తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మహిళల పాత్ర Role of women in Telangana armed struggle movement.
అంతవరకు కాంగ్రెస్ తో చేతులు కలిపిన కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ పోరాటంతో తన ఉనికిని చాటుకుంది.
భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి సాగిన వీరోచిత తెలంగాణ రైతాంగం పోరాటం సాయుధ పోరాటంగా రూపొందే క్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భూపోరాటాల్లో, రైతు కూలీ పోరాటాల్లో ముందున్నారు. భూస్వాముల ధాన్యాన్ని స్వాదీనం చేసుకోవడంలో పాలు పంచుకున్నారు. కోయ, చెంచు, లంబాడా, తెగలను తమ పల్లెల నుంచి తరిమి వేయాలనే బ్రిగ్స్ ప్లాన్‌కి వ్యతిరేకంగా పోరాడారు. తమ అన్నలతో, భర్తలతో కలిసి నిజాం తొత్తుల్ని, రజాకార్లని ఎదిరించి, తర్వాత నెహ్రూ-పటేల్ సైన్యాలని, పోలీసులని కూడా ఎదిరించారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి మహిళలు దళాల్లో చేరారు. రాజకీయ, సైనిక దళాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. కొరియర్లుగా, కార్యకర్తలుగా ఆర్గనైజర్లుగా, కార్యకర్తలుగా, ఆర్గనైజర్లుగా వ్యవహరించారు. ప్రజాందోళనల్లో, రైతాంగ ఉద్యమాల్లో పాల్గొనే క్రమంలో భూస్వాముల నుంచి, పోలీసుల నుంచి ఎన్నో చిత్రహింసలకు గురయ్యారు. మానభంగాలు, గర్బిణీ స్త్రీల కడుపులు చీల్చడాలు, పచ్చిబాలింతపై అత్యాచారాలు, చనుబాలని బలవంతంగా పిండి నేలపాలు చేయడం, గడ్డి వాముల్లో సజీవ దహనాలు, ఉద్యమకారుల పైజామాల్లోకి తొండల్ని వదిలి వేధించడం వంటి హింసలు అనుభవిస్తూ కూడా స్త్రీ ఆత్మస్థైర్యం సడలలేదు. భూమి, భుక్తి విముక్తి సాధించుకోవాలనే తపన చల్లారలేదు. అందుకే మర ఫిరంగులు మోగినా, బాంబుల వర్షం కురిసినా, ఎత్తిన జెండా దించకోయ్’ అంటూ ఉద్యమించారు. మరింత రాటుదేలి, తీవ్రంగా ప్రతిఘటించారు. సామాజికంగా, ఆర్థికంగా అణగారిపోయిన స్త్రీలలో ఈ విప్లవోత్తేజం మరింతగా ఉరకలెత్తించింది. పాలకుర్తి గ్రామంలో ఐలమ్మ ముకుందపుంలో కుమారి, ఓడపల్లి, కొండ్రపోలు, మొద్దులకుంటల్లో లంబాడీ విధవలు, ఇంకా అనేకులు భూపోరాటాల్లో చురుకైన పాత్ర నిర్వహించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో తునికాకు పోరాటాలు చేశారు. ఆకు తెంపినందుకు కూలీరేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. రైతుకూలీ సమ్మెల్లో పోరాటాల్లో ఇరవై కంటే ఎక్కువ గ్రామాల్లో మహిళలే నాయకులయ్యారు. దళాల్లో కూడా స్త్రీలు చురుకైన పాత్ర నిర్వహించారు. పోలీసుల ఆనుపానులు కనుక్కుంటూ గెరిల్లాలకు ఆహారాన్ని అందిస్తూ వీరులను ఎంతో ప్రేమగా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. రాళ్లతో, రోకళ్లతో, కారంతో, గునపాలతో, నాగలి కర్రలతో, పశువుల గంటలతో వాళ్లు పోలీసులను వీరోచితంగా ఎదుర్కోన్నారు. అందుకే ఆనాటి మహత్తర ఘటనలనీ, మహిళల సాహస గాథలను, వారి భాధలను ఎవరు మర్చిపోగలరు’ అన్నాడు సుందరయ్య.
సమాజంలో సగభాగమైన స్త్రీలు పాల్గొనందే ఏ విప్లవం విజవంతం కాదు అనే సార్వత్రిక సత్యం మరోసారి ఈ పోరు ద్వారా వెలుగులోకి వచ్చింది. కిరాతక భూస్వాముల,నిజాం,పటేల్ సైన్యాలను ఎదిరిస్తూ ,వారి దౌర్జన్యాలకు బలిగాకుండా తెలంగాణ మహిళ చూపిన దీక్ష,ప్రతిఘటన అసమానమైనది. పోరాటపు తొలినాళ్లలోగెరిల్లాలకు అన్నం పెట్టడం,ఆశ్రయమిచ్చి కాపాడుకోవడానికి పరిమితమయ్యిన స్త్రీలు తమ పాత్రను మరింతగా విస్తరించుకున్నారు. పోరులో అడుగడుగునా భుజం భుజం కలిపి ఆకలిదప్పులు మరచి తుపాకులకు తలలొడ్డి నిర్భయంగా నడిచారు. మనిషి విలువ,బతుకు విలువ తెలుసుకోవడం,తమకు,తమ వారికి ,తరతరాలకి స్వేచ్చా స్వాతంత్రాలు సాధించడం కోసం విజయమో,వీర మరణమో తీరులో త్యాగాలు చేశారు. అక్షర జ్ఞానం లేని అనేక మంది తల్లులు తమ ధైర్య సాహాసాలతో అద్భుతమైన చరిత్ర సృష్టించారు. తెలంగాణరైతు పుట్టినగడ్డ కోసం, అన్నం పెట్టే భూమిని నిలుపుకోవడం కోసం జరిపిన పోరాటపు తొలిదశ చిహ్నం , అగ్నికణిక చాకలి ఐలమ్మ .
ఇంటినే పోరాట కేంద్రంగా, కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి, కుటుంబాన్ని మొత్తం పార్టీ కి అంకితం చేసి , గుండాలతో ప్రత్యక్షంగా తలపడి తాను పండించిన పంటను ఇంటికి చేర్చుకున్న ఐలమ్మ సాహసం ఒక గొప్పనైన ఉత్తేజభరిత ఘట్టం. 1944 భువనగిరి ఆంధ్రమహాసభ తీర్మాణాల వెలుగులో చైతన్యంతో గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకొని ,ఐలమ్మ పంట రక్షణ పోరులో విసునూరు దొరలపై మడమతిప్పని గ్రామంగా తెలంగాణలో కడవెండి పోరాట కేంద్రంగా మారింది. దొడ్డి కొమురయ్య అమరత్వంతో రైతాంగ సాయుధ పొరుగా మారింది. భూ సమస్యల గురించి జనగామ మున్సిఫ్ మేజిస్ట్రేట్ చర్చిద్దామని చెప్పి కడవెండి నాయకుడు ఎర్రమరెడ్డి మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు. చర్చల తర్వాత నిజాంపోలీసులు వీరిని అరెస్ట్ చేసారు. వీరిని విడిపించడం కోసం కడవెండి గ్రామంలో ఏర్పడిన తొలి మహిళా దళం నల్లా వజ్రమ్మ, ఎన్నమ్మ, గోపమ్మ,శేరమ్మ, సుశీల లతో కూడిన మహిళ దళం రాళ్లతో దాడి చేసి తమ నాయకుడిని విడిపించుకున్నారు.
జనగామ తాలుకాలో పెరుగుతున్న కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం నిజాం రాజు ప్రధాని మీర్జా ఇస్మాయిల్ 300 ల మంది తో కూడిన సైన్యాన్ని కడవెండి ,దేవరుప్పుల గ్రామలపైకి పంపించాడు. అప్పుడు కూడా ఇదే దళం ప్రజలను సమీకరించి వడిశెల రాళ్లు,కారంపొడి, రొకళ్ళు ఆయుధాలతో మూడు గంటల పాటు పోరాడి సైన్యాన్ని గ్రామాల్లోకి రాకుండా చేశారు.పోరాటం విస్తరించిన వందలాది గ్రామాల్లో స్త్రీలు ఇదే రకంగా ఉద్యమాన్ని ,ఉద్యమకారులను శత్రువుల నుండి కాపాడుకున్నారు.ఉద్యమ తొలి దశలో పోరాటకారులకు అన్నం పెట్టడం,కాపాడటంలో స్త్రీలు పాల్గొన్నారు.ఉద్యమం పై తీవ్ర నిర్బంధం పెరిగినప్పుడు మగవాళ్ళు అడవులలో తలదాచుకున్నప్పుడు పిల్ల పాపలను, ముసలి వాళ్ళను,గొడ్డు గోదాను స్త్రీలు చూసుకున్నారు.ఈ విధంగా స్త్రీలు ఉద్యమానికి వెన్నముకగా నిలిచారు. తర్వాతి దశలో స్త్రీలు మరింత చైతన్యం కనపరచి ,పట్టుపట్టి మైదాన,అటవీ ప్రాంతాలలో సాయుధదళాలోకి చేరారు.
నల్లమల అటవీ ప్రాంతంలో రంగమ్మ దళం చురుకుగా పని చేసింది.నిజాం సైన్యాన్ని ,ఆ తర్వాత యూనియన్ సైన్యాలను ధీరుగా ఎదుర్కొంది.రంగమ్మ దళ పర్యవేక్షణలోనల్ల నర్సింహ,ముఖ్దము మోహిద్దున్,రాజా బహదూర్ గౌడ్ కొంతకాలం పని చేశారు.ఆదిలాబాద్ అడవి ప్రాంతంలో ఆదివాసీ మహిళ వెంకటమ్మ దళం పని చేసింది.అనేక గ్రామాలను దొరలనుండి విముక్తి చేసింది. మానుకోట ప్రాంతంలో షార్ఫ్ షూటర్ గా పేరు పొందిన నాగమ్మ దళం శత్రు ఆయుధగారాలే మన ఆయుధగారాలే అని మెరుపు దాడులతో అనేక ఆయుధాలను చేజిక్కించుకుంది. వైద్యంలో కొంత శిక్షణ తీసుకుని అనేక దళాలతో తిరుగుతూ గాయపడ్డ,జ్వరం బారిన పడిన గెరిల్లాలను కట్లతో,ఇంజెక్షన్లతో చికిత్స అందించి,కొన్ని సార్లు గాయపడ్డ వారిని మైళ్ళ కొద్దీ మోసుకెళ్లి రక్షిత ప్రాంతాలలోకి చేర్చి ప్రాణాలు పోసిన అక్షర జ్ఞానం అంతగా లేని అపర ధన్వంతరి అచ్చమాంబ,బర్లు కాసుకునే దూడల సాలమ్మ ఉద్యమంలో చేరి బద్దం ఎల్లారెడ్డి,నల్లా నర్సింహ దళాలతో పని చేసి అనేక రజాకార్ల క్యాంపుల పై జరిపిన దాడులలో ముందు భాగంలో ఉండి విరుచక పడిన తీరు,ఎర్రగొల్లపహాడ్ లో కుప్పల కొద్దీ రాళ్లతో పోలీసులను తరింకొట్టి పది మంది గెరిల్లాలను కాపాడుకున్న పుట్నాల రామక్క,మైదాన ప్రాంత ఉద్యమాల్లో తమ ప్రజల భాషలో వాడి వేడి ఉపన్యాసాలిస్తూ రైతాంగ ఉద్యమాన్ని విస్తరించిన మల్లు స్వరాజ్యం,ఆరుట్ల కమలమ్మ,ప్రియంవదలు ,పార్టీ బాధ్యతలకు ఇబ్బంది కలుగకూడదని తన పసి కందును ఆదివాసీల కు ఇచ్చిన మానుకోట కమలమ్మ,ఉద్యమం నుండి తన భర్త వెనక్కుపోయిన తను మాత్రం కొనసాగి పెద్ద మహిళా దళాన్ని నడిపించిన రాములమ్మ, దేశముఖ్ కుటుంబం నుండి వచ్చి పూర్తి స్థాయి ఉద్యమ నేత గా మారిన సూర్యాపేట లలితమ్మ, దాడులు,ఆత్మ రక్షణ లో స్త్రీలకు సైనిక శిక్షణ ఇచ్చిన మోటూరి ఉదయం,పార్టీ వలంటీర్లకు ప్రధమ చికిత్స ,మంత్రసాని శిక్షణ ఇచ్చిన డా.కొముర్రాజు ఆచ్చమాంబ,హైదరాబాద్ నగరంలో రజాకార్ వ్యతిరేక దళాలను నిర్మించిన బ్రిజ్ రాణి,ప్రమీల ,రజియా లాంటి వందలాది స్త్రీల త్యాగం,ధైర్య సాహాసాలు ఆశ్చర్యం తో ,ఆనందంతో ,అణువణువు పులకరిస్తుంది.
ప్రతి మానవ విమోచన ఉద్యమానికి సాంస్కృతిక రంగం రథ చక్రంగా పని చేస్తుంది.మల్లు స్వరాజ్యం,శశిరేఖ లు ఉయ్యాల, బతుకమ్మ పాటలతో మహిళలను సమీకరించేవారు.’’ఎంత పాపకారి ఉయ్యాలో,విసునూరి దోరోళ్ళు ఉయ్యాలో’’అనే పాటలతో పీడకుల దౌర్జన్యాలను చెప్పి ప్రతిఘటనకు సిద్ధమయ్యేలా ఉత్తేజింప చేసేవారు.కొటేశ్వరమ్మ,తాపీ రాజమ్మ,సరోజిని, ఉదయం, లక్మిలతో బుర్రకథ దళాలు రాష్ట్రమంతా తిరిగి ఉద్యమానికి ఉతమయ్యాయి. స్వతంత్ర పోరాట పాటలు,నిజాం వ్యతిరేక పాటలు,స్త్రీల హక్కుల పాటలు పాడుతూ చివరకు ‘‘కదిలి నడువమ్మా స్వేచ్ఛకై ఎర్రజెండా నెత్తుమమ్మా’’ అనే పాటతో ముగించేవారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ సభలకు వచ్చే ప్రజలలో మగవారి కంటే స్త్రీలు అధిక సంఖ్యలో హాజరయ్యేవారు. ఉద్యమ ఉధృతితో దొరల నుండి వేల గ్రామాలు విముక్తి కావడం,నిజాము రాజు బలహీనం అవడంతో యధాతద ఒప్పందం నుండి వైదొలిగి ఎలాంటి ప్రతిఘటన లేకుండా హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్ లో విలీనం చేసాడు.పచ్చి కమ్యూనిస్టుల వ్యతిరేకి అయిన హోమ్ మంత్రి తన ప్రత్యర్థి నెహ్రూకు కమ్యూనిస్టులు మద్దతు ఇస్తున్నారని భావించి రజాకార్లను కాపాడి కమ్యూనిస్టు ల పై ఉక్కుపాదం మోపాడు,కిరాతక సైనిక జనరల్ నంజప్ప సారధ్యంలో యూనియన్ సైన్యాలు చేసిన అత్యాచారాలు నిజాం కంటే చాలా రెట్లు ఎక్కువని అనేక నివేదికలు తెలియచేసాయి.ఈ దురాగతాలను మహిళ దళాలు సాయుధ పోరాట విరమణ అయ్యే వరకు తమ శక్తి మేర ప్రతిఘటించాయి.మహిళా డిటెన్యూలు గా జైళ్లలో సౌకర్యాల కల్పన కోసం జంగ్ సైరెన్ కూడా మోగించారు.
ఉద్యమంలో రోజు రోజుకు పెరుగుతున్న స్త్రీల భాగస్వామ్యం, వెన్నముకగా నిలుస్తున్న వారి సాహసం ను దెబ్బ తీయాలని నిజాం,దొరల గుండాలు స్త్రీల పై కనీవినీ ఎరగని అఘాయిత్యాలకు ఒడిగట్టారు. గ్రామాలను కాలబెట్టడం,స్త్రీలను చెరచడం,సజీవ దహనాలు చేయడం వంటి కిరాతక చర్యలకు పాల్పడ్డారు.ఈ దూరాగతాలను సాయుధ పోరాట సేనాని రావి నారాయణ రెడ్డి జాతీయ మీడియా కు తెలియచేశారు. విషయాన్ని తెలుసుకుని చలించి మాహాత్మా గాంధీ సరోజిని కూతురు పద్మజా నాయుడుని నిజ నిర్ధారణ చేయమని ఆదేశించారు. ఆకునూరు, మచ్చిరెడ్డిపల్లి ఇంకా అనేక గ్రామాలు తిరిగి అనేక సాక్ష్యాలతో దొరల దూరాగతాలను ఎండగడుతూ నివేదికను విడుదల చేసారు. సరోజిని నాయుడు కూతురు పద్మజా, కొడుకు డా.జయసూర్య లు పౌర హక్కుల నేతలుగా పని చేసి తెలంగాణ ప్రజల తరపున చివరివరకు కృషి చేసారు. తెలంగాణ రైతాంగ పోరు భూపంకము,హైదరాబాద్ విలీనం వంటి అనేక విజయాలతో పాటు స్త్రీల జీవితాల్లో అనూహ్యమైన మార్పులను తీసుకొచ్చింది.
తెలంగాణ చరిత్రలో మొదటి సారి మగవాళ్ళు,ఆడవాళ్లు సమానం అనే భావన వ్యక్తమయ్యింది. దోపిడీ,అణచివేతల కు వ్యతిరేకంగా మగవాళ్ళతో సమానంగా పోరాడే హక్కు ఉందని నిరూపించగలిగారు.
బాల్య వివాహాలను, భార్యలను హింసించడం చాలా మేరకు నిరోధించగలిగారు. అవసరమై నప్పుడు విడాకులను ప్రోత్సహించారు. ఎరుకల, ఆదివాసీ స్త్రీలకు రవికలు తొడగడం నేర్పించింది. కట్నం కానుకలు లేని వివాహాలు,వితంతు వివాహాలు ఆదరణ పెరిగింది.
వెట్టి నుండి విముక్తి అయ్యారు.ఆరోగ్య స్పృహ పెరిగింది.సాంప్రదాయ, ఫ్యూడల్ ఆలోచనల ప్రభావం తగ్గింది.
పోరులో తన మాట,పాట, ఆయుధాలతో అద్వితీయ పాత్ర పోషించి ఈనాటికి అదే స్ఫూర్తితో, ఆశయంతో కొనసాగుతున్న లిలివింగ్ లెజెండ్ మల్లు స్వరాజ్యం ఇలా అంది " స్త్రీల చరిత్ర ఉండాలి, చరిత్రకు మనుషులు అవసరం, మా వంతు పాత్ర ఆమోఘంగా పోషించాము.కానీ నమోదు చేయడానికి నా జీవితం నాకు అవకాశం ఇవ్వలేదు".
(16.9.2020, ప్రజాతంత్ర)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి