పాలక వర్గాలకు,పార్టీకి మధ్యనున్న వైరుధ్యమే పార్టీ అభివృద్ధికి చోదక శక్తి.


ప్రపంచంలో ఏ వస్తువులోనైనా ఏ ప్రక్రియలోనయినా, ఏ క్రమంలో నయినా రెండు విరుద్దాంశాలు వుంటాయి. ఈ విరుద్దాంశాలు ఒకే ఎంటిటీ (ఒక వస్తువు, క్రమం, ఆలోచన, మనం దేన్నయితే పరిశీలిస్తున్నామో ఆ భాగం) లో సహజీవనం చేస్తాయి. అదే సమయంలో ఒక దాన్నొకటి నిరాకరించుకుంటాయి. దీని ఫలితంగా పదార్థం చలనంలో వుండటం, అభివృద్ధికి దారి తీయడం జరుగుతుంది. ప్రపంచంలో అనేక వైరుధ్యాలున్నాయి. వైరుధ్యాలనూ, ప్రకృతిలోని, సమాజంలోని, ఆలోచనలోని అభివృద్ధినీ, ఒక క్రమపద్ధతిలో, మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి కింది పద్దతులు కొంత ఉపయోగపడతాయి.

1.విరుద్ధాంశాల మధ్య ఐక్యత ఘర్షణ

2.అంతర్గత బహిర్గత వైరుధ్యాలు

3.వైరుధ్యం యొక్క విశ్వజనీనత,ప్రత్యేకత



1.విరుద్ధాంశాల మధ్య ఐక్యత ఘర్షణ :

మావో చెప్పిన దాని ప్రకారం రెండు విరుద్ధాంశాలు ఒకే ఎంటిటీలో సహజీవనం చేస్తుంటాయి. కనుక అది వాటి మధ్యనున్న ఐక్యత. పరస్పరం నిరాకరించుకోవడం, ఘర్షించుకోవడం అనే అంశం కూడా వుంటుంది కనుక అవి విరుద్ధాంశాలు. ఇవి వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. అంటే ఒకదాని స్థానాన్ని మరొకటి ఆక్రమించుకుంటాయి. ఒకటి మరొకటిగా రూపాంతరం చెందుతాయి. ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో అవి సహజీవనం చేస్తుంటాయి. మరో నిర్దిష్ట పరిస్థితుల్లో అని తమ స్థానాలను కూడా మార్చుకుంటాయి. సమాజాన్ని ఉదాహరణగా తీసుకుంటే భూస్వామ్య సమాజంలో భూస్వాములు రైతాంగం అనే రెండు వర్గాలు ఉన్నాయి. భూస్వామ్య సమాజం అనే ఎంటిటీలో ఈ రెండు అంశాలున్నాయి. నూతన ప్రజాస్వామిక విప్లవం కొనసాగుతున్న క్రమంలో వారి స్థానాల్లో మెల్లగా మార్చులొస్తుంటాయి. తెలంగాణా ప్రాంతంలోని ఒక వూరిని తీసుకుంటే అక్కడి రైతాంగ పోరాటాల ఫలితంగా దొరలు ఊరు వదిలిపెట్టేసి వెళ్లి పోయారు. భూమి, సంఘం ఆధీనంలోకి వస్తుంది. ఇక అప్పుడు ఊర్లో దొర పెత్తనం పోయి సంఘ ఆధిపత్యం వస్తుంది. మొత్తంగా దేశంలో ముడిపడి ఉన్న సమస్య కాబట్టి భూస్వామ్యం పోలేదు. అది ఉనికి లోనే ఉంటుంది. కానీ ఆది తన ఆధిపత్యపు స్థానాన్ని మార్చుకుంది. రైతాంగం దాని స్థానాన్ని ఆక్రమించింది పూర్తిగానే సమాజం మరోరూపం తీసుకోలేదిక్కడ, విప్లవ శక్తులు పెరగడం వల్ల వాటి స్థానాల్లోనే మార్పు వచ్చింది. ఇదే విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత

2.విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ :

విరుద్ధ శక్తుల మధ్య ఘర్షణ అనే నియమం రెండు అంశాల్ని చెప్తుంది. మొదటిది ఏ వస్తువులో నయినా, ఏ క్రమంలోనైనా నైరుధ్యమంటూ ఏర్పడినపుడు అది మొదటి నుండి చివరి వరకూ కొనసాగుతుందని. రెండవది ఘర్షణ వల్ల ఆ వస్తువు మరో వస్తువుగా మారుతుందని. ఆ నూతన వస్తువు నూతన వైరుధ్యాలతో కూడినదిగా ఉంటుంది. రెండు విరుద్ధాంశాల మధ్య ఐక్యత సహజీవనం కేవలం ఘర్షణ కోసమే విరుద్ధాంశాల మధ్య ఘర్షణ శాశ్వతమైనది, నిత్యమైనది ఐక్యత తాత్కాలికమైనది, పాపేక్షికమైనది.

అంటే నిర్దిష్ట పరిస్థితుల్లోనే ఐక్యత కొనసాగుతుంది. ఘర్షణ మాత్రం నిత్యమైనది, శాశ్వతమైనది ఇదెలా చెప్పగల్గుతున్నామంటే ఏ ప్రక్రియనూ, వస్తువునూ తీసుకున్నా మొదటి నుండి చివరి వరకూ ఘర్షణ కొనసాగుతుంది. పరస్పరం నిరాకరించుకుంటాయి. స్థానాలు మారుతాయి. అట్లా విరుద్ధాంశాలు స్థానాలు మార్చుకోవడం వల్ల గుణాత్మక మార్పుకు దారి తీస్తుంది. ఇంకా పరిస్థితులు మారిపోతే వస్తువు ప్రక్రియనే మరో ప్రక్రియగా మారుతుంది. ఘర్షణే ప్రధానమని ఇవన్నీ చెపుతున్నాయి. కేవలం ఐక్యతే వుంటే మార్చు, అభివృద్ధి సాధ్యమే కాదు. ఈ అభివృద్ధికి ఘర్షణ తోడ్పడుతుంది. దీన్ని బట్టి ఘర్షణ నిత్యమయినదని చెప్తున్నాం.

అయితే విరుద్దాంశాల మధ్య సమతుల్యత ఏర్పడదా? అంటే రెండింటి బలాబలాలు సమాన స్థాయికి చేరుకోవా? అంటే _కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ సమతాస్థితి వస్తుంది.  అయితే ఈ సమతా స్థితి సాపేక్షికమైనది. తాత్కాలికమైనది. సమతా స్థితికి చేరుకున్న తర్వాత మళ్లీ వాటి మధ్య అసమానత వస్తుంది. పెట్టుబడిదారీ సమాజాన్ని ఉదాహరణగా తీసుకుందాం. పెట్టుబడిదారీ సమాజం అంటేనే పెట్టుబడిదారుల అధిక్యత పుందని అర్థం. కార్మికవర్గ పార్టీ సార్వత్రిక తిరుగుబాటుకు సన్నాహాలు చేస్తుంది. సన్నాహక స్థితిలో కార్మికుల బలం అసాధారణంగా పెరుగుతుంది. ఒక దశలో రెండు వర్గాల బలాలు సమాన స్థాయికి వస్తాయి సాయుధ తిరుగుబాటు విజయవంతమవుతేనేమో స్థానాలు బదిలీ అయిపోతాయి. విఫలమయితే మళ్లీ యధాస్థితికి చేరుకుంటాయి. 1917 బూర్జువా విప్లవానికి అక్టోబర్ విప్లవానికి మధ్యకాలంలో బూర్జువా వర్గానికీ, కార్మిక వర్గానికీ మధ్య బలాబలాల్లో సమతాస్థితి ఏర్పడింది. సమతాస్థితికి ఇదొక మంచి ఉదాహరణ

అంతర్గత, బహిర్గత వైరుధ్యాలు :

ఒక వస్తువు, ప్రక్రియ మార్పుకు ఈ రెండు వైరుధ్యాలు దోహదం చేస్తాయి. అయితే ఆ మార్పుకు ప్రధానమైన కారణం దాని అంతర్గత వైరుధ్యమే. బహిర్గత వైరుధ్యం మార్పుకు దోహదపడుతుంది ద్వితీయంగా ఉంటుంది. ఉదాహరణకు మన రాష్ట్రంలో విప్లవోద్యమం అభివృద్ధి కావడమనే విషయాన్ని తీసుకుందాం. ఇక్కడ ఉద్యమం అభివృద్ధి కావడమనేది ఇక్కడున్న అంతర్గత వైరుధ్యాల మీద ఆధారపడి వుంటుంది. అంటే పాలక వర్గాలకు పార్టీకి మధ్యనున్న వైరుధ్యం మీద ఆధారపడి వుంటుంది. ఇక దేశంలో జరిగే జాతుల పోరాటాలు వగైరా ఉద్యమాభివృద్దికి బహిర్గతంగా తోడ్పడుతాయి. ఇటువంటి బహిర్గత వైరుధ్యాలు ఎప్పుడూ ప్రాథమికం కావు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ రష్యా ఒక సోషలిస్టు బేస్ గా ఉండింది. దానిమీద సామ్రాజ్యవాదం యుద్ధం ప్రకటించింది. ఆ సమయంలో అంతర్జాతీయ కార్మిక్షవర్గం రష్యాకు మద్దతునిచ్చింది. కానీ ఆనాడు రష్యా నిలబడాలంటే విజయం సాధించాలంటే అది చేసే పోరాటమే ప్రాథమికమైనది. అదే నిర్ణయాత్మకమైనది. అంతర్జాతీయ మద్దతూ, మూడవ కమ్యూనిస్టు ఇంటర్ నేషనల్ చేసే నిర్ణయాలు సోషలిస్ట్ స్టాపరాన్ని నిలబెట్టుకోవడానికి బహిర్గతంగా ఉపయోగపడతాయి

చైనా విప్లవానికి రష్యా చాలా సహాయపడింది. కానీ చైనాలో విప్లవ విజయానికి కారణం అక్కడ అంతర్గత వైరుధ్యాలు పరిపక్వం చెందడమూ, అక్కడి కమ్యూనిస్టు పార్టీ ప్రజలు చేసిన పోరాటమూ. రష్యా సహాయం బహిర్గతంగా ఉపయోగపడింది

బహిర్గత వైరుధ్యాలు వస్తువు అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఒక్కోసారి ఆటంకంగా మారవచ్చు. నెగెటివ్ ప్రభావాన్ని వేయవచ్చు

అంతర్గత వైరుధ్యాలు వస్తువు అంతస్సారంతో పెనవేసుకొని వుంటాయి. ఆ వైరుధ్యాలు మారితే తప్ప ఆ వస్తువు గుణంలో మార్పుకు గురికాదు. అంటే ఆ విరుద్ధ శక్తుల ఘర్షణే, చలనమే వస్తువు మార్పుకి దారితీస్తుంది. బహిర్గత విషయాలు అనుకూలించవచ్చూ, ప్రతికూలించవచ్చు.

3. వైరుధ్యపు విశ్వజనీనత, ప్రత్యేకత :

ప్రకృతిలోని, సమాజంలోని ప్రతి వస్తువు మరో వస్తువుకు భిన్నంగా ఉంటుంది. వైవిధ్య పూరితంగా ఉంటుంది. అంటే దేని ప్రత్యేకత దానికుంటుంది. అదే సమయంలో ప్రత్యేక లక్షణాలు కల్గిన వస్తు సముదాయాల్లో సాధారణత్వం కూడా ఉంటుంది. ఉదాహరణకు వేప, చింత, మామిడి వైవిధ్య పూరితమయిన చెట్టు. కానీ వీటన్నింటిని కల్పి చెట్లు అంటాం. అంటే వీటన్నింటిలో సాధారణత్వం

కూడా ఉందన్నమాట. ఇవన్నీ భూమిలోకి వేర్లను పంపి ఆహారాన్ని తీసుకుంటాయి. సూర్యరశ్మిని ఆకుల ద్వారా స్వీకరించి ఆహారంగా మార్చుకుంటాయి. ఇటువంటి మరి కొన్ని లక్షణాలు చెట్లన్నింటిలో సాధారణంగా కన్పించే అంశాలు. ఈ సాధారణత్వం అన్ని చెట్లలోనూ మొదటి నుండీ చివరి వరకూ ఉంటుంది. సమాజాల్ని ఉదాహరణగా తీసుకుంటే బానిస సమాజం, భూస్వామ్య సమాజం పెట్టుబడిదారీ సమాజం, సోషలిస్ట్ సమాజం, ఇవి వేటికవి ప్రత్యేకతను కల్గిన సమాజాలు. ఈ సమాజుల్లోని వర్గాలూ, వర్గ వైరుధ్యాలూ భిన్నంగా ఉన్నాయి

బానిస సమాజంలో బానిసలూ, బానిస యజమానులూ భిన్న వర్గాలుగా ఉన్నారు. వీరి మధ్య వైరుధ్యముంది. ఇక్కడ ఉత్పత్తి విధానం ఒక తరహాలో ఉంది. భూస్వామ్య సమాజంలో భూస్వాములూ రైతాంగమూ భిన్న వర్గాలుగా ఉన్నారు. వీరి మధ్య ఘర్షణ ఉంది ఇక్కడ ఉత్పత్తి విధానం మరో తరహాలో ఉంది. పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదారులు, కార్మికులూ వున్నారు. వీరి మధ్య వైరుధ్యం ఉంది. సోషలిస్ట్ సమాజంలో కార్మికులకు ఇంకా మిగిలివున్న పెట్టుబడిదారులకూ వైరుధ్యముంటుంది. మరి వీటన్నింటిలో నున్న సాధారణత్వమేంటి? ఈ నాలుగు సమాజాల్లోనూ వర్గపోరాటముంది. ఆ వర్గపోరాటం మొదటినుండి చివరి వరకూ ఉంది. ఇది వీటి మధ్యనున్న సాధారణత్వం. ఆ తర్వాత సమాజం (కమ్యూనిస్టు సమాజం)లో ప్రకృతితోని మానవులకు సంఘర్షణ ఉంటుంది. ఇది కమ్యూనిస్టు సమాజంలో ఉంటుంది. ఆదిమ సమాజంలో ఉంది. ఈ రెండు సమాజాల్లో ఉన్న సాధారణత్వంగా దీన్ని చెప్పుకోవచ్చు

కాబట్టి సాధారణత్వం అన్నింటిలోనూ ఉండాలనీ, అది మొదటినుండీ చివరి వరకూ కొనసాగాలనీ మనం సాధారణత్వం గురించి నిర్వచించుకుంటున్నాం.

రసాయన శాస్త్రాన్ని తీసుకుంటే వివిధ మూలకాలుంటాయి. వాటికి వేర్వేరు లక్షణాలుంటాయి. ఆ మూలకాలు కలవడం వల్ల ఏర్పడే వాటికి మరో రకపు లక్షణాలుంటాయి. మన అవసరాల కోసం ప్రయోగాలు చేస్తుంటాం. ఈ శాస్త్రంలో ఉండే సాధారణత్వం సంయోగం, వియోగం. ఏ మూలకంలో చూసినా మొదటి నుండి చివరి వరకూ ఈ సాధారణత్వం వుంటుంది

వివిధ వస్తువుల్లోని ప్రత్యేకతల్ని పరిశీలించడం ద్వారానే మనం సాధారణత్వాన్ని పట్టుకోగలం. వస్తు సముదాయంలో ఒకటో రెండో సాధారణ లక్షణాలు ఉంటాయి. ప్రత్యేకమైనది విశ్వజనీనతకు దారితీసేదిగా ఉంటుంది. ఆ సంబంధంలోనే అది అస్తిత్వంలో ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఐక్యత ఉంటుందనుకుంటే ప్రత్యేకతలు కూడా పరస్పర సంబంధాల్లోనే ఉంటాయి. మనుషులు, జంతువులు లోహాలు, రేడియో ధార్మిక శక్తి ఇవన్నీ ప్రత్యేకతలు. ఇవన్నీ విశ్వవ్యాప్తతకు కూడా దారి తీస్తాయి. అలాగే విశ్వజనీనమనేది కూడా ప్రత్యేకతలోనే అస్తిత్వంలో ఉంటుంది. ప్రత్యేకతలేని విశ్వజనీనతలేదు. దానికి స్వంత వ్యక్తిత్వం లేదు. రేడియం, థోరియం, యురేనియం వంటి ప్రత్యేక లక్షణాలు కల పదార్థాలను కలిపి రేడియోధార్మిక పదార్థాలు అంటాం. వర్గ పోరాటం అన్ని సమాజాల ప్రత్యేక లక్షణంగా ఉండి విశ్వజనీనతను సంతరించుకుంది

ఆయా వస్తువుల్లోని ప్రత్యేకతను తెలుసుకోవడం చాలా అవసరం. నిర్దిష్టత్వం అంటే అదే. ఒక సమాజపు మార్పును గానీ, అభివృద్ధినిగానీ మారుతున్న స్థల, కాల పరిస్థితుల్లో దాన్ని నిర్ణయించాలంటే తప్పనిసరిగా ప్రత్యేకతను అధ్యయనం చేయాలి. ఒకసారి చేస్తే చాలదు. సమాజం, ప్రకృతి నిరంతరం మారుతూ వుంటుంది. కాబట్టి ప్రత్యేకతను నిరంతరం అధ్యయనం చేయాలి. మావో కూడా దీన్ని నొక్కి చెప్పాడు. ఒకదేశంలో అన్వయించిన సూత్రాలను, ఎత్తుగడలను మరో దేశానికి యధాతధంగా అన్వయించవచ్చనే  ధోరణి చైనా కమ్యూనిస్టు పార్టీలో బలంగా వచ్చినపుడు, మావో ప్రత్యేకతను నొక్కి చెప్పాడు. ఈ ప్రత్యేకతను అధ్యయనం చేయడం కోసమే ఆయన వైరుధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. తత్వశాస్త్రంలో వైరుధ్యం అనే అంశం చాలా ముఖ్యమైనదనుకుంటే అందులో ప్రత్యేకత అనేది మరీ ముఖ్యమైనది. దీన్ని మనం భాగాలు భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. పదార్థం వేరువేరు చలన రూపాలు తీసుకుంటుందని చెప్పుకున్నాం. ప్రకృతిలో ఒక్కొక్క చలన రూపం ఒక్కో శాఖను అభివృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రాణుల్ని తీసుకుందాం, జంతువులు కావచ్చు వృక్షాలు కావచ్చు మెటబాలిజం గురించి చెప్పుకున్నాం. ఖగోళశాస్త్రం, భౌతికశాస్త్రం వంటి విజ్ఞానశాస్త్రాలను తీసుకుంటే వాటికి ప్రత్యేక చలన రూపాలున్నాయి. గణితంలో డిఫరెన్షియల్ - ఇంటిగ్రల్ (విశ్లేషణ, క్రోడీకరణ) అనేది ఉంటుంది. భాగాలుగా విడిపోవడం, కలవడం గురించి చెప్తుంది. వందలవేల తరహాలలో కలవడం గురించి చెప్తుంది. కూడికలతో, తీసివేతలతో, గుణకారాలతో ఇలా రకరకాలుగా కలవడాన్ని ఇది చెప్తుంది. ఇట్లా ఒక్కో శాస్త్రంకు ఒక్కో చలన రూపం వుంది. ప్రత్యేకత్వం గురించి చెప్పుకునేటప్పుడు మొదటగా మేజర్ చలన రూపాల ప్రకారంగా వాటిని విభజిస్తాం. ప్రకృతిని మరింత లోతుగా అర్థం చేసుకోనీకి అది ఉపయోగపడుతుంది. అంటే ఒక వస్తువును మరో వస్తువుతో వేరుచేసి చూడాలన్నా, ఒక శాస్త్రాన్ని మరో శాస్త్రంతో వేరు చేసి చూడాలన్నా మనం ఈ ప్రత్యేకత్వాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత వైరుధ్య స్వభావం, వాటిని పరిష్కరించే తీరూ ఈ రెండింటికీ సంబంధం వుంది. సమాజంలో ఏ వైరుధ్యం ముఖ్యమయినది? ఏ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరించాలనేది అర్థమవుతుంది. వేర్వేరు వైరుధ్యాలు వేర్వేరు స్వభావాన్ని కల్గి వుంటాయి. కొన్ని వర్గ పోరాటం ద్వారానే పరిష్కారమవుతాయి కొన్ని సామరస్య పూర్వకంగా పరిష్కారమవుతాయి. 

శతృవైరుధ్యాలన్నీ వర్గపోరాటం ద్వారా పరిష్కారమవుతాయి. 

మిత్రవైరుధ్యం శాంతియుత పోరాటం ద్వారా పరిష్కారమవుతుంది. 

పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడిదార్లకూ కార్మికులకూ మధ్య ఉండే వైరుధ్యం వర్గపోరాటం ద్వారానే పరిష్కారమవుతుంది. 

అదే సమాజంలో కార్మికులకీ రైతాంగానికి మధ్య ఉండే వైరుధ్యం సామరస్యంగా పరిష్కారమవుతుంది. సమాజాన్ని బట్టి కూడా పరిష్కారాలుంటాయి. పెట్టుబడిదారీ సమాజంలో పట్నాలకీ, గ్రామాలకీ మధ్యనుండే వైరుధ్యం శతృపూరిత స్వభావాన్నే కల్గివుంటుంది. కాబట్టి వాటి పరిష్కారాన్ని ఒక్కోసారి అవి రాడికల్ గానే కోరుకుంటాయి. సోషలిస్టు సమాజంలో పట్నాలకు గ్రామాలకు మధ్య నుండే వైరుధ్యం శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటాయి. అలాగే స్త్రీ పురుషుల మధ్య ఉండే వైరుధ్యం, మానసిక, శారీరక శ్రమలకు మధ్య నుండే వైరుధ్యం, దోపిడీ సమాజంలో ఒక రకంగా, సోషలిస్టు సమాజంలో మరొక రకంగా వ్యక్తమవుతాయి. దీన్ని బట్టి భిన్నమైన వైరుధ్యాలు వాటి స్వభావాన్ని బట్టి భిన్నమైన పరిష్కారాన్ని కోరుకుంటాయని అర్థమవుతుంది. అంటే వీటిని ప్రత్యేకతలోకి
పోతే తప్ప పరిష్కరించలేం. ఒక వస్తువు అభివృద్ధిలో విరుద్దాంశాల చలనం తాలూకు ప్రక్రియ మొత్తం ఆ అంశాల పరస్పర సంబంధాలలోనూ, ప్రతీ ఒక్క అంశంలోనూ, ప్రత్యేక లక్షణాలను కలిగి వుంటుంది. వాటిని గురించి మనం తప్పక శ్రద్ధ పెట్టాలి. అయితే, ప్రక్రియలోని ప్రతి దశకు, దాని విశిష్ట, లక్షణాలు వుంటాయి వాటిని గురించి కూడా మనం శ్రద్ధ వహించాలి." - (తత్వశాస్త్ర వ్యాసాలు - పి.నం.40)

మన దేశంలోకి బ్రిటిష్ వాళ్లు రాకముందు భూస్వాములకి రైతాంగానికి మధ్య వైరుధ్యముంది. ఈ వైరుధ్యం వుందనే విషయాన్ని ఆనాటి ఉత్పత్తి సంబంధాలను బట్టి నిర్ణయిస్తాం. రెండు పక్షాలను పరిశీలించి, వీటి సంబంధంలో ఇతర అంశాలను పరిశీలించి దీన్ని భూస్వామ్య వ్యవస్థ అని చెప్తాం. బ్రిటీష్ వాళ్లు వచ్చాక ఈ ప్రక్రియలో మార్పు చూస్తాం. భూస్వామ్య వ్యవస్థ పోలేదు

ఆ వైరుధ్యం కొనసాగుతూనే ఉంటుంది. అయితే వైరుధ్యంలో కొంత తేడా వచ్చింది. భూస్వామ్య సంబంధాలలో కొన్ని మార్పులు వచ్చాయి. ఇప్పుడు రైతాంగం పరిస్థితిలో కొంత తేడా వచ్చింది భూస్వాముల పరిస్థితుల్లో కొంత తేడా వచ్చింది. పంపిణీ సంబంధాల్లో కొంత తేడా వచ్చింది. మార్కెట్ విధానం వచ్చింది. ఈ మార్పుల్ని పరిశీలించిన తర్వాత ఈ మార్పులో వచ్చిన నూతన అంశాలను పరిశీలించిన తర్వాత దీన్ని అర్ధ భూస్వామ్య వ్యవస్థ అని చెప్పుకున్నాం. వైరుధ్యమయితే పరిష్కారం కాలేదు కానీ మార్పులకు లోనైంది. 60 దశకాల తర్వాత మరి కొన్ని మార్పులు వచ్చాయి. పంజాబ్ హర్యానా, కేరళ, కోస్తాల్లో హరిత విప్లవం పేరిట కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్టుబడిదారీ భూస్వాములు వచ్చారు.  ఆ వర్గాల్లోని మార్పుల్ని పరిశీలించడం ద్వారానే విషయం మనకు అర్థమయింది. రైతాంగంలో వస్తోన్న మార్పుల్ని మరింతగా పరిశీలించాలి. ధనిక రైతులు పెరుగుతున్నారా అనేది పరిశీలిస్తాం. ఈ పరిశీలన తర్వాత అర్ధ భూస్వామ్యమని చెప్పినప్పటికీ కొన్ని ప్రాంతాలలో మార్కెట్ సంబంధాలు ప్రధానమైతే  అక్కడి ఎత్తుగడల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. దీని ద్వారా మనకర్థమవుతుందేంటంటే ప్రక్రియ సుదీర్ఘ కాలం కొనసాగినపుడు మొదటి నుండీ చివరివరకూ రెండు పక్షాలు ఒకేలా వుండవు. వాటి మధ్య సంబంధం కూడా ఒకేలా వుండదు. కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వీటినే మనం దశలంటాం. దశలను నిర్ణయించేటప్పుడు కూడా రెండు పక్షాల్లో వస్తున్న మార్పుల్ని దృష్టిలో వుంచుకుంటేనే వాటిని నిర్ధారించగలుగుతాము.

మన దేశ విప్లవాన్ని తీసుకుంటే 1947 కు ముందు 4 మౌళిక వైరుధ్యాలు ఉన్నాయి. అప్పుడు ప్రధాన వైరుధ్యం సామ్రాజ్యవాదానికి భారత ప్రజలకూ మధ్య వుంటుంది. 1947 తర్వాత అవే నాలుగు వైరుధ్యాలున్నాయి. కానీ భూస్వామ్యానికి అశేష పీడిత ప్రజానీకానికి ఉన్న వైరుధ్యం ప్రధాన వైరుధ్యమయింది. అంటే అంతవరకూ రెండవ స్థానంలో ఉన్న వైరుధ్యం మొదటి స్థానంలోకి వచ్చింది వీటిని రెండు దశలుగా చెప్తున్నాం. బ్రిటిష్ వాళ్లు వున్నప్పుడు జాతీయ విప్లవంగా, వెళ్లిపోయాక ప్రజాస్వామిక విప్లవంగా ఉంటుంది. ఒకవేళ రేపు దేశం నయావలసగా మారితే అప్పుడు ఈ నాలుగు వైరుధ్యాలూ వుంటాయి. అయితే సామ్రాజ్యవాదానికి భారత ప్రజలకు మధ్య వైరుధ్యం ప్రధానంగా ముందుకు వస్తుంది. ఈ ప్రత్యేకతల్ని అధ్యయనం చేస్తేనే విప్లవ స్వభావాన్ని నిర్ణయించుకో గల్గుతాం.

“ఒక వస్తువు అభివృద్ధి ప్రక్రియలోని ప్రతి దశ వద్ద వుండే వైరుధ్యాల ప్రత్యేకతలను అధ్యయనం చేసేటపుడు, మనం వాటిని, వాటి మధ్య వుండే పరస్పర సంబంధాలలోనో లేదా ఏక మొత్తంగానో గమనించడం మాత్రమేగాక, ప్రతి వైరుధ్యం తాలూకు రెండు అంశాలను కూడా తప్పని సరిగా పరిశీలించాలి. - (తత్వశాస్త్ర వ్యాసాలు - పే.నం.42) అన్ని దశల్లోనూ నాలుగు వైరుధ్యాలుంటాయని మాట్లాడాం. కానీ హెచ్చరిక ఏంటంటే కాలం గడుస్తున్న కొద్దీ ఆ వైరుధ్యాల్లోని రెండు పక్షాల్లో మార్పు ను పరిశీలించుకునేందుకు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.రెండింటినీ పరిశీలించి రెంటి మధ్య సంబంధాన్ని చూడటమే కాకుండా గతానికీ రేపు భవిష్యత్ కూ ఈరెంటి మధ్య సంబంధం ఏ దిశలో వుంటుందో చూడాలి. ఉదాహరణకు ఒక పక్షం  బూర్జువా వర్గం దీనికొక చారిత్రక క్రమం వుంది. బ్రిటిష్ ఆక్రమణలో ఉన్నప్పుడు ఈ వర్గం వుంది, వాళ్లు వెళ్లిపోయాకా వుంది. మరో పక్షాన కమ్యూనిస్టు పార్టీ వుంది. జాతీయ విప్లవ దశ అంతటా బూర్జువా వర్గం రెండు రకాల స్వభావాన్ని చూసింది. కొంత ఉద్యమాలు చేసింది. మరికొంత దళారీగా కూడా వ్యవహరించింది.సారాంశంలో అది దళారీ స్వభావాన్ని ప్రదర్శించింది. 1947 తర్వాత చూస్తే  జాతీయ స్వభావాన్ని  తీసుకుంది. 
 కమ్యూనిస్టు పార్టీని తీసుకుందాం. బ్రిటిష్ కాలంలో జాతీయ వామపక్షంగా వ్యవహరించింది. అంటే మితవాదంతో కూడుకొని వుంది. తెలంగాణా పోరాటంలో  విప్లవకరంగా ఉండింది.   ఇది కమ్యూనిస్టు పార్టీ చారిత్ర కత. దీన్ని కూడా మనం పరిశీలించాలి. దాన్ని బట్టి కూడా అవతలి పక్షంతోని మనం ఏ సంబంధంలో ఉంటాం? మన పోరాటమేంటి? ఎత్తుగడలేంటి అనేది దీన్ని బట్టే నిర్ణయించుకుంటాం. దీన్ని బట్టి రెండు పక్షాలనూ, దాని చరిత్రను పరిశీలించాలనేది అర్థమవుతుందిి.

ప్రత్యేకత విశ్వజనీనతలో సమైక్యమై వుంది గనుక, ప్రతిదానిలోనూ వైరుధ్యం తాలూకు విశ్వజనీనత, ప్రత్యేకతలు నిబిడీకృతమై వుంటాయి కనుకనూ, ప్రత్యేకతలోనే విశ్వజనీనత వున్నది కనుకనూ, మనం ఒక వస్తువును అధ్యయనం చేసేటప్పుడు విశ్వజనీనత ప్రత్యేకత ఈ రెండింటినీ వాటి పరస్పర సంబంధాన్ని కనుగొననెత్నించాలి. విశ్వజనీనతనూ, ఆ వస్తువులోపలే వాటి మధ్య వున్న పరస్పర సంబంధాన్నీ, యీ వస్తువుకు వెలుపలి యితర వస్తువులతో వున్న పరస్పర సంబంధాలను మనం కనుక్కోవడానికి ప్రయత్నించాలి". (తత్వశాస్త్రం పే.నెం. 46)

ఇప్పుడున్న ప్రపంచాన్ని ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ప్రపంచం అంటున్నాం. అంటే అన్ని దేశాల్లో పెట్టుబడికీ శ్రమకు మధ్య వైరుధ్యం ఉంది. ఇది సాధారణత్వం. అంటే ఆయా ప్రత్యేక దేశాల్లో పెట్టుబడికీ శ్రమకూ మధ్యనున్న వైరుధ్యం అనేది సాధారణ వైరుధ్యం. ఆయా ప్రత్యేకతల్లోని సాధారణత్వాన్ని పరిశీలించడం ద్వారా మనకీ విషయం అర్థమయింది. అయితే ఈ పెట్టుబడికి శ్రమకూ మధ్యనున్న వైరుధ్యం వివిధ దేశాల మధ్య ఉన్న సంబంధాలలో ఎట్లా వ్యక్తమవుతుంది అనేది చూద్దాం. అంటే అమెరికాకు జపాన్కూ మధ్య సంబంధం ఎలా వుంది? రెండూ సామ్రాజ్యవాద దేశాలే కాబట్టి వాటి మధ్య సంబంధం సమాన స్థాయిలో ఉంది. అమెరికాకు చైనాకు మధ్య ఎలా వుంది? చైనా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది కనుక వాటి మధ్య ఘర్షణ ఉంది.
 ఇండియాకూ అమెరికాకూ మధ్య ఎలా ఉంది? ఇండియా ఆర్థిక వ్యవస్థ చితికి వుంది కనుక ఇక్కడి బూర్జువా వర్గం ఒక్కోసారి లొంగి, మరోసారి పోరాడుతూ ఉంది. ఇక మెక్సికోనయితే అమెరికా సామ్రాజ్యవాదం దాని ఇంటి వెనుక పెరడుగా భావిస్తోంది. ఇక్కడ అన్ని దేశాల్లోనూ సాధారణత్వం ఉన్నప్పటికీ ఆయా దేశాల్ని ఒక సంబంధంలోకి తెచ్చినపుడు ప్రత్యేకత్వం కనిపిస్తుంది. ఒకచోట సామ్రాజ్యవాదానికీ, సామ్రాజ్యవాదానికీ మధ్య పోటీలాగా కనబడుతుంది. మరోచోట సామ్రాజ్యవాదానికి  బూర్జువా వర్గం  లొంగుబాటులాగా కనబడుతుంది. దీన్ని అధ్యయనం చెయ్యాలి.

      ప్రత్యేకతను అధ్యయనం చేయడం సాధారణత్వాన్ని పట్టుకోవడానికే. భారతదేశంలోని వైరుధ్యాల్ని ప్రత్యేక ంగా నిర్దిష్టంగా స్టడీ చేయడమెందుకంటే దేశంలో ఉన్న సాధారణత్వమేంటి? మొత్తం ప్రపంచ సంబంధంలో దీంట్లో వున్న సాధారణత్వం ఏంటి అనేది తెలుసుకోవడానికే. మన దేశం ఒక్కదాన్నే కాకుండా దాని చుట్టూ వున్న దేశాలతో కూడా పోల్చి చూడాలి.

ఒక విశ్వజనీనత నుండి ప్రయాణం చేసి ఆయా ప్రత్యేకతలను సమగ్రంగా అధ్యయనం చేయగల్గుతాం. ప్రత్యేకతనుండి తిరిగి విశ్వజనీనత పరిపూర్ణం అవుతుంది. మొత్తం ఉద్దేశం అది.  వర్గ విశ్లేషణకు సంబంధించి ఇది ఒక నమూనా. ఇదొక  దీన్ని తీసికెళ్లి కమిటీలు గ్రామాల్లో విశ్లేషించడమనేది ప్రత్యేకత. వీటన్నింటినీ క్రోడీకరిస్తే మళ్ళీ విశ్వజనీనత రూపొందుతుంది. అంటే మళ్లొక నమూనా రూపొందుతుంది. అంటే విశ్వజనీనతను పరిపుష్టం చెయ్యడానికి ప్రత్యేకత తోడ్పడుతుంది. విశ్వజనీనత అనేది ప్రత్యేకతను అధ్యయనం చేయడం కోసం ఒక గైడ్ లైన్ లాంటిది. రెండింటి మధ్య గతితార్కిక సంబంధం వుంది.

(కా||మహేష్,2003,జ్ఞానదీపిక)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

MPTC, ZPTC, Sarpanch అంటే ఎవరు ? వారి విధులు ఏంటి ?

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం

పాలకవర్గ భావాలే ప్రజలు భావాలు గా చలామణి అయి ప్రజల్ని పాలిస్తాయి..