో ముఖ్యమైన సూత్రం ఏమిటంటే శక్తికొలది పని - శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. పని చేయగల్గిన | శక్తి ఉన్నంతకాలం కష్టపడి పనిచేయాలి. అంతే తప్ప సోమరిగా ఉంటానంటే వ్యవస్థ అంగీకరించదు. ఎటువంటి పని చేయకుండా సోమరులుగా ఉండే పరిస్థితి ఉండదు. అందరూ శ్రమించి ఉత్పత్తిని కొనసాగిస్తారు. కనుక వచ్చిన సంపదపై | ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తి చేసే శ్రమ వ్యక్తిగత స్వభావాన్ని కోల్పోయి సామాజిక స్వభావాన్ని కలిగి ఉంటుంది.

వృద్ధాప్యం వచ్చినప్పుడు. వికలాంగులు పని చేయలేని స్థితి ఉన్నప్పుడు ప్రభుత్వమే వృద్ధులకు, వికలాంగులకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో తల్లిదండ్రులను పోషించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో అడుక్కుతిని బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సోషలిస్టు వ్యవస్థలో అడుక్కుతినే పరిస్థితి ఉండదు. (2) సోషలిస్టు ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం ఏమిటి ?

(ఎ) దేశ ఆర్ధిక పరిస్థితిని అభివృద్ధి చేయడం. ఉదా : చైనా. 2025 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థని మించి నెంబర్ వన్

స్థానానికి చేరుకునే లక్ష్యం (బి) పెట్టుబడిదారీ దేశాల కన్న మిన్నగా ఉత్పత్తి సాధనాలను అభివృద్ధిని సాధించడం

(ఉత్పత్తి సాధనాలు అనగా ఉత్పత్తి వనరులు (భూమి, నదులు, అడవులు, ఖనిజాలు) ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిని ఉత్పత్తి వనరులు అంటారు. ఉత్పత్తి పరికరాలు ఉత్పత్తి వనరులను వినియోగంలోకి తీసుకురావడానికి ఉపయోగపడే పరికరాలు పలుగు, పార, యంత్రాలు, ట్రాక్టర్లు, విద్యుత్చక్తి మొదలగునవి. ఈ రెండు కలిపితే ఉత్పత్తి సాధనాలు) (సి) ప్రజలందరికి జీవించే హక్కు కల్పించడం.

(డి) ప్రజల జీవన స్థాయిని పెంచి, ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సోషలిస్టు ప్రభుత్వం పని చేస్తుంది. అసమానతలు,

తారతమ్యాలు లేని వ్యవస్థ ఏర్పాటుకై కృషి.

(3) పెట్టుబడిదారీ విధానం అంటే ఏంటీ ?

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంపద వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఉత్పత్తి సాధనాలపై వ్యక్తుల అజమాయిషి (పెత్తనం) ఉంటుంది. భూమి, ఖనిజాలు, ఫ్యాక్టరీలు, నదులు సమస్తము పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటాయి. దీనినే పెట్టుబడిదారీ విధానం అంటాము. కష్టించే కార్మికులకు శ్రమ తప్ప మరో ఆయుధం లేదు. అందుచేత పని చేస్తేనే తిండి, కొన్ని సందర్భాల్లో పని చేసినా తిండి దొరకదు. పెట్టుబడిదారీ సమాజంలో శ్రమ చేసే కార్మికులు ఆకలిదప్పులతో అలమటించే పరిస్థితి ఉంటుంది. సోషలిస్ట్ సమాజంలో

ఆ పరిస్థితి ఉండదు. తిండి, బట్ట, ఇల్లు లాంటి కనీస అవసరాలకు సోషలిస్ట్ ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.

పెట్టుబడిదారీ వ్యవస్థలో సంపద కార్పోరేట్స్ (దోపిడీదారులు) చేతుల్లో పోగుపడుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టించే శ్రామిక జనానికి తిండి కరువుతుంది. అనారోగ్యం పాలైన, జబ్బుపడినా మందులు కొనుగోలు చేయడానికి సరిపడ డబ్బు లేక అనారోగ్యంతో మరణించడం జరుగుతుంది.

(4) సోషలిస్ట్ వ్యవస్థలో ప్రభుత్వం ప్రజలకు అందించే పధకాలు :

(ఎ) ఉచిత విద్య :

16 సంవత్సరాలలోపు బాల, బాలికలతో పని చేయడాన్ని నిషేదిస్తుంది. సోషలిస్టు సమాజంలో అందరికి నిర్భందం ఉచిత విద్యను అమలు చేస్తుంది. పెట్టుబడిదారీ సమాజంలో ప్రభుత్వం అందరికి విద్య అందించే బాధ్యత నుండి తప్పుకొని విద్యను వినిమయ వస్తువుగా మార్చి విద్యను కొనుక్కోండి అనే దానిని అమలు చేస్తుంది. కొనుక్కొనే సామర్థ్యం లేకపోతే చదువుకొనే హక్కు కోల్పోతారు. దీనికి భిన్నమైనది సోషలిస్టు సమాజం కల్పిస్తుంది. (బి) అందరికి ఉపాధి:

సోషలిస్టు సమాజంలో నిరుద్యోగం ఉండదు. నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సోషలిస్టు సమాజంలో పనిచేసే హక్కు గ్యారెంటీని ఇస్తుంది. ప్రభుత్వమే సమర్థతను బట్టి ఉపాధి లేదా ఉద్యోగం కల్పిస్తుంది. ఈ రెండు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తుంది. పరిశ్రమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఉదా : చైనా జనాభా 140 కోట్లు. చైనాలో పేదరికాన్ని నిర్మూలించామని సగర్వంగా ప్రకటించారు. (సి) అందరికి ఇల్లు:

సోషలిస్టు సమాజంలో ఇండ్లు లేక భాదపడే కుటుంబాలు ఉండవు. వ్యక్తిగతంగా ఇల్లు సమకూర్చు కోలేకపోతే అందరికి గృహాన్ని సమకూర్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్థిక స్థోమతలను బట్టి సొంత ఇల్లు, సొంత వాహనం సమకూర్చుకొనే స్వేచ్చ ఉంటుంది.

(డి) అందరికి వైద్యం :

సోషలిస్టు సమాజంలో ప్రతీ వ్యక్తి ఆరోగ్యానికి భద్రత ప్రభుత్వమే కల్పిస్తుంది. సాధారణ ఆసుపత్రులు మొదలుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు ప్రభుత్వమే నిర్మించి అందరికి వైద్యాన్ని అందిస్తుంది. వైద్యం అందక చనిపోయే పరిస్థితి సోషలిస్టు సమాజంలో ఉండదు. వైద్యం కొనుక్కునే పరిస్థితి రూపుమాపుతుంది.

గత రెండు సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఈ విషయంలో కూడా

పెట్టుబడిదారుడు కోవిడ్ సంక్షోభాన్ని కూడా ఉపయోగించుకొని కోట్లు ఆర్జించారు. కోట్లాది మంది మరణించారు. ఆర్ధిక వ్యవస్థ

క్షీణించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి పెట్టుబడిదారీ దేశాలు కోవిడ్ మహమ్మారితో గిలగిల కొట్టుకున్నాయి.

కాని వీటికి భిన్నంగా సోషలిస్టు దేశాలు వ్యవహరించాయి. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా జాగ్రత్తపడడమే కాక ఆర్థికాభివృద్ధిని సాధించాయి. చైనా 100 దేశాలకు పైగా మందులను ఎగుమతి చేసింది. అతి చిన్న దేశమైన సోషలిస్టు క్యూబా తన దేశం నుంచి డాక్టర్లను, నర్సులను 50 దేశాలకు పంపి వైద్య సేవలందించింది. ప్రపంచమన్ననలు పొందింది. పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిస్టు వ్యవస్థకు ఉన్న తేడా ఇదే.

(ఇ) ఫించన్ సౌకర్యం :

సోషలిస్టు సమాజంలో ఒక కార్మికుడు వృత్తి నుండి రిటైర్ అయిన తరువాత అతను బ్రతకడానికి ఫించన్ సౌకర్యం కల్పిస్తుంది. ఎవరు మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బ్రతికే పరిస్థితి కల్పిస్తుంది. సాంఘిక బీమా మొదలగు పథకాలకు ప్రభుత్వమే నిధులు చెల్లిస్తుంది.

(ఎఫ్) సామాజిక సాంస్కృతిక అవసరాల కోసం నిధులు కేటాయింపు : కార్మికులు విరామ టైంలో వినోదం, విజ్ఞానం అందించడం కోసం విజ్ఞాన మందిరాలు (లైబ్రేరీలు), శారీరక దారుడ్యం పెంచుకోవడానికి వ్యాయమశాలలు, ఆడుకోవడానికి ఆటస్థలాలు, పబ్లిక్ పార్క్లు నిర్మాణం, విజ్ఞానం, వినోదం అందించడానికి

సినిమా హాల్సు నిర్మాణం ప్రభుత్వమే నిర్వహిస్తుంది. నేడు పెట్టుబడిదారీ సమాజంలో కార్మికులకు, పేదలకు ఇవేమి అందుబాటులో లేవు. పైగా డబ్బుతో కొనుక్కునే

 వినిమయ వస్తువులుగా మారిపోయాయి. ఇందువల్ల పేదలు, కార్మికులు విజ్ఞానం, వినోదానికి దూరమవుతున్నారు. కనుక ఆనందదాయకమైన జీవితం అనుభవించాలంటే సోషలిస్టు సమాజంలోనే సాధ్యపడుతుంది.

సంపదపై అధికారం ప్రభుత్వానికే ఉంటుంది కాబట్టి సంపదలో కొంత మిగులును పై సంక్షేమ కార్యక్రమాలు, సదుపాయాలకు ఖర్చు చేయడం జరుగుతుంది.

దేశ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని, ఆధునిక విత్తనాలను అభివృద్ధి చేసి ఎక్కువ దిగుబడి సాధించిం ప్రజల అవసరాలు తీరుస్తారు. ఉదాహరణకు 140 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనాలో ఒక ఎకరాకు వరి 70 - 80 బస్తాలు | దిగుమతి సాధిస్తారు.

(జి) పనిగంటల తగ్గింపు:

పెట్టుబడిదారీ విధానంలో కార్మికుడి శ్రమను అనేకవిధాలుగా దోపిడీ చేస్తారు. పని గంటలు పెంపు, యాంత్రీకరణ చేయడం, టెక్నాలజీ అభివృద్ధి, మున్నగు పద్ధతుల ద్వారా యాజమాని కార్మికులను దోపిడీ చేస్తారు. కాని సోషలిస్టు సమాజంలో దోపిడీ యాజమాన్యం ఉండదు కాబట్టి పరిశ్రమల్లో యాంత్రీకరణ, టెక్నాలజీ, అభివృద్ధి అయ్యేకొద్ది నూతన సాంకేతిక పద్ధతులు| అభివృద్ధి చెందే కొద్ది శ్రమచేసే కాలం తగ్గుతుంది. సోషలిస్ట్ సమాజంలో కేవలం 6 గంటల పని అమలులో ఉంటుంది. ఉత్పత్తి పెరిగేకొద్ది కార్మికుల వేతనాలు కూడా పెరుగుతాయి.

శక్తికొద్ది పని - పనిని బట్టి ప్రతిఫలం అనేది సోషలిజంలో ఒకముఖ్యమైన సూత్రం. ఇది కార్మికుని నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అందరికి సమాన వేతనాలు అనేది సరికాదు ఎందుకనగా నైపుణ్యాన్ని (స్కిల్డ్- అన్ స్కిల్డ్) బట్టి వేతనాలు నిర్ణయించటం జరుగుతుంది. దీనివల్ల ప్రతి కార్మికుడు నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడు. (హెచ్) సోషలిస్టు సమాజంలో ఆర్థిక సంక్షోభాలు ఉండవు:

పెట్టుబడిదారీ వ్యవస్థలో ఆర్థిక సంక్షోభాలు అనివార్యంగా ఉంటాయి. ఉత్పత్తికి, వినియోగానికి మధ్య ప్రణాళిక ఉండదు. లాభమే పరమావధిగా వస్తువులను ఉత్పత్తి చేస్తారు తప్ప సమాజ అవసరాలు పట్టించుకోరు. దీనివల్ల సంక్షోభాలు తలెత్తి పరిశ్రమలు మూతపడతాయి. నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. 2008లో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి నేటికి బయటపడలేకపోతుంది. పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదదేశాలు కుడితిలో పడ్డ ఎలుకల్లాగా కొట్టుమిట్టాడుతున్నాయి.

సోషలిస్టు దేశాలు మాత్రమే ఆర్థిక సంక్షోభానికి గురికాకుండా ఉన్నాయి. కారణం ప్రణాళికబద్ధ ఆర్థిక వ్యవస్థ అమలు చేయడం మరియు ప్రజల కొనుగోలు శక్తి పెంచడం వల్లనే.. (ఐ) మహిళల హక్కులకు రక్షణ :

(1) సోషలిజం ఉన్న దేశాలలో మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పిస్తారు.

(2) పురుషులతో సమానంగా స్త్రీలను కూడా ఉద్యోగాలలో నియమిస్తారు. | (3) మహిళలపై లైంగిక వేధింపులు లేకుండా చూస్తారు. లైంగిక వేధింపులు జరిపిన వ్యక్తులపై కఠినమైన చర్యలు ఉంటాయి. (4) స్త్రీలు అభివృద్ధి చెందడానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తారు.

(5) భార్యా భర్తల మధ్య వివాదం ఏర్పడితే వాటిని పరిష్కరించడానికి పూనుకుంటారు. స్త్రీ గనకా భర్త నుండి విడాకులు కోరుకున్నట్లైతే స్త్రీ ఆలోచనలకు ప్రాధాన్యతను ఇస్తారు.

(జె) అవినీతి నిర్మూలన

సోషలిస్ట్ సమాజంలో ఎక్కడైనా ఎవరైనా అవినీతికి పాల్పడితే చాలా కఠినంగా శిక్షిస్తారు. చైనాలో సరళీకరణ విధానాలు అమలైన తర్వాత అభివృద్ధితో పాటు అక్కడ్కడ అవినీతి చోటు చేసుకొంది. అవినీతి పరులు ఎవరైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులైనా ఖచ్చితమైన చర్యలు తీసుకొని జైలుకి పంపుతారు. అవినీతి గనుక ప్రజల దృష్టిలోకి వస్తే ప్రభుత్వానికి తెలియజేయండని నోటీసు బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు.

((కె) మత స్వేచ్ఛ :

సోషలిస్ట్ వ్యవస్థలో వివిధ మతాలు ఉంటాయి. ఒక మతస్తుడు మరొక మతంపై దుష్ప్రచారం చేయకూడదు. బహిరంగంగా మత ప్రచారం చేయకూడదు. ఇష్టమోచ్చిన మతాన్ని వారు ఆచరించే స్వేచ్ఛ ఉంటుంది.

పెట్టుబడిదారీ వ్యవస్థకు సోషలిస్టు వ్యవస్థకు పోలికే ఉండదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మతాన్ని కూడా దోపిడికి సాదనంగా ఉపయోగిస్తారు. కులాల మధ్య కొట్లాటలు ఉండవు. మతాల మధ్య కీచులాటలు, దూషణలు ఉండవు. ప్రాంతాల మధ్య వైరుద్యాలను నిర్మూలిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ అభివృద్ధితో పాటు వ్యక్తిగత జీవన అభివృద్ధికి అవకాశాలను కల్పిస్తారు.

(ఎల్) సోషలిస్టు దేశాల్లో మీడియా పాత్ర :

సోషలిస్టు దేశాల్లో మీడియా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపవచ్చు. కానీ సోషలిస్టు వ్యతిరేక వార్తలు అనుమతించరు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే వార్తలకు, మతాల మధ్య ఉద్రిక్తతలు| సృష్టించే వార్తలను అనుమతించరు. దేశ సమైఖ్యతను పరిరక్షించే విధంగా మీడియా పాత్ర ఉంటుంది. ఇంటర్నెట్లో కూడా ఆంక్షలు ఉంటాయి. చైనాలో గూగుల్కి అనుమతి లేదు. కాని సొంత ఇంటర్నెటిని ఏర్పాటు చేసుకున్నారు. (ఎమ్) సోషలిస్టు ప్రజాస్వామ్యం :

సోషలిస్టు సమాజం యొక్క ప్రధాన రాజకీయ లక్షణం సమగ్రమైన కార్మిక ప్రజాస్వామ్యం అమలు చేస్తారు. అనగా సామాజిక జీవితానికి సంబంధించిన వివిధరంగాల్లో ప్రజాస్వామాన్ని అభివృద్ధి చేసి నూతన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు | అభివృద్ధి చేస్తారు. తిరోగమన భావాలను, మూడనమ్మకాలను నిర్మూలిస్తారు.

పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పేరుకు మాత్రమే ప్రజాస్వామ్యం ఉంటుంది. కాని ఆచరణలో అణచివేతలు, నిర్భందాలు అమలు చేస్తారు. ఉన్న పౌరహక్కులను అమలు కాకుండా ఆటంకపరుస్తారు. నేతిబీరకాయలో నెయ్యి ఉన్న చందంగానే పెట్టుబడిదారీ సమాజంలో పౌరహక్కులు ఉంటాయి. కాని సోషలిస్టు సమాజంలో సోషలిస్టు వ్యవస్థను కాపాడుకుంటూనే పౌరహక్కులను అమలు చేస్తారు. పౌరహక్కుల పేరుతో సోషలిస్టు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి సామ్రాజ్యవాదులు చేసే కుట్రలను తిప్పికొట్టి సంపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తారు.

జాతుల మధ్య విభేదాలు లేకుండా ఐక్యత చేకూర్చడం, విభిన్న భాషలను అభివృద్ధి పరిచి, వివిధ జాతులు సాంస్కృతిక స్థాయిని మెరుగుపరచడానికి సోషలిస్టు ప్రజాస్వామాన్ని అమలు చేస్తారు.

సోషలిస్టు సమాజంలో ప్రజల హక్కులను, ప్రయోజనాలను కాపాడతారు. వ్యక్తుల ఆస్తికి రక్షణ కల్పిస్తూ (ఇల్లు, వాహనాలు) ప్రజల మధ్య శాంతిభద్రతలు విచ్ఛిన్నం కాకుండా శాంతిని నెలకొల్పే విధంగా సోషలిస్టు ప్రజాస్వామ్యం కృషి సలుపుతుంది.

(ఎస్) ఎన్నికల విధానం :

ప్రతి సోషలిస్టు దేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి. వారు ఎన్నికల్లో పాల్గోంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా సోషలిస్టు వ్యవస్థను బలపరిచే విధంగా పని చేయాలి. సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి అనుమతి ఇవ్వరు. ప్రాంతాల వారీగా వారి కోర్కెలను ప్రభుత్వానికి తెలియజేయడానికి స్వేచ్ఛ కల్పిస్తారు. (ఒ) ప్రభుత్వంలో పార్టీ పాత్ర :

దేశ అభివృద్ధికి పార్టీ పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తుంది. రూపొందించిన ప్రణాళికలను పార్టీ మహాసభల్లో ఆమోదిస్తారు. అప్పుడు రూపొందించిన ప్రణాళికలను ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తుంది. పంచవర్ష ప్రణాళికలు తయారు చేసి ఆ విధంగా దేశ అభివృద్ధికి పార్టీ సమగ్రమైన ప్రణాళిక రూపొందిస్తుంది.

కనుక మనదేశంలో కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల మొత్తం పేదప్రజల బాధలు పోవాలంటే, ఆనందదాయకమైన జీవితం గడపాలంటే మనమంతా మన దేశంలో అమలవుతున్న పెట్టుబడిదారీ, భూస్వామ్య విధానాన్ని కూలద్రోసి సోషలిస్టు సమాజ నిర్మాణానికి కృషి చేయాలి.

సోషలిస్ట్ సమాజం సాధించాలంటే ముందుగా జనతా ప్రజాతంత్ర విప్లవాన్ని జయప్రదం చేయాలి. ఇందుకోసం మనం వివిధ వర్గాలను, సామాజిక తరగతులను సమీకరించి ప్రజాసంఘాల నిర్మాణం, వేదికల నిర్మాణం ఏర్పాటు చేసి వీటి ద్వారా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలి. పోరాటాల ద్వారానే సమాజంలో ప్రజల భావాలలో మారు తీసుకొని రాగలుగుతాము. పెట్టుబడిదారీ భూస్వామ్య బావజాలం పోయి కార్మిక వర్గ బావజాలం, సోషలిస్ట్ చైతన్యం ఏర్పడాలంటే పోరాటాలే శరణ్యం. అందుచేత జనతా ప్రజాతంత్ర విప్లవం సాధించడానికి ఉవ్వెత్తున పోరాటాలు సాధించాలి. దీనిని సాధించాలంటే తక్షణ మనం వామపక్ష ప్రజాతంత్ర సంఘటన వేదికను ఏర్పాటును ఏర్పాటు చేయాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?