పోరాటం లేనిదే అభివృద్ధి అంటూ లేదు.






ఒక వస్తువులో కాని, ఒక పరిణామంలో కాని రెండు పరస్పర వ్యతిరేకమైన అంశాలు ఉంటాయి. ఇవి రెండూ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి, ఈ రెండు అంశాలు ఘర్షణ పడుతూ ఉంటాయి. ఐక్యమవుతూ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి వైరుధ్యం అంటారు

ఉదా : చావు బ్రతుకులు జీవికి సంబంధించిన రెండు అంశాలు. ఈ రెండూ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మానవుల శరీరం జీవకణాల చేత నిర్మింపబడింది. ఈ శరీరంలో కొన్ని కణాలు చనిపోతూ ఉంటే కొన్ని కొత్తవి పుడుతాయి. ఈ విధంగా శరీరం చనిపోయే కణాలు, పుట్టే కణాలతో కూడి ఉన్నది. అందుచేత చావు బ్రతుకులు రెండూ కలిసి వుంటాయి. కావున జీవితం కూడా వైరుధ్యమే.

గతి తర్కం ప్రకారం వైరుధ్యం అనేది ప్రపంచమంతటా ఉంటుంది. ప్రతి వస్తువులోనూ ఉంది. ప్రతిదీ ఒకటి రెండుగా విభజించబడుతుంది కాని అధిభౌతిక వాదులు అన్నింటిలో వైరుధ్యం ఉంటుందనే దానిని అంగీకరించరు.
కొన్నింటి లోనే వైరుధ్యం ఉన్నదని చెబుతారు. అలాగే వైరుధ్యం ఒక దానిలోనే ఉంటుందని
చెబుతారు

ఒక వస్తువు యొక్క అంశాలు విడదీయరాని అంత: సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండూ కలిసి ఒక వైరుధ్య క్రమం అవుతుంది. ఒక దాని ఉనికి మరొక దానిపై ఆధారపడి ఉంటుంది. కావున వాటి ఉనికి ఒకదానికొకటి కారణమవుతుంది

ఉదా : రాత్రి, పగలు కలసి ఒక వైరుధ్య క్రమం అవుతుంది. అంటే ఒకరోజు అవుతుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా రోజు పూర్తికాదు. అందువలన ఈ రెండూ ఒక దానితో ఒకటి విడదీయరాని సంబంధాన్ని కలిగి వున్నాయి.

విరుద్ధ శక్తుల మధ్య ఖచ్చితమైన లేదా శాశ్వతమైన ఐక్యత ఉండదు. ఇలా శాశ్వతమైన ఐక్యత ఉంటుందని చెప్పటమంటే వాటి మధ్య భేదాన్ని లేదనడమే అవుతుంది. అసలు వైరుధ్యమే లేదన్నట్లవుతుంది.

వ్యతిరేక శక్తుల మధ్య ఐక్యతను విరుద్ధ శక్తుల ఏకత్వము అంటారు. వ్యతిరేక శక్తులు
పోలికను కలిగి ఉంటాయి. తన వ్యతిరేకమైన శక్తి లేకుంటే రెండో అంశం దాని ఉనికిని పోగొట్టుకొంటుంది. జీవిలేకుండా చావులేదు. చావులేకుండా జీవిలేదు. భూస్వాములు లేకుండా రైతులు లేరు. రైతులు లేకుండా భూస్వాములు లేరు. పెట్టుబడిదారులు లేకుండా కార్మికులు లేరు. కార్మికులు లేకుండా పెట్టుబడిదారులు లేరు. అందువలన విరుద్ధ శక్తుల మధ్య ఏకత్వమంటే అర్థం ఇది

విరుద్ధ శక్తుల మధ్య ఏకత్వం అంటే రెండవ అర్థం ఒక వస్తువులోని విరుద్ధ శక్తులు పరస్పరం స్థానాలు మార్చుకోవటం.అంటే ఆధిక్యత స్థానం నుండి అధీన స్థానంలోకి మారటం.
 ఉదాహరణకు పెట్టుబడిదారులు-కార్మికులు కలిసి ఒక వైరుధ్య క్రమం. పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారులు ఆధిక్య స్థానంలో ఉంటారు. అదే సోషలిస్టు సమాజంలో కార్మికులు ఆధిక్య స్థానంలోకి వచ్చి పెట్టుబడిదారులు అధీన స్థానంలోకి చేరుతారు. ఈ విధంగా విరుద్ధాంశాలు నిత్యం ఘర్షణ వలన పరస్పరం స్థానాలు మార్చుకుంటాయి.

వ్యతిరేక శక్తులు ఒక దానితో ఒకటి విభేదిస్తాయి. దీని వలన రెండింటి మధ్య పోరాటం వస్తుంది. వ్యతిరేక శక్తుల మధ్య పోరాటం అంటే అర్థం అధీన స్థానంలో వున్న శక్తి ఆధిక్యత కోసం అప్పటికే ఆధిక్య స్థానంలో వున్న శక్తితో పోరాడటం. తన ఆధిక్యత్వాన్ని వృద్ధి చేసుకోవటం, వ్యతిరేక శక్తుల మధ్య పోరాటం అభివృద్ధికి మూలం. 

పోరాటం లేనిదే అభివృద్ధి అంటూ లేదు.

విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత తాత్కాలికమైనది. సాపేక్షకమైనది. పరస్పరం విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ మాత్రం శాశ్వతమైనది. అధిభౌతిక వాదం వ్యతిరేక శక్తులను పూర్తిగా వేరుచేసి చూస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..