జాతీయోద్యమం లో కమ్యూనిస్టులు
గాంధీజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రధాన భూమిక పోషించినా ప్రజల తరపున నూతన భావాలను ప్రతిపాదించిన వారు కమ్యూనిస్టులే.
విదేశీ పాలకులు ఇక్కడి వనరులను ముడిపదార్థాలను కొల్లగొట్టి తమ సరుకులు మనపై రుద్దే సమయం. మన రైతులను వ్యవసాయాన్ని నాశనం చేసి తమకు అవసరమైన టీ కాఫీ పొగాకు నీలి మందు తదితర వాణిజ్య పంటలను అలవాటు చేశారు. స్వదేశీ సంస్థానాధీశులు రాజులు, జమీందారులు, దొరలను తాబేదార్లుగా చేసుకుని రైతాంగాన్ని శ్రమ జీవులను క్రూరంగా కొల్లగొట్టారు. అయినా ఈ రాజులు జమీందార్లపై పోరాటం అవసరంలేదన్నది గాంధీజీ భావనగా వుండేది. అలాంటి సమయంలో కమ్యూనిస్టులే భూస్వామ్య రాచరిక వ్యతిరేక పోరాటాలకు నాంది పలికారు. కేరళలో పున్నప్రా వయిలార్, బెంగాల్‌లో తెభాగ, త్రిపుర సంస్థానం, తెలుగునాట ఉత్తరాన మందసా నుంచి మునగాల పరగణా, చల్లపల్లి జమీందారు వంటి వారికి వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు, దీనంతటికి శిఖర స్థాయిలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించారు. ఆ విధంగా శ్రమజీవులనూ అణగారిన తరగతులను కదిలించి గొంతునిచ్చింది విముక్తి సమరాలకు ముందు నిలిచింది కమ్యూనిస్టులే.
అప్పటి వరకూ మహాజర్లకూ అధినివేశ ప్రతిపత్తి వంటి కోర్కెలకు పరిమితమైన కాంగ్రెస్ కమ్యూనిస్టుల వచ్చాకే సంపూర్ణ స్వాతంత్ర్యం నినాదమిచ్చింది. అమరజీవి భగత్‌సింగ్‌తో సహా ఎందరో జాతీయ విప్లవ యోధులు కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులైనారు. ఆయన బృందాన్ని ఉరితీసినా మిగిలిన సహచరులంతా కమ్యూనిస్టు పార్టీ వైపు వచ్చారు. ఈ కారణం చేతనే బ్రిటిష్ పాలకులు కమ్యూనిస్టు పార్టీపై ప్రత్యేకంగా కక్ష గట్టారు. దశాబ్దాలుగా వుంటున్న కాంగ్రెస్‌పై ఎన్నడూ ఏ నిషేధం లేదు. కాని అప్పుడప్పుడే మొదలవుతున్న కమ్యూనిస్టుపార్టీనే బ్రిటిష్ పాలకులు నిషేధించారు. కేసులమీద కేసులు పెట్టి వేధించారు.కొన్ని వేలమంది కమ్యూనిస్టులను పాలకులు వూచకోత కోశారు. జైళ్లపాలు చేశారు.
కమ్యూనిస్టులు గాంధీజీ లాగే దేశీయ ఆర్థికాభివృద్ధిని కోరుకున్నారు. 1920లలోనే దేశంలో కమ్యూనిస్టులు, మరోవైపున ఆరెస్సెస్ ముందుకొచ్చాయి. కమ్యూనిస్టులు ఇన్నిరకాల ప్రజలతో మమేకమవుతుంటే ఆరెస్సెస్ కేవలం ముస్లిం వ్యతిరేకతే ప్రధానమన్నట్టు వ్యవహరిస్తూ స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా వుండిపోయింది, బ్రిటిష్ వారు కూడా మతతత్వ రాజకీయాలను పెంచి పోషించడంతో చివరకు దేశ విభజన ఘోర మతమారణహోమం చూడవలసి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చి ఆరు నెలలు కాకుండానే ఒక హిందూ మతోన్మాది మహాత్మాగాంధీని క్రూరంగా కాల్చి చంపాడు, కమ్యూనిస్టులు మాత్రం మతసామరస్యం దేశ స్వావలంబన కోసం కట్టుబడ్డారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి