సిపిఎం సమరశీల ప్రజా ఉద్యమాలు




సిపిఎం సమరశీల ప్రజా ఉద్యమాలను పునరుద్ధరించేందుకు, కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎంతో దీక్షగా పోరాడింది. శాసనసభలో సిపిఎం నేతలు రాజకీయంగా గట్టి పోరాటం చేసేవారు.శాసనసభలో సుందరయ్య సిపిఎం పక్ష నేతగా వుండగా తరిమెల నాగిరెడ్డి ఉపనేతగా పనిచేశారు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల సమస్యలపై ఆరోజుల్లో అనేక హక్కులు సాధించుకోగలిగారు.1966లో విశాఖ ఉక్కు ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్‌ను వూపేసింది. ఆ సమయంలో సిపిఎం శాసనసభ్యులందరూ రాజీనామా చేసి సంఫీుభావం ప్రకటించారు. అంతేగాక వివిధ సమస్యలపై జిల్లాలలోనూ విస్తారమైన ఉద్యమాలు నడిచాయి.

రూపాయకు కిలోబియ్యం : ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బియ్యం ధరలు మండిపోయాయి.అలాటి తరుణంలో చౌకదుకాణాల ద్వారా రూపాయకు కిలో బియ్యం అందించాలని సిపిఎం ఆందోళన చేసింది. అంతేగాక గన్నవరం ప్రాంతంలో ఆ విధంగా ప్రజలకు తానే అందించింది కూడా. మరికొన్ని చోట్ల పరిమితంగా జరిగింది. ఈ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ ఈ విధమైన కార్యక్రమం అమలు చేయడం అదే ప్రథమం. సహజంగానే ఇది ప్రభుత్వానికి మింగుడుపడలేదు. 1972లోనే పశ్చిమ బెంగాల్‌లో ఇందిరాగాంధీ అర్ధ ఫాసిస్టు బీభత్స కాండ సాగించి ఎన్నికలను బూటకంగా మార్చివేసింది.ఆ సమయంలో జ్యోతిబాసును రాష్ట్రానికి ఆహ్వానించి ముఖ్య కేంద్రాలలో సభలు జరిపి సంఫీుభావం ప్రకటించింది.

పత్తి రైతుల ఆత్మహత్యలు- అప్పుల భారం : ప్రకాశం జిల్లాలో ప్రత్తి రైతులకు ధర పడిపోయి 1984`85లో ఆత్మహత్యలు ప్రారంభమైనప్పుడు సిపిఎం రైతుసంఘం దేశంలోనే మొదటిసారిగా ముందుగా ఆ సమస్యను గుర్తించాయి. గిట్టుబాటు ధర సమస్యను రంగం మీదకు తెచ్చాయి. ప్రత్తికి ధర కావాలని నిర్భందాలని ఎదిరించి పోరాడారు. కొన్ని రాయితీలు సాధించేవరకు ఉద్యమం నడిచింది.

కరువులో ప్రజలకు అండగా : రాజకీయాలు, ఉద్యమాలతో పాటు సేవా కార్యక్రమాలలో కూడా సిపిఎం ఎప్పుడూ ముందుంటున్నది. 1986లో మహబూబ్‌నగర్‌లో తీవ్రమైన కరువు ఏర్పడింది. ప్రభుత్వ యంత్రాంగం అశ్రద్ధ వలన ప్రజలు సహాయం అందక నానా బాధలు పడుతున్న స్థితి.ఆ సమయంలో సిపిఎం దాతల సహాయంతో నిర్వహించిన గంజి కేంద్రాలు ఎంతో ఉపశమనం కలిగించాయి.కర్నూలు వరదలు విలయతాండవం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిపిఎం కేడర్ ని పూర్తిగా రంగంలోనికి దింపి, శక్తికి మించి ప్రజలకు సహాయ సహకారాలు అందించింది.

      1992, 93లో జన విజ్ఞాన వేదిక, మహిళా సంఘం ఆధ్వర్యంలో సారా వ్యతిరేక ఉద్యమం వూపందుకుంది. నెల్లూరు జిల్లాలో మొదలైన ఈ ఉద్యమం కొద్ది కాలంలోనే రాష్ట్రమంతటా వ్యాపించింది. సిపిఎం ఈ ఉద్యమానికి అండగా నిలిచింది. మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే సిపిఎం కులతత్వాలపై కూడా సమరశంఖం పూరించింది. కుల వివక్షతా వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌)ను స్థాపించి సమరశీల ఉద్యమానికి నడుం కట్టింది. సిపిఎం పోరాటఫలితంగాచివరకు వెనుకబడిన కులాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు జస్టిస్‌ పున్నయ్య అధ్యక్షతన ఒక కమిషన్‌ను నియమించాల్సి వచ్చింది. ఇది సామాజిక రంగంలో పెద్ద విజయం.

        ప్రపంచ  విధానాల గురించి సిపిఎం ముుందే హెచ్చరించింది. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో  ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం విజన్‌2020 వంటి వాటితో ప్రపంచ బ్యాంకు విధానాలకు రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మార్చివేసింది. ఆ పరిస్థితుల్లో అటు సరళీకరణ విధానాలపై పోరాటం ఉదృతం అయ్యింది. ఈ సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం 2000లో విద్యుచ్చక్తి బోర్డును ముక్కలు చేసి రేట్లు పెంచింది.ఈ పరిస్థితుల్లో సిపిఎం మరో ఎనిమిది వామపక్షాల వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ ను కలుపుకుని విద్యుత్‌ ఉద్యమం ప్రారంభించింది. 2000 ఆగస్టు 28న చలో అసెంబ్లీ సందర్భంగా బషీర్‌బాగ్‌ వద్ద జరిపిన కాల్పులు మూడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. అది మహోద్యమంగా విస్తరించి చంద్రబాబు సర్కార్‌కు ప్రాణ సంకటంగా తయారైంది. ప్రపంచీకరణకు ప్రయోగశాలగా మారిన రాష్ట్రాన్ని ప్రతిఘటనలకూ కేంద్రంగా మార్చడంలో సిపిఎం కృషి ఫల ప్రథమైంది. నీటి మీటర్లు, యూజర్‌చార్జీలు, ఔట్‌ సోర్సింగు వంటి అనర్థక పద్ధతుల ప్రమాదాన్ని ప్రారంభంలోనే గుర్తించి హెచ్చరించడమే గాక వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది. ఆ దశలో జరిగిన అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యమం, ఆర్టీసీలో సమ్మెలకు మద్దతూ నిచ్చి వాటివిజయంలో రాజకీయ పాత్ర పోషించింది.

ఉదృతంగా భూపోరాటం : పేదలకు కనీస గృహ వసతికల్పించాలకి కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సాగిన భూపోరాటం ప్రజల మనన్నలు పోందింది. ఈపోరాటంలో అనేక మంది నాయకులు జెళ్లపాలు అయ్యారు . అనేక ప్రాంతాలలో పేదలకు ఇళ్లస్ధలాలు రావడంలో సిపిఎం పోషించిన పాత్ర అమోగం. ఖమ్మం జిల్లా ముదిగొండలో ఈ పోరాటంపై కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొనడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. సిపిఎం కెవిపిఎస్‌ తరపున నిరాహారదీక్ష జరిపి ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ను సాధించింది. జిల్లాలలో సమగ్రాభివృద్ధి యాత్రలు, సాగునీటి పాదయాత్రలు నిర్వహించింది. భాషారాష్ట్ర విభజనకు వ్యతిరేకంసిపిఎం విధానం అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉంది. అవకాశవాదరాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇప్పుడు విడిపోయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కమిటీగా బాషాప్రయుక్త రాష్ట్రలనే కోరుకుంది. రాష్ట్రాలు ఒకటైనా రెండైనా పోరాటం అనివార్యం అనే నినాదంతో అది సమస్యలపై ప్రజలను సమీకరించింది. పోరాటాలు నిర్వహించింది..

      మొన్నటి ఎన్నికలలో కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి పూర్తి మెజార్టి తెచ్చుకుంది కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైంది. సిపిఎం వామపక్షాల బలం కూడా బాగా తగ్గిపోయింది.   రాష్ట్రంలో  విభజన ఉద్వేగాలు, పాలక వర్గ పార్టీల ప్రచారార్భాటాల మధ్య సిపిఎంకు ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభలో ప్రాతినిధ్యం లభించలేదు. విచ్చలవిడిగా డబ్బు, ప్రలోభాలు మాత్రమే గాక కార్పొరేట్‌ శక్తులు పెద్ద పెద్ద కాంట్రాక్లర్లతోపాటు, కంపెనీల యజమానులు ప్రత్యక్షంగా ఎన్నికల్లో అభ్యర్థులయ్యారు.కనీవినీ ఎరుగని స్థాయిలో పార్టీ ఫిరాయింపుల నడుమ జరిగిన ఎన్నికల్లో ప్రజా సమస్యలకు తావులేకుండా పోయింది. కులం అస్త్రాన్ని బాగా ప్రయోగించారు మరోవంక 1998లో వలెనే తెలుగుదేశం అధినేత బిజెపితో జతకట్టడమే గాక ప్రభుత్వాలలో పరస్పర భాగస్వామ్యం తీసుకున్నారు.. గతంలో తను రెండు సార్లు ఓడిపోవడానికి కారణమైన విధానాలు సవరించుకోకపోగా చంద్రబాబు కార్పొరేట్‌ ఎజెండాను మరింత తీవ్రంగా అమలు చేశారు. రుణమాఫీ వంటి వాగ్దానాలు నీరుగార్చి కొత్త కొత్త భారాలు వేసేందుకు ప్రజా వనరులు కార్పొరేట్‌ పరం చేసేందుకు అనేక మార్గాలు వెదికారు.

వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత, లౌకిక పక్షాల సమీకరణకు తోడు ఆర్థిక రంగంలో ప్రమాదాలను తిప్పికొట్టకపోతే ముందు ముందు పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మరింత దుర్భరమవుతాయని సిపిఎం భావిస్తోంది. సామాజికంగా అణచివేతకు వెనకబాటుకు గురైన తరగతులకు సామాజిక రక్షణ కవచం సాధించవలసి ఉంది. దేశీయ వ్యాపారాలను దెబ్బతీసేలా ఎఫ్‌డిఐల ప్రవేశం పెను ముప్పు తీసుకొస్తుంది. యాభై ఏళ్లలో ప్రజా ఉద్యమాలను సైద్ధాంతిక విశిష్టతను స్మరించుకుంటునేసిపిఎం నేటి పరిస్థితులకు తగినట్టు తనను తాను సమాయత్తం చేసుకుంటోంది. జాతీయోద్యమంలో నాడు కాంగ్రెస్‌ అధినివేశ ప్రతిపత్తికి పరిమితమైతే కమ్యూనిస్టులు తొలుత సంపూర్ణ స్వాతంత్య్రం నినాదం ఇచ్చారు. నాడు బ్రిటీష్‌ పాలకులు కమ్యూనిస్టుల్ని దేశవ్యాపితంగా అరెస్టు చేసి జైళ్ళలో కుక్కారు. అయిన పోరాటం ఆగలేదు. సాగుతూనే ఉంది. ఈనాడూ కమ్యూనిస్టులు వామపక్షాలే మళ్ళీ సరళీకరణ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటంలో చేస్తున్నాయి. కార్మిక  రైతు సంఘాలు విద్యార్థి యువజన సంఘాలు మహిళలు సామాజిక తరగతులు అన్నిటిలో మరింత చొరవగా ముందుకు సాగడానికి సంసిద్ధమవుతోంది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..