విమర్శ


       p c: Getty images
కమ్యూనిస్టు పార్టీలో విమర్శ  చాలా ముఖ్యపాత్ర వహించుకుంది. ఇతర సభ్యులలో గల పొరబాట్లను ఎత్తి చూపడం విమర్శ.
పార్టీ విధానానికి సంబంధించిగాని, నిర్మాణానికి సంబంధించిగాని తప్పులు జరిగినప్పుడు విమర్శించకపోతే మొత్తానికి నష్టం కలుగుతుంది. తోటి సభ్యులనుగాని, నాయకులునుగా నిస్సంకోచంగా విమర్శించగలగాలి. అందుకు తగిన చైతన్యం సంతరించుకోవాలి తప్పు అని తెలిసి కూడా ఎత్తిచూపలేక నిస్సహాయ ప్రేక్షక పాత్రలో మిగిలిపోవడం కమ్యూనిస్టు లక్షణం కాదు. లేకపోతే తప్పులను విమర్శించే పని నాయకత్వం చూసుకుంటుంది. మాకిందుకులెమ్మని ఉదాసీనంగా, మొహమాటంగా ఉండటం బూర్గువా మర్యాదస్తుల లక్షణమవుతుందిగానీ విప్లవకారులది కాదు. గతంలోనే చెప్పుకున్నట్లు చిన్న చిన్న అంశాలని కోపతాపాలను పట్టించుకోకుండా హానికరమైన పోకడలను మాత్రం నిశితంగా అందించాలి.

"మంచి చెడు తెలిసికూడా చెప్పలేనివారు
ఎవరికీ పనికిరారు ఏమీ చేయలేరు"

అని కవి చేసిన వ్యాఖ్య పార్టీ సభ్యులందరికీ వర్తిస్తుంది. అయితే విమర్శ పేరుతో అవతలివారిపై ఒక్క పెట్టున విరుచుకుపడటం, దండకాలు చదవడం కూడా సరైంది కాదు. అది విమర్శను స్వీకరించడానికి దోహదపడదు. సున్నితంగా, సమతూకంతో నచ్చచెప్పే ధోరణిలో విమర్శ వుండాలి. సరిదిద్దడం మన ధ్యేయంగా వుండాలి. పదే పదే తప్పులు చేసేవారిని కఠినంగా విమర్శించవచ్చుగానీ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లు చేయకూడదు. విమర్శ జరిగినా పొరబాటు మీద ఉండాలి గాని చేసిన వారికి ఉద్దేశాలను ఆపాదించేదిగా వుండకూడదు. ఎవరైనా ఎప్పుడైనా దురుద్దేశంతో వ్యవహరించారనడానికి సరైన ఆధారాలుంటే సరైన సమయంలో ప్రస్తావించాలేగానీ అనుమాన దృష్టితో ఆరోపణలు చేయకూడదు. అలా చేస్తే సమిష్టి సంబంధాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం వుంటుంది.
       p c: Aandhrabhoomi.net
సమావేశాలలో పరస్పరం విమర్శించుకోకుండా, పత్రికా ప్రకటనలో కుస్తీ పట్టడం బూర్జువా పార్టీలకు అలవాటు. కమ్యూనిస్టులు మాత్రం అలాగాక తమ భిన్నాభిప్రాయాలను సమావేశాలలోనే నిష్కర్షగా చర్చించుకుంటారు. పరిస్థితి గురించిన అంచనాలు, అవగాహనలలో గల తేడాలు భిన్నాభిప్రాయాలకు దారితీస్తాయి. పార్టీని మరింత ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలి? ఉన్న వనరులను ఏ విధంగా కేటాయించాలి. దేనికి ప్రాధాన్యతనివ్వాలి వంటి విషయాలలో అంచనాలు భిన్నంగా ఉంటాయి. చాలా సందర్భాలలో పార్టీ అభివృద్ధి కోసం తహతహనుంచే ఈ భిన్నాభిప్రాయాలు బయలుదేరుతాయి. అయితే వాటిని సకాలంలో పరిష్కరించుకోలేకపోతే అవాంచనీయమైన ఉద్రేకాలు, ఆవేశాలు, ఘర్షణలు పెరగడం బాగా పనిచేసే వారికి పనిచేయడం లేదని వారు భావించేవారికి మధ్య ఎడం పెరగవచ్చు. 
           పార్టీ నిర్మాణావలోకనం

 ఎవరైనా పార్టీ విధానానికి, నిర్మాణానికి కట్టుబడినంత కాలం ఇలాంటి విభేదాలను సుహృద్భావంతో పరిష్కరించుకుని పార్టీ ఐక్యతను నిలబెట్టాలి. 

__తెలకపల్లి రవి
(పార్టీ నిర్మాణావలోకనం నుండి)


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..