ఐక్యపోరాటాలు



*🚩ఆవిర్భావ దినోత్సవ స్ఫూర్తితో ఐక్యపోరాటాలకు పునరంకితమవుద్దాం!🚩*♦️♦️♦️♦️♦️
*భారతదేశంలో జాతీయోద్యమం, కార్మికోద్యమం పెనవేసుకొనే సాగాయి.ఏఐటియుసి ఏర్పడ్డ ప్రారంభ దినాల్లో జాతీయోద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులే ఆ తరువాత ఏఐటియుసికి నాయకత్వం వహించారు. బి.టి.రణదివే,పి.రామ్మూర్తి, డాంగే,ఘాటే వంటి ఎందరో కమ్యూనిస్టు నాయకులు కూడా కీలక పాత్ర పోషించారు. అందుకనే ఇటు జాతీయోద్యమంలోనూ,అటు కార్మికోద్యమంలోనూ మిలిటెంట్‌ పోరాటాల ఉధృతి సాగింది.*

1920 లో ఏర్పడ్డ                    ఏఐటియుసి కార్మిక సంస్థను భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి మూడునెలల ముందు ఏఐటియుసిలో చీలికలకు కాంగ్రెస్‌ పార్టీ పావులు కదిపింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి పాత్రధారి, సూత్రధారుడు.1947 జూన్‌లో  ఐ ఎన్ టి యు సి ఏర్పడింది. దీంతో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో చీలికలు ప్రారంభం అయ్యాయి. ఆ తరువాత 1948లో హిందూ మజ్దూర్‌ సభ ఏర్పడింది. 1948లో యుటియుసి, 1955లో భారతీయ మజ్దూర్‌ సంఘ్ (బిఎంఎస్‌),1958లో యుటియుసి లెనిన్‌ సారాని తదితర కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి.కాల క్రమేణా ఏఐటియుసి .పాలకవర్గ స్వభావం పట్ల భ్రమలకు లోనైంది.ప్రభుత్వంతో సహకరించాలని నిర్ణయించింది. కార్మికులకు నష్టం కలిగించే లాలూచీ పద్ధతులను అనుసరించింది.ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి వర్గ పోరాటాన్ని వదిలి వర్గ సామరస్య మార్గాన్ని చేపట్టింది.వర్గ పోరాట భావననే హేళన చేసింది.వర్గ ఐక్యతకు అనుకూలంగా ఉండే ఏఐటియుసిలోని కొంత మంది నాయకులను అనేక బాధలు, క్షోభలకు గురి చేసింది. ఏఐటియుసి ఆనాటి ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఎం.జోషి కార్మికులు రాజకీయ పోరాటాల్లో పాల్గొనడాన్ని వ్యతిరేకించారు.ఎస్‌.ఎ.డాంగే రెండు స్తంభాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ఈ సిద్ధాంతమే కార్మిక రంగంలో సంస్కరణ వాదానికి పునాదులు వేసింది.

నాటి పాలకవర్గం బోనస్‌ను 8.33 నుండి 4శాతానికి తగ్గిస్తే ఏఐటియుసి అధినేత ఎస్‌.ఎ. డాంగే దాన్ని అంగీకరిస్తూ సంతకం చేశాడు.ప్రభుత్వమే ఏకపక్షంగా వేతనం నిర్ణయించేలా వేజ్‌ కోడ్‌కు ప్రభుత్వం ప్రతిపాదిస్తే అంగీకరించాడు.1975 నుండి 1977 వరకు ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీని సపోర్ట్‌ చేశారు.ఏఐటియుసి సంస్కరణవాద ధోరణులను వ్యతిరేకించిన నాయకులను యూనియన్ల నాయకత్వ బాధ్యతల నుండి తొలగించి, వారు బాధ్యత వహిస్తున్న సంఘాల అనుబంధాలను రద్దు చేశారు.ఏఐటియుసి వర్గ సామరస్య విధానాల నుండి, పాలకవర్గాలకు తోకలుగా ఉండే ధోరణి నుండి వేరు చేయడానికి కొందరు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ పరిస్థితుల్లో కార్మికవర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేయడానికి,ప్రజాతంత్ర పని విధానాన్ని స్వేచ్ఛగా అమలు చేయడం కోసం,రాజీ - లొంగుబాటు ధోరణులకు వ్యతిరేకంగా 1970 మే 30న సిఐటియు ఆవిర్భవించింది. బి.టి.రణదివే మొదటి అధ్యక్షులుగా,పి. రామ్మూర్తి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

 భారతదేశంలో వర్గ దోపిడీని అంతం చేసి సాంఘిక మార్పుకు వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేయాలనే లక్ష్యసాధన కోసం సిఐటియు ఏర్పడింది.సిఐటియు తన లక్ష్యాన్ని నిబంధనావళిలో స్పష్టంగా రాసుకుంది.ఉత్పత్తి సాధనాలన్నీ,పంపిణీని సమాజపరం చేస్తే తప్ప కార్మికుల దోపిడీ అంతం కాదని చెప్పింది.ఈ మార్పు వర్గ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమని,అన్నిరకాల అణచివేతలు,వివక్షలను ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చింది.అన్నిరకాల వర్గ సామరస్యాలను వ్యతిరేకిస్తామని కూడా తమ లక్ష్యాలలో నిర్థేశించుకున్నది. 1970లో ''ఐక్యత-పోరాటం'' నినాదంతో సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (సిఐటియు) ఆవిర్భవించింది.

 సిఐటియు ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే పాలకవర్గాలు, ఇతర కార్మిక సంఘాలు సిఐటియుని ఒంటరి చేసే ప్రయత్నాలు చేశారు. సిఐటియు పిలుపునిచ్చిన ఐక్యతా నినాదాన్ని అవహేళన చేశారు.సిఐటియు మాత్రం తన కార్యాచరణ ద్వారానే సమాధానం ఇచ్చింది.

 ఇందిరాగాంధీ చేపట్టిన వేతన
స్తంభన, కంపల్సరీ డిపాజిట్‌ స్కీంలకు వ్యతిరేకంగా పోరాడటానికి సిఐటియు చొరవ చేసి యునైటెడ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్లను ఏర్పాటుచేసింది.ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి ప్రభుత్వం సిఐటియు సంస్థను అణచివేయ జూసింది. సిఐటియు నాయకత్వం తీవ్ర నిర్భంధాలకు గురైంది.అయినా పౌరహక్కులు,అప్రజాస్వామ్య అణచివేతలను నిరసిస్తూ కార్మికవర్గ ఐక్యతను చాటి చెబుతూ కార్మిక,ప్రజా పోరాటాలకు సిఐటియు మద్దతు కూడగట్టింది.

1974లో జరిగిన అద్భుతమైన రైల్వే కార్మికుల సమ్మె దేశంలోని మొత్తం కార్మిక వర్గాన్ని ఉత్తేజపరిచింది.రైల్వే కార్మికులను దేశవ్యాప్త పోరాటాల బాటలోకి తీసుకు రావడానికి సిఐటియు శ్రీకారం చుట్టింది.తీవ్రమైన అణచివేతలు,కక్ష సాధింపుల మధ్య 20రోజులు సమ్మెలో కీలకభూమిక పోషించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే కార్మికులను ఐక్య పోరాటాల్లోకి తీసుకురావడం కోసం నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఫర్‌ రైల్వే మెన్‌ స్ట్రగుల్స్‌ (ఎన్‌సిసిఆర్‌ఎస్‌) ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించింది. ఐఎన్‌టియుసి తప్ప మిగతా ప్రధాన కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసింది.1978లో జనతా ప్రభుత్వం ఇండిస్టియల్‌ రిలేషన్స్‌ బిల్‌ తీసుకొచ్చి భూతలింగం కమిటీ సిఫారసుల సందర్భంగా దానికి వ్యతిరేకంగా సిఐటియు చేపట్టిన ఐక్య పోరాటాల ఫలితంగా నాటి ప్రభుత్వం ఆ బిల్లును పక్కన పెట్టాల్సి వచ్చింది.

 1980 దశకంలో ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా ఏఐటియుసి, హెచ్‌ఎంఎస్‌ తదితర కార్మిక సంఘాలతో కలిసి సిపిఎస్‌టియుని ఏర్పాటు చేసింది.1981లో కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా నేషనల్‌ క్యాంపెయిన్‌ కమిటీ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ (ఎన్‌సిసి)ను ఏర్పరచి పోరాటాలను చేపట్టడంలో సిఐటియు ముఖ్యపాత్ర వహించింది.రైతులు, వ్యవసాయ కూలీల వ్యవసాయ కూలీల సమస్యల్ని ముందుకు తెచ్చి 1982 జనవరి 19న మొదటిసారిగా దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది.ఇందులో కార్మికవర్గం,రైతులు, వ్యవసాయ కార్మికుల డిమాండ్లను కూడా దేశ కార్మికోద్యమం లేవనెత్తింది. ఈ సమ్మెలో పాల్గొన్న 10మంది వ్యవసాయ కార్మికులు పోలీస్‌ కాల్పుల్లో చనిపోయారు. సిఐటియు జనవరి 19న ఆనాటి నుండి కార్మిక-కర్షక సంఘీభావ దినంగా పాటిస్తుంది.
1995 నవంబర్‌ 17న నాటి కార్మిక శాఖామంత్రి వెంకటస్వామి ఇ.పి.ఎస్‌. పథకాన్ని ప్రకటించాడు. ఏఐటియుసితో సహా మొత్తం కార్మిక సంఘాలు ఆ పథకాన్ని రెండు చేతులా ఆహ్వానించాయి.ఒక్క సిఐటియు మాత్రమే దాన్ని వ్యతిరేకించింది.దేశవ్యాప్త క్యాంపెయున్‌ను నిర్వహించింది.1996 ఫిబ్రవరి 26 అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చింది.ఆనాటి సిఐటియు సభ్యత్వంతో నిమిత్తం లేకుండా ఎన్నో రెట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

2002లో నేషనల్‌ అసెంబ్లీ ఆఫ్‌ వర్కర్స్‌ను,స్పాన్సరింగ్‌ కమిటీ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ను ఏర్పాటుకు సిఐటియు కృషి చేసింది.సిఐటియు చేస్తున్న స్వతంత్ర కార్యాచరణ ద్వారా ఐక్య కార్యాచరణకు ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుంది.2018లో నిర్వహించిన మహాపడావ్‌ అందుకు ఉదాహరణ.2019 జనవరి 8, 9 తేదీల్లో జరిగిన రెండు రోజుల సమ్మెలో 20 కోట్ల మంది కార్మికులు పాల్గొన్నారు. వివిధ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో వివిధ సెక్టార్లలో కోల్‌,స్టీల్‌, ప్లాంటేషన్‌,అంగన్‌వాడీ,ఆశా, మధ్యాహ్న భోజనం కార్మికుల్లో ఐక్య ఉద్యమాలు - సమ్మెలు జరిగాయి.

2010 నుండి 2013 వరకు ఐఎన్‌టియుసి,బిఎంఎస్‌తో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యవేదిక ద్వారా మూడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలను నిర్వహించాయి. 1982లో దేశవ్యాప్తంగా మొదటిసారి జరిగిన సమ్మెలో ఐఎన్‌టియుసి పాల్గొనలేదు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడంతో 2015లో బిఎంఎస్‌ ఐక్య ఉద్యమం నుండి దూరమైంది.నయా ఉదారవాద విధానాల ప్రారంభం నుండి నేటి వరకు 21 సాధారణ సమ్మెలు సిఐటియు చొరవతో జరగడం అపూర్వం.

సిఐటియు కేవలం కార్మిక సంఘాల,కార్మికుల మధ్య ఐక్యత సాధించడానికే పరిమితం కాలేదు.సమాజంలో దోపిడీకి,అణచివేతకు గురవుతున్న అన్ని వర్గాల కార్మిక,ప్రజానీక సమస్యలపై తన గొంతెత్తి నినదించింది. 2020 నవంబర్‌ 26న 20వ సార్వత్రిక సమ్మె సందర్భంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతు ఉద్యమాన్ని తన అక్కున చేర్చుకొని విజయం సాధించే వరకు ఆ పోరాటంతో మమేకమైంది.గ్రామీణ వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఉమ్మడి పోరాటాలతో సిఐటియు మమేకమవుతుంది.      
 శ్రామిక మహిళలను ఉద్యమాలలోకి తీసుకు రావడంలో సిఐటియు పాత్ర చాలా ముఖ్యమైనది. దీనిని ఒక వర్గ కర్తవ్యంగా సిఐటియు గుర్తించింది.వర్గ ఐక్యతను పెంపొందించడానికి, అలాగే వర్గ పోరాటాలను బలోపేతం చేయడానికి శ్రామిక మహిళలు ఉద్యమంలోకి రావడం ముఖ్యమైనదిగా సిఐటియు భావించింది. 1979లో మొట్టమొదటిసారిగా శ్రామిక మహిళా జాతీయ సదస్సును సిఐటియు నిర్వహించింది.ఒక కేంద్ర కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా కన్వెన్షన్‌ను నిర్వహించడం అదే మొదటిసారి.

మతోన్మాద ఎజెండాతో అధికారంలోకి వచ్చిన బిజెపి మనుస్మృతి ఆధారంగా మెజారిటీ రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నిస్తున్నది. అందులో భాగంలో దళితులు, ఆదివాసులు,మహిళలపై అణచివేత,దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నది. గో సంరక్షణ సాకుతో ముస్లీం మైనారిటీలు,దళితులపై దాడులు చేస్తున్నది.కులాంతర వివాహాల జంటలను ఎంచుకొని వేధింపులకు పాల్పడుతున్నది.తద్వారా కార్మికవర్గ ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నది.కార్మికవర్గ ఉద్యమం ఆర్ధిక డిమాండ్ల పోరాటంలో విజయం సాధించాలంటే నయా ఉదారవాద విధానాలపై పోరాడాలి.సామ్రాజ్యవాద కుట్రలను ఓడించాలి. రాజకీయంగా,సైద్ధాంతికంగా అన్ని స్థాయిల్లో కార్మికవర్గ ఐక్యతకు కృషి చేయాలి. కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసే మతతత్త్వ శక్తులను వేరుచేసి ఓడించాలి.

 అన్నిరకాల దోపిడీ, అణచివేతలను అంతం చేయాలనే లక్ష్యంతో కార్మికవర్గం శ్రమ జీవులందరినీ ఏకం చేయాలనే లక్ష్యం కోసం సిఐటియు పని చేస్తున్నది.
నయా ఉదారవాద విధానాలను దుందుడుకుగా అమలుపరుస్తూ,కార్పొరేట్‌ సంస్థలను ప్రయోజనాలు, లాభాల కోసం దేశాన్ని దివాళా తీయిస్తున్నది.నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం,లీజుకు ఇవ్వడం, ప్రయివేటీకరించడంతో మన దేశ సంపదను లూఠీ చేస్తున్నది.

 ''భారతదేశాన్ని రక్షించుకుందాం! ప్రజల్ని కాపాడుకుందాం!!'' అనే నినాదంతో దేశ రక్షణ కోసం కార్మికవర్గాన్ని జాగృతం చేస్తున్నది.భారత కార్మికోద్యమ చరిత్రలో సిఐటియు నిర్వహించిన పాత్ర అమోఘమైనది.కార్మికవర్గ ఐక్యతే ధ్యేయంగా 53ఏండ్లుగా సిఐటియు అలుపెరగని పోరాటాలు చేస్తున్నది.ఎన్ని ఒడిదుడుకులెదురైనా కార్మికుల పక్షాన,కార్మిక హక్కుల కోసం ముందుకు సాగుతున్నది. నిరంతరం కార్మిక లోకాన్ని జాగృతపర్చుతున్నది. సిఐటియు 53 వసంతాల ప్రస్థానం ఒక ఉజ్వల ఘట్టం. సిఐటియు ఆవిర్భావ స్ఫూర్తితో భవిష్యత్‌లో ఐక్య ప్రతిఘటన పోరాటాలకు పునరంకితమవుదాం!!

*-పాలడుగు భాస్కర్‌*.                      సి ఐ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కార్పొరేట్ ఉప్పెనలో ఐక్యరాజ్యసమితి

కర్మసిద్ధాంత సర్పాన్ని చంపడం తేలికైన పనికాదు.

GDP ఎలా పంపిణీ అవుతోంది?