కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా చీలిక



కమ్యూనిస్టుల అధ్వర్యంలో సాగిన తెలంగాణ సాయుధపోరాటం, తెభాగ, పునప్రవాయలార్ ఉద్యమాలు అందులో గ్రామీణ రైతాంగం కదిలిన తీరు కమ్యూనిస్టుల్లో బలమైన వర్గాన్ని చైనా వైపు మళ్లేలాచేశాయి. ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో మూడువేల గ్రామాలు నిజాంనుంచి విముక్తి పొంది కమ్యూనిస్టు గ్రామ కమిటీల అధ్వర్యంలోకి రావడం అనేది చైనా మార్గం వారికి అత్యంత ఉత్సాహమిచ్చిన అంశం.అదే ఊపులో పోరాటం సాగిస్తే దేశంలో సోషలిజం సాధించొచ్చని అప్పట్లో అంచనాలు వేశారు.

       అయితే నిజాం సైన్యాలకు వ్యతిరేకంగా పోరాటం వేరు, భారత సైన్యాలకు వ్యతిరేకంగా పోరాడడం వేరు అని అందులోని వారు కూడా తర్వాత గుర్తించారు. అప్పటికే కొమింటార్న్ అంటే కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ నుంచి కొమింఫామ్‌గా పేరు మార్చుకున్న అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థ కూడా చైనా మార్గాన్నే ప్రతిపాదించింది. భారత కమ్యూనిస్టు పార్టీలో చైనా లైన్ ఆధిపత్యం సాధించింది. 51లో రణదివేను దించేసి చండ్ర రాజేశ్వరరావు పార్టీ నాయకత్వం చేపట్టారు. 

      సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా విరమించాలా అనే విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది. కొనసాగించాలనేవారు, విరమించాలనే వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పంచాయితీ రష్యాకు చేరింది.రష్యా సలహా కోసం నలుగురు నాయకుల బృందం మాస్కో వెళ్లి స్టాలిన్ సలహా తీసుకుని వచ్చింది. బసవపున్నయ్య, అజయ్ ఘోష్, అమృతపాద డాంగే, చండ్ర రాజేశ్వరరావు నలుగురూ స్టాలిన్ బృందంతో చర్చించారు.

       తిరిగొచ్చాక తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించారు. విరమించి 1952 ఎన్నికల్లో పాల్గొనడానికి మార్గం సుగమం చేసుకున్నారు. కాకపోతే అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాబోయే నిర్బంధాన్ని అప్పటికి ఉన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రెండు లైన్లను ప్రతిపాదించారు. టాక్టికల్ లైన్లో సుదీర్ఘ సాయుధ పోరాటం, పొలిటికల్ థీసీస్లో పార్లమెంటరీ పంథాను ప్రతిపాదించారు.అదే సమయంలో మధురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్లో నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని ప్రతిపాదించారు. తర్వాత కూడా పార్టీలో రష్యా, చైనా మార్గాల్లో రెండు లైన్ల పోరాటం కొనసాగుతూ వచ్చింది.

ఎవరు ఆధిపత్యంలో ఉంటే వారి పంథాలో విధానాలు రూపొందుతూ వచ్చాయి. మెజారిటీ, మైనారిటీ అభిప్రాయాల ఘర్షణ సాగుతూ వచ్చింది.

     1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 1955 ఆంధ్రా ఎన్నికల్లో విజయం తథ్యమని మెజారిటీ నాయకులు భావించినప్పటికీ అప్పుడు సాగిన అత్యంత భయానకమైన ప్రచారాల మధ్య వారి అంచనా తల్లకిందులైంది.

        కాకపోతే 1957లో కేరళ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించింది. నంబూద్రిపాద్ అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల మార్గంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం అప్పటికిప్రపంచంలోనే అరుదైన ఘటన. ఎన్నికల మార్గంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావచ్చనే భావన బలపడింది.

      దీనికి తోడు రష్యాలో స్టాలిన్ తర్వాత అధికారంలోకి వచ్చిన కృశ్చేవ్ అంతర్జాతీయంగా శాంతియుత పరివర్తనను ప్రతిపాదించారు.

      చైనా మార్గమే మా మార్గం అనేదానికి తోడు కేరళ మార్గమే మా మార్గం కూడా జతకలిసింది. అంటే గతంలో ఎజెండాలో ఉన్న సాయుధ పోరాటం స్థానంలో ఎన్నికల పోరాటం ప్రధానంగా ముందుకొచ్చింది.కాకపోతే నంబూద్రిపాద్ భూసంస్కరణలు, వేతన సంస్కరణలు అమలు చేయడం మొదలెట్టాక అక్కడ మత సంస్థలు బలీయమైన ఇతర సమూహాలతో కలిసి ఒక అలజడి రేగుతున్నది.

       నంబూద్రిపాద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి అధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి. వివాదాల నడుమ అప్పటి కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ రాష్ర్టంలో పర్యటించి బర్తరఫ్‌కు సిఫారసు చేశారు.నెహ్రూ ప్రభుత్వం 1959లో నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. బర్తరఫ్ వెనుక అమెరికా హస్తం కూడా ఉందని కమ్యూనిస్టులు అప్పటినించీ ఆరోపిస్తూ వస్తున్నారు.

        అప్పటికే రష్యా చైనాల మధ్య గ్రేట్ డిబేట్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అటూ ఇటూ చీలిపోయాయి.1962లో భారత్ చైనా యుద్ధం కీలకమలుపు తీసుకుంది. యుద్ధంలో చైనాను సమర్థించారంటూ సీపీఐలోని లెఫ్టిస్ట్ నాయకులను జైలుకు పంపించారు. పార్టీలో రెండు లైన్ల మధ్య సాగుతున్న పోరాటం తీవ్రరూపం దాల్చింది. 1963లో తెనాలిలోని ఒక రైస్ మిల్లులో సమావేశమైన అసమ్మతి నేతలు తమ లైన్తో ముందుకెళ్లాలని నిర్ణయించారు. తొలిసారిగా అక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో  దాదాపుగా సీపీఎం ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు అక్కడే జరిగిపోయినట్టు లెక్క. తర్వాత 1964లో పార్టీ చీలిపోయింది.

పార్టీ ఏడో కాంగ్రెస్ విడివిడిగా కలకత్తాలోనూ బాంబేలోనూ జరిగింది. చైనీస్ లైన్ తీసుకున్న సీనియర్ నేతలు తొమ్మిదిమంది పాలిట్ బ్యూరో మెంబర్లుగా సీపీఎం కలకత్తాలో ఏర్పడింది. ప్రధాన కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య ఎన్నికయ్యారు. బాంబేలో సమావేశమైన పార్టీ నాయకులు సీపీఐగానే కొనసాగారు. పార్టీ చీలిక తో సిపిఐ జాతీయ స్థాయిలో బలహీనపడింది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

GDP ఎలా పంపిణీ అవుతోంది?