ఆత్మవిమర్శ

       pc:myfoodnameblog.blogspot.com

          కమ్యూనిస్టులు తమ పనిలో దొర్లే లోపాలను, పొరబాట్లను చక్కదిర్దుకోవడానికి గల ఏకైక సాధనం "ఆత్మవిమర్శ". సమిష్టిగా పనిచేసే సమయంలో అందరూ కలిసి చేసిన పొరబాటు నిర్ణయాలనుగాని, లేక వ్యక్తిగత లోపాలనుగాని సరిదిద్దుకోవడానికి అంతకు మినహా మార్గం లేదు. తమలో లోపాలను తాము గుర్తించడం లేదా పార్టీ తన గత నిర్ణయాలను పున:పరిశీలించుకోవడం ఆత్మవిమర్శ. 

         మిగిలిన అనేక అంశాల్లాగే ఇది కూడా కమ్యూనిస్టులకు గల ప్రత్యేకత. సమిష్టి ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు ఆస్కారం లేని సంస్థ గనుక సభ్యులు అవసరమైతే ఎవరినైనా విమర్శించవచ్చు. అదే విధంగా తమ తప్పులను నిస్సంకోచంగా అంగీకరించి, సరిదిద్దుకోవచ్చు. ఈ రెండూ జరక్కపోతే శాఖలోగాని, పార్టీలోగాని, తిరిగి అనేక పొరబాట్లు, తప్పులు కొనసాగుతుంటాయి. తప్పులు చేయడం సహజం అయితే వాటిని దిద్దుకోవడం ఒక అవసరం. లేకపోతే ముందుకు గాక వెనక్కుపోవలసి వస్తుంది.

"స్వీయ లోపమ్ము లెరుగుట పెద్ద విద్య
లోపమెరిగిన వాడే పరిపూర్ణ నరుడు"
            galib poet
అని గాలీబ్ మహాకవి అంటాడు. తన తప్పు తాను తెలుసుకుని, సరిదిద్దుకోగలగడం పరిపక్వతకు నిదర్శనమవుతుంది. తప్పులను దాచుకోవడం అంటే అది జబ్బును దాచుకోవటం  లాంటిదే. ఆత్మ విమర్శకు భయపడటం, ఎదుటి వారిపై మాత్రం అదే పనిగా విమర్శలు చేయడం సమిష్టి కృషికి దోహదపడవు. ఆత్మ విమర్శ (Self-criticism) ఏ విధంగా దారి తప్పుతుందో చెప్పడానికి కీర్తిశేషులు బి.టి.రణదివే "My self-criticise you" అని వ్యంగంగా అనేవారు. "తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు" అని వేమన దీన్నే అంటాడు. 

              vemana
ఇతరుల తప్పులు విమర్శించడంతో పాటు మన తప్పులు మనం గుర్తించాలనేదే ఇక్కడ సమస్య “ఉర్విజనుల కెల్ల ఉండు తప్పు” అని వేమనే అన్నాడు. ప్రతి ఒక్కరూ తెలిసో, తెలియకో ఏవో తప్పులు చేయకుండా వుండరు. మొత్తం పార్టీయే పొరబాట్లు చేసిన సందర్భాలు వుంటాయి. వాటిని ధైర్యంగా అంగీకరించి సరిచేసుకోగలగాలే గాని కప్పిపుచ్చుకోవడం అందరికీ నష్టం.సంబంధిత వ్యక్తులకు మరీ ఎక్కువ నష్టం.

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను తిరగేస్తే మహానాయకులు, గొప్ప పార్టీలు తమ తప్పులను అంగీకరించిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి. చైనా విప్లవానికి సంబంధించి స్టాలిన్ చేసిన కొన్ని సూచనలను చైనా పార్టీ ఆమోదించలేదు. చరిత్రలో దాని వైఖరి సరైందని రుజువైంది. చైనా పార్టీ తనను కాదన్నందుకు స్టాలిన్ కోపగించలేదు సరికదా వాస్తవాన్ని గుర్తించారు. మన రాష్ట్రంలో 1983లో వివిధ కారణాల వల్ల తెలుగుదేశంతో ఎన్నికల అవగాహనకు రాలేకపోయాం . అది తప్పని తర్వాత ఆత్మవిమర్శ చేసుకున్నాం. దాన్ని వివరించే సందర్భంలో కీ. శే.కామ్రేడ్ బసవపున్నయ్య ఒక వ్యాసం రాశారు. జరిగిన తప్పును ఎత్తిచూపిన ఆ వ్యాసంలో వేరే కొన్ని పొరబాట్లు దొర్లాయి. వాటిని సరిదిద్దుకుంటూ ఆయన మళ్లీ ఒక వ్యాసం రాశారే గాని తనదే రైటు అని భీష్మించలేదు.

కమ్యూనిస్టులు ఎప్పుడూ బస్సు మిస్సవుతారు. తర్వాత ఆత్మ విమర్శ చేసుకుంటారని శత్రువులు షరామామూలుగా వ్యాఖ్యలు చేశారు. కాని ఆ ఆత్మవిమర్శ వల్ల మన అవగాహన పరిపుష్టమైంది. నిరంకుశ కాంగ్రెసు వ్యతిరేక ఎత్తుగడలలో భాగంగా తెలుగుదేశం పట్ల సరైన వైఖరి అనుసరించే అవకాశం ఏర్పడింది. “మిస్సయిందని" శత్రువులు ప్రచారం చేసిన బస్సు ఎక్కడికీ పోలేదు. 1984 ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంతో మొదలు పెట్టి కాంగ్రెసు కుట్రలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడటం మన ప్రతిష్టను ఇనుమడింపచేసింది. ఈనాటికి వచ్చేసరికి వామపక్షాల బలం గణనీయంగా పెరగడానికి వీలేర్పడింది. పదేళ్ల క్రితం పార్టీ తన పొరబాటును సూటిగా ఆత్మవిమర్శ చేసుకుని వుండకపోతే ఈ పరిణామం సాధ్యమయ్యేదా? కొన్ని పార్టీలు సూటిగా ఆ పని చేయకుండా అటూ ఇటూ దోబూచులాడి, అనవసర గందరగోళానికి కారణమైన తీరు తెలిసిందే కదా ఇలాంటి ఉదాహరణలు ఆత్మవిమర్శ ప్రాధాన్యతకు నిదర్శనాలు. ఇలా మొత్తం పార్టీయే నిస్సంకోచంగా ఆత్మవిమర్శ చేసుకొంటున్నప్పుడు సభ్యులు వ్యక్తిగతంగా తమ లోపాలు చెప్పుకోవడానికి వెనుకాడవలసిన అవసరమే లేదు.
            పార్టీ నిర్మాణావలోకనం

నేను ఫలానా విధంగా ప్రవర్తించి వుండాల్సింది కాదు" అ రోజు ఆ విధంగా మాట్లాడటం తప్పని గుర్తిస్తున్నాను" "నాకు అప్పగించిన ఫలానా బాధ్యత సక్రమంగా నిర్వహించడంలో వెసుకబడినందుకు విచారిస్తున్నాను" అని అంగీకరించినంత మాత్రాన ఆకాశం విరిగిపడుతుందని అందరూ చులకనగా చూస్తారని అనుకోవడం సరైంది కాదు. భవిష్యత్ లో ఆ తప్పు చేయరాదని గట్టిగా నిర్ణయించుకోగల చిత్తశుద్ధి చూపగలిగితే అందరూ ఆ ఆత్మవిమర్శను హర్షిస్తారు. దాని వల్ల సదరు సభ్యుల వ్యక్తిత్వం పట్ల గౌరవం ఏర్పడుతుంది. అదే కోవలో తమ పొరబాట్లు అంగీకరించడం మంచిదనే చైతన్యం ఇతరులలో కలుగుతుంది. అయితే ఇదంతా ఒక తంతులా గాక స్ఫూర్తితో జరగాలి. ప్రాయశ్చిత్రం రోజున తప్పుల చిట్టా ఒప్పుకున్నట్లుగాక చైతన్యవంతంగా, ఆచరణ దృష్టితో ఆత్మవిమర్శ చేసుకోవాలి. తర్వాత వాటిని కచ్చితంగా సరిదిద్దుకోవాలి. ఆ విధంగా శాఖలో ప్రతి వారూ ఆత్మ విమర్శన పూర్వకంగా తమను తాము సమీక్షించుకుంటే ఇతరులు లేదా పై నాయకులు ఎత్తి చూపాల్పిన అవసరం తగ్గుతుంది.

__తెలకపల్లి రవి
(పార్టీ నిర్మాణావలోకనం నుండి)



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..