స్వీయమానసిక ధోరణులు
స్వీయ మానసిక తత్వం
వాస్తవాన్ని బట్టిగాక తన ఆలోచనలు, భావాల మీద ఆధారపడడాన్ని స్వీయ మానసికతత్వం అంటాం. దీనివల్ల ప్రకృతిలో ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించడం జరగదు.
స్వీయ మానసిక తత్వానికి గురికావడానికి కారణాలు
1. స్వార్థం : వాస్తవాలతో నిమిత్తం లేకుండా మన అభిమానాన్ని బట్టి, దురభిమానాన్ని బట్టి నిర్ణయానికి రావడం. ఉదా : వార్డు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆశతో మన గెలుపుకు ఉండే అవకాశాలను ఎక్కువగా చేసి చెపుతాం.
రాగద్వేషాలు : పొగిడేవారిని ప్రమోట్ చేయడం, తెగిడేవారని అణగదొక్కడం
ఇష్టాయిష్టాలు : ఇది వ్యక్తిగతం కావచ్చు. ఉద్యమ జనితం కావచ్చు. స్వంత ఇష్టా యిష్టాలను జోడించి ఉన్న అనుకూల పరిస్థితిని తక్కువ చేసి చూపుతాం. ఈ రకమైన స్వీయ మానసికతత్వం మధ్య తరగతి, రైతాంగ తరగతులలో ఎక్కువగా ఉంటుంది. ఇది వర్గ జబ్బు కాబట్టి మనం అంతర్గత పోరాటం ద్వారా దీన్ని పోగొట్టుకోవాలి.
మనం ఎందుకని స్వీయ మానసిక తత్వానికి గురవుతున్నాం?
1.అధ్యయనం లేకపోవడం పరిశీలన చేయకపోవడం
2.పరిశీలనా పద్ధతి సరిగా లేకపోవడం
3.విశ్లేషణ చేసే పద్ధతి సరిగా లేకపోవడం
4.అన్యవర్గ ధోరణులకు గురికావడం
5. స్వార్థం, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలను బట్టి వ్యవహరించడం
6. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడలేకపోవడం
వాస్తవ పరిస్థితులను గమనించకుండా తమ కోరికలు, అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలకు రావడమే స్వీయమానసిక ధోరణి. బలాబలాలను అంచనా వేయటంలోనూ, కార్యకర్తలను అంచనా వేయటంలోనూ ఈ ధోరణుల వల్ల నష్టం జరుగుతుంది. క్షేత్ర స్థాయిలో తగినంత సమాచారం సేకరించకుండా, అన్ని కోణాలనుండి పరిశీలించకుండా బలాబలాలను అంచనా వేయటం పొరపాటు నిర్ణయాలకు దారితీస్తుంది. పార్టీకి నష్టం చేస్తుంది. కార్యకర్తల పనిని, వారు సాధిస్తున్న ఫలితాలను, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్ధిష్టంగా పరిశీలించడం ద్వారా మాత్రమే వారి పని విధానం గురించి అంచనాకు రావాలి. అంతే తప్ప అప్పటికే ఆయా కార్యకర్తల మీద ఉన్న అభిప్రాయాల ప్రాతిపదికగా నిర్ణయాలకు రాకూడదు. అట్లా జరిగితే వాస్తవ విరుద్ధమైన అంచనాలకు వస్తాం. తప్పుడు నిర్ణయాలు చేస్తాం. సమర్థులు నిరుత్సాహ పడటానికి లేదా తగిన సామర్ధ్యం లేనివారు శక్తికి మించిన బాధ్యతల్లోకి రావడానికి దారి తీస్తుంది. ఈ రెండూ ఆచరణలో పార్టీకి నష్టం చేస్తాయి. అనుమానం ఆధారంగా నిర్ధారణలకు రావడం, అమలు చేయటం పార్టీలో అనైక్యతకు దారితీస్తుంది. అనుమానాలను నివృత్తి చేసుకుని నిర్ధారణల ప్రాతిపదికగా నిర్ణయాలు చేయడమే పార్టీలో ఐక్యతను పెంపొందిస్తుంది. అనుమా నాలు నివృత్తి చేసుకునే అవకాశం లేనప్పుడు తగిన ఆధారాలు లేనప్పుడు అనుమానాలను వ్యక్తం చేయడం గానీ, అందుకు అనుగుణంగా వ్యవహరించడం గానీ సరైంది కాదు. పార్టీలో ఐక్యతకు హాని చేస్తుంది. విజయాలకు పొంగిపోవటం అపజయాలకు కుంగిపోవటం కూడా స్వీయ మానసిక ధోరణిలో భాగమే. విజయాలకు పొంగిపోయినప్పుడు అతి అంచనాలు వేయటం,అపజయాలకు కుంగిపోయినప్పుడు చేతులెత్తేసే అవకాశం ఉంటుంది. కామ్రేడ్స్ పట్ల రాగ ద్వేషాలు ప్రదర్శించడం కూడా స్వీయ మానసిక ధోరణిలో భాగమే.
ఎస్ వీరయ్య
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి